బాధతో కుమిలిపోతున్న మహిళా లోకానికి తమ అక్షరాలతో ఓదార్చుతామని… న్యాయం కోసం ఉద్యమించే నారీమణులకు తమ కలాలతోనే సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రముఖ రచయిత్రి ఛాయాదేవి సహా 40 మంది రచయిత్రిలు వాకపల్లి మహిళల వెన్ను తట్టారు. ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించిన వారు బాధితుల గోడును స్వయంగా విన్నారు. ఈ క్రమంలో ఉద్వేగానికి లోనైన కొందరి నయనాలు చమర్చాయి. అమాయక ఆదివాసీ మహిళలకు న్యాయం చేయడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారని స్పష్టమవుతోందని వారు ఆవేదన చెందారు. అక్షరాల్నే ఆయుధాలుగా మలచి పాలకులపై సంధిస్తామని, బాధిత మహిళలకు వెన్నుదన్నుగా ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. న్యాయం కోసం ఉద్యమిస్తున్న వాకపల్లి మహిళల్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళా లోకం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
తలెత్తుకుని తిరగలేక పోతున్నాం : బాధితులు
పోలీసులు చేసిన పాపానికి సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని పలువురు మహిళలు కన్నీళ్ళ పర్యంతమయ్యారు. తమను ఇతర గ్రామాలకు చెందిన వాళ్ళందరూ పోలీసుల భార్యలమంటూ హేళన చేస్తున్నారని బాధిత మహిళలు తెలిపారు. ఈ అవమానాన్ని భరించలేక ఇతర గ్రామాలకు, వారపు సంతలకు వెళ్ళడం లేదని బాధితులు సిత్తాయి, శ్రీదేవి, లక్ష్మిలు పేర్కొన్నారు. గ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తాను జి.మాడుగులలో సమావేశానికి కూడా వెళ్ళలేని దుస్థితి నెలకొందని కొర్రా చిలకమ్మ వివరించింది. ఎన్ని అవమానాలు పడినా… ఎందరి కాళ్ళు పట్టుకున్నా తమకు న్యాయం జరగకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దుస్థితి మరే మహిళకు దాపురించకూడదని పలువురు బాధితులు కోరారు.
తొలిసారిగా గిరిజనులతో మమేకం: ఛాయాదేవి
గిరిజనుల విషయమై పుస్తకాల్లో చూడడం, చదవడం మినహా ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడే తొలిసారిగా వారితో మమేకమయ్యానని ప్రముఖ రచయిత్రి ఛాయాదేవి అన్నారు. వాకపల్లి సందర్శనతో గిరిజనులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలు స్వయంగా తెలిశాయని ఆమె అన్నారు. ఉద్యమాల గడ్డగా భాసిల్లుతున్న ఉత్తరాంధ్రపై అధ్యయనం చేయడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని రచయిత్రులు విలేకరులకు తెలిపారు. శనివారం గంగవరం, దిబ్బపాలెం సందర్శించామని, ఆదివారం వాకపల్లి వచ్చామని తెలిపారు. అధ్యయనాల అనుభవాల్ని తమ రచనల్లో రంగరిస్తామని వారు పేర్కొన్నారు. ప్రముఖ రచయిత్రి సత్యవతి, ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.