పౌరులుగా మన బాధ్యతేంటి – కొండవీటి సత్యవతి 

నిన్న రాత్రి హెల్ప్‌లైన్‌కి ఒక కాల్‌ వచ్చింది. ఒక వర్కింగ్‌ ఉమన్‌ హాస్టల్‌లో ఉంటున్న ఒకమ్మాయి ఇలా చెప్పింది. ”మేము ఆఫీసులు ముగించుకుని హాస్టల్‌కి వచ్చేసరికి 6 గంటలు, ఒక్కోసారి ఇంకా ఆలస్యమవుతుంది. బస్సులు దొరక్క, ట్రాఫిక్‌ జాంలు… ఇలా చాలా కారణాలతో లేటయిపోతుంది. మెయిన్‌ రోడ్డు నుండి హాస్టల్‌ వరకు వెళ్ళాలంటే చీకటిలో నడిచి వెళ్ళాలి. రోడ్లకు అటు ఇటు పిచ్చి మొక్కలు మొలిచి చిట్టడవిలాగా ఉంటుంది. మేము ఆ చీకటిలో నడిచి వెళ్తుంటే పోకిరీలు మా వెంటపడడం, బళ్ళడ్లమీద రాసుకుంటూ, మమ్మల్ని ముట్టుకుంటూ వెళుతుంటారు. నా ఫ్రెండ్‌కి చాలా ఘోరమైన అవమానం ఎదురైంది. తన బ్రెస్ట్‌ని టచ్‌ చేసి వేగంగా వెళ్ళిపోయారు. మేము ఎవరికీ చెప్పుకోలేక చాలా బాధపడుతున్నాము. ఎప్పుడైనా, ఏదైనా వస్తువు అవసరమై దగ్గరే ఉన్న షాప్‌కి వెళ్ళినా కామెంట్స్‌ చేయడం, హాస్టల్‌దాకా నడిచి రావడం. మాకు చాలా భయంగా ఉంది. ఎక్కడో పల్లెల నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మా వాళ్ళకు చెబితే ఉద్యోగం మానేసి వచ్చేయమంటున్నారు. మాకు ఏదైనా సహాయం చేయండి”. ఇదీ ఆ కాల్‌ సారాంశం.

ఈ రోజు ఉదయం నేను వాళ్ళు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి చూసాను. భయానకంగా ఉంది. విద్యుత్‌ స్తంభాలున్నాయి కానీ బల్బులు లేవు. రోడ్డుకు అటు ఇటు పిచ్చి మొక్కల పొదలు… ఖాళీ ప్లాట్లలో అంతెత్తు ఎదిగిన ఆముదం, తదితర చెట్లు. అల్లరి మూక అమ్మాయిలను ఆ పొదల్లోకి గుంజుకెళ్ళినా దిక్కు లేనట్టు ఉంది.

నేను వెంటనే షీ టీమ్స్‌కి ఫోన్‌ చేసి నేను తీసిన ఫోటోలు షేర్‌ చేసాను. వెంటనే ఆ ఏరియా షీ టీమ్స్‌ ఎస్సై ఫోన్‌ చేసి మూడు రోజులు మేమక్కడ నిఘా పెడతాం, ఆ తర్వాత అవేర్‌నెస్‌ ప్రోగ్రాం చేస్తాం, మీరూ రండి అని పిలిచారు.

సాయంత్రం అక్కడికి వెళ్ళారు, నాకు ఫోన్‌ చేశారు.

