మీరా సంఘమిత్ర ఇప్పుడొక సామూహిక శక్తి -కె. సజయ

మీరా సంఘమిత్రగా ఎలా సగర్వంగా నిలబడిందో తెలుసుకోవాలంటే… ఇప్పుడు మనల్ని మనం కొత్తగా సిద్ధం చేసుకుని ఆమె జీవిత కథలోకి వెళ్ళాల్సి ఉంటుంది.

మీరా సంఘమిత్ర. జాతీయ ప్రజా ఉద్యమాల సమన్వయ వేదిక (National Alliance of Peoples Movements – NAPM) కు ఉన్న 15 మంది నేషనల్‌ కన్వీనర్లలో ఒకరు.2019 జనవరి 23కి 34 సంవత్సరాలు నిండాయి. యాక్టివిస్టుగా పన్నెండేళ్ళ అనుభవం. హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. ఇక్కడే తన వ్యక్తిత్వానికి పదును పెట్టుకుంది. ఇక్కడే తన భవిష్యత్తుకు ఒక సంకల్పాన్ని దిక్సూచిగా మలుచుకుంది. తనలో అంతర్లీనంగా ఉన్న సామాజిక స్పృహ ప్రేరణతో హక్కుల ఉద్యమాల వైపు అడుగు వేసింది. నర్మదా డామ్‌ నిర్వాసితుల కోసం పనిచేయడానికి వెళ్ళింది.

ఇదొక్కటే మీరా ప్రత్యేకత కాదు. తన లోపలి అంతరంగం కల్లోల భరితం. వ్యక్తిగత అస్థిత్వమే సంఘర్షణాపూరితం. చిన్నప్పటి నుంచి మనసును మెలిపెట్టే ఎన్నో రకాల అవమానాలు, ఒంటరితనం వెంటాడిన క్షణాలు, దిగులు కమ్మేసిన ఆలోచనలు, తెలిసీ తెలియని వయసు నుంచే వెంటాడుతూ వచ్చిన ‘నాకే ఎందుకిలా’ అనే సమాధానం లేని ప్రశ్న! ఆర్థిక సామాజిక స్థితిగతులు బాగున్నప్పటికీ ఇష్టమయిన అన్నింటికీ వదులుకోవాల్సి వచ్చిన బాల్యం. కాదు కాదు అసలు బాల్యమే కరువైపోయిన అస్తిత్వం. ఒంటరితనపు వేదనను ఎక్కడా వ్యక్తీకరించటానికి వీల్లేని పరిస్థితులు. ఎందుకంటే మీరా ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళ. 28 సంవత్సరాల పాటు తన మనసు అంగీకరించని జెండర్‌ చట్రంలో బతుకుతూ మానసికంగా, శారీరకంగా ఎంతో చిత్రవధను అనుభవించింది. అలా ఉండడం అనేది తనను ఎంత మానసిక సంక్షోభానికి గురిచేస్తోందో గుర్తించి తాను చిన్నప్పటినుంచీ తనను తాను విశ్వసిస్తున్న, అలా వ్యక్తీకరించుకోవటానికి పోరాటం చేస్తున్న స్త్రీత్వంలోకి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించటం మొదలుపెట్టింది. తన ఈ మొత్తం ప్రయాణాన్ని వ్యక్తిగతంగా కాకుండా, తాను ఏ ఉద్యమంలో పనిచేస్తోందో, ఆ ఉద్యమ సహచరులందరూ కూడా తన భావాలను, మనఃస్థితిని అర్థం చేసుకునేలా ఒక చర్చను పెట్టి ఆ ప్రయాణాన్ని ఒక సమూహపు అంశంగా మార్చగలిగింది. ఆ రకంగా తనతోపాటు అందరినీ దానిలో భాగస్వాములుగా చేయగలగటం ద్వారా ఒక సామాజిక మార్పునకు తోవను ఏర్పరిచింది.

తనలోని ఆమెని ప్రొజెక్ట్‌ చేసుకోవడానికి, మీరా సంఘమిత్రగా గుర్తింపు తెచ్చుకోవటానికి, దానినొక హక్కుగా ప్రకటించుకోవటానికి, ఆమె చేసిన యుద్ధం మాటల్లో చెప్పలేనిది. ఈ దశలో ఆమె తన కుటుంబంలో, సమాజంలో బాల్యం నుంచి యుక్తవయస్సు వరకూ ఎదుర్కొన్న సమస్యలు, బాధలు, అవమానాలు, హింస, ప్రశ్నలు అసంఖ్యాకం. వాటినుంచి బయటపడి తను మీరా సంఘమిత్రగా ఎలా సగర్వంగా నిలబడిందో తెలుసుకోవాలంటే… ఇప్పుడు మనల్ని మనం కొత్తగా సిద్ధం చేసుకుని ఆమె జీవిత కథలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులను వారి పూర్వ అస్తిత్వానికి ఇచ్చిన పేరుతో గుర్తించకూడదు. ఆ పేరుతో పిలవకూడదు. తనను తాను ట్రాన్స్‌ మహిళగా ప్రకటించుకుంటూ పెట్టుకున్న పేరే మీరా సంఘమిత్ర. ”మీరా అనే పేరుకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది న్యాయం కోసం, మార్పు కోసం పట్టుదలగా చేసిన పోరాటం. సంఘమిత్ర అశోక చక్రవర్తి కూతురు. రక్తపుటేరులు పారిన యుద్ధభూమిలో నిలబడి దేశాల మధ్య శాంతి కోసం ముందడుగు వేసిన మొదటి మహిళ. సంఘమిత్ర అంటే సమాజానికి స్నేహితులు. వీటి స్ఫూర్తితోనే తన పేరుని ఎంచుకుంది. మీరా తనకు ఊహ తెలిసిన తర్వాత తనను తాను ఎప్పుడూ అబ్బాయిగా అనుకోలేదు. ఆ అస్తిత్వం తనకు సమాజం అంటగట్టిన ఒక మూసచట్రంగానే భావించింది. దాన్ని తాను ఎప్పుడూ అంగీకరించలేదని చెబుతూ, అనుక్షణం తాను అమ్మాయిననే భావిస్తూ పెరిగానని, దానివలన ఎన్నో రకాల ఉద్వేగాలు, అవమానాలు ఎదురయ్యాయని, నిరంతర ఒంటరితనం వెంటాడిందని, అసలు బాల్యమే లేకుండా పోయిందని ఒక దుఃఖపూరిత కంఠంతో ఆమె చెప్తుంటే ఆ భావాలకు అక్షర రూపం ఇవ్వటం చాలా కష్టం.

