అబ్బూరి ఛాయాదేవి గారితో… – వారణాసి నాగలక్ష్మి

 

‘ఎలా వచ్చారు?’ అడిగాను. ‘ఆటోమేటిగ్గా’ అన్నారు. తర్వాత తెలిసింది ఆటోలో వచ్చారని.

ఃఔశీఎaఅఃర బజూశ్రీఱట్‌ఎవఅ్‌ః అంటే ఇది కాదేమో? స్త్రీల సాధికారత గురించిన సదస్సు రెండో అంతస్తులో జరుగుతుంటే లిఫ్టులో పైకొస్తూ అనుమానపడ్డారు ఇంకో సందర్భంలో.

వృద్ధాప్యం, భర్తా పిల్లలు లేని ఒంటరితనం, నిరంతరం తన వెంటే

ఉండిపోయిన ఆస్తమా, గత పదేళ్ళుగా విసిగిస్తున్న నడుంనెప్పి… ఆమెను కలవడానికి వెడితే ఇవేవీ మనకు కనబడవు. చిరునవ్వుతో వెలిగే వదనం, రోజువారీ పనుల్లోనే హాస్యాన్ని వెలికితీయగల చాతుర్యం, వచ్చిన వారికి ఆప్యాయంగా ఏదో ఒకటి తినిపించి గానీ సాగనంపని ఆత్మీయతా! ఇవే కనిపించేవి.

బాగ్‌ లింగంపల్లిలో ఉండే రోజుల్లోనూ, తర్వాత చండ్ర రాజేశ్వరరావు గారి సి.ఆర్‌.ఫౌండేషన్‌ వృద్ధాశ్రమంలో చేరాకా కూడా అప్పుడప్పుడు కలవడానికి వెళ్ళేదాన్ని. ఆవిడకీ, ఆమె సోదరికీ కూడా పాటలంటే ఇష్టం. రెండు మూడుసార్లు వర్షిణిని తీసుకువెళ్ళాను. పాటలు పాడించుకుని విన్నారు. ఎనభయ్యేళ్ళ వయసులో ఈ మెయిల్‌ పంపడం నేర్చుకున్న ఆమె, మా రాకకి ఎంతో సంతోషించానని చెపుతూ నాకొక ఈ మెయిల్‌ రాశారు. తన ఫోన్‌లో కాల్స్‌ రావడం లేదని చెప్పి ఒకసారి చూడమని చెపితే వర్షిణి అందులో సెట్టింగ్స్‌ చెక్‌ చేసి సరిచేసి ఇచ్చింది. దానికి ఎంతో సంతోషించారు. తర్వాత కూడా మూడు నాలుగు ఈ మెయిల్స్‌ రాశారు.

2005లో తన అత్తగారి పేర నెలకొల్పిన ‘శ్రీమతి అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారం’ కోసం నన్ను ఎన్నుకున్నానని చెపుతూ, ఫోన్‌ చేశారు. అంతకు కొద్ది నెలల ముందే నా మొదటి కథా సంపుటి ‘ఆలంబన’కి ఆమె ముందు మాట రాసి ఎంతో ప్రోత్సహించారు. అదే నా మొదటి పురస్కారం నిజానికి. అయితే ఆ తర్వాత వారం రోజులకే చెన్నయ్య గారి నుంచి ఫోన్‌ వచ్చింది. తెలుగు విశ్వ విద్యాలయం వారు 2004 సంవత్సరపు సాహితీ పురస్కారం కోసం, అంతకు ముందు సంవత్సరం వెలువడ్డ నా ‘వానచినుకులు’ గ్రంథాన్ని ఎన్నుకున్నట్టుగా తెలియచేస్తూ, దానికి సంబంధించిన లేఖ అందగానే

ఛాయాదేవి గారికి ఫోన్‌ చేశాను విషయం చెపుతూ. ‘అయితే నేను సరైన వ్యక్తినే ఎన్నుకున్నానన్నమాట’ అన్నారు నవ్వుతూ.

