”కభీ తూ మోటీ కెహతా హై
కభీ తూ ఛోటీ కెహతా హై
కభీ తూ కాలీ కెహతా హై
కభీ తూ సావ్లీ కెహతా హై
తేరే ఇన్ బాతోంసే… మేరే దిల్ దుఖ్‌తా హై”
అంటూ కన్నీళ్ళతో విద్యాబాలన్ నిలదీస్తే అందరూ కదిలిపోయారు. లక్షల మంది ఆమెకు బాసటగా నిలిచారు.
కానీ మనూర్లో ఒక మామూలు అమ్మాయి
ఉంటుంది.
ములక్కాయకి చీర కట్టినట్లుందిరా!
కాటుక డబ్బా నడుస్తున్నట్లుందిరా!
ఫెయిర్ అండ్ లవ్లీబేబీ… ఒకసారి ముట్టుకుని చూడరా…
ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంటికొచ్చి అద్దం ముందు కన్నీరయిపోతుంది.. ఐశ్వర్య రికమెండ్ చేసిన కాస్మొటిక్స్ కొనుక్కోవాలని తపన పడుతుంది. జిమ్‌కి వెళ్ళగలిగిన స్థోమత ఉంటే సరే, లేకపోతే జీరో సైజ్ షేప్ కోసం కడుపు మాడ్చుకుంటుంది. రక్తహీనత వల్ల డిప్రెషన్ వస్తుంది. మనాది ముదిరి రోగమై చచ్చిపోతుంది.
అసలు లావు కానీ, సన్నం కానీ, పొడుగు కానీ, పొట్టి కానీ, నలుపు కానీ, తెలుపు కానీ, ఎత్తు పళ్ళు కానీ, కాలు కురచ కానీ, నంగి మాట కానీ, నత్తి కానీ… ఏదీ కూడా మనకై మనం తెచ్చుకోగలిగేదే కాదు.
మరి అలాంటిది, జన్మతః వచ్చిన శారీరక లోపాల మీద ఛలోక్తులు విసరడమన్నది ఏ తరహా క్రూరత్వం క్రిందకు వస్తుందో కదా! ఈ క్రూరత్వం నేరమే కదా!
అవును మరి, మన అభిప్రాయాలు ఇంకొకరి వేదనకి కారణమైతే మనం తప్పకుండా నేరస్థులమే. ఆ అభిప్రాయాలు, మన ఎవరి చేతుల్లోనూ లేని శరీరతత్వం గురించో, రంగు గురించో, శారీరక దౌర్భల్యత గురించో అయితే అది మరింత తీవ్రమైన నేరమే. ఒక మనిషి లావే అయి
ఉండవచ్చు. లేకపోతే బక్క పలచగా ఉండి ఉండవచ్చు. అయితే మనకొచ్చిన నష్టమేంటి? మనం చేసే హేళనల వల్ల మనకు ఒరిగేది ఏమిటి? లేదా అతి మంచితనానికి పోయి మనం చూపించే సానుభూతి వల్ల వాళ్ళకు జరిగే మంచి ఏమిటి? సమాధానం చెప్పగలమా?
”మనమంటే 36,24,36 కొలతలమైన చోట
మొటిమలు మొలవడం, జుట్టు రాలడం
నడుం సన్నగా లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట
ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!
నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యంకై వెంపర్లాడుతూ…
మూసలోకి ఒదిగి ఒదిగి
ఈ ”స్వచ్ఛంద” సౌందర్య హింస
మన సహజాతమని నమ్ముతూ…
మనల్ని చూసుకున్నప్పుడల్లా
గడ్డీ గాదం కూరి పంటచేలలో నిలబెట్టిన దిష్టిబొమ్మ గుర్తొస్తుంది.
మనలోంచి మనసంతా తీసేసి, డొల్ల చేసిన
”ఈజిప్షియన్”’ మమ్మీలాగుంటాం!” అని చాలా కాలం క్రితం విమలగారు రాశారు.
అవును… ఆమె రాసింది ముమ్మాటికీ నిజం. ఎవరికి వారికి ఒక సహజ సిద్ధమైన అందం ఉంటుంది. అది రూపంలోనే కావచ్చు, మాటల్లో కావచ్చు, తెలివిలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు. అందమంటే అంత సహజంగా ఉండాలి. ఆ సహజత్వం లేనిది ఏదీ అందం కాదు. దిష్టిబొమ్మే… రూపమొక్కటే అందానికి కొలమానం అనుకుంటే నాగుపాము కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలా అని దగ్గరికి వెళ్ళగలమా? ఏ మనిషికి అయినా ఆకర్షణ అన్నది తనలోని సహజ సిద్ధమైన మేధ నుండే వస్తుంది కానీ రూపవిలాసాలని బట్టి కాదు.
