ఇతర అంశాలకు మాదిరిగానే భాషకు సంబంధించిన వాదనలు, గ్రాంథిక, వ్యావహారిక భాషా ఉద్యమాలు, భాషా నిర్మాణాలు, వ్యాఖ్యానాలు, వ్యక్తీకరణలు, గ్రామ్యము, వ్యాకరణము, భాషా చరిత్రలన్నిటిని హిందూ ఆధిపత్య మగ దృష్టి కోణాన్నే సార్వజననీనంగా చెలామణి కాబడ్తున్నాయి. ఇప్పటిదాకా తెలుగు భాషమీద జరిగిన నిర్వచనాలు, నియంత్రణలు చేస్తున్నదీ, చట్రాలు బిగిస్తున్నదీ ఆంధ్ర మగ పండిత సమాజమే.
భాష తల్లి పాల నుంచి, తల్లి ఒడిలోనుంచి మొదలవుతుంది ఏ సమాజాల్లోనైనా. అందుకే భాష గురించి చెప్పాల్సి వస్తే మహిళలు, అందులో శ్రమ కులాలైన దళిత మహిళలే నిపుణులు. అందుకే ప్రముఖ తెలంగాణ కవి సి.నారాయణరెడ్డి ‘మాఊరు మాట్లాడింది’ పుస్తకాన్ని మాదిగ మహిళలకు అంకితమిస్తూ…
‘మా ఇంట్ల పనిచేసే ”మాదిగామె” నుంచి నేను అద్భుతమైన జీవభాష నేర్చుకున్నా’నని చెప్పుకున్నాడు. తెలుగు భాష కోసమే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప తెలుగు భాషా పరిశోధకుడు సావెం రమేష్ ‘తెలుగు నాలుగు దిశలా బత్కుతుందంటే అది మాదిగ మహిళల వల్లనే అని చారిత్రక ఆధారాల్తో వివరిస్తున్నాడు.
తెలంగాణ భౌగోళిక, సామాజిక ఉత్పాదక ప్రాచీనతలలోని మౌఖిక సాహిత్య కళా సంస్కృతుల సమ్మేళనమే తెలంగాణ దళిత భాషా సౌందర్యము. మౌఖిక సాంప్రదాయం తెలంగాణ దళిత సాహిత్యానికి ఒక విశిష్టతను, ఒక ప్రత్యేకతను సంతరించింది. తెలంగాణ దళిత సాహిత్యము మౌఖిక సాంప్రదాయానికి చెందినదే. పని పర్యావరణం నుంచే భాష పుట్టి పెరుగుతుంది. సమూహాల సాంఘిక నేపథ్యాలను బట్టి తన భాష, తన స్థాయీ, స్థానాలను మార్చుకుంటది. పేద భాషలు, ధనిక భాషలు పనికి దూరమైన పాండిత్య భాషలున్నయి. భాషక్కూడా కులమానాల కొలమానాలున్నయి కుల సమాజంలో. అట్లనే ప్రాంతముంది. ఒక సమూహము ఇంకో సమూహమ్మీద, ఒక ప్రాంతం మరో ప్రాంతమ్మీద పెత్తనం చెలాయించినట్లే ఒక భాషమీద ఇంకో భాష పెత్తనం చెలాయిస్తున్నది.
ప్రపంచ భాషగా చేయబడిన ఇంగ్లీషు పెత్తనాన్ని చాలా దేశాలు వ్యతిరేకిస్తూ తమ దేశ భాషల్ని నిలుపుకుంటున్నయి. హిందీ భాషను దక్షిణ భారత రాష్ట్రాలు అంగీకరించడంలేదు. అట్లనే నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర ఆధిపత్య కులాల భాషాధిపత్యాలకు అడ్డుకట్ట వేసి తెలంగాణ తెలుగు భాషను అందులో తెలంగాణ దళిత భాషా విశిష్టతలను, సౌందర్యాలను, నుడికార సొగసుల ఆస్తిత్వాలకు కాపాడుకున్నది తెలంగాణ దళిత సాహిత్యము.
తెలుగు భాష పేరుతో వచ్చిన భాషా శాస్త్రవేత్తలంతా ఆంధ్ర కుల మగ పండితులే. తెలంగాణ భాషను మాండలికమని అవాచ్యం చేసి అవమానించారు. ఆధునిక భాష, పత్రిక భాష, ప్రామాణిక భాష శిష్ట వ్యావహారికమని చెప్పిందంతా కోస్తాంధ్ర ఆధిపత్యకుల భాషనే.
తెలంగాణ సమాజము ఆంధ్ర వాళ్ళనుంచి ఎదుర్కొన్న అవమానాల్లో భాష ప్రధానమైనది. తెలంగాణ శ్రామిక కులాలు తమ సొంత భాష మాట్లాడానికి ప్రామాణికాల పేరుతో అనేక అవరోధాలు ఎదుర్కొన్నారు. తమది కాని భాషను, నుడికారాన్ని చదువుకునే దానికి తెలంగాణ దళిత కులాలు ఎంతో హింసను భరించాయి. ఆంధ్ర పండిత వ్యావహారికాన్ని ప్రామాణికం చేసిన విద్రోహానికి తెలంగాణ భాష గురయింది. తెలంగాణ దళిత భాషను కాసట బీసట భాషగా చూపించినయి. కలుషితాలంటని ముంజల్లో మూలిగం వంటి తెలంగాణ దళిత భాషని, నుడికారాల్ని, జాతీయాల్ని భాషా చరిత్రలో విస్మరించాయి ఆంధ్ర భాషా పాండిత్యాలు. ఒక ఆంధ్ర భాషా శాస్త్రవేత్త ‘దర్జీ’ అనే పదము అన్ని చోట్ల బట్టలు కుట్టే వాళ్ళని అర్థంగా చెప్పాడు.
తెలుగు ప్రాంతాలన్నిచోట్ల ”దర్జీ” అనే అంటారని స్థిరపరిచిండు. కానీ తెలంగాణలో బట్టలు కుట్టేవాళ్ళను దర్జీ అని అనరు. ‘మేర’ అని అంటారు. కానీ ఈ సదరు భాషా పండితుడు తెలంగాణ ‘మేర’ పదాన్ని నిర్ద్వంద్వంగా అవాచ్యం చేసిండు. ఇట్లా అనేక పదాలు ఆంధ్ర భాషా పండితులు తెలంగాణ పదాల్ని, నుడికారాల్ని, ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ భాషకు అన్యాయం చేసిండ్రు. ఇక దళిత భాష విషయానికి వస్తే అన్నిరకాల ఆధిపత్యాలు విస్మరించినయి.