‘కాల్పనిక సాహిత్యం-రచయిత్రుల కృషి’ అనే శీర్షికతో లేఖిని ఆధ్వర్యంలో సాహిత్య అకాడమీ ఒక సదస్సు నిర్వహించింది, 2015 ఏప్రిల్‌ నెలలో. అందులో ఛాయాదేవిగారి రచనల మీద పతసమర్పణ చేసే అవకాశం నాకు లభించింది. 2005లో ఆమెకి సాహిత్య అకాడెమీ పురస్కారం తెచ్చిపెట్టిన తన మార్గం పుస్తకంలోని కథలని ముఖ్యంగా విశ్లేషిస్తూ ఛాయామార్గం అనే శీర్షికతో నా పత సమర్పణ చేశాను. అప్పటికే ఆమె తేలికగా ప్రయాణించలేని స్థితిలో ఉన్నారు. అందువల్ల ఆ సదస్సుకి ఆమె రాలేదు. తర్వాత నేనే ఆ వ్యాసాన్ని ప్రింటవుట్‌ తీసుకుని వెళ్ళి ఆవిడకి ఇచ్చాను. అప్పుడు ఆమె అంతకు ముందుంటున్న గది నుంచి కొంచెం పెద్ద గదికి మారి, తన సోదరితో కలిసి ఉంటున్నారు. బలహీనంగా, నడుం నొప్పితో ఉన్న ఆమెని భోజనం ఎలా ఉందని అడిగితే నవ్వి ‘స్పైసెస్‌ ఎక్కువగా తినలేకపోతున్నా’ అన్నారు. ఆమె సోదరి కొద్ది రోజులు తన పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తారని తెలిసి ‘మీరు మా ఇంటికి రండి. నాకు మీతో గడపాలని ఉంది. మీకూ కొంచెం మార్పు ఉంటుందని’ ఎంతో అడిగాను. వర్షిణి కూడా చాలా బతిమాలింది. ససేమిరా అని ‘మళ్ళీ ఆ మాయా మోహంలో పడదల్చుకోలేదు’ అన్నారు. తర్వాత నాలుగు రోజులకి ఒక చక్కని ఉత్తరం రాశారు, మీ వ్యాసం చాలా బావుంది అని మెచ్చుకుంటూ. ‘మీ ప్రశంసకి తగినంత గొప్పగా నా కథలు ఉన్నాయా అనుకున్నాను’ అన్నారు. అంతకంటే వినయ సంపన్నత మనం ఎక్కడైనా చూడగలమా? ఒక గదికే పరిమితమై చరమాంకం గడుపుతున్న రోజుల్లో కూడా ఆవిడ తన కళాత్మక సృష్టిని వదిలేయలేదు. దగ్గరున్న పనికిరాని వస్తువులతో రకరకాల కళాకృతులు చేసేవారు. లైబ్రేరియన్‌గా తాను సంపాదించిన అనుభవాన్ని పురస్కరించుకుని, ఆశ్రమంలోని గ్రంథాలయం తాలూకు పనులు చూస్తూ తన తీరిక సమయాన్ని గడిపేవారు. ఊహించని సమయంలో ఆమె నించి ఒక కమ్మని ఉత్తరం వచ్చి మాలాంటి రచయిత్రులకి ఆహ్లాదం పంచేది.

భూమిక బృందం, ముఖ్యంగా సత్యవతి ఆ మహా రచయిత్రిని ఎంతో గౌరవంతో, ఆత్మీయతతో ఆదరించడం నాకు తెలుసు. వాకపల్లి యాత్రలోనూ, ఒకసారి ఆమె పుట్టినరోజు నాడు, తర్వాత అనేక సందర్భాలలో ఛాయాదేవి గారిని సమకాలీన రచయిత్రులు ప్రేమతో, అభిమానంతో సత్కరించుకున్నారు. వారందరినీ ఆమె తనదైన శైలిలో ప్రోత్సహించారు. విలువైన సూచనలిచ్చి దారి చూపించారు.

తనదైన సరళ నిరాడంబర చిదానంద మార్గంలో ఆమె ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపి పరమపదం చేరారు. గొప్ప సాహిత్యాన్ని, ఒక ఉన్నత సంస్కారం తాలూకు పరిమళాన్ని మన కోసం వదిలి వెళ్ళారు. ఉదయించే సూర్యుడిని తలపింపజేసే ఆమె నుదుటి మీద బొట్టూ, నిశితమైన దృక్కులని ప్రసరింపజేసే నక్షత్రాల లాంటి కళ్ళూ, చిరునవ్వు వీడని వదనం… ఆమెతో పరిచయమున్న ప్రతి వ్యక్తి మనసులోనూ, ఆ విశిష్ట మహిళ రూపం చెరగకుండా ఎప్పటికీ నిలిచిపోతుంది.

ఆమెకి నా ఆత్మీయ నివాళి!

(ఆమె కథా సంపుటి ‘తన మార్గం’ మీద సాహిత్య అకాడెమీకి సమర్పించిన పత్రం ‘ఛాయామార్గం’ పేర http://vanalakshmi.blogspot.com లింక్‌లో పొందుపరచబడింది. ఆసక్తిగల పాఠకుల కోసం ఆ వ్యాసపు లంకె ఇక్కడ ఇవ్వడం జరిగింది.)

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.