మొన్న ఒక వార్త చదివిన. రోహిత్ వేముల తల్లి (హైద్రాబాద్) పాయల్ తడ్వీ తల్లి (ముంబయి) కల్సి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో, యూనివర్శిటీల్లో కుల వివక్షల్ని నిలువ రించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిండ్రు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు స్పందించి కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసులు జారీ చేసింది. కుల వివక్షల్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని టైముతో పాటు ఆదేశాలు జారీచేయడం మంచి పరిణామంగా ఆశిద్దాము.
2016 జనవరి పదిహేడున హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశీయంగానే కాదు అంతర్జాతీయాన్ని కూడా కుదిపేసింది. భారత దేశ ఉన్నత విద్యా సంస్థల్లో, యూనివర్శిటీల్లో కుల వివక్షల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు, చర్చలు జరిగినయి. కానీ ప్రభుత్వాల్ని అవేవీ కదిలించలేదు. పేనుబారిన చలనాలు కూడా కలగలే.
ఈ సంవత్సరం మే 22న ముంబయి లోని టి.ఎన్.టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజిలో మెడిసిన్ చేస్తున్న విద్యార్థిని పాయల్ తడ్వీ సాటి సీనియర్ మహిళలు (సవర్ణ) చేసే అవమానాలకు, కులటార్చర్‌ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆమె ఒంటిమీద గాయాలు కూడా బైటబడినా అది ఆత్మహత్య కిందనే నమోదయింది. పాయల్ తడ్వి ఒక గిరిజన తెగ అమ్మాయి. కుటుంబంలో మొదటి డాక్టర్. సీనియర్ సవర్ణ మహిళల హ్యుమిలియేన్స్, రిజర్వేషన్ క్యాటగిరీ అనీ ఆమెను అడుగడుగునా అవమానించి, పేషెంట్స్ ముందు, సాటి కొలీగ్స్ ముందు హేళనగా మాట్లాడితే… ఎన్ని ఫిర్యాదులు చేసినా యాజమాన్యాలకు చెవికెక్కలేదు. ఆ సీనియర్ సవర్ణ మహిళలకు వార్నింగ్ గానీ లేదా సీరియస్ చర్యలు గానీ తీసుకొని ఉండి ఉంటే డా||పాయల్ తడ్వి బత్కలేని అవమానాల్నించి తప్పించుకొని ఉండేది.
గూడేల నుంచి ఉన్నత విద్యకు రావడము ఎస్సీ, ఎస్టీలకు చిన్న విషయం కాదు. స్కూలు చదువు, కాలేజీ చదువులు దాటుకొని యూనివర్శిటీలకు రావడం ఒక సవాలు, ఒక యుద్ధము. నేను ప్రొఫెసర్‌నైతా, డాక్టరేట్‌నైతా, లాయర్‌నైత, ఆఫీసర్‌నైత, కలెక్టర్‌నైతా, సైంటిస్టునైతా అనే కోటి ఆశల్తో యూనివర్శిటీల్లో అడుగులేస్తరు. పెట్టినంక మొసమర్రని వివక్షలు వాల్ల బట్టలు, వేషభాషలు, వస్తువులు అన్నీ సవర్ణ జాతులకు చిన్నచూపే. హేళనగా చూడ్డం, మాట్లాడ్డం, నవ్వుకోవడం చేస్తుంటరు. కదలికలు, మాట, కళ్ళు, మూతి విరుపులు… ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటరు. కాలేజీలోకి రాంగనే మనిషిని చూసి నేపధ్యాల్ని పట్టేస్తుంటరు. రిజర్వేషన్ క్యాటగిరీలనీ, స్కాలర్‌షిప్పులనీ ఎద్దేవ చేస్తుంటరు. ఇక యూనివర్శిటీ హాస్టల్స్‌లో కులాలు, కులాలుగా సెట్ చేస్కుంటరు.
రోహిత్ వేముల ఆత్మహత్యయినా, డా||పాయల్ తడ్వి ఆత్మహత్యయినా… బైటికి ఆత్మహత్యలుగా కనిపిస్తున్నా ఇవి కుల హత్యలే. ఇవే కాకుండా దేశంలోని యూనివర్శిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో ఆత్మహత్యలకు పాల్పడుతోంది అణగారిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే ఉండడం అలజడి, ఆందోళన కలిగించే అంశము.
యూనివర్శిటీల్లో సమానత నిబంధన లకు సంబంధించిన సెల్స్ ఉన్నాయనే సంగతి ఎవరికీ తెలువది. ఎందుకంటే అవి పంజేయవు కాబట్టి. కుల వివక్షలకు వ్యతిరేకంగా అంతర్గత ఫిర్యాదుల మెకానిజము పటిష్టంగా ఉండాల్సి ఉంది. అట్లనే ఈక్విటీ సెల్స్‌లో ఎస్సీ, ఎస్టీల నుంచి, ఎన్జీఓ సంస్థల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి ప్రాతినిధ్యముంటే నిష్పక్షపాత వైఖరి ఉండి ఉంటే రోహిత్ వేముల, పాయల్ తడ్విలాంటి అనేకమందిని రక్షించేవి.
రాజ్యాంగంలో మా పేర కొన్ని హక్కులు, అవకాశాలున్నాయని తెలువని కులాలు కోకొల్లలు. ఇప్పుడిప్పుడే యూనివర్శిటీల్లోకి ఉన్నత చదువుల బాట బడ్తున్న ఎస్సీ, ఎస్టీలను కుల వివక్షలకు, అవమానాలకు గురిచేసి చేతికి మట్టంటకుండా చంపేస్తున్నయి ఈ సంస్థలు. యూనివర్శిటీలన్నీ అగ్రహారాలుగానే ఉన్నయి. ఎస్సీ, ఎస్టీలకు గైడ్ దొరకడం కనాకష్టం. భాష రాదనీ, జ్ఞానం లేదనీ, చదవరనీ, మధ్యలో వెళ్ళిపోతారనీ, గ్యారెంటీ లేదనీ, వ్యర్థమనీ ప్రచారం చేస్తుంటరు సవర్ణ ప్రొఫెసర్లు. విద్యార్థుల భవిష్యత్తుని శూన్యం చేసే అసహనాలే రాజ్యమేలుతుంటయి. ఇవన్నీ కులం కారణంగా వీరి పట్లనే జరుగుతుంటయి. వీటన్నింటితో పాటు వచ్చే స్కాలర్‌షిప్‌లను నిలిపేసే వేధింపులు అదనం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకిచ్చే రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌ని ఎస్సీ పరిశోధక విద్యార్థులకు మాత్రమే మూడు సంవత్సరాల్నుంచి కారణం లేకుండా దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో నిలిపేశారు. యూనివర్శిటీల్లో అగ్రహార వ్యవస్థలు సమానత్వ భావనలు సాటి మనుషుల పట్ల లేకపోవడం వల్లనే ఈ వివక్షలు.