ట్రెండ్‌ సెట్టర్‌ సినిమా… తెలంగాణ ‘మల్లేశం’ -నారాయణ స్వామి వెంకట యోగి

ఇవ్వాళ తెలుగు సినిమాలో ఒక కొత్త దృశ్యం కనిపించింది. ఒక కొత్త స్వరం వినిపించింది. ఒక కొత్త భాష ధ్వనించింది. ఇంతకు ముందు మనం అనుభవించని ఒక కొత్త దృశ్య శ్రవణ అనుభవం కలిగింది. మామూలు అనుభవం కాదు. సినిమా చూసినంక కొన్ని రోజులపాటు మరచిపోలేని అనుభవం. వెన్నంటే ఉండే అనుభవం. కళ్ళల్లో మెదిలే సన్నటి కన్నీటి పొరల్లో జీవితం ప్రయాణాన్ని, వాతావరణాన్ని ప్రతిబింబించే ఫ్రేమ్స్‌. చెవుల్లో తేనె పోసినట్లుగా ధ్వనించే భాష. పెదవుల మీద చిరునవ్వులని మొలిపించే నవ్వుల సన్నివేశాల జల్లులు. మనసుని ఎక్కడికో తీసుకుపోయే పాటల సంగీత తరంగాలు.

అవును నేను మల్లేశం సినిమా గురించే మాట్లాడుతున్నాను. బహుశా తెలుగువాళ్ళు కొన్ని దశాబ్దాలుగా కండ్లు కాయలు కాసేటట్లు ఎదురుచూస్తున్న ఒక అద్భుత అనుభవాన్ని అందించిన గొప్ప సినిమా ‘మల్లేశం’. ఏండ్లకేండ్లు ఎదురు చూసి ఎదురు చూసి ఎన్నో సినిమాలు చూసి నిరాశ చెంది, కొన్ని చూసి ఫర్వాలేదనుకుని అరకొర సంతృప్తితో సర్దుకుపోతున్న సందర్భమిది. అన్ని రకాలుగా గొప్ప అనుభూతినిచ్చి, అనుభవాన్ని మిగిలించే సినిమాలు మిగతా భాషల్లో తమిళంలో, బెంగాలీలో, మలయాళంలో చివరికి కన్నడలో కూడా వస్తున్నాయి కానీ తెలుగులో ఎంందుకు రావడం లేదని ప్రతిసారీ నిరాశ చెంది చివరికి సబ్‌ టైటిల్స్‌తో ఇతర భాషల సినిమాలు చూసి సంతృప్తి పడిపోయి, మన భాషలో కూడా ఇటువంటివి రావాలని కలలు కని, కండ్లలో వత్తులు వేసుకుని చూసిన నాలాంటి ప్రేక్షకులకు మల్లేశం సినిమా ఒక గొప్ప ఒయాసిస్‌. నీళ్ళులేక పొలాలు ఎండిపోయి, నేల బీటలు వారి, కనీసం దాహం తీర్చుకోవడానికి నీటి బొట్టు లేక అలమటిస్తున్న వేళ, అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న జల్లులు అప్పుడప్పుడు వస్తున్నా ఒక జడివానలా కురిసి తడిసి ముద్ద చేసి ఊళ్ళూ, బీళ్ళూ ఏకం చేసిన గొప్ప సినిమా మల్లేశం.

ఇంతకీ ఏముంది సినిమాలో అంత గొప్పగా? మనల్ని తడిపి ముద్ద చేసేంతగా? మనకో గొప్ప అనుభవాన్నిచ్చి అనుభూతిని మిగిలించేలా?

ఇది సినిమాల్లో బయోపిక్‌ల కాలం. తెలుగులో కూడా బయోపిక్‌లు (జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రాలు) చాలానే వస్తున్నాయి. అట్లాగే పీరియడ్‌ సినిమాలు కూడా చాలానే వస్తున్న సందర్భమిది. బహుశా జ్ఞాపకాలు బాగుంటాయనో, ఆ పాత మధురమనో, గతం తలిచీ సంతోషించడమూ, వగచడమూ కన్నా సౌఖ్యం మరొకటి లేదనో ఏమైతేనేమి పీరియడ్‌ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. తెలుగులోనే కాదు మిగతా అన్నిభాషల్లో కూడా ఇదే మూడ్‌, ఇదే వాతావరణం ఉంది. అలాగే బయోపిక్‌లది కూడా. ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా తీసుకుని చాలా సినిమాలే వస్తున్నాయి. ఒక ప్రముఖ నటి జీవితంలోని విభిన్న కోణాలను, ఎగుడు దిగుడులను ఆధారంగా తీసిన ‘మహానటి’ గొప్పగా విజయవంతమయింది. అలాగే ఒక రాజకీయ నాయకుని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ కూడా విజయవంతమైనట్లే. ఒక సినిమా కథానాయకుని జీవితంలోని ఘట్టాలను ఆ హీరో రాజకీయ నాయకుడయ్యాక జరిగిన పరిణామాలను ఎటువంటి సంఘర్షణ, వైరుధ్యాలు లేకుండా తీసిన రెండు సినిమాలు బోల్తా పడడమూ మనం చూశాం.

