హైదరాబాద్ త్యాగరాజ గానసభ భవనం ముందు దిగాము నేను, ములుగు లక్ష్మి. హైదరాబాద్ పెద్దగా పరిచయం లేదు. కొంచెం జంకుగా ఉంది. ఎవరూ పరిచయం లేరు. వంగూరి ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు రెండవ మహిళా రచయితల సదస్సులో కవిసమ్మేళనంలో పాల్గొనాలని వచ్చాము. లోపలికి వెళ్ళగానే నిర్వాహకులు ఆహ్వానించారు. హమ్మయ్య ఫర్లేదు, కొంచెం ధైర్యంగా ఉంది. ముందు ఎలా ఉంటుందో?
మేము అడగకముందే ఛార్జీల కవర్‌తో సహా బ్యాడ్జ్ అన్నీ గౌరవంగా ఇచ్చి లోపల కూర్చోమని మాకు చదవవలసిన సమయం గురించి తెలియజేశారు. ముందు వరుసలో వెళ్ళి కూర్చున్నాము ఇద్దరం. వచ్చే వాళ్ళని, చదివేవాళ్ళని కుతూహలంగా గమనిస్తూ
ఉన్నాను. కొందరు మమ్మల్ని పరిచయం చేసుకుంటున్నారు. నిజంగా నెల్లూరు దాటి పెద్దగా వచ్చింది లేదు. సభకు వెళ్ళేముందు వచ్చే వాళ్ళ గురించి కొంత హోం వర్క్ చేసుకుందాము, అప్పుడు వాళ్ళను ఏమైనా సందేహాలు అడగొచ్చు అనుకుంటాను, కానీ మళ్ళీ హడావిడిలో మామూలే. లక్ష్మి కానీ మా నెల్లూరు రచయితలు తోడు ఉంటే వాళ్ళు వివరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరినీ చూపించి వారి వారి వివరాలు, కొన్నిసార్లు వాళ్ళే నన్ను పరిచయం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకో వాళ్ళతో మాట్లాడడం కంటే ఏమైనా చెపితే వినడం ఇష్టం. బెదురు
ఉందేమో! కాకపోవచ్చు. నా స్వభావమే అంతేనేమో!
ఇక తరువాతి ఆవృతం మాదే. ఇక్కడ వాళ్ళ స్నేహ భావంతో కొంత అక్కడ ఎనర్జీకి అలవాటు పడ్డాను. స్థిమితంగా చదవాల్సిన కవితను ఒకసారి చూసుకుంటూ
ఉన్నాను.
”అబ్బా!” ఒక్క పురిటి నొప్పి వెంట ఒక అరుపు, ”ఆడదానివి ఓర్చుకోలేవా?”
ఆడవాళ్ళం అని మనకు తెలుసు, నొప్పికేదీ వివక్ష. అరుపు కాస్తా బలహీనమైన మూలుగై పెదవి కింద నలుగుతూ ఉంటుంది. ఒక్క ప్రాణాన్ని మొయ్యడానికి ఎన్ని అబ్బాలు మొయ్యాలి లోలోపల!
పక్కన ఎవరో కూర్చున్నారు. తల తిప్పి చూశాను. పెద్దావిడ. కవిత చదవడానికి వచ్చి ఉంటారేమో! నా కళ్ళలో ఏమి కనిపించింది చిన్నగా నవ్వారు. ఇదిగో నా బలహీనత, స్నేహపూర్వక నవ్వును నేను ఇగ్నోర్ చెయ్యలేను. అసలు ఆ వెన్నెల వదిలేటట్లు లేదు. ఏదో ఆప్యాయత ప్రవహిస్తూ ఉంది ఇద్దరి మధ్య. పేరు కూడా తెలీని పెద్దామెతో ఏమిటి స్నేహం?
నా కవితలు రఫ్ పుస్తకం తీసి చూపించాను. చిన్నగా తిరగేశారు. చిన్ని మార్పులు చెప్పారు. బోసినవ్వుల విజయం కవిత చూపించాను. ఆ నవ్వుకు అదే చూపించాలి అనిపించింది. చదివారు. భకు జట ఎందుకు పెట్టావమ్మా? అని అడిగారు. నేను బుద్దిగా తల ఊపాను. జట నాకు ఎప్పుడూ పెద్ద అర్థం కాని ఇబ్బంది. ఈమె ఏమి చెప్పినా ఒప్పుకోవాలి అనిపిస్తూ ఉంది. ఇక వెళ్ళిపోతుందేమో! ఏదో ఒకటి అడగాలి గుర్తుగా. సంతకం ఇవ్వరా అన్నాను.
మళ్ళీ ఒక చిన్న నవ్వు, చిట్టి పాపాయి తల్లిని మిఠాయి అడిగితే నవ్వినట్లు, పెట్టారు.
చూశాను. ”మీకందరికీ శుభాకాంక్షలు!”… అబ్బూరి ఛాయాదేవి.
ఆవిడ స్టేజ్ మీదకు వెళ్ళిపోయారు. నేనింకా తేరుకోలేదు. అప్పుడే పక్కన వచ్చిన లక్ష్మి చెపుతూ ఉంది, శశి ఆవిడ ఎవరు అనుకున్నావు? అబ్బూరి రాజేశ్వరరావుగారి భార్య. పెద్ద రచయిత్రి. విశ్లేషణాలు దొర్లుతూ ఉన్నాయి వరద గోదారిలాగా! నా మనసులో మాత్రం ఒకే ఒక్క విశేషణం ”చిరపరచిత స్నేహమయి”.
అమ్మా మీరు నా పక్కన కూర్చున్న పది నిమిషాలు మీ సంతకం గొప్పదనం తెలీలేదు. ఈ రోజు మీరు వెళ్ళిపోయాక పేజీలుగా అందరి నుండి వస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మీ గొప్పదనం ఆకాశమంత ఎదిగి అంతు చిక్కకుండా ఉంది. పైకి వెళ్ళి ఏమి చేస్తూ
ఉంటారో నాకు తెలుసు. ఇంకా కొందరికి చిరునవ్వుతో స్నేహం పంచుతూ ఉంటారు. బహుశా ఇంద్రుడు అయినా ఉంటే గింటే మీ స్నేహం త్రాగి అమృతాన్ని మర్చిపోతాడేమో!