రికార్డ్‌ డ్యాన్సర్‌ -వేముల ప్రభాసత్యం

ఆనాడు –

”ఈ ఊళ్ళో శ్రీపతి వాళ్ళ గోడల్ల రికార్డు డాన్సట. డ్యాన్సర్‌ చాలా అందంగా ఉందట. అచ్చం సినిమా యాక్టర్‌లాగ ఉందట. ఆంధ్రామెనట. పెద్ద పెద్ద ఊళ్ళల్ల ఆడిందట”.

ఊళ్ళో ఎక్కడ చూసినా ”అట” వార్తలు వినబడుతున్నాయి. స్వయంగా చూసినవారు ఈ ”అట” తీసేసి గొప్పగొప్పగా చెప్పుకుంటున్నారు.

”రాత్రి 10 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్‌ అవుతుందట”.

”అరే రాత్‌ కో మజా ఉడాయేంగే…”

”’హో క్యా తారీఫ్‌ కరేంగే ఉస్‌కీ… కో”

”దేఖ్‌ నే కా కాబిల్‌ హై ఔర్‌ ఉహహుహుహుహు…”

”అచ్ఛా… రిజర్వ్‌ టికెట్‌ లేలేంగే”.

”తబ్‌….లలలా లలలా లాలా…”

– రసగ్రంథం సాగిపోతున్నది.

ప్రేక్షక స్థలాన్ని మూడు తరగతులుగా విభజించారు.. ముందున్న నేలను తవ్వి కుర్చీలు అమర్చారు. ఆ తర్వాత చాప.. చివరికి నేల.

ఇంకొక మనిషి కూడా దూరే సందు లేకుండా అంతా నిండిపోయారు. ఆ ఊళ్ళోకానీ, చుట్టుపక్కల కానీ థియేటర్‌ లేనందువల్ల సినిమాలు చూసే అవకాశం లేేదు. ఇలా నాటకాలవారో, డాన్సుల వారో వస్తేనే ఊరి జనానికి వినోదోత్సవం.

ఇహ ఇలాంటి రికార్డు డాన్సులంటే చిన్న పిల్లవాడి నుంచి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాడి దాకా కుతూహలమే.

”ఏమే రామన్నా! బెజవాడ పిల్లొచ్చిందట. నీ యవ్వ. అవ్వల్దరి ఉందట… డాంచు… డాంచు చేత్తదటనే…”

”ఎన్ని పైసలంటరా?”

”ఎన్ని పైసలు ఎక్కడిదే. అఠానట. మనమేమన్న కుర్చీల కొయ్యేటోళ్ళమా… బెంచీల కొయ్యేటోళ్ళమా? ఇంత గొంగడేసుకుని న్యాలమీద కూర్చుండి… నీ యవ్వ… ఆ పిల్ల ఆట… పాట.. ట్ల్‌” లొట్టలేస్తున్నారు వయసు మళ్ళిన వాళ్ళు.

”రమక్కా! మనమూ పోదామాయె. అచ్చం సినిమాల తరీకనే చేస్తదటనే”

”పోదాం కాని, అమ్మ ఏమంటదోనే?”

”ఎందుకేమంటది? మనూళ్ళే ఏమన్న సినిమాలున్నాయా, ఇంకేమన్న ఉన్నాయా? కనీసము గిదన్న చూడద్దా?”

”నిజంగా తప్పక చూడాల్నే. పాట పాటకో చీర మారుస్తదట. సరళ చెప్పిందప్పుడు. మెడల ఏమేమి హారాలేసుకుంటదో. చెవులకు ఏం వెట్టుకుంటదో, కాళ్ళకు, చేతులకు ఏమేసుకుంటదో, ఎసుంటి జడేసుకుంటదో చూడాలె.”

– ఎలాగైనా అమ్మను ఒప్పించి ఆ డ్యాన్సర్‌ని చూడ ఉత్సాహపడుతున్నారా కన్నె పిల్లలు.

”ఏమే, రాత్రికి ఆటున్నదట. వెళ్దామాయె”.

”ఆఁ మన బతుకే ఆట పాట తీరుగుంది. ఇంక వేరే ఆట పాటలెందుకు?”