నిజానికి ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల అంతరంగిక వేదనను తెలిపే సాహిత్యం మనకు చాలా తక్కువ. ఈ మధ్యనే తమిళ రచయిత రేవతి ‘నేను హిజ్రాను’ అని రాసిన పుస్తకం తెలుగులో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ద్వారా వెలువడింది. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల పట్ల సామాజిక వివక్ష ఎంత తీవ్రస్థాయిలో ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన వేదనానుభవం. ఇళ్ళు అద్దెకు దొరకవు. మొహం మీదే చెప్పేస్తారు మీలాంటి వాళ్ళకు ఇళ్ళు ఇవ్వమని. ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులంటేనే ఏ రకమైన ముద్రయినా వేసేయొచ్చు అనుకుంటారు. లోకల్‌ ట్రెయిన్లలో, బస్సుల్లో వెళ్తున్నప్పుడు చాలామంది పక్కన కూర్చోవటానికి కూడా ఇష్టపడరు. అల్లరి చేస్తున్న తమ పిల్లలను బెదిరించడానికి ‘వాళ్ళు నిన్ను ఎత్తుకుపోతారు’ అని మొహం మీద వేలుపెట్టి మరీ చూపిస్తారు కొంతమంది. నేరస్థులుగా చూస్తారు. రోడ్డు మీదకు వస్తే ప్రకృతి అవసరాలు తీర్చుకోవటం అనేది అత్యంత గగనం. లైంగిక హింసకు గురవటం సర్వసాధారణం. దీని గురించి ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోదు. అసలు మనుషులుగానే గుర్తించరు. ఇంత వివక్షాపూరిత సమాజం మన చుట్టూనే, మనలోనే ఉందంటే సిగ్గుపడాలి.

మీరా పుట్టింది విద్యావంతుల కుటుంబంలోనే. తల్లి స్కూల్లో టీచరు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబం. చిన్నవయసులో మీరా తనను తాను అమ్మాయిగా వ్యక్తీకరించుకుంటున్నప్పుడు దాన్ని సహించలేని తండ్రి ‘పొట్టై (కొజ్జా)’ అని తిట్టేవారు. తండ్రి నుంచి ఆ రకమైన ఈసడింపు ఎదురవ్వగానే భయం భయంగా తనలో తానే ముడుచుకుపోవటం, గుండెలో దుఃఖాన్ని పేర్చుకోవటం తప్ప దానికి తిరిగి సమాధానం కూడా చెప్పలేని చిన్నవయసు. అసలు ఆ పదం అనటమే చాలా అవమానపర్చేది అని తెలుస్తూ ఉంటుంది కానీ, అర్థమేమిటో తెలియదు. బంధువుల ఒత్తిడి, చుట్టుపక్కల వాళ్ళ ఎగతాళి చూపులు, స్కూల్లో టీచర్లు కూడా తనకు సమాజం ఇచ్చిన ‘మగ’ జెండర్‌ అస్థిత్వానికి సంబంధించిన ఆటలే ఆడాలని చెప్పటం, చదువు కూడా ఆ వైపుగానే ఉండాలని ఒత్తిడి పెట్టడం, మగపిల్లవాడివి మగపిల్లవాడిగా ఉండలేవా అని హుంకరించటం, మాట, నడక, స్వభావం, అన్నింటినీ ఎగతాళి చేసి హింసించే తోటి పిల్లలు. వీటన్నిటి మధ్యలో తల్లి ఒక్కటే తన మనసులో ఉన్న బాధను అర్థం చేసుకునే ఓదార్పు. తన బిడ్డ మీద ఆమె ఏనాడూ ఆంక్షలు పెట్టలేదు. తల్లంటే విపరీతమైన ప్రేమ మీరాకు. తల్లిలాగే ఉండాలని, తల్లి చేసే పనులన్నిటికీ తన చిట్టి చేతుల్ని తోడుగా కలిపేది. ఇంట్లో అమ్మ చేసే పనులన్నీ కూడా ఒక సామాజిక వ్యవస్థీకృత భావజాల చట్రంలో తయారయ్యాయన్న స్పృహ అంత చిన్న వయసులో మీరాకు అర్థమవటం సాధ్యమయ్యే విషయం కాదు.

తల్లి కూడా తన బిడ్డ అభివ్యక్తీకరణ సాంప్రదాయ విరుద్ధంగా ఉన్నప్పటికీ ఏనాడూ పరుష పదజాలంతో అవమానించలేదు. అమ్మలోని ఆ ప్రేమ, అర్థం చేసుకునే మనస్తత్వమే 28 ఏళ్ళకయినా సరే తనను తాను ధైర్యంగా ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళగా ఆవిష్కరించుకోవటానికి ధైర్యమిచ్చిందంటుంది మీరా. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ప్రేమే చిన్న వయసులో తాను కుటుంబం నుంచి పారిపోకుండా నిలబెట్టిందని, లేకపోతే చాలామంది ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల్లాగా కుటుంబాల్లో ఉండే నిర్బంధాన్ని, బయట సామాజిక అవహేళనల్ని తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయే పరిస్థితి వచ్చేదేమో అని మీరా అంంటుంది. కుటుంబ సహకారం లేకపోవటం వల్లనే ఎంతోమంది ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల జీవితాలు దుర్బర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయనేది కూడా మన కంటి ముందు ఉన్న వాస్తవం. చిన్నతనం నుంచీ కూడా తన చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులకు చలించే స్వభావం ఉన్న మీరా పేద ప్రజలతో పనిచేయటం లా కాలేజిలో చదువుకునేటప్పుడే ప్రారంభమయింది. అదే ఆమెలో ఉన్న యాక్టివిస్టుకి మొదటి మెట్టు. అక్కడ మొదలయిన ఆమె ప్రస్థానం దాదాపు తొమ్మిదేళ్ళ పాటు తన పూర్తి సమయాన్ని నర్మదా డ్యామ్‌ నిర్వాసితుల కోసం వెచ్చించింది. ఈ క్రమంలో కొండ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు, మత్స్యకార కుటుంబాలు, దళిత శ్రామికులు ఇలా అనేకమందితో మమేకమై పనిచేసింది. వారంతా కూడా ఆమెని ప్రేమగా ‘మీరా దీదీ’ అని పిలుచుకుంటారు. నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేథా పాట్కర్‌తో మీరా అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేసింది. ఇప్పుడు ప్రజా ఉద్యమాల జాతీయ సమన్వయ వేదిక తరపు నుంచి అనేక ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేస్తోంది. అలాగే ట్రాన్స్‌జెండర్‌ సమూహాలకు సంబంధించిన హక్కుల పోరాటంలో, జెండర్‌ సమన్యాయ పోరాటాలలో అత్యంత కీలక పాత్ర పోషించింది.

మీరా గురించి యాక్టివిస్టు డైరీలో రాయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మేథాపాట్కర్‌ స్పందిస్తూ ”మీరా గురించి చెప్పాలంటే ముందు తన నిబద్ధత గురించి చెప్పాలి. ఈ వయసు యువతరంలో చూస్తే తనకు సామాజిక, ప్రజా ఉద్యమాలపై ఉన్న కమిట్‌మెంట్‌ ఎంతో శక్తివంతమైనది. తన ప్రవృత్తిలోనే యాక్టివిజం ఉంది. సమభావం, సమన్యాయం ఈ రెండు అంశాల దిశగా తన పని, ఆలోచన, సంఘీభావం నిరంతరం ఉంటాయి. ఇంత చిన్న వయసులో వివిధ భాషల మీద మీరాకున్న పట్టు నాకెప్పుడూ ఆశ్చర్యం అనిపిస్తుంది. తను చదివిన న్యాయశాస్త్ర విద్య ద్వారా, ఇతర కార్యాచరణల ద్వారా దళిత, ఆదివాసీ, కార్మిక హక్కుల కోసమే కాకుండా జెండర్‌ సమన్యాయ దిశగా విశాల పోరాటంలో తన గళాన్ని ఎక్కుపెట్టడం, వాటిని సమన్వయం చేయటం తనకు మాత్రమే సాధ్యమవుతున్న విషయం.

