”
అబ్బూరి ఛాయాదేవి అత్యంత బలమైన స్త్రీ వాద రచయిత్రిగా అనిపించదు. ఎక్కడా ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు తిరుగుబాటు చేయరు. స్త్రీల పక్షంలో చేరి ఆమె తీవ్రంగా వాదించదు. ఆ స్త్రీ పాత్రలు ఎక్కడా శక్తిమంతమైన మాటల్లో వాదించవు. జీవిస్తున్న జీవితంతో పెద్దగా అసంతృప్తి పడినట్లు కనిపించవు. పెట్టె పట్టుకొని భర్త ఇంట్లోనించి గడపదాటే ఆలోచనే ఆ పాత్రల్లో రాదు. ”శ్రీమతి-ఉద్యోగిని” కథలో రిసెర్చి విద్యార్థిని ఉద్యోగం చేసే ఒక స్త్రీని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల సమస్యలు ఏమిటో పరిశోధనలో భాగంగా ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి ఒక ప్రశ్న ఇలా అడుగుతుంది – ‘భార్యా భర్తల మధ్య తగవు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మొండిగా వాదిస్తారా? ఎక్కువగా ఏం జరుగుతుంది?’ అని అడుగుతుంది. దానికి ఉద్యోగిని అయిన శ్రీమతి ”ఆడది తగ్గక ఏం చేస్తుంది?’ అని సమాధానమిస్తుంది. ఈ జవాబుతో పాఠకులకు ఛాయాదేవి ఒక సర్దుకుపోయే స్త్రీలాగా కన్పిస్తుంది. కాని ఆమె వాక్చాతుర్యం ఇక్కడే ఉంది. లోకంలో భార్యాభర్తల్లో స్త్రీ అణిగిమణిగి ఉంటుంది అని ఛాయాదేవి చెప్పినా, ఉద్యోగం చేస్తున్నా స్వయం నిర్బరంగా ఉన్నా మొండి వాదంలో స్త్రీ లొంగక తప్పడంలేదు అన్న స్త్రీత్వాన్ని, స్త్రీ లొంగుబాటుతనాన్ని, పురుషాహంకారాన్ని, దౌర్జన్యాన్ని, ఆధిపత్యాన్ని ఆమె పాఠకులకు స్ఫురింపచేస్తారు. ఛాయాదేవి రచనల్లో ఆ విధంగా పాఠకులకు స్ఫురింపచేసి, పాఠకుల్లో ఆలోచనలు రేపి, వారిలో మార్పును తెచ్చే శక్తి ఉంది.
”ఆయన కీర్తి వెనుక” అనే కథలో ఛాయాదేవి ఎక్కడా స్త్రీ పాత్ర సీతమ్మ భర్త అహంభావాన్ని గర్హించినట్లుగా లేదు. ఆ భర్త తను పాల్గొన్న దేశ స్వాతంత్య్ర పోరాటం అనుభవాలను పత్రికల వాళ్ళకు ఇంటర్వ్యూలో చెప్తుంటే ఆమె పక్కగదిలో కూర్చుని వింటూ
ఉంటుంది. భర్తకు పోరాట సమయంలో అతని తండ్రి ఆస్తిని అమ్మి డబ్బు ఇవ్వనంటే తాను తన చేతిగాజులు, గొలుసు తీసి ఇచ్చింది ఉద్యమం కోసం వాడుకోమని. ఆ విషయాన్ని భర్త పత్రికల వాళ్ళకు ఇంటర్వ్యూలో ఎక్కడా చెప్పకపోవడం చూసి హఠాత్తుగా లేచి వాళ్ళ ముందుకు వెళ్ళి నిల్చుంటుంది. అందరూ ఆమెవైపు ప్రశ్నార్థకంగా చూస్తారు. భర్త చిరాకు ధ్వనించే కంఠంతో ”ఏం కావాలి?” విసుగ్గా అడుగుతాడు. అప్పుడామె తడబడుతూ ”ఏం లేదు, కాఫీ తేనా?” అని అడుగుతుంది. పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయిన సీతమ్మకు తన అవస్థలు గుర్తుకొచ్చాయి. ఏం మాట్లాడకుండా సీతమ్మ కాఫీలు తేవడానికి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. భర్తతో వెనుక నిలబడి ఫోటో దిగమన్నా ‘నాకెందుకు నాయనా!’ అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. లోపలికెళ్ళి ‘మంచి పని చేశాను. కక్కుర్తి పడలేదు నయమే’ అనుకుంటుంది. పిల్లల పాలన కోసం తాను ఇంట్లో ఉండిపోయింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రేరణతో తను ఉద్యమంలోకి దూకితే తననూ ఈ రోజు పత్రికలవాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కదా’ అని విచారిస్తుంది కొంతసేపు. ”ఏంటో స్వతంత్రం వచ్చి యాభై ఏళ్ళయిందంటూ ఉత్సవాలు జరుపుతున్నారు. ఎవరికొచ్చిందో మరి ఆ స్వాతంత్య్రం? నాకైతే వచ్చినట్లు లేదు” అనుకుంటుంది సీతమ్మ. తీవ్రవాదంతో ఆలోచించని ఇటువంటి స్త్రీ పాత్రలను చిత్రించిన ఛాయాదేవి ప్రత్యక్షంగా కాక పరోక్షంగా, మెత్తగా పురుష ప్రపంచాన్ని మందలిస్తారు. స్త్రీల అణచివేతలను, వివక్షతలను, స్వేచ్ఛా రాహిత్యాన్ని ప్రశ్నిస్తారు.
స్త్రీకి సమాజంలో ఉన్న స్వేచ్ఛా రాహిత్యాన్ని, బానిసత్వాన్ని, సంప్రదాయం పేరుతో జరిగే వివక్షను అనుభవించే క్రౌెర్యాన్ని, బానిసత్వపు హింసను, ఇంటి బాధ్యత పేరుతో పడే సంకెళ్ళను ధ్వనింపచేస్తారు. పాఠకులను ఆలోచనల్లోకి నెట్టివేస్తారు. మృదువుగా చెప్తూనే సంప్రదాయవాదులను మేల్కొలుపుతారు. అటువంటి సాదాసీదా పాత్రల చిత్రణ ఛాయాదేవి చాలా కథల్లో కనిపిస్తుంది. లోతుగా పరిశీలించే పాఠకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
నేను ముఖ్యంగా ఛాయాదేవి ప్రసిద్ధమైన కథ ”బోన్‌సాయ్ బతుకు” ను విశ్లేషించదలచుకున్నాను. ఈ కథ సాదాసీదాగా నడిచింది. ఈ కథ ఎక్కడా స్త్రీ వాధ కథ జెండర్ వివక్షను చెప్పే కథ అని చివరివరకు చదివేవరకు అనిపించదు. కథ, కథనంలో ఆవేశం, అధిక్షేపం, అభిశంసనం ఏదీ కన్పించదు. ఛాయాదేవి స్త్రీ వాద కథల్లో ఉన్న ప్రత్యేకతే అది. కథనంలో ఎక్కడా స్త్రీ వాద సిద్థాంతాలు, జెండర్ వివక్షతతో కూడిన కసి, కక్షలు కనిపించవు. సరళమైన భాషలో హాయిగా కథనం నడిచిపోతుంది. కథంతా అయిపోయాక పుస్తకం మూసివేసిన తర్వాత ఆమె చెప్పే జెండర్ వివక్షతలు మన మనస్సులో మెదలాడుతాయి. ”బోన్‌సాయ్ బతుకు” కథా అంతే!