వ్యాపార లాభాల కోసం ఎవరో సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్స్‌లో ఎవరైనా ఇమడకపోవడం అన్నది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది. నిజమే…. ప్రతిదానికీ ఒక స్టాండర్డ్ సెట్ చేసి దాన్ని అచీవ్ చెయ్యడమే మన అల్టిమేట్ గోల్ అన్న భావనని మనలో ఇంజెక్ట్ చేసి, దాన్ని సాధించలేనప్పుడు పుట్టే న్యూనత భావం ఒక మనిషిని ఎంత ఆత్మరక్షణలోకి నెట్టేస్తుందో ఆలోచన చెయ్యలేనంత నిరక్షరాస్యులం అయ్యామా మనం?
పక్కవాళ్ళెవరో మనల్ని చేసే కామెంట్‌తో మనమీద మనకే ఒక అపనమ్మకం ఏర్పడి మనల్ని మనం ఇష్టపడకపోవడం ఎన్నోసార్లు జరిగే ఉంటుంది కదా… మరి ఎదుటి వారిదైనా అదే పరిస్థితి అన్న ఆలోచన మనలో ఎందుకు కలగడం లేదు? ఎందుకంటే.. ఇప్పుడు ఒక మార్కెటింగ్ మాయాజాలంలో చిక్కుకుపోయాం, జీరో సైజ్ కొలతలంటూ, సిక్స్ ప్యాక్ బాడీలంటూ మనిషిని మోహపరిచే ఒక ఆకర్షణీయ అయస్కాంతంలో మనం చిక్కుబడిపోయి… మన విషయం, మనవాళ్ళ విషయం మనం మరిచిపోయి ఎదుటి వాళ్ళమీద వ్యంగ్యంగా జోక్స్ కట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం.
ఇలాంటి వ్యంగ్యాలు… కామెంట్లూ ఇప్పుడిప్పుడే వయసుకి వస్తున్న యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా… మనం చేసే కామెంట్స్‌తో, తమని తాము ఒప్పుకోలేక తాము
ఉండాల్సింది ఇలా కాదు ఇంకెలానో అని చేసే పిచ్చి ప్రయత్నాలతో జీవితాలనే కోల్పోయిన సంగతులు వార్తా పత్రికల లోతుల్లోకి వెళ్ళి చూస్తే కథలు కథలుగా కనిపిస్తాయి.
ఒకరు ఇంకొకరి బాడీని షేమ్ చేస్తున్నారు అంటే… ముందుగా వాళ్ళు షేమ్ చేసుకోవాల్సింది తమ మైండ్స్‌ని. ఇంకొకళ్ళ శరీరాన్ని కామెంట్ చేసే ప్రతి వ్యక్తి యొక్క మైండ్‌ని కూడా షేమ్ చెయ్యాలి. ఆ షేమ్ అన్నది ఆ మనసుల్ని అస్థిరపరచాలి… అప్పుడు ఇక షేమ్ ఉండదు.
ఇప్పుడు మనం యువతరానికి నేర్పాల్సింది ఒక్కటే… వాళ్ళని వాళ్ళుగానే ప్రేమించుకోవాలి. అదే ప్రకృతి సహజం. మనల్ని మనం ఇష్టపడడం మొదలయ్యాక లావా, సన్నమా, పొడుగా, పొట్టా అనేదేదీ సమస్య కాదు. మన శరీరమన్నది మనం ఇలానే ఉండాలనుకుని కోరుకుంటే వచ్చింది కాదు ఎవరో దాన్ని కించపరిస్తే క్రుంగుబాటులో వెళ్ళడానికి. ఎవరిని వారు తమని తాము గాఢంగా ప్రేమించుకోవడమన్నది జరిగితే ఎవరెన్ని హేళనలు చేసినా ఒక్క చిరునవ్వుతో అవి మాయమైపోతాయి. ఆ ఒక్క చిరునవ్వు చాలు చిరకాలం ఆరోగ్యంగా ఉండడానికి. ఆ ఆరోగ్యమే ఎప్పుడూ మనకు తోడుండాలి… మానసిక రోగగ్రస్తుతలని చూసినవ్వుకోవడానికి.
ఇది మన జీవితం… మన జీవితం ఎప్పుడూ మన నియమాల్లోనే సాగాలి.