‘అమ్మ’నౌతున్నాననే గర్వం
మోములో దాగని దరహాసం
‘ఆడా’, ‘మగా’… అంటూ ఆరాలు
ముద్దులొలికే చిన్నారులెవరైనా ఒకటే
నీ ఆరోగ్యం కోసమే ఈ పరీక్షలు
అపర బ్రహ్మలు మగబిడ్డ కాదన్నారట
ఆడకణానికి ఆరువారాలే ఆయుష్షట
తల్లి ప్రాణానికి ప్రమాదం అంటున్నారు
ఇష్టం లేకపోయినా అబార్షన్ తప్పలేదు
అప్పుడే అమ్మగా చచ్చిపోయాను
ఎలాగో కణ’హంతకుల’ బారినుండి
తప్పించుకొని అమ్మాయికి అమ్మనయ్యాను
అత్త ఇంటి తలుపులు మూతబడ్డాయి
భాగస్వామి భారమంటూ తప్పుకున్నాడు
లింగవివక్షా!… అది మాకు తెలీదు
కోడలి ప్రవర్తనబాలేక గెంటేశాము
అభియోగాలు, ఎన్నో నిందారోపణలు
ఏ అగ్ని ప్రవేశం చేసి పునీత కావాలో
తెలియని అమాయకపు అమ్మ మనసు
ఒంటరి పోరాటానికి సిద్ధపడింది
భ్రూణహత్యల పరంపర నుండి తప్పించి
కనుపాపలో పెంచుకుంటున్న చిట్టితల్లిని
అక్షరజ్ఞానం కోసం బడికి పంపితే
పంతులు లైంగిక పాఠాలతో వేధింపులు
బయటకు అడుగేస్తే ‘షీ’ లను మింగే బృందాలు
ఏడు తర్వాత కర్ఫ్యూ నిబంధనలట ఆడవారికి
వయసులోని మృగాళ్ళు తప్పు చేయడం సహజమంటూ
నిర్లజ్జగా పాలక మంత్రుల మగ సమర్ధనలు
ఆంక్షలు విన్న ‘బేటీ’ ఎందుకు కన్నావమ్మా అంటూ ప్రశ్న
”బేటీ బచావో”, ”బేటీ పఢావో” నినాదాల హోరుల మధ్య
అంకురాన్ని నవమాసాలు కడుపులో పెంచుకున్నా
ఈడు వస్తున్న బంగారాన్ని ఎక్కడ దాచను
చోరులు మానం దోస్తారో, ప్రాణం తీస్తారో తెలియక
కునుకు మరచి, భయం నీడలో గడుపుతూ
బస్సు ఎక్కితే టికెట్టుతో పాటు ఇంకేమి తీయాలో
అనుకుంటూ, బిక్కచచ్చి ఎలాగో గమ్యం చేరి
అన్ని అర్హతలతో పోటీపడి ఉద్యోగాన్ని సంపాదిస్తే
పై అధికారి ‘పక్క’ చూపులకి ఔననకపోతే
ఈ పనికి పనికిరావంటూ ‘ఫైరింగ్’లు
మహిళా సాధికారత సాధించాలంటూ ఉపన్యాసాలు
స్త్రీలను గౌరవించటం సంప్రదాయమంటూనే
చిన్నారులపై, వివాహితలపై, పండు ముదుసలులపై
అత్యాచారాలు, యాసిడ్ దాడులు, బెదిరింపులు
సమభావం చూపించే మృగాళ్ళకు ‘సలామ్’!
మృత్యుంజయులుగా బతికి బట్టకట్టిన స్త్రీ జాతి
తమ బిడ్డలను ఎలా కాపాడుకోవాలో తెలియక
గొడ్రాళ్ళుగా జీవిస్తూ… ఈ శాపం ఎవరిదంటే?
బదులివ్వలేని మృగజాతి దైవ నిర్ణయమంటూ
సంతానం కోసం శిలాప్రతిమలకు పూజలు చేస్తారు
అట్టహాసంగా మాతృ దినోత్సవాలను జరుపుతారు.