పండుటాకుల్నుండే కదా చిగురుటాకులు పుడ్తాయ్‌ -పి. ప్రశాంతి

”ఛాయలు ఈ మధ్య అసలు తిండి తినడమే మానేసింది. ఏదో రెండు ముద్దలు తిని, తిన్నాననిపించుకుని మానేస్తోంది. బాగా చిక్కిపోయింది. మాటలు కూడా తగ్గించేసింది. మీరొకసారి వచ్చి చెప్పండి, మీ మాటైతే వింటుంది.” అంటూ ఒక రోజు యశోదగారు అమ్మూకి ఫోన్‌ చేసి బాధపడ్డారు. అంతకు ముందే రజిత కూడా ఫోన్‌ చేసి ”నేనేళ్ళోచ్చాను, ఛాయాదేవిగారు బాగా చిక్కిపోయారు” అని చెప్పేసరికి అమ్మూ, నేను వెంటనే వెళ్ళిరావాలనుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నమే సి.ఆర్‌. ఫౌండేషన్‌కి వెళ్ళాం. ఛాయాదేవిగారి రూం నిశ్శబ్ధంగా ఉంది. పడుకున్నారేమో… డిస్టర్బ్‌ చేస్తున్నామా అనుకుంటూనే మెల్లగా తలుపు తట్టాం. అంతలోనే ప్రక్క గదిలోనించి యశోదగారు వచ్చారు. తలుపు నెట్టేసరికి ఛాయాదేవిగారు మంచంలో లేచికూర్చున్నారు. ఆవిడ్ని చూసి నిర్ఘాంతపోయాను.

నేను ఆవిడ్ని చూసి అప్పటికి 4, 5 నెలలు అయిపోయినట్లుంది. చిన్నగా కోమలంగా ఉండే ఛాయాదేవి గారు మరింత చిన్నగా… బక్కగా… పెద్దగా ఉన్న చంటి పాపాయిలా అనిపించారు. అదే మాటంటూ, ‘ఏంటండీ తినడం లేదా ఇలా అయిపోయారు’ అంటే ‘ఈ వయసులో ఎంత తింటాం? ఏమీ చెయ్యకుండా తిని ఇంకా ఎంత కాలం బతకాలి?’ అంటూ ఆయాసపడ్డారు. ‘చూశారా, మాట్లాడ్తుంటే ఆయాసం వస్తోంది. అలా కాకుండా ఉండాలంటే శక్తి కావాలిగా! తినడానికి సయించకపోతే కనీసం రెండు, మూడు గంటలకొకసారి పాలు, బ్రెడ్‌ తినొచ్చు’ అంటూండగానే ‘పాపం, వాళ్ళనేమి ఇబ్బంది పెడతాం. డైనింగ్‌ హాల్లో నాకోసం ప్రత్యేకం పాలు, బ్రెడ్‌ ఇవ్వమని ఏం అడుగుతాం’, అయినా, ఇదిగో ఈ గ్లాసుతో పాలు తెచ్చుకుని రెండుసార్లుగా తాగుతూనే ఉన్నాను’ అంటూ టేబిల్‌ మీద చూపుడు వేలంత పొడుగున్న గ్లాసును చూపించారు. ఆ మాటల్లో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచన, తన కోసం ఎవరైనా ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారంటే ఆవిడపడే ఇబ్బంది, జీవించింది చాలు, ఇక ముగించేయాలనే బలీయమైన కోరిక… అన్నీ వినిపించాయి. ఆ రోజు ఒక మూడు గంటల సేపు కూర్చుని ఆవిడతో మాట్లాడ్తుంటే మధ్య మధ్య ఆయాసంతో ఆగుతున్నా, మాటల్లో హాస్యం, పెదాలపై చిరునవ్వు, ముఖంలో వెలుగు, కళ్ళల్లో కరుణతోపాటు చిలిపితనం… ఎప్పటి ఛాయాదేవిగారే ఏమాత్రం మార్పులేదు.