తను ఎంత మంచి నిర్వాహకురాలంటే, ప్రతి ఒక్కరినీ కార్యక్రమాల్లోకి సమీకరిస్తుంది. అణచివేయబడుతున్న సమూహాలను చైతన్యపరచటంలో తన సృజనాత్మకతను గుర్తించాలి. ఒక విశాల లక్ష్యంతో అందరనీ ఒక తాటిమీదకు తీసుకు రాగలిగిన సహనం, ఓర్పు, శక్తి తనలో ఎక్కువ. సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక అంశాల మీద తనకు స్పష్టమైన అవగాహన ఉంది. వివిధ అంశాల మీద తను రాసే ప్రకటనల్లోనూ, తీసుకునే కార్యక్రమాల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

యాక్టివిస్టుగా మీరా తొలిదినాల్లో మానవ హక్కుల వేదిక నాయకులు బాలగోపాల్‌, జీవన్‌కుమార్‌లతో కలిసి కొన్ని అంశాల మీద పనిచేస్తున్నప్పుడే నాకు హైదరాబాద్‌లో పరిచయమైంది. ఆ తర్వాత నర్మదా బచావో ఆందోళన్‌ (నర్మదా ఉద్యమం)లో మాతో జత కలిపి ప్రయాణం ప్రారంభించి మా అందరిలోనూ విడదీయరాని భాగమైంది. కేవలం న్యాయపరమైన అంశాల్లోనే కాకుండా, ప్రజా కార్యాచరణలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రస్తుతం చీూూవీ ద్వారా వివిధ ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేస్తూ, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా సమన్యాయం కోసం, ప్రజాస్వామ్యయుతంగా వ్యవస్థలో మార్పు కోసం పనిచేస్తూ, విభిన్న ప్రజా సమూహాల హక్కుల సాధనకై పోరాడుతోంది” అని ఎంతో అభిమానంగా చెప్పారు.

ఇంక, ఇదీ నా కథ అంటున్న మీరా మాటల్లోకి వెళదాం:

”ఎన్నో సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇంట్లో తమిళమే మాట్లాడతాం. నాకు చదవటం, రాయటం రాదు కానీ, అమ్మకు బాగా వచ్చు. అమ్మే నాకు చిన్నప్పటి నుంచీ బెస్ట్‌ ఫ్రెండ్‌. తను మా ఫ్యామిలీ గురించి బాగా సఫర్‌ అయిందని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది. తన సమయం, శక్తి దీనిలో చాలా పెట్టేసింది. మా నాన్నతో తనది సమానమైన బంధం కాదు. ఆయన బాగా తాగేవారు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండేవారు కాదు. వేరే రిలేషన్‌ కూడా ఉండేదట! నాన్నతో పోలిస్తే, అమ్మ బాగా చదువుకుంది. ఎంతో ఓర్పు, సహనం ఉన్నాయి. టాలెంటెడ్‌, సెన్సిబుల్‌ కూడా. మా రెండు వైపుల కుటుంబాలు కూడా బాగా కన్సర్వేటివ్‌ కుటుంబాలు. నాకు ఒక అన్నయ్య, మేమిద్దరమే. తను, నేను చిన్నప్పటినుంచి చాలా డిఫరెంట్‌. నాది చిన్నప్పటినుంచీ కూడా బాగా ప్రశ్నించే తత్వం. అన్నయ్యేమో ప్రవాహంతో పాటు వెళ్ళేవాడు. నేను అలా కాదు. అయితే తను కూడా చాలా విషయాల్లో స్ట్రగుల్‌ అయ్యాడు. ముఖ్యంగా తన పెళ్ళి విషయంలో. వదిన వేరే కాస్ట్‌ అమ్మాయి. అమ్మ ఏమీ వ్యతిరేకించలేదు కానీ, నాన్న ఒప్పుకోలేదు. అమ్మే పూనుకుని దగ్గరుండి వాళ్ళ పెళ్ళి చేయించింది. వదినకి అమ్మంటే చాలా గౌరవం. నా విషయంలో నాన్న నన్ను తిట్టినా కానీ, అమ్మ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉండేది. తను నా కోసం ఎంతో నిలబడింది. నాన్నతో ఉన్న బంధంలో అమ్మ బాగా హింసని ఎదుర్కొంది. సెక్సువల్‌ ఎబ్యూజ్‌! రెగ్యులర్‌గా మారిటల్‌ రేప్‌… ఇది పెద్దయిన తర్వాత తెలిసిన పదమే! (కన్నీళ్ళతో కూడిన మౌనం)… అమ్మ స్కూల్లో పనిచేసేది. తనకి పీరియడ్స్‌ టైమ్‌లో హెవీ బ్లీడింగ్‌ అయ్యేది. స్కూల్లో పాఠాలు చెప్పటానికి ఎక్కువ సేపు నిలబడాలి. చాలా పెయిన్‌ ఫీలయ్యేది. తనకి వంట్లో బాలేదని తెలిసేది కానీ ఎందుకో నాకు చిన్నప్పుడు అర్థం కాకపోయేది.

ఒకరకంగా తనకి ఈ ఫ్యామిలీ అనేది జైలే. అందరం ఒక్కో విధంగా జైల్లో ఉంటామనిపిస్తుంది. ఆ జైలు సంకెళ్ళని తెంపుకుని బయటకు రావటానికి ఒక లైఫ్‌ టైమ్‌ పడుతుంది. ఒక్కోసారి బయటపడటం కూడా అసాధ్యమే. తను ఆర్థికంగా మంచిగా సంపాదిస్తున్నా కానీ కుటుంబం అనే జైలు నుంచి బయటపడడానికి జీవితకాల పోరాటం చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ స్థితి ఒక సామాజిక చట్రం. కుటుంబం అంటే భర్త తరపు నుంచి మాత్రమే అని సమాజం నిర్వచిస్తుంది. భర్త, పిల్లలు ఇది తప్ప ఇంకో ప్రపంచం ఉంటుందని అనుకోనివ్వని సామాజిక స్థితి. మా కోసం, ముఖ్యంగా నా కోసం చాలా హింసను భరించిందని అనిపిస్తుంది. నాన్నకు ఉన్న ఇంకో రిలేషన్‌ విషయంలో అమ్మ చాలా బాధపడేది. ఆ బాధకి నేను మౌన శ్రోతని, ప్రేక్షకురాలిని. ఆ రకంగా మా ఇద్దరికీ చాలా అనుబంధం ఉంది. అమ్మ ఇప్పుడు నాన్నతో విడిపోయి స్వతంత్రంగా బతుకుతోంది.