మన చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటివి మన కంట్లో పడితే వెంటనే షీ టీమ్స్‌కో, 100కో కాల్‌ చేస్తే అమ్మాయిలకు చాలా హెల్ప్‌ చేసినవాళ్ళమవుతాం. మన ప్రాంతాలను సేఫ్టీ ఆడిట్‌ చేయగలగితే… ఎక్కడ లైట్లు లేవు, ఎక్కడ పోకిరీలు గుంపులుగా కూర్చుని మహిళలని, అమ్మాయిలని ఇబ్బంది పెడుతున్నారు, నిర్మానుష్య ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసు గస్తీ తిరిగేలా ప్రయత్నించడం… పౌరులుగా మన బాధ్యత కాదా? ఇంకొక కాల్‌లో ఒకమ్మాయి ‘నేను రోజూ బస్సులో కాలేజీకి వెళ్తాను. బస్సు దిగాక చాలా దూరం నడవాలి. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ దారి మధ్యలో ఆకతాయిలు నా వెంటపడి అసహ్యకరమైన కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఫ్రెండ్స్‌ కలిసి వెళ్ళి వస్తుంటాం, కానీ కొన్నిసార్లు క్లాసులో ఆలస్యమై ఒక్కదాన్ని వస్తున్నపుడు వాళ్ళ ఆగడాలు మితిమీరుతుంటాయి. మా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌కి చెప్పినా లాభం లేకపోయింది. మా ఇంట్లో వాళ్ళకు చెబితే కాలేజి మానెయ్యమంటారని భయం. మీరు ఏమైనా హెల్ప్‌ చేయగలరా?’ అని దాదాపు ఏడుపు గొంతుతో అడిగింది. చెప్పిన కాలేజి నాకు తెలుసు. ఎప్పుడూ వెళ్ళలేదు. షీ టీమ్స్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌ ఫ్రెండ్‌ని తీసుకుని ఆ కాలేజీకి వెళ్ళాను. నిజంగానే ఆ దారి ఘోరంగా ఉంది. పక్కన ఒక చెరువుంది. అర కిలోమీటర్‌ దూరం నడిస్తేనే కాలేజి వస్తుంది. మేమిద్దరం వెళ్తూ చూసిందేమిటంటే రోడ్డుకు ఇరువైపులా అబ్బాయిలు బైకులాపి కాలేజీకి వస్తున్న అమ్మాయిల్ని వేధిస్తూ అల్లరి చేస్తున్నారు. ఒకరిద్దరు అమ్మాయిల్ని ఆపి అడిగాం. ‘రోజూ ఇంతేనండి వీళ్ళు, మా కాలేజి వాళ్ళు కాదు. ఎక్కడినుంచి వస్తారో తెలియదు. మొన్న ఒకమ్మాయికి చాలా దారుణమైన అనుభవమైంది. ఒకడు ప్యాంట్‌ జిప్పు విప్పి నిలబడ్డాడట. ఆమె చాలా భయపడిపోయింది. కాలేజీకి రావడం మానేసింది’ అంటూ ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. నా కానిస్టేబుల్‌ ఫ్రెండ్‌ వెంటనే షీ టీమ్స్‌కి ఫోన్‌ చేసి పిలిపించింది. అక్కడున్న వాళ్ళందరినీ పట్టుకుని పక్కనున్న పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు అక్కడే నిఘా వేస్తామని తను నాతో చెప్పింది.

మాకు ఫోన్‌ చేసిన అమ్మాయి చాలా సంతోషంగా ఇలా చెప్పింది, ‘మేడమ్‌, మీకు చాలా థాంక్స్‌. చాలాకాలంగా మేము పడుతున్న ఇబ్బందులు తొలగించారు. ఇప్పుడు హాయిగా ఏ బాధా లేకుండా నడవగలుగుతున్నాము. షీ టీమ్స్‌

వాళ్ళు మా కాలేజీకి వచ్చి అవగాహన కలిగించి ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ నంబర్‌కి ఫోన్‌ చెయ్యమని చెప్పారు. థాంక్యూ సో మచ్‌, అంది చాలా సంతోషంగా. ఈ పని కాలేజి వాళ్ళు చేసి ఉండొచ్చు, తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు, పౌరులుగా ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ చాలాసార్లు మనకెందుకులే అనే ఉదాసీనత, మన సమస్య కాదులే అనే భావన మన ఆడపిల్లలకి ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. మనం చాలాసార్లు సమస్యల చిట్టాని విప్పుతాం కానీ మనం ఏమి చెయ్యొచ్చు అనే ఆలోచన చెయ్యం. రోడ్ల మీద, బస్సుల్లో అమ్మాయిలని ఎవరైనా వేధిస్తుంటే సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. నాకెందుకులే అనే ధోరణి ఎక్కువగా

ఉంటుంది. ప్రతి బస్సులోకి పోలీసులొచ్చి రక్షించలేరు కదా! మన ఆడపిల్లలు కూడా బస్సుల్లో ప్రయాణించేటపుడు ఇలాంటి వేధింపులే ఎదుర్కొంటారు, తమలాగే ఎవ్వరూ వారి సాయానికి రారు అనే ఇంగితం కూడా ఉండదు. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాలలో మన పిల్లలు భద్రంగా, సురక్షితంగా ఉండాలని ఆలోచిస్తే, ప్రజల భాగస్వామ్యం ఉంటే మన ఆడపిల్లలు బయట సురక్షితంగా తిరగగలుగుతారు.

