వర్ధనమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు రాఘవ పాతికేళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తండ్రి చనిపోయినప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇదే రావడం. రాఘవకు ఒక కొడుకు, కూతురు. కొడుకు అమెరికాకు వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. కూతురు చదువుకుంటున్నది. భార్య ఆరోగ్యం సరిగ్గా లేదని రక్తస్రావం ఎక్కువవుతున్నందువల్ల హోమియోపతి వైద్యం తెలిసిన తన తండ్రి దగ్గరే మందులు వాడుతోంది. నుక మాత్రలతో తగ్గిపోతుందని కూతురికి వైద్యం చేస్తూ ఉంటాడు.
రెండవ కొడుకు కేశవ, కోడలు మాలతి, వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. పెళ్ళి కాగానే అత్తగారి మడి, ఆచారం నచ్చక వేరే కాపురమంటూ వెళ్ళిపోతుంది. వర్ధనమ్మకు ఇష్టం లేకున్నా మాట వినేవారు ఎవరూ లేరు. అంతా భర్తదే పెత్తనం. అతను సరేననడంతో వాళ్ళు ఊర్లోనే వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు.
కూతురు మాధవి భర్తతో వేరే ఊర్లో కాపురం ఉంటుంది. తల్లిని పండగలకు రమ్మని ఉత్తరం రాస్తుంది. వర్ధనమ్మ వెళ్ళదు. ఎక్కడైనా పండగే అని మమకారాలను వదిలించు కోవాలని, గతాన్ని మరచిపోవాలని, భవిష్యత్తును గురించి భయపడవద్దని చెబుతూ, మళ్ళీ ఈ బంధాలతో విడిపించుకోకుండా చేస్తున్నారు అనుకుంటుంది వర్ధనమ్మ.
తన పదహారవ ఏట కాపురానికి వచ్చినప్పటి నుంచి పొద్దు పొడవక ముందే లేచి, పాచి పనులన్నీ చేసి, ఇంటి పనులు, పిల్లలకు, భర్తకు, అత్తమామలకు సేవ, ఆ తర్వాత మనవలకు సేవ చేయడంతో జీవితమంతా రావి చెట్టులాంటి భర్త నీడన కొనసాగి, తన ప్రమేయం లేకుండా భర్త చూపిన దారిలో నడిచింది. భర్త మరణం తర్వాత ఆమెకు కొంత సమయం దొరికి, జీవితానికి ఒక మలుపైంది.
భర్త చనిపోతూ ఇల్లు తన స్వార్జితం అని, భార్యకు మాత్రమే చెందుతుందని, ఆవిడ తదనంతరం ఎవరికివ్వాలి అనుకుంటే వాళ్ళకు ఇచ్చుకోవచ్చని రాశాడు విల్లులో. పిల్లల భవిష్యత్తును ఆలోచించడమే కానీ భార్య గురించి ఆలోచించని అతను, భార్య భవిష్యత్తు కోసం ఇల్లు రాయడం, బ్యాంకులో డబ్బు ఎంత ఉందో తెలియదు కానీ నెల, నెల ఖర్చులకు డబ్బు రావడం… అన్నీ అమర్చి వెళ్ళిన అతని జ్ఞాపకాలతో కళ్ళు చెమర్చాయి వర్ధనమ్మకు.
అతను బతికి ఉన్న రోజు ఒక్క రోజు కూడా ఆమెపై శ్రద్ధ తీసుకోలేదు. భార్యతో అన్యోన్యంగా ఉంటే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడని తన అన్నను వేళాకోళం చేసినట్లు తనను కూడా చేస్తారని కాబోలు ఎప్పుడూ అంటి ముట్టనట్టుగా ఉండేవాడు. ప్రేమగా పిలిచింది లేదు. అప్పుడు అందరితో నిండుగా ఉన్న ఇంట్లో భర్త చనిపోయిన తర్వాత ఒక్కతే ఉంటూ సగం వాటా అద్దెకిచ్చింది వర్ధనమ్మ.
