అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ, ఆవిడకి, ఆవిడ సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను (మీతో పంచుకోవాలనుకుంటున్నాను).
భారతదేశంలో contrast situations, cultures ఉన్నాయి అంటారు డాక్టర్ కోశాంబి. (నేను correct convey చేస్తున్నానో లేదో). చాలా ఆధునికమైన భవనాలు, సాంకేతికత మొదలైన వాటితో కూడిన ప్రదేశం ఒకవైపు ఉంటే అక్కడికి కొంచెం దూరంలోనే మురికివాడలు
ఉంటాయి. అభివృద్ధి చెందిన నగరాలకు, పట్టణాలకు ఒక మాదిరి దగ్గరలోనే విద్యా వైద్య సదుపాయాలు లేని పల్లెటూళ్ళు, గిరిజన గూడేలు ఉంటాయి. ఇదీ ఆయన చెప్పిన contrast. ఇక సంస్కృతుల గురించి వేరే చెప్పాలా!
కోశాంబి నాకు ఎందుకు గుర్తుకు వస్తారు అంటే నేను అలాంటి contrast ప్రదేశం నుంచి culture నుంచి వచ్చాను కాబట్టి కొంచెం ఎక్కువగా గుర్తుకువస్తారు. ఆ contrast గురించి చెపితేనే నాకు ఛాయాదేవి గారు ఎలా అర్థమయ్యారో కొంచెం చెప్పగలను. కాస్త భరించండి. మా అమ్మ బొమ్మకంటి (పోడూరి) సీతా తులసి, మా మేనత్త మండలపర్తి (బొమ్మకంటి) శేషారత్నం ఇద్దరికీ కూడా నాలుగైదు సంవత్సరాల తేడాలో ఛాయాదేవి గారి వయసు. మా అమ్మ, వాళ్ళ చెల్లెళ్ళ అక్షరజ్ఞానం కోసం ఆమె తాతగారు ఇంటికి మేస్టార్ని పిలిపించి చదివించారు. (Home tutions అన్నమాట). హార్మోనియం వాయించగలిగేలా సంగీతం కూడా చెప్పించారు. మా అమ్మ అప్పుడప్పుడు పాడుకునేది. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ మాత్రం అక్షరజ్ఞానం కల్పించిన మా తాతగారు ఆ ఊళ్ళో మంచివాడి కింద లెక్క. (మిగిలిన వాళ్ళకు ఆ దిక్కు కూడా లేదు కదా!) ఇంక మా మేనత్త అయితే మా నాన్న, బాబయ్యలతో స్కూల్ మెట్లు ఎక్కినట్లుంది. ఆవిడకి కూడా చదవటం, రాయటం వచ్చు. మాకు విద్యావంతులైన స్త్రీలుగా వైద్యుల పేర్లే ముందు తెలుసు. బండారు అచ్చమాంబ (ఈవిడ పుస్తకాలూ, కందుకూరి వీరేశలింగం పుస్తకాలూ అమ్మ వాళ్ళకి పరిచయం చేసింది నాన్నగారు, మావయ్యగారే. ఈ contribution credit వాళ్ళకే దక్కాలనుకుంట.) వీరమాచనేని విమలాదేవి, సుభద్ర, రుక్మిణీదేవి ఇలా…
70 ఏళ్ళ క్రితం (మా అన్నయ్యకి 70 ఏళ్ళు) ప్రసవాలు కష్టంగానే ఉండేవి. ఈ డాక్టర్లే చాలామంది స్త్రీల ప్రాణాలు కాపాడారు. ఆ జూతీశీషవరర లోనే కృతజ్ఞతగా మా వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా చెప్పినట్లు ఉన్నారు. ఆ తర్వాత లైబ్రరీ పుస్తకాల వల్ల వేరే రంగాల్లో విద్యావంతులైన కొందరు స్త్రీల గురించి తెలిసింది. ఓహో గొప్పవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అనుకునేదాన్ని. మా ఊళ్ళో స్కూల్‌కి వెళ్ళే ఆడపిల్లలు ఏ ఒకరిద్దరో తప్ప మిగిలిన ఆడపిల్లలు, వీథిలోంచి నడచిన జ్ఞాపకం నాకు లేదు. కాలువగట్టు వెంబడి నడిచి పెరట్లోంచి ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. అలాంటి పల్లెటూరు నుంచి ఒక్కసారి హైదరాబాద్‌లో పడి గిలగిలా తన్నుకున్నాను. ఇక్కడకు వచ్చాక 11 ఏళ్ళకు పెళ్ళయి 14 ఏళ్ళకు కాపురాలకు వెళ్ళిన మా అమ్మ, మేనత్తలకు, కాలేజీకి వెళ్ళి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఛాయాదేవి గారు, కృష్ణాబాయిగారు, విజయభారతి గారు మొదలైన వారి జీవితాలకు ఉన్న తేడాను చూశాను, నాకు నమ్మశక్యంగా ఉండేది కాదు.