”మన బతుక్కేమయిందే బంగారమోలె. అసలు సంగతి అదికాదు. నేను దాన్ని చూసి దాని మోజుల పడిపోయి నిన్ను మర్చిపోతానని భయం. గంతే…”

”ఊఊఁ… మీ మొహాలకు గదొక్కటే తక్కువయింది. ఉన్న పెండ్లాం పిల్లలకే సరిగా కూడు పెట్టే ఇది లేదుగాని ఇంక వేరేదానికి పెడతాడట నా సవితికి.”

”ఏదో వట్టిగన్న తియ్యే. నిన్ను మించిన సుందరి ఇంకెవ్వరుంటరె నా ముద్దుల పెండ్లామా? రాత్రికయితే తయారుగుండు మళ్ళొస్త.” – ఇదీ ఓ సంసార శకట చక్రాల సరస విరస సమన్విత సంభాషణ.

పది గంటలకని ప్రకటించిన డాన్సు పదకొండు గంటలకు ప్రేక్షకుల విసుగు, అల్లరి గరిష్ట స్థాయికి చేరుకున్నాక గాని ప్రారంభం కాలేదు.

ఆలస్యం ప్రతి కార్యక్రమానికి మామూలే. దానికి కారణం ఎన్నెన్నో. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు కేవలం ముగ్గురే.

డాన్సర్‌, ఆమె భర్త, ఓ పధ్నాలుగు పదిహేనేళ్ళ అబ్బాయి… ఆమె తమ్ముడు.

స్టేజీపై కనిపించేది ఒక్క డాన్సరే. యుగళ గీతాలకు మాత్రము ”మగ”’ స్థానాన్ని ఆ అబ్బాయి భర్తీ చేస్తున్నాడు.

ఇహ, మేనేజరూ, పనిమనిషి, మేకప్‌మెన్‌, టికెట్‌ సెల్లర్‌… వగైరా అన్నీ ఆవిడ భర్తేనూ. మంచి పెర్సనాల్టీ ఉంటే అతడూ ఆమెతో కూడి ప్రదర్శనలిచ్చేవాడు. కానీ సగటు భారతీయుడిలా బక్కచిక్కి కడుపు, వీపులు కలిసిపోయి, విల్లులా వంగిపోయి, అసలు వయసును మించిన ఆకారము కలిగి తెరచాటుకు తప్పుకొని సూత్రధారుడైనాడు. అందమైన భార్య దొరకడం అతడి జీవితానికి జీవిక నేర్పించింది. తెర వెనుక రికార్డును, తెర ముందు భార్యను ప్లేయింగ్‌ చేయిస్తున్నాడు.

ఆహా… ఓహోలు.. ఈలలు ఆరంభమైనవి ప్రేక్షక మహాశయుల నుంచి. జావళీలను, శృంగార విరహ గీతాలను చక్కగా అభినయిస్తోంది. సంగీతానుగుణమైన అంగాంగముల ఊపు ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ఉంది.

-మేని ఒంపు, విరపు, పురుషులలో నరాల జ్వాల రగిలిస్తోంది. యుగళగీతాలు మరింత చిచ్చు రేపుతున్నాయి.

ఆ అబ్బాయి అందరి అసూయ కెర అవుతున్నాడు. ఆ స్థానములో తాముండి, ఆ అందాల భరణిని చేతుల్లోకి తీసుకుని ఆ పైన…

దాదాపు అందరి ఆలోచనలు ”ఆపై” మీదనే ఉన్నాయి.

”గా చిన్న పోరని తోటి ఆడితే ఏం పసనే…ఇగో నన్ను రమ్మనే, తకతైయ్య… నీ చెయ్యి పట్టుకొని ఎంత మంచిగ డాన్సు చేత్తనో… ” తమకము ఆపుకోలేక లోని భావాలను ఎవరికి వారే అస్పస్టంగా వెలిగక్కుతున్నారు.

కామావేశ ప్రకటనలు హెచ్చాయి.

ఈలలు పెచ్చు పెరిగాయి.

సూత్రధారుడిది గమనించాడు. తమ ప్రదర్శనలలో ఇది మామూలే. తనూ పురుషుడే. అందమైన ఆడది ఎదురుగా ఉంటే ఆపుకోలేని ఆవేశ ఫలితమే ఈ అలజడి.