అయితే ‘మల్లేశం’ సినిమా తెలుగులోనే కాదు బహుశా భారతదేశంలోనే ఇంతకు ముందు ఎవరూ, ఎప్పుడూ చేయని ప్రయత్నం. హిందీలలో పాడ్‌ మాన్‌ ఈ ప్రయత్నం చేసినా అది అంత సహజంగా లేకపోవడమూ, ఎక్కువ నాటకీకరించడం వల్ల ఆకట్టుకోలేకపోయింది. అలాగే మేరీ కోమ్‌ కూడా.

నిజానికి చింతకింది మల్లేశం ఒక పాపులర్‌ సెలబ్రిటీ ఏమీ కాదు. దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక పద్మశ్రీ విజేతగా తప్ప చాలామందికి ఆయన చేసిన పని ఏమిటి, సాధించిందేమిటీ అని తెలియదు, తెలంగాణలోని నల్గొండ జిల్లా చేనేత కుటుంబాలకు తప్ప. వారికి సహాయం చేయాలని ముందుకు వచ్చే కొందరు ఉదార దేశీ విదేశీయులకు (ఎన్నారై) తప్ప ఆయన గురించి కానీ, ఆయన కథకానీ పెద్దగా తెలియదు. బహుశా కొంతమంది ఆయన టెడ్‌ టాక్‌ చూసి ఉంటే తప్ప ఆయన వివరాలు బయటకు రాలేదు. ఎందుకంటే చింతకింది మల్లేశం సాధించిన విజయం అత్యంత ప్రాంతీయమైనది, దేశీయమైనది, ఒక సామాజిక సమూహానికి సంబంధించినది.

స్థూల దృష్టికి అలా కనబడినా సూక్ష్మ దృష్టికి నిజానికి అతనికి విశ్వజనీన, గ్లోబల్‌ స్వభావమున్నది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ కాలంలోనయినా ఏ ప్రాంతంలోనైనా అత్యంత సామాన్యుడైన మనిషి తనవాళ్ళ కష్టాలను పోగొట్టడానికి, కన్నీళ్ళు తుడవడానికి నడుం కట్టి, అందుకు ఎన్నెన్నో కష్టనష్టాలనుభవించి, ఎగుడు దిగుళ్ళని ఎదుర్కొని ఏమీ లేని స్థాయి నుంచి ఒక విజయాన్ని సాధించడం, ఆ విజయం వల్ల ఆ ప్రాంత, ఆ సామాజిక సమూహ ప్రజలు బాగుపడడం నిస్సందేహంగా విశ్వజనీన స్వభావమున్న కథనమే.

సరిగ్గా ‘మల్లేశం’ సినిమా దర్శకుడు ఈ పాయింట్‌ను పట్టుకోగలిగాడు. అదీ ఆయన గొప్పతనం. ‘ఒక సామాన్యమైన మనిషి అసామాన్యమైన కథ’ అనే టాగ్‌ లైన్‌ ఉన్న ఈ సినిమా నిజానికి ఒక సామాన్య మానవుని గ్లోబల్‌ కథ. విశ్వజనీన విజయం. ఈ తాత్విక అంశాన్ని చాలా గొప్పగా, శక్తివంతంగా చిత్రీకరించిన సినిమా ‘మల్లేశం’. ఈ మధ్యే ఇంగ్లీషులో వచ్చిన ‘ద బాయ్‌ హు హార్నెస్సేడ్‌ ద విండ్‌’ ఇదే కోవకు చెందినా, ఇంత శక్తివంతంగా లేదనే చెప్పాలి.

