చుక్కల నడుమాటి చుక్కాని చుక్కా,
నేలకు వచ్చావా అమ్మా…
చల్లాని తల్లీ కడుపుల నువ్వు,
చల్లగ, హాయిగ బతుకమ్మా…
తల్లి కడుపుల కూడా ఆడబిడ్డకు రక్షణలేనీ లోకాన,
ఎందర్తోనో పోరాడి, ఎన్నీటికో ఎదురొడ్డి,
మనసారా నినుకంది మీ అమ్మ…
ఆ తల్లి దీవెన్లు నీ తోడుండంగ
చల్లగ వెయ్యేళ్ళు బతుకమ్మా…
చెడ్డది చెడ్డదని, అందరూ ఈసడించుకునే ఈ లోకంలోన,
‘మంచి’ కూడా ఇంకా బ్రతికే ఉంది,
ధైర్యంగ కనుతెరిచి చూడమ్మా…
ఆ మంచితనపు వెన్నెల్లో,
వానల్లో తడిసేటి ఏరల్లే బతుకమ్మా…
ప్రాణాలు నీకిచ్చి, ప్రాణిగ నిను మలచి,
నిను భువిపైన నిలిపింది మీ అమ్మ…
పసిడంటి పసిదాన, పచ్చాని లోకాన,
విచ్చేటి పువ్వల్లే బతుకమ్మా…
రంగురంగుల్తో ముస్తాబయ్యి, అందంగ కనిపించే ఈ నేలన,
రంగులు మార్చే ఊసరవెల్లులు కూడా ఉన్నాయి చూడమ్మా…
వాటికి బెదిరి, గూటిలో దాగక, చిన్నారి ఓ చిలకమ్మా,
ధైర్యంగ ఎదురించి, రెక్కల్ని విదిలించి, సీతాకోకల్లే బతుకమ్మా…
పాలనవ్వుల్ని కూడా పాపపు చూపుతో,
చూసే కనులున్నయ్ ఈ భూమ్మీద…
బేలవై నువ్వుండిపోకు,
కాళిలా నువు బతుకమ్మా…
కమ్మేసే కారు చీకట్లున్నయ్,
నువు నడయాడే ఈ ఇలలోన…
దివ్వెలెప్పుడూ చీకట్లకు వెరువయ్,
చెరగని వెలుగోలే బతుకమ్మా…
ఎన్ని కన్నీటి సంద్రాల్ని గుండెల్లో మోస్తున్నా,
నీ నవ్వుల్నే కోరారే ఓ కన్నా…
నిను కన్నవాళ్ళ కన్నీరు తుడవంగ,
కడలంత నవ్వోలె బతుకమ్మా…
కన్నంటని మిన్నంటుతు ఎగిరిందే గువ్వ,
ఏ తీరం ఇక దూరము?…
దూరాల్ని చెరిపేసే రెక్కుందే నీలో,
తీరాన తరగల్లే బతుకమ్మా…
జీవితమంటే చిన్నదే కానీ,
దాని కొరకు చేసేటి పోరాటం పెద్దదే…
పోరాడందే గెలవలేరు ఎవరు,
గెలుపుల్నే ఏలుతూ బతుకమ్మా…