అబ్బూరి ఛాయాదేవి గారిని కాకతాళీయంగా కొండాపూర్ ఆశ్రమానికి వెళ్ళినపుడు కలవడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి ఆమె ఒక స్టూల్ మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వారించి దేనికి అని అడిగితే కర్టెన్ మార్చాలన్నారు. అతి బలవంతం మీద ఆమెను ఒప్పించి నేను స్టూల్ ఎక్కి కర్టెన్ మార్చాను. అదే ఆమెను మొదటిసారి కలవడం. భూమిక సంపాదన వర్గంలో ఒకరిగా ఆమె పేరు చదవడమే తప్ప ఆమెతో పరిచయం లేదు. అది 2015వ సంవత్సరం సెప్టెంబర్ / అక్టోబర్ మాసం అయ్యుండవచ్చు. అప్పుడు నా దృష్టి ఆమె తెలుగులోకి అనువదించిన జిడ్డు కృష్ణమూర్తిగారి పుస్తకం మీద పడింది. నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే ఒక రచయిత్రి, జిడ్డు కృష్ణమూర్తి గారిని అంత లోతుగా అర్థం చేసుకుని ఆయన తాత్వికతను తెలుగువారికి అందించే ప్రయత్నం చేసిన వ్యక్తిని కలిసినందుకూ, ఇంకా ముఖ్యంగా నేను నా ఇరవయ్యేళ్ళ వయసుకే ఆయనకి అంత గొప్ప అభిమానిని అయినందుకూ. ఈ ఒక్క విషయం మా ఇద్దరినీ వెంటనే కనెక్ట్ అయ్యేలా చేసింది. అంతే నాకు ఇక సమయం తెలియలేదు. ఆమె ఎన్ని కబుర్లు చెప్పారో. ఆ గదిని అలంకరించిన విధానం, ఆమె పెయింటింగ్స్, విస్కీ వినాయకుడు, షేవింగ్ బ్రష్ తోటి చెట్టూ, బుద్ధుడు ఇంకా అక్కినేని గారి గుండుని కొండలుగా వాడుకున్న వైనం చెప్పి నవ్వించారు, అబ్బుర పరిచారు అబ్బూరి గారు. వంశానికి మూల పురుషుడు కాబట్టి ఆమె భర్త వాడిన గొడుగునో, కర్రనో సరిగా గుర్తు లేదు కానీ తలుపు మూల పెట్టాననడం ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కి తార్కాణం. ఆశ్రమంలో గ్రంథాలయం తీర్చిదిద్దాలనే పనిలో బిజీగా ఉన్నానని చెప్పారు. ఓపిక
ఉన్నంతవరకూ ఖాళీగా ఉండకూడదన్న ఆమె ఉత్సాహం ఆ వయసు వారిలో అరుదు.
నిజానికి అబ్బూరిగారి రచనలు ఆమె తన స్వదస్తూరితో ప్రేమగా నా పేరు రాసిచ్చిన కథల పుస్తకం తప్ప నేను మరేమీ చదవలేదు. ఒక రచయిత్రిగా కన్నా ఆమెను నేను అర్థం చేసుకున్నది ఆమెతో గడిపిన ఆ కొన్ని గంటలలోనే. ఆ సమయంలో నాలో ఎన్నో ప్రశ్నలు మొదటి పరిచయంలోనే అడగలేనివి. ఇక ఇప్పుడు ఆమె గురించిన మరిన్ని వివరాలు తెలిశాక ఆమె అంటే ఉన్న గౌరవం మరింత పెరిగింది. వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు లేనివారు, వాటివల్ల కలత చెందని వారూ ఉండరు. కవులు గానీ, రచయితలు గానీ అందుకు మినహాయింపు కాదు కానీ రవి కాంచనిచో కవి గాంచున్ అన్నట్లు సాధారణ వ్యక్తులకన్నా సహానుభూతి పొందగలిగి అందరి దుఃఖాన్నీ అనుభవించగలిగే కవులు తమ జీవితాల్లోని దుఃఖాన్నీ, సమస్యల్నీ ఎలా అధిగమిస్తున్నారు, ఎలా పరిష్కరించుకుంటున్నారు అంటే నేను అర్థం