వాల్యూమ్‌ పెంచాడు.

డాన్సులో ఎంత ప్రాక్టీసు ఉన్నా కంటిన్యూగా తనొక్కతే కావడంతో అలసట వస్తోంది. రిలీఫ్‌ ఇచ్చే ఇంకో డాన్సర్‌ కానీ ఉంటే బావుండేది. పాట పాటకీ మధ్య అలుపు తీర్చుకోను రెండు, మూడు నిమిషాలు ఆగుతోంది. డ్రెస్సులు మార్చుకోను అప్పుడప్పుడు ఐదారు నిమిషాలు పడుతోంది.

ఆ సందు సాకుగా దొరికింది అరవడానికి –

”గిదేంది నడుమ నడుమ… గిందుకే పెట్టినామే పైసలు?”

”జల్ది జల్ది పాటెయ్యరాదురా!”

”బిరబిర కట్టుకోరాదె చీర… ఏమో దీర్గము చెయ్యవడ్తివి?”

”యేడి మీద యేడి పడితేనే బాగుంటది. నడుమ నడుమ మమ్మల్ని గిట్ల చల్లార గొర్తున్నవేమే?”

”ఓ మై లవ్‌లీ డార్లింగ్‌, కమాన్‌ క్విక్‌లీ” అప్పుడప్పుడే నేర్చుకుంటున్న ఇంగ్లీషునుపయోగిస్తున్న హైస్కూలు కుర్రాళ్ళు.

”అరే మేరీ గోరీ.. జల్దీ జల్దీ ఆవోనా..”

వాళ్ళందరి దృష్టిలో ఆమె ఒక మనిషి కాదు. కేవలం శృంగార బొమ్మ! పైసలిచ్చి కొనుక్కున్న కొమ్మ!!

కూటికోసం అవయవాలనలరిస్తున్న ఓ ఆడది. అంతే!!

ఆ అరుపులన్నీ అలవాటయిపోయినట్లు, వారి కూతలన్నీ పట్టనట్లు యధావిథిగా స్టేజీ పైకి వస్తూ, కృత్రిమ చిరునవ్వులను చిందిస్తూ హావభావాలను ప్రదర్శిస్తూనే ఉంది.

మళ్ళీ శృంగారం.

మళ్ళీ ఆవేశం.

మళ్ళీ తమకం.

ఈలలు..

గోలలు…

సాహిత్య శృంగార స్థాయికనుగుణంగా ఆవిడ నటనా రసం గరిష్టస్థాయిన చిప్పిల్లుతున్నప్పుడు తమ ప్రే(కా)మను డబ్బుల రూపాన గుప్పిస్తున్నారు కొందరు దాన(కామ)కర్ణులు.

మరి కొందరికి కొన్ని వికారపుటాలోచనలు వచ్చాయి. తమ జేబులోంచి 5, 10 పైసల నాణేలు తీసి ఆవిడపై సూటిగా…

మెడపై…

నడుముపై…

వక్షోజాలపై…

ఇంకేవేవో భాగాలకేసి గురిచూసి విసురుతున్నారు.

ఆ భాగాలను తాకి కిందబడిన తీరు చూసి నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు. ఏదో విజయాన్ని పొందినంతగా విలన్ల ఫోజుతో వికృతంగా థ్రిల్లవుతున్నారు.

శరీరంలో రకరకాల చోట్ల వేగంగా వస్తున్న నాణేలు చురుక్కుమనిపిస్తున్నాయి. అయినా ఓర్చుకోవాలి, ఓర్చుకోక తప్పదు. లేకపోతే రసాభాస!

ఎలాగైతేనేం… పైసలొస్తున్నాయి.. అంతే చాలు!

తన కోసం, తన భర్త కోసం, తననే నమ్ముకొని వేరే దిక్కులేని వాడయిన తన తమ్ముడికోసం, తన చిన్నారి బాబు కోసం- ఆడాలి, పాడాలి. ఎన్ని ఇబ్బందులనైనా ఓర్చుకోవాలి. కానీ ఇంతవరకు తను నీచస్థాయికి మాత్రం దిగజారలేదు. కేవలం తను చిన్నప్పుడు నేర్చుకున్న నృత్య కళనే ప్రదర్శిస్తోంది. దానినే ఒక ఉద్యోగంగా ఉపయోగించుకుంటోంది.