నాకు ఊహ తెలిసిన నాలుగు సంవత్సరాల నుంచే నేను అమ్మాయిననే అనుకునేదాన్ని. నన్ను నేను అబ్బాయిలా ఎప్పుడూ అనుకోలేదు. ఆరేళ్ళ వయసులో అనుకుంటాను, నాకు చీర కట్టించి ఫోటో తీయించమని చాలా ఏడ్చాను. గొడవ పడ్డాను. అమ్మే నాకు చీర కట్టింది. అమ్మా నాన్న ఇద్దరూ ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించారు. అలా ఉండడం నా డిసైర్‌. ఇంట్లో అమ్మతో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఏ టెన్షన్‌ ఉండేది కాదు. ఇంటి ముందు ముగ్గు వేయటం, ఇంటి పనులు చేయటం, అమ్మాయిలాగా డ్రెస్‌ చేసుకోవటం ఇలా అన్నీ చేసేది. నాన్న మాత్రం ఈ పనులన్నింటినీ చేయకుండా కట్టడి చేస్తూనే ఉండేవారు. నాలుగేళ్ళ వయసు నుంచీ ఎనిమిదేళ్ళు వచ్చేవరకూ అలానే ఉండేది. బహుశా నేను ఏ కొంచమయినా హ్యాపీగా ఉంది అప్పటివరకే. ఆ తర్వాత సమస్య తీవ్రత నలువైపుల నుంచీ మొదలయింది. నాన్నకి నా మీద ప్రేమ ఉండేది కానీ, బంధువులు వచ్చినప్పుడల్లా ‘అలా ఎందుకున్నాడు, సరైన దారిలో పెట్టాలి ఇప్పుడే’ అంటూ నా గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉండేవారు. అవి విని తట్టుకోలేక నా మీద కట్టడిని మరింత ఎక్కువ చేశారు నాన్న. నేను వినకపోతే కోపంతో ‘పొట్టై’ అని తిట్టేసేవారు. అంటే తమిళంలో ‘కొజ్జా’. అలా అన్నప్పుడు చాలా భయం అనిపించేది. ‘నన్నెందుకలా తిట్టాలి, నన్నే ఎందుకలా అనాలి’ అని లోలోపల బాగా దుఃఖం అనిపించేది. (మౌనం)… పదే పదే అలా అనిపించుకోవటం కూడా అలవాటైపోయింది. అది చాలా డెరొగేటరీ వర్డ్‌ అని తెలుసు కానీ, ఎలా తిరిగి సమాధానమివ్వాలో తెలిసేది కాదు (మౌనం). ఒకసారి ఇంక తట్టుకోలేక ‘అవును నేను పొట్టైదాన్నే, అయితే ఏంటి’ అని పిచ్చిపిచ్చిగా అరిచేశాను. అంత చిన్న వయసులో అలా నన్ను నేను అనుకోవటం కూడా లోలోపల ఎంతో అవమానపడిన నిస్సహాయత కదా! (కన్నీళ్ళతో కూడిన మౌనం)…

చీర కట్టినా, ముగ్గులేసినా, నిజానికి వాటిని జెండర్‌ ఎందుకుండాలి? చీర అనేది ఒక డ్రెస్‌. ముగ్గు అనేది ఒక కళ. అమ్మలాగా డ్రెస్‌ చేసుకోవటం, టీవీల్లో కన్పించే డ్రస్సుల్లాంటివి వేసుకోవటం నాకు ఇష్టంగా అనిపించేవి. అవి నేను ఇప్పటికీ చేస్తాను. అయితే సమాజం వాటిని కేవలం ఒక జండర్‌కి మాత్రమే సంబంధించిన విషయంగా నమ్మిస్తూ వచ్చింది. అలా మనల్ని ఒక చట్రంలో కూర్చోబెట్టేసింది. ఆ పనులకు ఒక జెండర్‌ రోల్‌ పెట్టి చూడడం అలవాటయిపోయింది కాబట్టే, అవి ప్రతి ఒక్కరూ చేయగలిగిన పనులనే విషయాన్ని మర్చిపోతున్నాం. బంధువుల వైపు నుంచీ చాలా ఒత్తిడి ఉండేది. ‘అలా ఎందుకు నడుస్తున్నావు, ఇలా ఎందుకున్నావు, అలా మాట్లాడొచ్చా’ అని పదే పదే చెప్పటం మొదలుపెట్టారు. దీనివల్ల అందరితో కలవాలంటే భయం వేసేది. అలా ఎంంతకాలమని ఉండగలుగుతాం. అదే ఇంట్లో ఉండాలి, అదే బంధువుల చుట్టూ ఉండాలి, అదే వీథిలో తిరగాలి, అదే స్కూల్లో చదవాలి, అదే మనుషుల మధ్య

ఉండాలి. దాంతో, నేను నాలోపల అమ్మాయినే, కానీ నేను బయటకు అబ్బాయిలాగా నటించటం మొదలుపెట్టాను. కానీ, నాలో అబ్బాయి అనే అంశమే లేదు. నేను అలాగే అస్సలు నటించలేకపోయాను. వెరీ బ్యాడ్‌ యాక్టర్‌ని నేను. ఎప్పుడూ ఫెయిలవుతూ ఉన్నాను. ఇప్పుడు ఆలోచిస్తే, నా సామాజిక అవగాహన పెరుగుతున్న కొద్దీ అలా ఫెయిల్‌ అవడం అనేది ఒక రాజకీయ బలం, గుర్తింపు అనే స్పృహ పెరిగింది. ఇది చాలా ముఖ్యమైనది కూడా!

ఇన్ని ఆంక్షలు ఎందుకు?: మీరా

నన్ను నేను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే అవకాశం కోసం వెతికేదాన్ని. అవి ఎప్పుడూ కూడా ఒంటరితనంతోనే ఉండేవి. సమూహంతో కలిసికట్టుగా ఆడుకునే అవకాశం నాకు చిన్నతనంలో ఎప్పుడూ రాలేదు. మాటలైనా, నన్ను నేను ఊహించుకున్నా, ఆలోచించినా అన్నీ ఒంటరిగానే. ఈ సమాజం ఎందుకు నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతోందనే ఆలోచన! అంత చిన్న వయసులో అర్థం కాలేదు. వయసు పెరుగుతున్నకొద్దీ ఆ క్రూరత్వం అర్థమవుతూ వచ్చింది. కానీ, నా లోపలి నేను దాన్ని అంగీకరించలేదు. నేను అమ్మాయిని మాత్రమే. నాది కాని శరీరంలో నేనున్నాను. నాకు సంబంధం లేని పేరుతో పిలవబడుతున్నాను అంతే. ఇట్‌ ఈజ్‌ డిజైర్‌ టు బి ఒన్‌ సెల్ఫ్‌.