సరిగ్గా 10 రోజులు గడిచాయో లేదో… ఆగష్ట్‌ 25, పొద్దున్నే అమ్మూ ఫోన్‌ చేసి ‘అరేయ్‌, ఛాయాదేవిగారు వెళ్ళిపోయారు’ అన్న మాటకి అదిరిపడ్డాను. ‘మూడు రోజుల్నుంచి కొత్తపేటలోనే ఉన్నారంట’, అన్న మాట వేదనకి గురిచేసింది, అతి దగ్గర్లో ఉండి కూడా తెలియలేదు. చూడలేకపోయానని బాధేసింది. మొన్న వెళ్ళినపుడు నన్ను గుర్తుపట్టలేదనిపించి ఆ మాటే అంటే ‘ప్రశాంతి. నాకెందుకు తెలియదు. మీరు భూమికలో రాస్తున్నవి అన్నీ చదువుతున్నాను. ఎన్నో సమస్యల్ని లేవనెత్తుతున్నారు. బాగుంది’ అన్నది గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంత గొప్ప మనిషి… నన్నూ గుర్తించారని. ఒక ఫోటో తీసుకుందామండి అనగానే ‘అయ్యయ్యో ఆగండి. ఈ చింపిరి జుట్టుతోనా’ అంటూ గబగబా తల దువ్వుకొని, చీర సరిచేసుకుని ఎప్పట్లా నవ్వుతూ ‘ఇకరెడీ’ అన్నది గుర్తొచ్చి చిరునవ్వు పూసింది. అదీ ఛాయాదేవిగారి గొప్పతనం.

ఒకసారి, చాలా కాలం క్రితం, అమ్మూ, ఛాయాదేవిగారు మొక్కల్లో తిరుగుతూండగా అమ్మూ ఒక పండుటాకుని మొక్క నుండి తీసేస్తుంటే ‘అయ్యో, పండుటాకుల్ని తీసేయకండి, రాలేదాకా ఉండనివ్వండి’ అన్నారట. తర్వాత కలిసినప్పుడు నేనది ప్రస్తావిస్తే ‘పండుటాకుల్నుండే కదమ్మా చిగురుటాకులు పుట్టినయి. చిగుళ్ళు పెరగాలంటే ఆకులు పండాలిగా…’ అంటుంటే జీవిత చక్రాన్ని, జీవన విధానాన్ని, లోతుల్ని నాలుగు మాటల్లో ఇమిడ్చేసి బోధించినట్లైంది. బుద్ధుని రూపంలా అనిపించారు ఆ సమయంలో. ఛాయాదేవిగారేంటో అర్థమైపోతుంది ఎవరికైనా ఈ మాటల్తో. అలాంటి ఛాయాదేవిగారు… వయసులో ఎంతో చిన్నవాళ్ళైనా ‘మీరు’ అనే సంబోధించే ఛాయాదేవిగారు… మనుషుల పట్లే కాదు. మొక్క, పిట్ట, పురుగు, జంతువులు… అంతేకాదు, జీవం లేని వస్తువులు పట్ల కూడా ఒకే రకమైన గౌరవం, ఇష్టం, ఆత్మీయత చూపించే ఛాయాదేవిగారు…. తన చేతిలో పడ్డ ఏ మామూలు వస్తువునైనా ఒక కళాకృతిగా మార్చి అమూల్యంగా తయారు చేసి ఆ సున్నిత హృదయం, అచలిత వ్యక్తిత్వం మనందరికీ సుపరిచితం. ఈ రోజున భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన మాటలు, చేతలు, వ్యక్తిత్వంతో మనందరి మధ్యా… మనందరి స్మృతుల్లో నిలువెత్తుగా నిలిచిపోయారు. పున్నమి వెన్నల ప్రతి ఒక్కర్ని స్ప్రశించినట్లు ఛాయాదేవిగారు తన అమృత రచనలతో చిన్నా, పెద్దా, పిల్లా, పాప… ప్రతి ఒక్కర్ని తట్టిలేపారనిపిస్తుంది. ఆవిడ కథల్ని నేను చదివా’ అని చెప్పుకోడం కూడా గర్వంగా అనిపించే ఎత్తుకి ఎదిగినా ఆవిడ మాత్రం ఎంత నిగర్వో, ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెల్సు. అదీ ఛాయాదేవిగారు!

ఏ నీడ చూసినా ఛాయాదేవిగారు ఛాయగా గుర్తొస్తుంటారు. అటువంటి అపూర్వ వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు, అత్యంత ప్రియమైన స్మృతులతో ఇదే నా నివాళి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.