మహానగరం, దేశ రాజధానిలో ఉద్యోగం చేస్తున్న ఒక చెల్లెలు. చిన్ననాడు ఐదో క్లాసు చదివింతర్వాత ఆడపిల్లకు పెద్ద చదువులెందుకని ఒక పల్లెటూరు వ్యవసాయదారునికిచ్చి వివాహం చేయబడిన అక్క. ఈ అక్కా చెల్లెళ్ళకు కథలో పేర్లు లేవు. ఒకరు చెల్లెలు, మరొకరు అక్క. దోసకాయలు, గోంగూర, ములక్కాడలు పట్టుకుని అవి మహానగరం ఢిల్లీలో దొరకవని మోసుకుని వచ్చింది అక్క. వడియాలు, అప్పడాలు పెట్టే సమయం లేని చెల్లెల్ని చూసి ”అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటి పని, ఆఫీసు పనీను” అంది అక్క చెల్లెల్ని చూసి ఓదార్పుగా. ఏమిటో ఒక్కొక్కసారి ఉద్యోగం మానేయాలన్పిస్తుంది, ఇంటి పని, ఆఫీసులో వ్యవహారాలు… తలకు మించిన పనే అంటుంది చెల్లెలు. వెంటనే అక్క అందుకొని ఉద్యోగం మానెయ్యకు. ఎంత బాగా మగవాడితో సమానంగా ఉద్యోగం చేస్తూ దేహి అని అడగవలసిన పనిలేదు. నా వంటి దానికి పైసా దగ్గర్నుంచి మొగుడిమీద ఆధారపడాలి. నువ్వు అట్లా ఒకరిమీద ఆధారపడకుండా దర్జాగా బ్రతుకుతున్నావు అని తను ఆర్థికంగా స్వతంత్రురాలిని కాను అన్న విషయం బయటపెడ్తుంది. చెల్లెలు అయితే ఆర్థిక స్వాతంత్య్రంతో హాయిగా, దర్జాగా బతుకుతున్నదని అక్క ఒక స్త్రీకి బానిస బతుకుకన్నా ఆర్థిక స్వాతంత్య్రం అవసరమని చెప్తుంది. ఇలా మాట్లాడుకుంటూ అక్క అక్కడే ఉన్న పూలకుండీల్లోని మొక్కలను చూస్తూ చూస్తూ తురాయి, దానిమ్మ చెట్లు కుండీల్లో ఉండడం చూస్తుంది. ”ఇదేంటే ఇట్లా బయట హాయిగా, వృక్షాల్లా పెరగవలసిన చెట్లను మరుగుజ్జుల్లా చేశావు” అని ఆశ్చర్యపోతుంది. చెల్లెలు అక్కగారి అజ్ఞానానికి పకపక నవ్వుతుంది.
దీన్ని ‘బోన్‌సాయ్’ మొక్కలంటారే. జపాన్ దేశంలో మర్రి చెట్లవంటి మహా వృక్షాలను పూలకుండీలో, కొమ్మలను కత్తిరిస్తూ చిన్నసైజు చెట్టుగా చేసి కాయలను కాయనిస్తారు. చూడడానికి అందంగా ఉంటాయి. మహా వృక్షాలను ఈ విధంగా పెంచడం ఒక కళ తెలుసా అని అక్కకు వివరిస్తుంది. కానీ అక్క చెల్లెలు చెప్పిందాన్ని మెచ్చుకోలేకపోతుంది. మేడంత ఎదగవలసిన చెట్లను ఇట్లా బంధించావు అని నిట్టూరుస్తుంది అక్క. తన కళను అక్క మెచ్చుకోలేదని చెల్లెలు నిరుత్సాహపడుతుంది.
అక్కా చెల్లెళ్ళ సంభాషణ సాగుతుండగా పెద్ద గాలి దుమారం వస్తుంది. చెల్లెలు తొందరగా బాల్కనీలోకి పరిగెత్తుకెళ్ళి బోన్‌సాయ్ కుండీలను లోపలికి చూరు కిందికి లాగుతుంది. అటు చూడే! ఆ రోడ్డు పక్కనున్న తురాయి చెట్టు ఎంత పెద్దదైందో. గాలి దుమారం వచ్చినా కించిత్తు చలించలేదు. పైగా ఈ గాలిదుమారం వానలో నలుగురికి ఆశ్రయం ఇచ్చింది. నీ బోన్‌సాయ్ మొక్క చూడడానికి అందంగానే ఉంది సంసారపక్షపు స్త్రీలాగా. కానీ ఎంత సుకుమారమో చూడు. మరొకరికి నీడనియ్యలేదు. తుఫానుకి తట్టుకోలేదు. మగవాడికి, ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదా ఆడదాని బతుకు బోన్‌సాయ్ మాదిరి అయింది అంటుంది అక్క.
