ఛాయాదేవి గారిని మొదటిసారి చూసింది 2002లో ముక్తవరం పార్థసారధి (మా వారు) గారి 9 పుస్తకాలు ఆవిష్కరణ సభలో చూశాను. మా వారు ఆవిడ గురించి చెప్పగా విన్నాను. పార్ధసారధి గారు ఛాయాదేవి గారిని కలిసి మాట్లాడినప్పుడు, మా ఆవిడ ఆకులతో బొమ్మలు చిత్రిస్తారని చెప్పారట. ఛాయాదేవి గారికి సృజనాత్మకమైన కళ ఉండడంతో వెంటనే మా ఇంటికి తీసుకుని రండి అని చెప్పారట.
మరొకసారి 2003లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగుకి వెళ్ళి పక్కనే ఉన్న ఛాయాదేవి గారింటికి వెళ్ళాం. ఆహ్లాదకరమైన ఆ పొదరిల్లు చూడగానే హాయిగా అనిపించింది. నాకు కొన్ని ప్రత్యేకమైన ఆకుల మీద దృష్టి పడింది. డోర్ బెల్ కొడదామని చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. తలుపు గడియకు, గోడకు ఒక గంట వేలాడుతోంది. మోగగానే చిరునవ్వుతో, ఆ కళ్ళు వెలుగు రేకులతో స్వాగతం. పక్కనే పిల్లులు ఆవిడని చూడగానే పరిగెత్తుకొచ్చాయి. నేను అమెరికాలో కొన్న పిల్లి బొమ్మ ఉన్న వింత పెన్ను ప్రెజంట్ చేశాను. ఆవిడకు పిల్లులంటే ఎంత ఇష్టమంటే… ఫ్లవర్‌వాజ్, టేబుల్ క్లాత్ మీద డిజైన్, పర్సులు అన్నీ చూపించారు. ఒక పిల్లి కథ కూడా రాశారు. పిల్లిని పెంచడంలోని అనుభవాలన్నీ చెప్పారు.
ఛాయాదేవి గారు ఎంతో ఓపిగ్గా తన కళాత్మకమైన బొమ్మలను చాట భారతం, ఇందిరాగాంధీ, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మొదలైన చాలా బొమ్మలు ఎలా తయారుచేసేవారో చెప్పారు. నా ఆకుల చిత్రాల గురించి అడిగారు. ఎలా వచ్చింది ఈ ఆలోచన అని ఆశ్చర్యపోయారు. ప్రకృతిని పునఃసృష్టించావు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత నా ఆకుల చిత్రాలను భూమిక ముఖ చిత్రానికి (స్త్రీ విముక్తి చిత్రం) కూడా రికమెండ్ చేశారు. కొండవీటి సత్యవతి గారికి, ఈనాడు వాళ్ళకు పరిచయం చేశారు. భూమిక ఆఫీసులో ప్రదర్శన పెట్టినపుడు చాలా సంతోషించి ముక్తవరం పార్ధసారధిగారు రాకపోవడమేమిటి అని ఫోన్ చేసి మరీ పిలిపించారు.
నా మొట్టమొదటి ‘కళా ప్రదర్శన’ ”చిత్రమయి”ని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభోత్సవం చేశారు. నాకు ఆవిడంటే ఆరాధనా భావం ఎక్కువయింది. అప్పుడప్పుడూ ఫోన్ చేసి మాట్లాడేవారు. మేడమ్ అని పిలిచేదాన్ని. చమత్కారమైన మాటలు, జోక్‌లు వినిపించేవారు.
భూమిక ఆఫీసులో ”ఆర్ట్ క్యాలెండర్” ప్రారంభించారు. ఆ క్యాలెండర్ పాతదైపోయినా తేదీలు కట్ చేసి దాన్ని వచ్చిన రచయితలకు, ఇంటికి వచ్చిన వారందరికీ చూపించానని చెప్పేవారు. ఎంతో శ్రద్ద, స్పందించే గుణం ఉన్న ఛాయాదేవి గారిని చూసి ఆశ్చర్యపోయేదాన్ని. 2003 డిసెంబర్‌లో తొలిసారి కలిశానని చెప్పాను కదా, 2004 జనవరి 1న శుభాకాంక్షలతో ఆకులతో ఒక ‘పిల్లిబొమ్మ’ను తయారుచేసి పోస్ట్ చేశాను. వెంటనే రెండు రోజుల్లో నాకు పోస్ట్‌లో ఒక చెట్టు బొమ్మ, ఒక బెరడుతో చేసి పంపించారు. ఆ ప్రతిస్పందన మరువలేనిది. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఃూవజూజూశీబతీఱః (ఎండిన ఆకులు, పువ్వులు, బెండ్లు, అడవికాయలు సువాసనతో నిండిఉన్న రంగు వేసి ఉన్న ప్యాకెట్ – అమెరికాలో కొన్న వస్తువు) ఇచ్చారు. ఎవరో ఇచ్చారట. దానిమీద Made in India అని ఉంది. నవ్వుకున్నాం.
ఎప్పుడూ నవ్వుతూ పలకరించటం మరువలేనిది. ఒకసారి మా ఇంటికి తీసుకెళ్తానని పట్టుబట్టాను. నేను వస్తానని అడ్రస్ తీసుకుని ఒక స్నేహితురాలిని వెంటబెట్టుకుని వచ్చారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే గుణం కాదు. తన మార్గంలో నడుస్తూ ఆత్మీయంగా, చిన్న పెద్ద భేదం లేకుండా తన చమత్కార మాటలతో, అనుభవాలను కూడా చమత్కార మాటలతో అలరించేవారు.
CRF Old age కు వెళ్ళాను ఒకసారి. అందరికీ డాక్టర్లు, మహిళామండలి వాళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆకులతో చిత్రాలు చేస్తానని పరిచయం చేశారు. అక్కడి వాళ్ళంతా వచ్చేటప్పుడు ఆకులు సేకరించి ఇచ్చారు. ఛాయాదేవి గారికి ఒక గ్రీటింగ్ కార్డును పక్కన ఒక బొమ్మ పెట్టి మనిద్దరి ‘స్నేహ బంధం’ అని నేను ఇస్తే, ఒకే కార్డులో ఇద్దరి చిత్రాలు ఒదిగించారు. అదీ ‘కళా హృదయం’. మహానుభావురాలు… వందనాలు…