వీటన్నింటిలో నాకు లోపల్లోపల చాలా సఫొకేషన్‌ ఉండేది. ఎనిమిదేళ్ళ వయసులో ఒక పెద్ద ఫంక్షన్‌ చేసి నాకు, అన్నయ్యకు జంధ్యం వేశారు. బంధువుల ఒత్తిడే ఇక్కడ కూడా! అది నాకు ఇష్టమనిపించలేదు. ఎట్రాషియస్‌ ఎక్స్‌పీరియన్స్‌ అది. నాకు ఎంత దుఃఖం అనిపించిందో ఇప్పుడు చెప్పలేనక్కా!… నాలుగైదు వందల మంది ముందు ఒంటిమీద చొక్కా లేకుండా అన్ని గంటలలపాటు

ఉండడం నాకు ఎంతో అవమానంగా అనిపించింది. దాన్ని ఎలా చెప్పాలో కూడా అప్పుడు నాకు తెలియలేదు. ఒకరకంగా అది నామీద జరిగిన అత్యాచారంగా భావించాను అప్పుడు. ఈ పదం అర్థం అప్పుడు నాకు తెలియదు. కానీ, నా ఇష్టంతో, నిర్ణయంతో నాకు సంబంధం లేకుండా నాకు అలా జరగడం అనేది ఇప్పటికీ నేను అంగీకరించలేకపోతున్నాను. ఇప్పుడు తలచుకున్నా గానీ ఆ సంఘటన నాకు తట్టుకోలేని విధంగా ఉంటుంది. (ఆగని కన్నీళ్ళు… గద్గదమైన గొంతు) అది నా అస్థిత్వంగా నేను అప్పుడే కాదు ఎప్పటికీ ఒప్పుకోలేను. ఏవేవో మంత్రాలు చెప్పటం తప్పితే, జంధ్యం ఎందుకు వేస్తారు, దాని పర్పస్‌ ఏంటి అని అర్థమయ్యేలా చెప్పటం అనేదే లేదు. ఇది మన ఆచారం కాబట్టి వేసుకోవాల్సిందే అనే నిర్బంధమే తప్ప. ఆ తర్వాత కూడా ప్రతిరోజూ ఒంటిమీద చొక్కా లేకుండా సంధ్యావందనం చేయాల్సి వచ్చేది. అలా రెండున్నర నెలలు చేశానేమో! ప్రతిరోజూ ఏడుపే చేయనని. ఆ తర్వాత ఇంక భరించలేక తీసిపారేశాను. అప్పుడు నాన్నతో చాలా గొడవైంది. కులం, మతం, జెండర్‌ భావనలను ఇలాంటి ఆచారాలతోనే స్థిరపరుస్తారు అని పెద్దయిన తర్వాత అర్థమయింది. ఇప్పటికీ మంచితనం, సమన్యాయం అనే భావనని నమ్ముతాను కానీ, ఎప్పుడూ మతపరమైన భావనతో నన్ను నేను గుర్తించుకోను.

స్కూల్లో పీర్‌ గ్రూప్‌ పిల్లలతో కూడా అనేక సమస్యలక్కా! వాళ్ళు నా అస్థిత్వాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదనిపిస్తుంది. నాకు కూడా నా స్థితి మీద చాలా గందరగోళం ఉండేది. బయటికేమో నేను అబ్బాయిగా అందరూ అనుకుంటారు. కానీ, నా లోపల నేను అమ్మాయిని. అబ్బాయిలతో కలిసి ఆడుకోవాలని అనిపించేది కాదు. అమ్మాయిలు తమతో కలవనిచ్చేవాళ్ళు కాదు. పిల్లలు అనుకుంటాం కానీ అక్కా, ఎంత క్రూరత్వం చూపించేవాళ్ళో ఈ జెండర్‌ అస్థిత్వంలో. చాలా ఎగతాళి చేసేవారు. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా! వారికర్థమైన సమాజ సూత్రాలకు ఏ మాత్రం తేడాగా కనిపించినా వాటిని ఎగతాళి చేయటంలో, అవమానించటంలో పిల్లలు ముందుంటారు. ముఖ్యంగా మగపిల్లలు నన్ను రకరకాల పేపర్లతో అవమానించేవారు. సెక్సుసవల్‌గా హెరాస్‌ చేసేవారు. (మౌనం…) ఎవరికి చెప్పుకోగలను? అందుకే నాకు స్కూల్‌కి వెళ్ళాలన్నా, కిరాణాషాప్‌కి వెళ్ళాలన్నా, వారితో ఆడుకోవాలన్నా భయంగా ఉండేది. ఒక ఒంటరితనం! చెప్పాలంటే నాకసలు బాల్యమే లేదు. నన్ను నేను స్వేచ్ఛగా వ్వక్తీకరించుకునే పరిస్థితులే లేవు. అందుకని నన్ను నేను ఎప్పుడూ దాచుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. నేను ఒంటరిగా ఉన్నప్పుడే నాకు చాలా స్వేచ్ఛగా అనిపించేది. ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే నేను నాది కాని శరీరంతో, ప్రవర్తనతో చాలా సంఘర్షణకు గురయ్యేదాన్ని. దాన్నుంచి తప్పించుకోవటం కోసం సబ్జక్ట్‌ పుస్తకాలు తెగ చదివేదాన్ని. న్యూస్‌ పేపర్స్‌ ఎడిటోరియల్స్‌తో సహా అర్థమయినా కాకున్నా చదివేదాన్ని. అదే కొంత రిలీఫ్‌. దానివల్ల తర్వాతి కాలంలో రాయటటం కూడా అలవాటయింది.

నాకు చిన్నప్పటినుంచీ డాన్స్‌ అన్నా, సంగీతమన్నా ఇష్టంగా ఉండేది. భరతనాట్యంలో చేరాను కూడా. అయితే అక్కడ మాస్టర్‌ నా ప్రతి కదలికనీ సరిచేస్తూనే ఉండేవాడు. అబ్బాయిలా చేయటం లేదని గద్దించేవాడు. నేను ఇష్టంగా దానిలో ఇమిడిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఆయన చాలా రూడ్‌గా

ఉండేవాడు. ఆ క్లాస్‌లకి వెళ్ళడమంటే నాకు ఒక శిక్షలాగా అయిపోయింది. డాన్స్‌ అంటే ఎంతో ఇష్టమున్నా కానీ, అక్కడ ఇమడలేక మానేశాను. ఇప్పుడు అనిపిస్తోంది, మానేయకుండా ఉండాల్సింది అని. కానీ, అక్కడ కాకుండా వేరే చోట చేరి నేర్చుకునే సపోర్ట్‌ సిస్టం లేదు. అంత చిన్న వయసులో అలాంటి వ్యతిరేక వాతావరణంలో ఇమడటం సాధ్యమయ్యే విషయం కాదు. నాకు బాగా కోపం అనిపించేది కానీ, ఏమీ చేయలేని నిస్సహాయత!