ఢిల్లీ నుండి వచ్చిన పెద్ద కొడుకు రాఘవ అప్పుడు హోటల్‌లో దిగితే వృధా ఖర్చు అని ఇంటికి రమ్మనేది. కానీ ఇప్పుడు తల్లి చాలా మారిపోయింది అనుకుంటాడు. అతను వచ్చేటప్పటికి వర్ధనమ్మ తాళం వేసి బయటకు వెళ్తూ వర్ధనమ్మ కొడుకును చూసి మళ్ళీ వెనకకు వస్తుంది. కుశల ప్రశ్నల తర్వాత ఇంట్లో ఉన్న జామపండు కోసి పెడుతుంది. అది చూసిన తర్వాత అమ్మను చూడడానికి వచ్చేటప్పుడు కొన్ని పండ్లయినా తేలేదు కదా అనుకుంటాడు. ఆఫీసు పనిమీద అన్నీ మర్చిపోయాను అనుకుంటాడు.
అయినా ఇప్పుడు పండు ఏమిటి? టిఫిన్ చేసి వచ్చానని, ఎక్కడికి వెళ్తున్నావ్ అంటాడు తల్లిని. చిన్న పని ఉంది అంటుంది. నేను చేసి పెడతానంటాడు. అక్కర్లేదు అంటూ నేను చేసుకుంటాను అంటుంది. ఒక్కర్తివే ఉండడం ఎందుకు? మా దగ్గరకు రమ్మంటే, ఢిల్లీ వాతావరణం పడదు, భాష రాదు అంటావు. కూతురు దగ్గర ఉండనంటావు. ఊళ్ళోనే ఉన్న కేశవ ఇక్కడకొచ్చి ఉంటానంటే వద్దంటావు. వాడి దగ్గరే
ఉండమంటే వాడి ఇల్లు ఇరుకంటావు. ఎలాగమ్మా నీతో అంటున్న కొడుకుతో ఇప్పుడు ఏమైంది అంటుంది వర్ధనమ్మ.
ఇంతవరకు ఏమీ కాలేదు. ఏదైనా జబ్బు చేస్తే ఎలా అంటాడు. ఇప్పుడు నా ఆరోగ్యానికి ఢోకా లేదు అంటుంది. వంట చేసుకున్నావా? అనడంతో ఇవాళ శనివారం కదా భోజనం చేయను అంటుంది. మాటవరసకైనా అమ్మ భోజనం చేయమని అనలేదనుకొని డబ్బు పంపించలేదని కోపమో, ఏమో అనుకుంటూ అయినా ఇంటి అద్దె వస్తుంది, బ్యాంకు నుంచి వడ్డీ వస్తుంది కదా అనుకొని, జేబులో చేయిపెట్టి ఇవ్వాలనుకున్న డబ్బును ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు.
భర్త చనిపోయినప్పుడు మంగళసూత్రాలు, నల్లపూసలు, గొలుసు, ముక్కుపుడక అన్నీ తీసినప్పటినుంచి ముత్యాలు, పగడాలతో చుట్టిన గొలుసు మెడలో వేసుకుంటున్నది. ఇప్పుడు అది తెగింది కనుక పక్కింటి అమ్మాయితో చెప్తే ఊరెళ్ళి వచ్చిన తర్వాత చేస్తాను అంటుంది. వచ్చిన కొడుకుకు ఇవ్వలేక కంసాలి దగ్గరికి వెళుతుంది. ఇంత దూరం ఎందుకు వచ్చారంటూ, పూర్వపు గౌరవాన్ని కనబరిచి డబ్బులు తీసుకోకుండానే అతికించి ఇస్తాడు కంసాలి.
భర్త ఉన్నప్పుడు ఇంటిపనులన్నీ తనే చేసేవాడు కనుక బయటకు వెళ్ళే ప్రసక్తి ఉండకపోయేది. ఇప్పుడు అన్నిపనులు తానేచేసుకోవాల్సి వస్తోంది. అయినా చేసుకోవాలి అనుకుంటుంది.