జీవనం కోసం స్త్రీ సహజమైన లజ్జను వదిలి ఇష్టం లేకున్నా అంగాంగాభినయంతో, పంటి బిగువన శృంగారాన్ని చిందిస్తూ ఆడుతోంది. డబ్బులు వెచ్చిస్తూ- ఒక రకమైన మానసిక బలహీనతతో వీక్షించవచ్చే ప్రేక్షకులను సంతృప్తిపరచడం తన కర్తవ్యం కాబట్టి- బాగుంది, బాగుంది అంటూ అదే బలహీనతతో ఇంకా తన ప్రోగ్రాంకి డిమాండ్‌ వస్తూ డబ్బు సంపాదించాలి కాబట్టి- బలవంతంగానైనా, పాటలోని సాహిత్య సంగీతాదులకనుగుణంగా, తన శరీరాన్నూపక తప్పదు.

తద్వారా వారిని రెచ్చగొట్టకా తప్పదు. వారి కారుకూతలకు గురికాకా తప్పదు. ఇలాంటి చురకలకు ఎరకాకా తప్పదు.

అదంతే!

రికార్డు తిరుగుతోంది…

ఆవిడా తిరుగుతోంది…

పాటకనుగుణంగా పెదవులు కదిలిస్తూ ఆడుతోంది…

రంగు రంగుల లైట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతోంది…

చిల్లర నాణాల వర్షం కురుస్తోంది. చిరు చెమటలకు మేను తడుస్తోంది.

ఇంతటి సందడిలో ఒక ధ్వని వినబడింది. అది తన కోసం ప్రత్యేకమైన ధ్వని!

ప్రేక్షకుల నుంచి కాదు. లోపలి నుంచి. హృదయాన్ని కదిలించే ధ్వని!

తన మాతృ హృదయాన్ని పొంగించే పసిపాప ధ్వని! కానీ… ఆవిడ భయపడిపోయింది.

”అరే…ఇప్పుడే లేచాడా?” సన్నగా మొదలైన ఏడుపు హెచ్చుతోంది.

మైకు నుంచి వస్తున్న పాట హోరులో ప్రేక్షకులకు ఏడ్పు రాగం వినబడ్డంలేదు. వారి రాగంలో మునిగి మైమరచియున్నారు.

ఏడుపు స్థాయి హెచ్చుతోంది.

”నిద్ర నుంచి లేచి తల్లికై ఆవురావురుమంటున్న బాబును తన భర్త సముదాయించలేడిప్పుడు.”

కనీసం పాలసీసా ఉన్నా బాగుండేది. రెండు రోజుల కిందనే అయిపోయింది. విచారాన్ని వెలయించినా సబబుగానే ఉండేది.

అయినా, అలవాటు పడ్డ పెదవులు, చేతులు, నడుము, పాదములు యాంత్రికంగా పాటకనుగుణంగానే కదులుతున్నాయి.

లోపల శబ్దం హెచ్చుతున్నది.

పాట ఇంకెంతసేపో నిమిషాలు లెక్కబెట్టుకుంటోంది.

రెండున్నర నిమిషాలు.

రెండు నిమిషాలు

ఒక్క నిమిషం.

సగం…

క్షణాలు…పాట ఆగిపోయింది.

గట్టిగా ఊపిరి పీల్చుకుని చటుక్కున లోనికి వెళ్ళింది.

ఏడుపు లంకిస్తూ గుక్కపెడుతున్నాడు బాబు.

ఓ చేత్తో కలర్‌ వైటీ స్విచెస్‌ మారుస్తూ, మరో చేత్తో బాబును ఒళ్ళో వేసుకుని సముదాయించ యమ యాతన పడుతున్నాడు భర్త.