‘మల్లేశం’ సినిమా గొప్పతనం వెనుక ఉన్న నిజం ఆ సినిమాను నిర్మించిన దర్శకుడు రాజ్‌ రాచకొండ, అతని టీం ప్రాంతీయతకూ, సామాజిక సమూహాల ప్రత్యేకతకూ ఉన్న విశ్వజనీనతను గుర్తించడమే. గుర్తించి దాన్ని అత్యంత నిజాయితీగా, అత్యంత సహజంగా తెరకెక్కించి ఒక అద్భుత, నిశ్శబ్ద, నిగూఢ దృశ్యకావ్యంగా మలచడమే.

ఈ సినిమా మల్లేశం అనే ఒక సామాన్య, ప్రాంతీయ, ప్రత్యేక సామాజిక సమూహానికి చెందిన వ్యక్తి చేసిన ఒక విశ్వజనీన ప్రయాణ కథనం. అందుకే అది తెలుగులో మొట్టమొదటిదీ, గొప్పదీ. అందుకే అంత గొప్ప అనుభవాన్నిస్తుంది.

ఇప్పటికీ చాలా మంది చాలా చోట్ల ప్రస్తావించిన సినిమా కథలోకి ప్రత్యేకంగా వెళ్ళడంకన్నా, సినిమాలో ఉన్న ప్రత్యేకతలను, గొప్పదనాన్ని ప్రస్తావించడం మరింత సమంజసం.

స్థూలంగా నల్గొండ జిల్లాలో పోచంపల్లి చుట్టుపక్కల ఉండే గ్రామాల చేనేత కుటుంబాలు, పద్మశాలి కులానికి చెందిన కుటుంబాలు, వారి ప్రత్యేకత అయిన ఇక్కత్‌ చీర నేయడానికి ముందుగా దారాన్ని ఆసు పోసి, దాని మీద చీరకు కావలసిన డిజైన్లు వేసి రంగులద్ది తర్వాత మగ్గం మీదికి ఎక్కిస్తారు. ఆసు పని ఆడవాళ్ళు చేస్తే మగ్గం మగవాళ్ళు చేయడం ఆనవాయితీ. ఒక చీరకు పదుల వేల సార్లు ఆసు పోసి ఆడవాళ్ళ ఎముకలు అరిగిపోయి చేతులు పడిపోయిన సందర్భాలెన్నో. వాళ్ళు ఆసు పొయ్యకపోతే మగ్గాలు మూలనపడి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలెన్నో. అలాంటి ఒక కుటుంబం లోంచి వచ్చిన చింతకింది మల్లేశం ఆరవ తరగతి కన్నా ఎక్కువ చదవకపోయినా, ఇంగ్లీష్‌ అంతగా రాకపోయినా ఏడేండ్లు నానా కష్టాలు పడి, పెద్ద పెద్ద ఇంజనీర్లను సైతం అబ్బురపరిచేలా ఆసు యంత్రం తయారు చేసిన కథ ఇది. తర్వాతి కాలంలో ఆ యంత్రానికి ఆయన చేసిన మార్పులు చేర్పులు ఇంప్రొవైజేషన్లు సినిమాలో కనబడవు. ఒక వ్యక్తి ఎన్ని కష్టాలెదురైనా ఎన్నో అడ్డంకులను అధిగమించి తను కలగన్న దాన్ని సాధించి విజయం సాధించడం అనే విశ్వజనీన సూత్రం సినిమాకు ప్రధాన థీమ్‌.

ఃణతీవaఎ ఱర ్‌ష్ట్రవ ష్ట్రఱస్త్రష్ట్రవర్‌ జూశీఱఅ్‌ శీట శ్రీఱటవ. ూష్‌ఱశీఅర ఱర ఱ్‌ర ఎaఅఱటవర్‌a్‌aఱశీఅః.

‘మల్లేశం’ సినిమాను ప్రత్యేకంగా, గొప్పగా నిలిపింది దాని థీమ్‌ అయితే దాన్ని సినిమాగా అత్యున్నత స్థాయికి అనేక అంశాలు తీసుకెళ్ళాయి.

ముందుగా చెప్పాలంటే దర్శకుడు రాజ్‌ రాచకొండ రాసుకున్న స్క్రీన్‌ ప్లే. మల్లేశం బాల్యం నుండి యవ్వనం దాకా, అతను యంత్రం కనుక్కునే దాకా లీనియర్‌ ఫార్మాట్‌లోనే అయినా ఒక్కొక్క దృశ్యాన్ని, ఒక్కొక్క సన్నివేశాన్ని, ఒక్కొక్క ఘట్టాన్ని, చాలా జాగ్రత్తగా, అత్యంత ప్రతిభావంతంగా, ఎటువంటి భేషజాలకు పోకుండా, ఎక్కడా నాటకీకరించకుండా, నిగూఢతను పాటిస్తూ, చాలా సూక్ష్మతతో స్క్రీన్‌ ప్లే రాసుకున్నాడు. స్క్రిప్ట్‌లో మరో గొప్ప విషయం ఏమిటంటే ముగింపు అందరికీ తెలిసినా, దాని కోసం జరిగే ప్రయాణం ప్రతి అడుగునూ ఉత్కంఠ కలిగించేలా, ప్రేక్షకులను కట్టి పడేసేలా రాయడం. అందుకు రాజ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి.