మర్నాడు బజార్ నుంచి సరుకులు తీసుకొని వస్తుంటే చిన్న కొడుకు కేశవ ఎదురై చేతిలో సంచి తీసుకోబోతుంటే, బరువు ఏం లేదు పద అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత నీ ఉద్దేశ్యం ఏమిటి? మమ్మల్ని వీథిలో పెడుతున్నావ్ ఎందుకు అంటాడు. ఈ వయసులో మమ్మల్ని దూరంగా ఉంచి ఒంటరిగా ఉండడం ఎందుకు? నువ్వు వెళ్ళి సామాను తెచ్చుకోవాలా? నాకు చెప్తే నేను తెచ్చి పెడతాను కదా అంటాడు. దాంతో వర్ధనమ్మ నాకంటే పదేళ్ళు పెద్దవాడయిన మీ నాన్న మొన్నటివరకు పనులన్నీ చేసుకోలేదా? ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. అయినా నేను ఒంటరిగా ఎ్కడున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినా నేను జీవితంలో ఎప్పుడూ ఒంటరిని అనుకుంటుంది. నీ కోసం అంత దూరం నుండి రావాలంటే కష్టమన్న కొడుకుతో, రావడం ఎందుకు ఒక్క ఉత్తరం ముక్క రాయమంటుంది. మేము ఇక్కడకొచ్చి ఉంటే ఈ బాధ ఉండదు కదా నీకు అంటే నాకేమీ ఇబ్బంది లేదు అంటూ కొడుకుకు బిస్కెట్లు పెట్టి, కాఫీ కలపాలా అంటుంది. అక్కర్లేదు తాగే వచ్చాను అంటాడు. బిస్కెట్లు కూడా కొనుక్కుని తింటోందా? అనుకుంటాడు. పెట్టడమే తెలుసు కానీ ఆమె ఎప్పుడూ తినగా నేను చూడలేదు. ఇప్పుడు అమ్మ చాలా మారిపోయింది అనుకుంటాడు.
అద్దె ఇల్లు ఇరుకుగా, ఎదిగిన పిల్లలతో ఉండాలంటే కష్టమవుతోంది. ఇక్కడ నాలుగు గదులు, సొంత ఇల్లు, వస్తామంటే అవసరం లేదంటుంది. కన్నకొడుకు, మనవరాళ్ళ దగ్గర ఉండాలని అనుకోవడం లేదు అనుకుంటాడు మనసులో.
అప్పుడు వేరే కాపురం పెట్టించిన భార్య ఇప్పుడు బాధ్యతలు పెరిగి చాలీచాలని జీతంతో రెండు గదుల్లో ఉండలేక కలిసి వస్తుంది, పిల్లలకు కాలేజి దగ్గరవుతుంది, అత్తగారు ఊరికే కూర్చోరు కదా! తనకు పనుల్లో విశ్రాంతి దొరుకుతుంది, అక్కడికి వెళ్దాం అంటే తల్లి ఒప్పుకోవడం లేదు అన్నా కోపం. ఆఖరికి అత్తగారిని అందరం కలిసుందాం అని అడిగితే ఎందుకమ్మా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే బాగుంటుంది అన్నా కూడా భర్తతో పోరు పెడుతూనే ఉంది.
తన పిల్లలు ఎవరొచ్చినా ఏమీ తీసుకురాకపోయినా వాళ్ళ పిల్లలకు ఏదో ఒకటి చేసి పంపాలి అనుకుంటుంది కానీ తన దగ్గర డబ్బులు, సరుకులు ఏమీ లేవు. చేయాలని ఉన్నా మనసొప్పక మధన పడుతుంటుంది వర్ధనమ్మ. ఈ మధ్య బజారుకి వెళ్ళినప్పుడు గోడల మీద బొమ్మలు చూసింది, సరి కొత్త సినిమా స్త్రీలకు ప్రత్యేక ఆహ్వానమంటూ సినిమా పేరు ‘ఆడదంటే అలుసా’. ఎప్పుడో చాలా కాలం క్రిందట సుమంగళి, బాలనాగమ్మ లాంటి సినిమాలు చూసింది. సంసారంలో సినిమాలు చూసే ప్రసక్తే లేకపోయింది. ఎలాగైనా సినిమా చూడాలనుకుంటుంది కావున ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఇంటి వాళ్ళ కోడల్ని అడిగితే మావారితో వెళ్తాను అంటుంది కావచ్చు అనుకుంటుంది. వాళ్ళ అత్త ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండి బయటకు రావడం ఇష్టపడదు. కొడుకునో, కోడలినో అడుగుదామనుకుంటే ఈ వయసులో నీకు సినిమానా అని, సినిమాలు ఎందుకు అంటారు. ఎవరిని అడిగినా ఏదో ఒకటి అంటారు అనుకొని రిక్షా ఎక్కి వెళ్ళి సినిమా చూసి వస్తుంది. ఆ సినిమా చూసి వచ్చాక ఏదో ఘనకార్యం చేసినంత తృప్తి కలుగుతుంది. చిన్నచిన్న కోరికలు తీర్చుకోవాలనుకుని ఎవరు ఏమనుకుంటారోనన్న ఆందోళన నుండి బయటపడి అనుకున్నది చేసిన తృప్తి ఆమెలో కలుగుతుంది.
ఏదో ఆలోచనలతో సతమతమవుతున్న వర్ధనమ్మకు, భర్త అలవాటు గుర్తుకొచ్చి పార్కుకు వెళ్తుంది. ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించి కుంచించుకుపోతుంది. ధైర్యం తెచ్చుకుని పచ్చని గడ్డిమీద కూర్చొని పరిసరాలను గమనిస్తుంది. పిల్లలను ఆడించేవారు, ఆడుకునేవారు, కొత్త దంపతులు ముచ్చట్లతో ఎవరి లోకంలో వారు ఉండి బయటి ప్రపంచాన్ని పట్టించుకునేవారు లేరు అనుకుంటుంది. కొందరు బయట ఉన్న తినుబండారాలు కొనుక్కొని తింటూ ఉంటే పిడత కింద పప్పు కొనుక్కోవాలని అనుకుని వెళ్ళి కొనుక్కుంటుంది. తన చిన్నప్పుడు ఓ ‘కానీ’ అనుకుంటుంది. అవి తీసుకుని మళ్ళీ కూర్చున్న చోటికి వచ్చి తిందాం అనుకుంటే మనవలు గుర్తుకు రావడంతో, తననే చూస్తున్న ఏడెనిమిదేళ్ళ ముష్టి కుర్రాడికి కొన్ని పెట్టగా వాడు పడే సంబరాన్ని చూస్తూ మిగిలింది నోట్లో వేసుకుంటుంది. నోరు చుర్రుమన్నా, రుచిగా ఉంది. అలా తనకు తాను కొనుక్కున్న అనుభవం చిన్నతనాన్ని గుర్తుచేస్తూ మనసు అరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆకాశంలో గంతులేసింది. బిడ్డలు తమ అవసరాలకు వాడుకోవడం అలవాటయిపోయింది. దగ్గర ఉంచుకుంటే చాలదా! ఒక్కొక్కరు వదిలిపెట్టి విదేశాలకు వెళ్తున్నారు. మేమే నయమను కుంటున్నారు కొందరు. బంధాలు బంధనాలలో ఇరుక్కున్న చేప ఉన్నంతవరకు చేనుకు తినడమే పెద్ద వయసులో చేయాలనుకుంటుంది.
స్త్రీగా లోలోపల బాధపడినా తనకు దూరంగా
ఉండాలనుకున్న పిల్లలు దగ్గరగా వచ్చి ఉంటే వచ్చే విసుగూ, విరామం ఎన్నో కుటుంబాలలో చూసి, నాది అన్న ఆలోచన మానుకున్నప్పుడే మనిషికి తృప్తి. అలాగే వర్ధనమ్మకు భర్త అవసానదశలో చేసిన మేలుతో పిల్లల మనస్తత్వాలు తెలుసుకుంది కనుక బంధాలపై వ్యామోహాన్ని వదిలి, తనను తాను నిలుపుకొని జీవితాన్ని మలచుకొని ఎందరికో మార్గదర్శకమైన గొప్ప వనిత వర్ధనమ్మ.