ఇంత contrast చూసిన నాకు ఛాయాదేవిగారి కథలు కూడా అలాగే అర్థమయ్యాయి. ప్రధానంగా ‘ప్రయాణం’. పెళ్ళి కుదిరాక సంతోషంగా తన స్నేహితురాలిని చూడబోయిన ఒక అమ్మాయి ఆ ఇంట్లో స్నేహితురాలి భర్త చేత అత్యాచారానికి గురవుతుంది. ఇక పెళ్ళి చేసుకోవడానికి పనికిరానని, పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. పెళ్ళికొడుకు ఆ సంఘటనలో ఆమె తప్పు లేదని ఓదార్చి ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. చదవగానే ‘ఎంత గొప్ప కల’ అనిపించింది. నిజంగా అలానే అనిపించింది. ఎంత మంచి కలను పంచారో ఛాయాదేవి గారు అనిపించింది. ఇప్పటికీ సమాజం పెద్దగా మారలేదు. ఆ contrast అలా సాగుతూనే ఉంది. స్త్రీలమీద రకరకాల హింసలతో పాటు లైంగిక హింస, పరువు హత్యలు నడుస్తూనే ఉన్నాయి. పాలిటెక్నిక్‌లో డి.సి.సి.పి అనే కోర్సు ఉంది. వాళ్ళకి చివరి సంవత్సరంలో ఛాయాదేవి గారి బోన్సాయ్ కథ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ సిలబస్‌లో ఉంది. తర్వాత తరాల పిల్లలు కదా! వాళ్ళకు సులభంగానే అర్థమయింది. ఆ కథ టీచింగ్ చేయడానికి నేను పెద్దగా కష్టపడలేదు. ఆ కథని వివరించి, ఆ రచయిత్రి ఇతర కథలను పరిచయం చేసే క్రమంలో, ‘ప్రయాణం’ కథ చెప్పి చర్చ పెట్టాను. చెప్పాను కదా contrast బతుకులు, cultures అని.
‘చాల్లెండి మేడమ్. ఎవడైనా వెంటపడ్డాడనో, ఏడిపిస్తున్నాడనో ఇంట్లో చెబ్దామంటే చదువు మాన్పిస్తారేమో అని హడలి ఛస్తాం. ఇంక అత్యాచారాలు, ఓదార్పులు, పెళ్ళి చేసుకోవటం ఇంత పెద్ద సీన్’ అంది ఓ పిల్ల. ఇంక చర్చ రకరకాలుగా మళ్ళింది. ఏం చెప్పాలో తోచలేదు. ‘తల్లీ! పోరాడటం చేతనయితే ఆ హింసకు వ్యతిరేకంగా పోరాడండి. సపోర్ట్ చేయండి. అదీ చేతకాదూ! ఫర్వాలేదు. వాటిని గాయాలుగా ట్రీట్ చేయడం నేర్చుకుని మనసుని డైవర్ట్ చేసుకోండి. అవి గాయాలు అంతే అనుకోండి’ అని చెప్పాను.
ofcourse, మచ్చలను కూడా కెలికి పుండ్లుగా చేయగలిగిన మహామహులు ఉండవచ్చు. అయినా ఆ హింసని గాయంగా ట్రీట్ చెయ్యమని నేర్పటమే మంచిది అనుకున్నాను / అనుకుంటున్నాను. నా స్టూడెంట్స్‌ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడిన ‘ప్రయాణం’ కథకి, రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారికి ధన్యవాదాలు.