ఒడి మారిన బాబు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లుగా ఠక్కున తన ఏడుపు ఆపుచేశాడు. తల్లి ఒడి అలాంటిది. అనిర్వచనీయ ఆత్మీయతాను రాగానంద జీవితం. బాబును గుండెలకు హత్తుకుని తన పాలనందిస్తున్నది. గంటన్నర ప్రోగ్రాం అయిపోయింది. ఇంకో అరగంట మిగిలింది. ఇవాళ తొందరగానే లేచాడు. ఆ కాస్త టైం అయిపోతే బాగుండేది… ప్చ్‌! ఆకలితో ఉన్న బాబు గుట గుట ఆరగిస్తున్నాడు. తన నుంచి వేరు చేస్తారేమోన్న ఆతురతతో తన అమృత కలశాన్ని గట్టిగా పట్టుకొని త్రాగుతున్నాడు.

బయట అరుస్తున్నారు –

బాబు అలాగే గట్టిగా పట్టుకొని త్రాగుతున్నాడు.

”ఏమాయె ఇంకెంతసేపు? ఇంకెంతసేపే…?”

అరుపులు, ఈలలు, కూతలు…

తన రొమ్మును బాబు నోట నుంచి తప్పించజూసింది.

ఊహుఁ విడవడం లేదు. వచ్చీ రాని పళ్ళతో నోటితో మరింత గట్టిగా ఇముడ్చుకున్నాడు.

ఆ స్థలంలో కుక్కలు, నక్కలు, కోతులు, గుడ్లగూబలు ప్రవేశించినట్లుగా ప్రేక్షకుల నుంచి వింత వింత శబ్దాలు మితిమీరుతున్నాయి.

ఇహ చేసేది లేక బాబు నోటిని బలవంతంగా విడిపించింది.

ఆకలి తీరని బాబు ఎలుగెత్తి అరిచాడు.

ఉక్రోషం హెచ్చి గుక్కబెట్టి ఏడ్చాడు. తల్లి మనసు నీరయింది. మాతృ హృది తల్లడిల్లింది. ఆత్మీయానురాగాలు క్షీరధారగా వయోధరాల నుంచి ”చేపు”లై ఏడుస్తున్న పసివాడి నోట కురిసినాయి.

తగిలిన చనుబాల తడికి బాబు ఏడుపు మాని, మాతృదేవత తనను కరుణించింది అన్న నమ్మకంతో నోటినటువైపు తిప్పి చనుమొనందించుకున్నాడు.

ఆ చిన్నారి చేష్టలకు ఆనంద నర్తకి ఆమె హృదయ రంగస్థలాన భరతనాట్యమాడింది. ”నా చిన్నా, నా కన్నా!” అంటూ తన వక్షస్థలానికి హత్తుకుని పులకించిపోయింది.

ఇంక అయిదు నిమిషాలయితే సరే, పది నిమిషాలయినా సరే తన బాబును సంతృప్తిపరచాకనే స్టేజీపైకి వెళ్ళాలనుకుంది.

ఈలలు వేసీ వేసీ – కూతలు కూసీ కూసీ –

పాపం, ప్రేక్షకులకు విసుగు పుట్టిందో ఏమో… ఇహ తమ సహజ కవిత్వమునకు పదును పెడుతున్నారు.

”ఏమాయెనే లోపల ఏం జేస్తున్నవే?”

”గింతసేపాయె. ఇంకా లోపలనే పంటావే”

”నీకు గిప్పుడే బుద్ది పుట్టిందాయె”

”ఇవతల ఇంతమంది ఉండంగ మమ్మల్ని ఇడిసిపెట్టి గా ఒక్కని…”

”……….”

”……….”

శ్రీనాధుని శృంగార నైషధము తలదన్నేస్తున్నారు. ఆ సాహిత్యపు ఘాటుకు తట్టుకోలేక జుగుప్సతో ఒక్కొక్కరుగా ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. చెవులు మూసుకొని కొందరు పూర్తిగా డాన్సు చూడాలన్న తహతహతో కూర్చున్నారు.

ఇహ చెవులు రిక్కించి వింటూ మరీ కూర్చున్నారు మరి కొందరు మగవాళ్ళు. బూతు మాట్లాడడం కొందరి స(దు)రదా అయితే మరి కొందరికి అది వింటుండడం సరదా. ఈ రెండూ కూడా లైంగిక బలహీనతా లక్షణాలే!