రాజ్‌ ముందు రాసుకున్న సంభాషణలకు జవజీవాలు నింపి ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన ఘనత రచయిత పెద్దింటి అశోక్‌ కుమార్‌ది. ఇటీవలి కాలంలో ఇంత గొప్ప సంభాషణలు ఏ సినిమాలోనూ వినలేదంటే అతిశయోక్తి కాదు. మినిమలిస్టు ధోరణిలో, క్లుప్తంగా, సూటిగా, అచ్చమైన తెలంగాణ నుడికారంతో, పద పదానా తెలంగాణ భాష గుబాళింపులతో అద్భుతంగా మాటలు రాశారు పెద్దింటి అశోక్‌ కుమార్‌. అలాగే మొదలు టైటిల్స్‌ అప్పుడు నేపథ్యంలో వినిపించే అద్భుతమైన తత్వాన్ని కూడా రాశారు.

రాజ్‌ రాసిన స్క్రిప్టుకూ, అశోక్‌ రాసిన సంభాషణలకూ ప్రాణం పోసింది లక్ష్మణ్‌ యేలే కళ. ప్రతి సన్నివేశంలో, ప్రతి దృశ్యంలో దేశీయతనూ, ప్రాంతీయతనూ ఉట్టిపడేలా తన కళతో తీర్చిదిద్దిన ఘనత లక్ష్మణ్‌దే. కథ 1984లో ప్రారంభమైనప్పటి నుంచి 1990లో అయిపోయేదాకా ప్రతి దృశ్యాన్ని అతి జాగ్రత్తగా తీర్చిదిద్ది అద్బుతమైన మీజాన్‌ సెన్‌ (ఎఱరవ వఅ రషౌఅవ) ను సమకూర్చారు లక్ష్మణ్‌. ఇటీవలి కాలంలో ఇంత అద్భుతమైన మీజాన్‌ సెన్‌ ఉన్న సినిమా మరొకటి కనబడదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ దేశీయత, పోచంపల్లి ప్రాంతీయత, పద్మశాలీ సామాజిక సమూహ ప్రత్యేకత ఉట్టిపడేలా లక్ష్మణ్‌ కళా దర్శకత్వం నెరపారు.

లక్ష్మణ్‌ మీజాన్‌ సెన్‌ను దర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి లాంటి నటుల అత్యంత సహజ నటనను, హావభావాలను, తెలంగాణ నల్గొండ జిల్లా ల్యాండ్‌ స్కేప్‌ను అద్భుతంగా రంగుల వెలుగు నీడల సమ్మేళనంతో చిత్రించిన ఛాయాగ్రాహకుడు బాలు శాండిల్య. ప్రతి ఫ్రేమ్‌ హృద్యంగా చిత్రించారు. బాలు చిత్రించిన దృశ్యాలను ఎడిటర్‌ చక్కగా కూర్పునిస్తే మార్క్‌ రూబెన్‌ మంచి సంగీతాన్నందించాడు.