మేము, షీ టీమ్స్‌ అఫెండర్స్‌కి కౌన్సిలింగ్‌ చేసేటప్పుడు వాళ్ళు రోడ్లమీద, కాలేజీల ముందు, బస్టాపుల్లో ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుంటారో వీడియోల్లో చూస్తుంటాం. వాళ్ళ అల్లరి, అసభ్యకరమైన కామెంట్లు, అమ్మాయిల చుట్టూ బైకులేసుకుని వాళ్ళు తిరుగుతుంటే కూడా ఎవ్వరూ పట్టించుకోని దృశ్యాలు చూసి మేము చాలా ఆశ్చర్యపోతుంటాం.

పౌరులుగా మన బాధ్యతని మనం మర్చిపోవడం వల్లనే ఈ రోజు మన ఆడపిల్లలు ఇంటి గడప దాటగానే బయట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళి చదువుకునే అమ్మాయిల కష్టాలకు అంతే

ఉండదు, సరైన రవాణా సదుపాయముండదు. షేర్‌ ఆటోలు సురక్షితం కాదు. నడిచి వెళ్ళే దారుల్లో లైట్లుండవు, పిచ్చి పొదల్లాంటివి పెరగడంతో పాటు ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండడం వల్ల అమ్మాయిల మీద లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయి. తమ ఊరి ఆడపిల్లలు సురక్షితంగా స్కూల్‌కో, కాలేజీకో వెళ్ళి రావడానికి తగిన ఏర్పాట్లు చేయడం ఆ ఊరి బాధ్యత కాదా? ఊళ్ళో అందరూ పూనుకుంటే ఈ పని చెయ్యలేరా?

హాజీపూర్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. తమ ఊరి ఆడపిల్లలు లైట్లు, బస్సులు లేని నిర్మానుష్య రోడ్లమీద నడుచుకుంటూ చదువుకోవడానికి వెళ్తున్నారని తెలుసు. ఈవిషయాన్ని సీరియస్‌గా పట్టించుకుని ఉంటే ముక్కుపచ్చలారని ముగ్గురు ఆడపిల్లలు దారుణమైన లైంగిక హింసకి గురై, బావుల్లో శవాలై తేలేవాళ్ళు కాదు. ఈ దుస్సంఘటన జరిగిన హాజీపూర్‌ గ్రామానికి వెళ్ళినపుడు బ్రహ్మ జెముళ్ళ పొదలతో, వదిలేసిన వ్యవసాయ బావులతో, మనిషి జాడ కనిపించని ఆ దారిలో ముగ్గురు అమ్మాయిలు భయానక హింసకి గురై మరణించిన బావులను చూసినపుడు నా గుండె చెరువైపోయింది. వారం రోజులపాటు ఆ దృశ్యాలు కళ్ళల్లోంచి కదలలేదు.

తమ ఊళ్ళో ఆడుతూ, పాడుతూ తిరిగిన ముగ్గురాడపిల్లల మరణాలకు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో, ఊరి వాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంది. మరణించిన మా పిల్లలకు న్యాయం చేయండి అని ఇప్పుడడుగుతున్నారే తప్ప వాళ్ళు బతికున్నపుడు మా ఊరికి బస్సు నడపండి, లైట్లు వేయండి అని అడగలేకపోయారెందుకు?

ఆ బ్రహ్మ జెముళ్ళ పొదల్ని నరికి, ఆ బావుల మీద ఓ కన్నేసి ఉంటే ఆ పిల్లలు బతికేవాళ్ళు కాదా?

సో… పోలీసులు చేసే పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేయాలి. నిజమే, మరి పౌరులుగా మనమేం చెయ్యాలి, మన బాధ్యతేంటి???

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.