చేసుకున్నంత వరకూ పెద్ద ఆశాజనకంగా అయితే లేదు. ఈ విషయంలోనే ఛాయాదేవి గారు అందరికీ మార్గదర్శకం అనుకుంటా. రాసినా, రాయకపోయినా, తమ రాతల వల్ల సమాజం రాతనీ, సమాజంలోని వ్యక్తుల రాతనీ మార్చినా మార్చకపోయినా పెద్ద నష్టం లేదు. ఎందుకంటే సమాజం ఎప్పుడూ తన పోకడ తను పోతుంటుంది, తప్పటడుగులు వేస్తూనే వాటి పర్యవసానాలు అనుభవిస్తూనే మార్పులు చేసుకుంటుంటుంది. కవుల పాత్ర ఈ మార్పుల్ని వేగవంతం చేయడానికి మాత్రమే. అంతకంటే ఎక్కువ ఆశించడం వృధా. ప్రస్తుతం మనకి సంస్కృతి పేరిట మూఢాచారాల్లోనూ, మూఢనమ్మకాల్లోనూ, ఉగ్రవాదంలోనూ కూరుకుపోయిన మేధావులు పుష్కలంగా ఉన్నారు. వీరెవరివల్లా సమాజానికి మేలు జరగట్లేదు సరికదా హానే ఎక్కువగా తోస్తుంది. వివేకం విజ్ఞత ఇవ్వని చదువు ఈనాడు. మారుతున్న సంబంధ బాంధవ్యాలూ, వాటి విలువల వల్లా, ఎవరికి వారికి, వారి వ్యక్తిగత జీవితాలే ముఖ్యమైపోయిన నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు పిల్లల వద్ద కూడా ఆదరణ పొందలేకపోతున్నారు. ఇదివరకులాగా పిల్లలు లేకపోతే కుటుంబంలోని ఏ పిల్లలైనా వృద్ధులని ఆదరించి దగ్గర పెట్టుకునే రోజులు కావు. అబ్బూరి గారి కన్నా ఓ రెండు తరాల తర్వాత అయిన నాకే ఇది కష్టంగా అనిపిస్తోంది. అలాంటప్పుడు అబ్బూరి గారు పిల్లలూ లేక దగ్గరి బంధువులూ లేక ఆశ్రమంలో ఒంటరిగా ఉండడం, ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నదే అయినా ఆమె అక్కడ జీవించిన తీరు మాత్రం అందరికీ అనుసరణీయం. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ, తనకున్న సమయాన్ని ఎప్పుడూ సద్వినియోగం చేస్తూ చివరివరకూ జీవించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒంటరితనం అనుభవించడం అంత తేలికయిన విషయం కాదు, అందునా వృద్ధాప్యంలో. ఏకాంతంలో ఆమె కూడా ఎన్నో యుద్ధాలు చేసుంటారు మనసుతో. కానీ ఆమె మానసిక స్థైర్యం ఎప్పుడూ చెదరలేదు. ఒక కవిగా గౌరవించాలేమో వ్యక్తిగత జీవితాన్ని విస్మరిస్తూ అన్న సందిగ్ధంలో పడేసే కవులు ఎందరో మొదటి నుంచీ, స్త్రీ వాదానికి, వాస్తవికతకు, యదార్థ సమాజానికి అద్దం పట్టిన రచయిత్రిగా ఎంతో గౌరవం. అలాగే ఆమె తను జీవించిన తీరులోనే ఎంతో గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తిగా కూడా ఆమె అంటే అంతే గౌరవం. అందుకే ఆమె ఒక ఆదర్శ మహిళా, రచయిత్రి నాకు. నేను ఆమెను కలిసిన నెలలోనే భూమికలో నాకు మొదటిసారి రెండవ బహుమతి వచ్చిన కవిత అచ్చవడం, దాన్ని చదివి ఆమె ఫోన్ చేసి మరీ ఫలానా లైన్ నాకు చాలా నచ్చిందని చెప్పడం నాకు మరువలేని జ్ఞాపకం. నేను కలిసిన మొదటి రచయిత్రి అంతటి పరిపూర్ణమైన వ్యక్తి అవటం ఇంకా గొప్ప సంతోషాన్నిచ్చే విషయం.