ఛాయాదేవి గారి మరణవార్త విని తేరుకునేసరికి కొంత సమయం పట్టింది. ఆ రోజంతా మన వాళ్ళను పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఛాయాదేవిగారితో పరిచయం అలాంటిది. ఆ పరిచయం నిన్న, మొన్నటిది కాదు, కొన్ని సంవత్సరాలది. భూమికలో ‘కాలమ్’ రాయడంతో మొదలైనది. బాగ్‌లింగంపల్లిలో ఉండడం ద్వారా ఆ అనుబంధం ఇంకా దగ్గరయింది. ప్రతి సంవత్సరం ఛాయాదేవి గారి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతాను. ఈ సారి కూడా ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆవిడ ”నాకు మతిమరుపు వస్తోంది. ఏదీ గుర్తుండడంలేదు. నేను ఎప్పుడు పోతానో అని ఎదురు చూస్తున్నాను ప్రసన్నా” అన్నారు. ఆవిడ అనుకున్నట్లుగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు కాదు అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయారు.
ఛాయాదేవి గారి క్రమశిక్షణ, నిబద్ధత, పంక్చువాలిటీ చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇంట్లో కూడా మా అమ్మా వాళ్ళకు చెప్పేదాన్ని. ”అమ్మా! ఛాయాదేవి గారిని చూసి నేర్చుకోవాలి మీరు. ఒక్కరే ఎంత బాగా కాన్ఫిడెంట్‌గా అన్ని పనులను సిస్టమేటిక్‌గా చేసుకుంటారో” అని చెప్పేదాన్ని. ఆవిడ అందరికీ ఇన్‌స్పిరేషన్.
భూమికలో తన ‘కాలమ్’ రాసి 15వ తేదీ వరకు ఇవ్వాలని ఫోన్ చేసి గుర్తు చేస్తే, ఆవిడే స్వయంగా అందమైన దస్తూరితో రాసి తెచ్చి ఇచ్చేవారు. ఆవిడ రాత ఎంత స్పష్టంగా ఉండేదంటే కళ్ళుమూసుకుని డిటిపి చేయవచ్చు.
కరెంట్ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ మేము కడతామంటే కూడా మన పనులు మనం చేసుకోవాలని ఆవిడే వచ్చి కట్టేవారు. ఎవ్వరిమీద ఆధారపడడం ఇష్టముండేది కాదు ఆమెకు. నిజంగా ఛాయాదేవి గారు ఛాయాదేవి గారే. అప్పటి కాలంలో
ఉన్నవాళ్ళల్లో కనిపించిన క్రమశిక్షణ, నిబద్ధతకు ఛాయాదేవిగారే ఒక ఉదాహరణ.
ఎప్పుడైనా వారి ఇంటికెళ్తే ఎండాకాలంలో అయితే ”ఆమ్‌పన్నా” తాగించి కబుర్లు చెప్పేవారు. మాటల్తో ఛలోక్తులు విసిరేవారు చిన్నగా నవ్వుతూ… ఆవిడతో మాట్లాడుతున్నంతసేపు కాలం అలా అలా గడిచిపోయేది. ఇప్పటికీ, ఎప్పటికీ ఆవిడ అంటే అభిమానం, ఆరాధన. ఛాయాదేవిగారితో అనుబంధం ఎంత చెప్పినా తక్కువే. అశ్రునివాళితో… – ప్రసన్నకుమారి