స్టడీస్‌లో కూడా నాకు ఎప్పుడూ లాంగ్వేజెస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఇష్టంగా ఉండేవి. మాథ్స్‌ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ”అబ్బాయివి అయ్యుండి మాథ్స్‌ అంటే ఎందుకు ఇష్టం లేదు” అని టీచర్స్‌ అనేవాళ్ళు. ఇంజనీరింగ్‌ చదవకపోతే మీ బతుకే వేస్ట్‌ అని బాగా ఊదరగొట్టేవాళ్ళు. ఎంత మూస ఆలోచనలంటే చెప్పలేం. అసలు ఒక సబ్జెక్టుకి జెండర్‌ని ఆపాదించటమేంటి? నాకు అర్థమయ్యేది కాదు. ఈ ధోరణి దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ. మాథ్స్‌ అబ్బాయిలది. ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిందే. ఇప్పుడు పరిస్థితి కొంచెం మారినట్లుంది.

లెక్కలు నాకు ఇష్టం లేదు మొర్రో అన్నా వినిపించుకునేవాళ్ళు కాదు. మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. అలా పదవ తరగతి వరకూ ప్రతిరోజూ ఒక సంఘర్షణే. ప్రతిదీ జెండర్‌కు సంబంధించిందే. ఎక్కడయినా కానీ నాకు ఒక అస్థిత్వమే లేదు. కేవలం నాలుగ్గోడల మధ్య ఎవరూ లేనప్పుడే నేను సేచ్ఛగా ఉండేదాన్ని. నా జెండర్‌ ప్రతిచోటా ‘సరిచేయబడుతూ’ ఉండేది. స్పోర్ట్స్‌ విషయంలో కూడా ఇదే రకమైన రిజిడిటీ, బైనరీ మనస్థత్వాలే ఉంటాయి. నాకు కొన్ని ఆటలు ఆడాలని ఉండేది. అవి ఆడపిల్లలు ఆడేవి అని రానిచ్చేవారు కాదు. ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరూ చాలా ఎగతాళిగా నవ్వేవారు. ఆడినా, ఆడకపోయినా గానీ వాళ్ళ ఈ ప్రవర్తన నన్ను ఒక న్యూనతలోకి నెట్టేసేది. దాంతో, నాకసలు ఎవరూ బాల్య స్నేహితులు లేకుండా అయిపోయారు. పిటి టీచర్‌ అయితే మరీ హారిబుల్‌ పర్సన్‌. చాలా భయమనిపించేది. దాంతో గేమ్స్‌ పీరియడ్‌ అనగానే నాకు జ్వరం వచ్చేసేది. వాళ్ళు నన్ను అబ్బాయిగానే చూసేవాళ్ళు కాబట్టి చాలా పనులు తప్పనిసరిగా చేయించేవాళ్ళు. నా శరీరం అందుకు సహకరించేది కాదు. నా శరీరం కానీ, నా మనసు కానీ, నా ఆలోచనలు కానీ ఏవీ కూడా ఆ పనులకు సరిపోయేవిగా ఉండేవి కావు. వాళ్ళు బలవంతంగా నా మీద రుద్దే ఆ ప్రయత్నాలకు భయమనిపించేది. చాలా టెన్షన్‌ ఉండేది. ఒక మగతనపు ప్రవర్తనను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడల్లా ఆ టెన్షన్‌ తట్టుకోలేక నాకు తెలియకుండానే పక్క తడిపేసేదాన్ని. ఒక్కోసారి స్కూల్లోనే ఆ పరిస్థితి ఎదురయ్యేది. ఏడవ తరగతి వరకూ ఇదే పరిస్థితి. జెండర్‌ నిర్బంధానికి ఈ పరిస్థితికి చాలా సంబంధం

ఉందని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను.

థియేటర్‌ (నాటకాల్లో) పాల్గొన్నప్పుడు మాత్రం అచ్చు ఆడపిల్లలానే ఉన్నావ్‌ అంటూ నన్ను ఆడవేషాలకు మాత్రమే తీసుకునేవారు. చాలా బాగా చేశావ్‌ ఆడపిల్లలాగా అని టీచర్లు పొగిడేవారు. ఒకవైపు పొగుడుతున్నట్లు ఉన్నా గానీ, వాళ్ళ మాటల్లో ఎక్కడో నా మనస్తతత్వాన్ని అర్థం చేచసుకోవడం కన్నా, ఎగతాళే కనిపించేది. మామూలు సందర్భాల్లో నన్ను నిరంతరం జెండర్‌ మూసలోకి బలవంతాన కుక్కుతూ ఇలాంటప్పుడు మాత్రం మెచ్చుకోవటం నాకు నచ్చేది కాదు.

పది తర్వాత ఇంటర్లో సిఇసి తీసుకున్నాను. అది కూడా ఒక ఘర్షణే. నేను ఉన్న మధ్యతరగతి వాతావరణంలో మాథ్స్‌ కాకుండా వేరే కోర్సులో చేరటమనేది తెలివితక్కువ పని. బంధువులందరూ అడిగేది ఒక్కటే మగపిల్లవాడివయ్యుండి మ్యాథ్స్‌ ఎందుకు తీసుకోలేదనే! ప్రతిసారీ ఎవరెవరితోనో పోల్చి మాట్లాడుతుండేవారు. ఫలానా వాళ్ళు యూఎస్‌ వెళ్ళారు, ఫలానా గొప్ప కాలేజీలో ఇంకో గొప్ప కోర్సు చదువుతున్నారు అంటూ మొదలెట్టేవాళ్ళు. వాళ్ళని ఆపడం అనేది అసాధ్యమైపోయేది. మీకెందుకు అన్నామా ఇంక రాద్ధాంతమే! ఇంటర్‌ తర్వాత, నా లోపలి ప్రశ్నకు సమాధానం ‘లా’లో దొరకచ్చు అని ఐదేళ్ళ కోర్సులో చేరాను. ఇక్కడ కూడా నాకు నాన్నతోనే పెద్ద సమస్య. నా చదువు వేస్టు, నాకు కట్టే ఫీజు దండగ అంటూ నా అస్థిత్వాన్ని పదే పదే విమర్శించేవారు. నిజానికి నాకు ఐదేళ్ళకు కలిపి పాతికవేలు కూడా అవలేదు. అదే మా అన్నయ్య ఇంజనీరింగ్‌కి చాలా ఖర్చు పెట్టారు.వీటన్నింటితో పాటు, జెండర్‌ అస్థిత్వంతో నా లోపలి సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలో తెలియకుండా అయిపోయింది. ప్రతిరోజూ, ప్రతిచోటా అందరితో నా అస్థిత్వానికి సంబంధించి రకరకాలుగా అనిపించుకోవటం నరకంగా ఉండేది. నా లోపలి సంఘర్షణ బయటకు తెలియటం ఇష్టం లేక, అందరి దృష్టి నుంచి తప్పించుకోవటం కోసం అప్పటినుంచీ గడ్డం పెంచడం ఒక మార్గంగా చేసుకున్నాను. పైకి ఎలా మాస్కులిన్‌లా కనిపించినా కానీ, నా లోపల నేను అమ్మాయినే. స్కూల్లో, కాలేజీలో తోటి పిల్లలతో సెక్సువాలిటీకి సంబంధించిన మాటలు చాలా సహజంగా నడుస్తుంటాయి. అలాంటి సందర్భాలలో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక పక్క ఆ సంభాషణల్లో ఉండాలని, ఆ చర్చల్లో పాల్గొనాలని ఉండేది. కానీ

ఉండలేకపోయేదాన్ని. ఎందుకంటే నేను నా లోపలి తత్వాన్ని బయటకు చెప్పుకునే అవకాశం లేదు. ఒక విధంగా ఇంటర్‌ పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌లో ఇది చాలా పెద్ద సవాలు. ఇప్పుడు కూడా ట్రాన్స్‌విమన్‌ తమ రిలేషన్‌షిప్స్‌ గురించి మాట్లాడటం అంత సులభమేమీ కాదు కానీ, ఇంతకు ముందున్న సమస్య అయితే లేదనుకుంటున్నాను. కొంతమంది అయినా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.