సినిమాకు మరో ప్రాణం దర్శి అద్భుతమైన నటన. నటులందరూ గొప్పగా, అతి సహజంగా నటించినా దర్శి తన పూర్వ కమెడియన్‌ ఇమేజి నుండి పూర్తిగా బయటపడి మల్లేశం పాత్రలో ఒదిగిపోయాడు. మల్లేశం తానే అన్నట్లుగా జీవించాడు. అద్భుతమైన హావభావాలు, గొప్ప డైలాగ్‌ టైమింగ్‌, ఉద్వేగభరిత సన్నివేశాల్లో కళ్ళల్లో నీళ్ళు తెప్పించిన నటన, అనేకసార్లు నవ్వుల పువ్వులు పూయించిన అమాయకపు మాటలు, అన్ని రకాలుగా దర్శి ఒక గొప్ప నటుడిగా తెలుగు వాళ్ళకు దొరికిన ఒక వెలకట్టలేని వజ్రంగా చెప్పుకోవచ్చు. ఇక ఝాన్సీ, చక్రపాణి, అనన్య, మల్లేశం దోస్తులుగా నటించిన జగదీష్‌, అన్వేష్‌ అందరూ గొప్పగా నటించారు. వాళ్ళ వాళ్ళ పాత్రలో అత్యంత సహజంగా ఒదిగిపోయారు. ఉద్వేగభరిత సన్నివేశాల్లో మల్లేశం నాన్నగా చక్రపాణి నటన అమోఘం. ఝాన్సీలో ఇంత గొప్ప నటి ఉన్నదా అన్నట్లు జీవించారు. అనన్య కొత్త అమ్మాయి అయినా ధీటుగా నటించింది. చిన్నపిల్లలుగా నటించిన ప్రతి ఒక్కరూ గొప్పగా సహజంగా చేశారు. సినిమాలో సహజ హాస్యం, దాదాపు ప్రతి సన్నివేశంలో నవ్వుల పువ్వులు పూయించింది.

సినిమాలో అడుగడుగునా తెలంగాణ ప్రాంతీయతనూ, సంస్కృతినీ గొప్పగా అద్దం పట్టడం మరో గొప్ప విషయం. శారద కాండ్ర కథ, పీర్ల పండగ, తర్వాత పద్మశాలీల కుల పురాణం, భావనా ఋషి మార్కండేయుల కథను పటం కథగా చెప్పడం, దుబ్బుల వాళ్ళతో ఎల్లమ్మ కథను చెప్పించడం మల్లేశం, పద్మలకు పెండ్లి అయినంక ఇంట్లోకి వస్తున్నప్పుడు భార్యా భర్తలను పేరడిగిన సన్నివేశంలో పద్మ చెప్పిన జానపదుల గాథ… ఇలా ఒకటేమిటి తెలంగాణ సంస్కృతి, జానపదాలు సినిమాలో అడుగడుగునా గుబాళిస్తాయి. అందుకు కళా దర్శకులు లక్ష్మణ్‌నూ, చిత్ర దర్శకులు రాజ్‌నూ ప్రత్యేకంగా అభినందించాల్సిందే. అలాగే దశాబ్దాలపాటు తెలుగు సినిమాలో హేళనకూ, అవమానాలకూ గురైన తెలంగాణ భాషను అద్భుతంగా, చెలిమలో నీటి ఊటలా, స్వచ్ఛంగా పలికించిన గొప్పదనం కూడా ‘మల్లేశం’దే.

సినిమాలో మేకప్‌ మరో గొప్ప విషయం. జాతీయ అవార్డు గ్రహీత పట్టానమ్‌ రషీద్‌ ప్రతి పాత్రనూ అతి సహజంగా తీర్చిదిద్దారు. ఆద్యంతమూ సింక్‌ సౌండ్‌తో నిర్మించిన ‘మల్లేశం’లో ధ్వని ప్రత్యేకంగా నిలుస్తుంది.

గోరటి వెంకన్న రాసిన రెండు పాటలూ, అశోక్‌ రాసిన తత్వమూ సినిమాకు హైలైట్‌గా నిలిస్తే, దాశరథి అద్భుత గీతం ‘ఆ చల్లని సముద్ర గర్భం’ సమయోచితంగా ఉపయోగించడం చాలా బాగుంది.

సినిమా అంటే కోట్లాది రూపాయల ఖర్చు, భారీ సెట్టింగులు, విదేశాల్లో పాటలు, పొట్టి గుడ్డల హీరోయిన్లు, అనేకానేక ఆస్తుల ధ్వంసం, అర్థరహిత ఫైటింగులు, బూతు డైలాగ్‌లు, ఐటెమ్‌ సాంగ్‌లు ఇంకా అనేకానేక భరించలేని చెత్త అనుకునేలా చేస్తున్న ప్రస్తుత తెలుగు సినిమాలో ‘మల్లేశం’ సినిమా ఒక గొప్ప మార్పు, ఒక మైలురాయి, ఒక గొప్ప ఒయాసిస్‌, కరువులో తడిపేసే జడివాన.

ఇంత గొప్ప సినిమాను నిర్మించిన శ్రీనివాస్‌ అధికారికీ, రాజ్‌ రాచకొండకూ మనసారా అభినందనలు. తెలుగు సినిమాకు ‘మల్లేశం’ నిస్సందేహంగా ఒక ట్రెండ్‌ సెట్టర్‌.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.