నిమిషాలు గడుస్తున్నకొద్దీ…

అల్లరెక్కువయింది..

అది వట్టి అల్లరి కాదు.

చెవులు చిల్లులు పడే…

మెదడు మొద్దుబారే…

లజ్జావంతులు ముడుచుకుపోయి అమాంతం అక్కడినుంచి ఎగిరిపోవాలనుకునే…

”ఆఖ్‌ థ్పూ…” అని ఆ నోళ్ళల్ల ఖాండ్రించి ఉమ్మి వేయాలనిపించే…

మొదలంటా ఆ నాలుకలు తొగ్గోయాలనిపించే…

బూతు పురాణపుటల్లరి అది!

తాగుబోతు వెధవల నోట్లోని పురుగులు అవి!

ఇలాంటి అల్లరికి ఎంత అలవాటయినా… ఎంత పట్టించుకోవద్దనుకున్నా…

మితిమీరిన మాటలు ఈటెలై పొడుస్తుంటే…

అశ్లీల పదాగ్నికి తాను దహించుకుపోతురటే…

ఇహ నిలువలేకపోయింది. కళ్ళు నీళ్ళతో నిండినాయి. పాలు గ్రోలుతున్న బాబుని తప్పించి, ఒడి నుంచి తీసి క్రింద

వేసి ఆ బాబు వంకైనా చూడకుండా స్టేజి ఎక్కింది.

రికార్డు తిరుగుతోంది యాంత్రికంగా…

ఆవిడా తిరుగుతోంది యాంత్రికంగా…

ఇలాంటి వాతావరణానికి అలవాటు అయి అయి… మొండిపోయి…. బండబారిన భర్త ఒడినూపుతూ బాబును పడుకోబెట్ట ప్రయత్నం చేస్తున్నాడు. బయటకు వచ్చి ప్రేక్షకులతో ఆలస్యానికి కారణాలు చెప్పేందుక్కూడా మొహం చెల్లకున్నాడు…కనీసం మైకు ద్వారానైనా…

స్టేజీ… టికెట్స్‌… రికార్డు ప్లేయర్‌… స్విచెస్‌…

చేతులు అలా అలా వాటి పనిని అవి చేసుకుంటూ పోతూనే ఉంటాయి తప్ప, ఏ ఊళ్ళో ఎప్పుడు ప్రోగ్రాం వచ్చినా కలెక్షన్‌, తిండికి కావలసిన వస్తువులు… ఆలోచనలు తప్ప…

వేరే ఏమీ ఆలోచించని అభాగ్య యాంత్రిక జీవి అతను…

కులాంతర వివాహం చేసుకున్నందుకు అటు బంధువుల అండలేక, ఉన్నత చదువులు లేక,

ఉద్యోగాలు లేక కూటికోసం ఆవిడ నాట్యకళను డబ్బుగా మార్చి ఉపయోగించుకుంటున్నందుకు ప్రజల గౌరవాన్ని నోచుకోలేక… చులకనకు గరయిన సంఘోపహతులు వారు… ఆత్మాభిమానం, రోషం క్రమక్రమంగా లుప్తమవుతూ జీవితాలు నెట్టుకొస్తున్న వట్టి యంత్రాలు వారు!!

ఆకలి తీరని బాబు ఆవురావురంటూ చూస్తున్నాడు.

బుల్లి బుల్లి చేతులతో పెనుగులాడుతున్నాడు.

కానీ… ఆ ఆకలి తీర్చే ఆడయంత్రం తిరుగుతోంది. బయట రికార్డులా, పెనుగులాడితే లాభం లేదనుకున్న బాబు ఏడుపు లంఘించుకున్నాడు.

ఆ మగ యంత్రం వాల్యూమ్‌ హెచ్చించింది యధావిధిగా…

ఆ రికార్డు హోరు!

డాన్సర్‌ జోరు!

ప్రేక్షకుల హుషారు!!

బాబు తల్లిపాల కోసం ఏడుస్తూనే ఉన్నాడు.

ఆ తల్లి బాబు పాల కోసం నర్తిస్తూనే ఉంది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.