ఈ సంఘర్షణను తట్టుకోలేక, ఇంట్లో ఆదరించేవారు లేక, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు తమలాంటి వాళ్ళను వెతుక్కుని పారిపోతారు. నేను కూడా అలా వెళ్ళిపోయి ఉండాల్సిందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడూ. అయితే, నాకు అప్పుడు ఎవరూ అలా పరిచయమవ్వలేదు. తెలిస్తే వెళ్ళిపోయేదాన్నేమో! కానీ, నాన్న వైపు నుంచీ ఒక ఇన్‌డిఫరెన్స్‌ ఉన్నప్పటికీ అమ్మ ఎప్పుడూ నాకు సపోర్టివ్‌గానే ఉండేది. ఆమె నా కోసం నిలబడింది. నేను ఆమె కోసం నిలబడ్డాను. బహుశా, నేను తన ప్రేమ వల్లనే అంతకాలం ఆ ఇంట్లో

ఉండగలిగాను, చదువుకోగలిగాను, సామాజిక అంశాల మీద ఆలోచించటం నేర్చుకున్నాను. స్కూల్లో ఉన్నప్పుడు మాకు మొదటి భాషగా హిందీ, రెండోది ఇంగ్లీషు, మూడోది తెలుగు ఉండేవి. దాంతో తెలుగు సాహిత్యంతో ఎక్కువ పరిచయం లేదు. ఇప్పుడు బాధనిపిస్తోంది. చిన్నప్పటి నుంచీ వివిధ భాషలంటే ఇష్టంగా ఉండేది. ఎంత కొత్త భాషయినా చాలా తొందరగానే నేర్చుకోగలిగాను.

ఇంటర్‌లో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఫిక్షన్‌ కన్నా, నాన్‌ ఫిక్షన్‌ ఎక్కువ చదివాను. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడే అరుంధతి రాయ్‌ ”గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌” చదివాను. ఒక ప్రత్యేక సామాజిక స్థితిలో ఆడవాళ్ళు చేసే పోరాటాలు, అలానే కుల దురాగతాల గురించి దీనిలో బాగా వివరిస్తుంది. నాకు బాగా నచ్చింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ”ఆటోబయోగ్రఫపీ ఆఫ్‌ లక్ష్మణ్‌ గైక్వాడ్‌” చదివాను. మరాఠీ నుంచి ఇంగ్లీషు అనువాదం అది. ఈ పుస్తకం ప్రభావం నా మీద చాలా ఉంది. సంచార జాతులకు సంబంధించిన పుస్తకం. నేరస్థులుగా ముద్ర పడిన సమూహం అది. పోలీసుల నుంచి, సమాజం నుంచి వాళ్ళెదుర్కొన్న చిత్రహింసలు, అవమానాలు చదువుతుంటే లోలోపల దుఃఖం సుళ్ళు తిరుగుతుంది. ఇంగ్లీషులోనే అంత కదిలించేదిగా ఉంటే మరాఠీలో ఇంకెంత బాగా ఉండేదో అనుకునేదాన్ని. ట్రాన్స్‌జెండర్‌ సమూహాలను కూడా ఇదే విధంగా నేరస్థులనే ముద్ర వేయడం ద్వారా సామాజిక వెలివేతకు గురిచేస్తారు.

రోజులు గడుస్తున్నకొద్దీ నేను మళ్ళీ చాలా ముడుచుకుపోయాను. పైకి అబ్బాయిగా ఉండడం, నా లోపల నేను అమ్మాయిగా

ఉండడం… ఈ పరిస్థితి లోపల్లోపల నన్ను తినేసేది. చెప్పుకోవడానికి ఎవరూ ఉండేవారు కాదు. స్పష్టత లేదు కానీ, నా లోపలి ఆలోచనల మీద చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా ఆలోచనలకు సమాధానాలు న్యాయ విద్యలో దొరకొచ్చు అని సబ్జెక్ట్‌ బాగా చదివేదాన్ని. మామూలుగానే, బయట చాలా దుర్బరమైన పరిస్థితుల్లో ఎవరన్నా కనిపిస్తే నాకు ముందు ఏడుపు వచ్చేది. ఇది చిన్నప్పటి నుంచీ ఉండేది. ఆకలితో ఉన్న చిన్నపిల్లల్ని చూసినా, అడుక్కుతినే వృద్ధుల్ని చూసినా, బాల కార్మికులను చూసినా మనసు బాధగా అయిపోయేది. ఆ పరిస్థితుల మీద కోపం వచ్చేది. ఏం చేయాలో తోచేది కాదు. ఈ విషయాల మీద గైడ్‌ చేసేవాళ్ళు ఎవరూ లేరు. రోడ్డుమీద వీథిబాలలు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే వారిని మందు ఇంటికి తీసుకువెళ్ళి తిండి పెట్టి ఆ మర్నాడు స్ట్రీట్‌ చిల్డ్రన్‌ హోమ్‌లకు చేర్చేదాన్ని.

ఒకరకంగా ‘లా’ కాలేజి నాకు మనస్ఫూర్తిగా సౌకర్యంగా అనిపించిన ప్రదేశం. ఇంకో ఇల్లులాగా. అక్కడ ఒక మేడమ్‌

ఉండేవారు. ఆవిడ చాలా మంచి వ్యక్తి. సామాజికపరమైన నా ఆలోచనలకు ఆవిడ సపోర్టివ్‌గా ఉండేవారు. అక్కడే, అంబేద్కర్‌ రాసిన ‘అనిహిలేషన్‌ ఆఫ్‌ కాస్ట్‌’ చదివాను. బాలగోపాల్‌ రచనలు పరిచయమయ్యాయి. వీటివల్ల నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. భవిష్యత్తులో నేను ఎటువైపు ఉండాలనే దానిమీద స్పష్టత వచ్చింది. కొంతమంది ఫ్రెండ్స్‌ అయ్యారు. అక్కడే మేమందరం కలిసి ‘గ్రాస్‌రూట్స్‌’ అని ఒక చిన్న గ్రూప్‌ మొదలుపెట్టాం. అసలు ప్రైవేటు కాలేజీల్లో ఆ రకమైన వ్యక్తీకరణకు అవకాశం ఉండదు. మేము ఫస్టియర్‌లో ఉన్నప్పుడు ఎబివిపి వాళ్ళు మమ్మల్ని కన్యాకుమారిలో జరిగిన ఒక వివేకానంద శిబిరానికి తీసుకెళ్ళారు. దాదాపు నెల రోజులు. అప్పటికి నాకు వాళ్ళ రాజకీయాలు తెలియదు కానీ, ఆ ఆలోచనలు సరైనవిగా అనిపించలేదు. సామాజిక న్యాయం అనే స్ఫూర్తి నాకు వాళ్ళల్లో కనిపించలేదు. ఆ తర్వాత వాళ్ళని ఫాలో చేయలేదు. అవి అర్ధవంతమైన రాజకీయాలు అని కూడా అనిపించలేదు.