చెల్లెలికి అక్క మాటలు వినగానే మనస్సు ఆర్ద్రమైంది. చెట్లకు పూలకుండీల్లోంచి విముక్తి కలిగించాలన్న ఆవేశం చెల్లెలిలో కలుగుతుంది. కథ చదివిన తర్వాత పాఠకుల్లో రచయిత్రి వాచ్యంగా చెప్పని ఎన్నో ఆలోచనలు లేచిపడ్తాయి. స్త్రీ బ్రతుకు బోన్‌సాయ్ లాంటిది అంటే ఈ పురుష ప్రపంచం, మనుధర్మ సంప్రదాయాలు స్త్రీని ఇంట్లో నాలుగు గోడల్లో (పూలకుండీల్లో లాగా) బంధించి బయట వెలుగు అంటే విజ్ఞానం, జ్ఞానం అందకుండా చేస్తున్నాయి అని అర్థం. బోన్‌సాయ్ అనే కళ అని మహా వృక్షాన్ని పొట్టి మొక్కగా తయారుచేసి చిన్న పూలకుండీలో బంధించటం, అపుడప్పుడు ఆ మొక్క కొమ్మలను, రెమ్మలను, వేళ్ళను కత్తిరించి మళ్ళీ కొత్త మట్టిని పోసి కుండీలో ఉంచడం, అంటే మొక్కను ఎదగనీయకుండా వేళ్ళ దగ్గరనుంచి కత్తిరించడం. స్త్రీకి స్బేచ్ఛ, సమానత్వం లేకుండా ప్రతిభను నొక్కిపెడుతూ ఆమె మెదడు ఎదగకుండా, వ్యక్తిత్వం వికసించకుండా పితృస్వామ్య సమాజం ఆచారాలు, సంప్రదాయాలు చేస్తున్నాయని రెండింటికీ సామ్యం తీసుకువచ్చి కథను నడిపింది. కథను చదవకముందు ‘నేను’ అని కథను చెప్పే చెల్లెలు లేదా కవయిత్రి, బోన్‌సాయ్‌కి లాగానే స్త్రీ జీవితం మానసికంగా పితృస్వామ్య ఆధిపత్యం విధించే బంధనాలతో కురచ అయిపోతోంది, ఎదగడం లేదని వినిపిస్తుంది అనుకున్నాను. ఈ కథలో అక్క ‘తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు… స్వేచ్ఛగా పెరిగింది కదూ! ఎంత గాలి దుమారం వచ్చినా కించిత్తు చలించలేదు, పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది’ అని అంటుంది. ఆడపిల్లకు చదువేమిటని తండ్రి భావించడంతో అక్క విద్య నుంచి వంచితురాలయింది. ఆర్థిక స్వాతంత్య్రం ఏ స్వేచ్ఛా లేని పితృస్వామ్య వ్యవస్థలో జీవిస్తోంది. కాబట్టి పీడితురాలయిన అక్క ‘బోన్ సాయ్’ గా ఒక మహావృక్షం కుంచించుకు పోయినందుకు విచారించింది. తన వేదనను వ్యక్తం చేసింది. అక్క మాటలతో చెల్లెలు కూడా ”మగవాడికి, ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బతుక్కూడా బోన్‌సాయ్ మాదిరి అయింది” అని గుర్తించింది.
అబ్బూరి ఛాయాదేవి కథనం సరళంగా, సూటిగా నడుస్తుంది. భాష కూడా సరళంగా, అక్కడక్కడా చిరుహస్యంతో ఉంటుంది. ఆడంబరం ఉండదు. నర్మగర్భం కథనం నడుస్తుంది. ఇతివృత్తం, పాత్రలు సామాన్యంగా కన్పిస్తాయి. కానీ ఎంతో అర్థాన్ని మోసుకొస్తాయి. అదే ఆమె కథల్లో కనిపించే ప్రత్యేకత! గొప్పతనం!!