భూగర్భజలాన్ని తాగేస్తున్న కుళాయిలు -పి. ప్రశాంతి

ట్రింగ్‌… ట్రింగ్‌… సైకిల్‌ బెల్‌ వినపడగానే తాతగారు వచ్చేశారూ.. అంటూ బైటికి పరిగెత్తింది పదేళ్ళ శాంతి. ‘ఎండలో నువ్వెక్కడికీ… వెనకనుంచి అమ్మ మందలింపు. ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, పొలం నుంచి వస్తూ తాతగారు తెచ్చే మల్లె మొగ్గలంటే శాంతికి ప్రాణం. కాలుతున్నా సరే చేతి పంపుకొట్టి భూతల్లి ఇచ్చే చల్లటి నీళ్ళని పట్టి ఎండకి వచ్చిన తాతగారు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోడానికివ్వడం మరీ ఇష్టం.

ఎర్రటి ఎండల్లో చేతిపంపులోంచి చల్లటి నీళ్ళు ఎలా వస్తున్నాయా అని… వణికించే ధనుర్మాసపు చలిలో తెల్లవారు ఝామున అదే పంపులోంచి వెచ్చటి నీళ్ళు ఎలా వస్తున్నాయా అని శాంతికి ఆశ్చర్యంగా ఉండేది. హైస్కూల్‌ కొచ్చాక భూగర్భ జలాలు శీతోష్ణస్థితి, జలవనరుల గురించి చదువుకుంటున్నప్పుడు అర్థమయ్యింది. భూతల్లంటే ప్రేమ, గౌరవం పెరిగాయి. జలచక్రం పట్ల అవగాహన వల్ల నీటి విలువ, ప్రాముఖ్యత తెలిసాయి. పెరట్లోని చేతిపంపుకొట్టి బక్కెట్లో నీళ్ళు పట్టుకుని వాడుకోడం, ఆ నీటి ఉష్ణత ఎంతుండొచ్చని చెల్లితో కలిసి అంచనా వేసుకోవడం, పంపు దగ్గర వాడిన నీటిని మళ్ళించి రకరకాల పూల మొక్కలు, కాయగూరలు పెంచడం… చాలా సరదాగా చైతన్యవంతంగా ఉండేది.

కాలేజీ చదువులకొచ్చేసరికి నగరవాసం, పై అంతస్థుల్లో ఇళ్ళు, చేతి పంపులు తగ్గి మోటర్లతో నీళ్ళు ట్యాంకుల్లో కెక్కడం, నల్లా తిప్పితే చాలు నీళ్ళు ధారగా రావడం, వంటింట్లో, బాత్రూంలో… ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్‌ వాటర్‌… కాని ఎప్పటికప్పుడు ఆ ట్యాంకులు కడగకపోతే నాచుపట్టి వాడకానికి ఇబ్బంది. విరుగుడుగా బ్లీచింగ్‌ కలిపి ఆ కల్తీ నీళ్ళు ఆరోగ్యమని భ్రమ పెట్టుకోవడం… తర్వాత్తర్వాత డాబాలపై సిమెంటుతో కట్టే ట్యాంకులు పోయి మార్కెట్‌లో సిద్ధంగా దొరికే ప్లాస్టిక్‌ ట్యాంకులు వచ్చాయి. ఇక వీటితో ఎండాకాలం ట్యాప్‌ తిప్పితే చాలు ఒళ్ళు కాలేటంత వేడినీళ్ళు… చలికాలం బైటి చలికన్నా జిల్లుమనిపించే చల్లటినీళ్ళు…

ఏ ఇంట్లో చూసినా ట్యాంకునిండటానికి మోటరేసి అది నిండి పైనించి నీళ్ళు పడుతుంటే పరిగెత్తెళ్ళి మోటరాపడం. ఈ లోపు పోయేనీరు డ్రైనేజీలు నింపడానికి తప్పించి ఇంకో దారిలేదు. మరి మట్టిలో పడితే అందతా చింది గోడల్ని పాడు చేయడంతోపాటు నేలమీద గుంతపడుతుంది కదా! కాళ్ళకి మట్టి అంటొద్దని, ఇంట్లోకి దుమ్ము రావొద్దని ఇళ్ళచుట్టూ ఎక్కడా నేల మిగల్చకుండా సిమెంట్‌తో గచ్చు చేసేయడం తోనూ, రోడ్లన్నీ సింమెంటుతోనో తారుతోనో వేయడంతోపాటు రోడ్ల పక్కన కూడా మట్టనేది వదలకుండా డ్రైనేజీలు కట్టడంతో ఆకాశం నుంచి జారిపడ్డ ప్రతి నీటిబొట్టూ డ్రైనేజీ పాలవ్వడమే కాని భూతల్లిని చల్లబరిచే మార్గమే లేకుండా పోయింది. పట్నాల్లోనే కాదు పల్లెపల్లెకీ ఇదే కథ. మరి భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయి!

పొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకోడంతో మొదలు… టాయిలెట్‌ ఫ్లష్‌ చేయడానికి రన్నింగ్‌ వాటర్‌. బ్రష్‌ చేసుకున్నంత సేపూ రన్నయ్యే ట్యాప్‌ వాటర్‌ కనీసం అరబక్కెట్‌ అవుతాయి, అదే పట్టి

ఉంచుకున్న నీళ్ళైతే రెండు మూడు మగ్గులకిమించదు. వంటింట్లో గిన్నెలు కడగడానికి, కూరగాయలు కడగడానికి, పనయ్యే వరకు ట్యాప్‌ రన్నవుతూనే ఉండాలి. ఇక బట్టలుతకడానికైతే, బట్టలు గుంజు తున్నంత సేపూ బక్కెట్లో నీళ్ళు పడుతూనే ఉండాలి. నాలుగు బక్కెట్లతో పూర్తయ్యే పని కనీసం ఏడెనిమిది బక్కెట్ల నీళ్ళు వాడితే కాని పూర్తవదు. స్నానం చేసేటప్పుడైతే చెప్పనే అక్కర్లేదు… ఎన్ని నీళ్ళు వాడుతున్నామో కూడా తెలియదు, మరి బక్కెట్‌ నిండదు కదా! ట్యాప్‌ ర్నవుతూనే ఉండాలి. సిటీలలో నీటి యెద్దడి కనుక అపార్ట్‌మెంట్లల్లో ప్రతి ఫ్లాట్‌లోనూ వంటింట్లో వాడకానికి బాత్రూంలలో వాడకానికి ఎక్కడికక్కడ ట్యాంకులు. మరి వాటర్‌ రన్నవుతూనే

ఉండాలిగా!! చాలా సార్లు జనం నిద్రలేచేది ఆ ట్యాంకులు నిండి నీళ్ళు పోతున్న చప్పుడికే. ఇక పల్లెటూర్లలో అయితే వీధి వీధికి నల్లాలు.. అవి కట్టేయడానికి వాటి హెడ్సుండవు. ఇంటింటికి నల్లా కనెక్షన్‌… పట్టినంత పట్టుకోడం… పోయినంత పోవడం.

మనిషి తయారు చేయలేని నీటిని వినియోగించుకోవడంలో మాత్రం ఇంత విచ్చలవిడితనమా! శాంతి మనసు ఆక్రోశిస్తోంది. చేతి పంపులు, చేద బావులు, చెరువులు మాత్రమే నీటి వనరులుగా

ఉన్నప్పుడు మనకి నీటి కరువు లేదు… బోరుబావులు, నీళ్ళ బ్యాంకులు, నల్లాలు వచ్చినప్పట్నించి నిరుపయోగంగా పోతున్న నీరు… ఎండుతున్న నదీనదాలు. ఏ ఊర్లోనూ జనమందరి దాహం తీర్చిన గిలక బావులు, ఉమ్మడి వాడకంలో ఉన్న ఊట బావులు ప్రాణంతో లేవు. మనిషి నీటి దగ్గరకి వెళ్ళినంతసేపూ ఆప్యాయంగా నీళ్చిచ్చిన వనరులు నీటినే తన దగ్గరికి రప్పించుకోడం మొదలయ్యాక పరిగెత్తి పరిగెత్తి అలసి ఆవిరైపోతున్నాయి.

ఈ రన్నింగ్‌ వాటర్‌ ఉన్మాదంతో భూతల్లి ఒంటినిండా రంధ్రాలు చేసి జీవజలాన్ని తోడేస్తుంటే, భూతాపంతో వర్షాల్లేక జలపేగులు ఎండుకుపోయి, బావులు, చెరువులు, చివరికి నదులు కూడా ఇక మీ బ్రతుకు మీరు బ్రతకండంటూ ఆవిరైపోతుంటే… ఇంటింటికీ, వీధివీధికీ అడుగడుగునా ఉన్న నల్లాల్లో గాలితప్ప నీటి బొట్లుకూడా రానంటుంటే.. ఇక మనిషికి బ్రతుకెక్కడిది. ఇంకా సమస్య నాది కాదని మభ్య పెట్టుకుంటూ, భ్రమల్లో మునిగి 24 గంటలు రన్నింగ్‌ వాటర్‌ మోజులోంచి బైటపడకపోతే ఎలాగోలా మన బ్రతుకులు తెల్లారినా తర్వాతి తరాలలో పురిటి గుడ్డు కళ్ళు తెరవాలన్నా కంటికి తడి ఉంటుందో లేదో…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.