మా కాలేజి ఎదురుగా ఒక పెద్ద చెత్త డంపింగ్‌ యార్డు చెత్తలోనే తిండి ఏరుకుంటూ తినేవాళ్ళు కనిపించేవాళ్ళు. మా ఎదురుగానే మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, మేము వాటిని రోజూ చూస్తూ క్లాసురూముల్లో చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, సమానత్వం గురించి చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇదంతా నాకు చాలా వైరుధ్యంగా అనిపించేది. అక్కడంతా అనారోగ్యకరమైన పరిస్థితులే. మనుషులు అలాంటిచోట బతకాల్సిన పరిస్థితి ఏమిటని బాధనిపించేది. చిన్న చిన్న పిల్లలుండేవారు. వారికోసం దగ్గర్లో ఒక అంగన్‌వాడి సెంటర్‌ కూడా లేదు. నా తొలి యవ్వనకాలంలో నా చుట్టూ ఉన్న ఈ పరిస్థితి నన్ను బాగా కుదిపేసింది. ఒక పక్క నా లోపలి అస్థిత్వం మీద ఉండే అలజడి, మరో పక్క బయట ఇటువంటి పరిస్థితులు. స్పష్టత లేకపోయినా గానీ, వీటి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించేది. అక్కడ పారేసిన చెత్తలోంచే వాళ్ళు తమ ఆహారాన్ని కూడా వెతుక్కోవలసి రావటం అంటే ఎంత దారుణమైన స్థితి, మనసు ఇంకా అల్లకల్లోలమైపోయేది. వారికోసం ఏమైనా చేయాలనుకున్నాం. నెమ్మదిగా వారితో పరిచయాలు పెంచుకున్నాం. వాళ్ళతో కూర్చుని మాట్లాడటం, వారి గురించి తెలుసుకోవటం, దాదాపు ఒక సంవత్సరం పాటు అలా వెళ్ళాం. కొంచెం దూరంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌కు పిల్లల్ని పంపించే ఏర్పాటు చేయటం, ఇలా మాకు తోచిన పనులు చేస్తూ ఉండేవాళ్ళం. సామాజిక విషయాల మీద ఆసక్తి మరింత పెరగటానికి కారణం మా కాలేజి మేడమ్‌ అయితే ఆ తర్వాత పరోక్షంగా బాలగోపాల్‌. ఆయన రాసిన కొన్ని బుక్స్‌, పాంప్లెట్స్‌ మా చదువులో భాగంగా చదివాం.హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్‌ (హ్యూమన్‌ రైట్స్‌ లా నెట్‌వర్క్‌)లో పనిచేసిన అడ్వొకేట్‌ వనజక్క ద్వారా సిటీలో చాలామందికి పరిచయమయ్యాం. కొత్తగా వస్తున్న లాయర్లకి వాళ్ళు కొన్ని ట్రైనింగులు నిర్వహించారు. అలా మేము మీ అందరికీ పరిచయమయ్యాం.హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్‌ లో రెండేళ్ళపాటు వాలంటీర్‌గా కూడా చేశాను. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగుల వల్ల నేను చట్టపరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాను.

యాక్టివిస్టుగా నా మొదటిరోజుల్లో వనజక్క నన్ను బాగా ప్రభావితం చేసింది. తను చాలా కమిట్‌మెంట్‌తో పనిచేసేది. తన పని విధానంతో నేను చాలా ప్రభావితమయ్యాను. మీకు గుర్తుందో లేదో అక్కా, తను పంపిస్తే మీ దగ్గరికి కూడా వచ్చాం. రైతు ఆత్మహత్యలపై జరిగిన మీటింగుకి మీతో కలిసి అనంతపురం కూడా వచ్చాను. హెచ్‌ఆర్‌ఎఫ్‌ వాళ్ళతో కూడా పరిచయమయింది. వాళ్ళతో కలిసి కొన్ని ఫాక్ట్‌ ఫైండింగ్‌లకు వెళ్ళాను. బాలగోపాల్‌ సార్‌తో ఒకటి రెండుసార్లే వెళ్ళాను, కానీ జీవన్‌ సార్‌తో ఎక్కువ అసోసియేట్‌ అయ్యాను. నివాస హక్కులకు సంబంధించి జరిగిన ఒక సభలో జీవన్‌ సార్‌ ద్వారానే మేథాపాట్కర్‌ పరిచయమయ్యారు. అలా నర్మదా వ్యాలీ ఆందోళనతో కనెక్టయి అక్కడ మధ్యప్రదేశ్‌లో పని చేయటానికి వెళ్ళిపోయాను. ఏ విషయం నన్ను అలా డ్రైవ్‌ చేసింది అని ఇప్పుడు ఆలోచిస్తే బహుశా నా లోలోపలి తపనకు అక్కడ సమాధానం దొరుకుతుందని అనిపించిందేమో! నేను వెళ్ళటం మాత్రం అవసరమని ఎంతో బలంగా భావించాను. నాకు అప్పుడు 22 ఏళ్ళు నిండాయి. నేను అక్కడ ఉన్నప్పుడే ఆకస్మికంగా అనారోగ్యంతో బాలగోపాల్‌ చనిపోవటం, ఆ తర్వాత వనజక్క కూడా అనారోగ్యంతో చనిపోయిందని తెలిసినప్పుడు తట్టుకోలేని బాధనిపించింది. హైదరాబాద్‌ వచ్చేయాలని చాలా బలంగా అనిపించింది. కానీ, అప్పటికే నేను నర్మదా పోరాట ప్రవాహంలో మునిగిపోయి ఉన్నాను. వెంటనే అది వదిలేసి రావటం సాధ్యం కాలేదు. ఆ తర్వాత తొమ్మిదేళ్ళపాటు అక్కడే ఉండిపోయాను. ఇన్ని సంవత్సరాలలో అక్కడి ఆదివాసీ, మత్స్యకార, దళిత మహిళా రైతులు, ఇతర ప్రజా సమూహాలతో పెనవేసుకున్న అనుబంధం, మా మధ్య ఉన్న ప్రేమ, స్నేహం నా జీవితంలో చాలా ముఖ్యమైనవి. నా బంధువులంటే వాళ్ళే. నా అస్థిత్వాన్ని అమ్మా నాన్న వైపు నుంచి వచ్చిన కులంతో ముడిపెట్టి నేనెప్పుడూ చూసుకోలేదు. చూసుకోను కూడా”. (ఇంకా ఉంది.)

సారంగ వెబ్ మ్యాగజైన్ నుండి ..

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.