కొండ పొలం చదివాను.
కొత్త సంవత్సరం తొలి రోజు వెయ్యి గొర్లను నల్లమల కొండల్లోకి తిండి కోసం తోలుకెళ్ళిన గొర్ల కాపరులతో కలిసి నేనూ నల్లమల అడవిలోకి వెళుతున్నాను. తిరిగొచ్చాక నా అనుభవాలు రాస్తాను అని రాశాను. నిన్ననే ఆ కొండల్లోంచి బయటకు వచ్చాను.
పుల్లయ్య తాత, గురప్ప రవి, అంకయ్య, భాస్కర్ ఇంకా చాలామందితో కలిసి ఆ కొండల్లో, ఆ అడవి గర్భంలో, ఆకుపచ్చ లోయల్లో తిరుగుతున్నట్లే ఉంది. పులులు, కొండ చిలువలు, లేళ్ళు, దుప్పులు, అడవి పందులు… ఇవన్నీ నా చుట్టూ తిరుగుతున్నట్లే ఉంది.
పొద చాటు నుండి పెద్ద నక్క కోరలు బయటపెట్టి బెదిరిస్తూనే ఉంది. అడవిని ప్రేమించే నేను చాలాసార్లు అడవిలో తప్పిపోయాను. మళ్ళీ వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళతో కలిసి కూర్చుని గట్టిబడిన రొట్టెని కొరుక్కుని తింటున్నట్లు ఉంది.
అడవిలో దొరికే అన్ని పళ్ళని కోసుకు తింటూ, సెలయేళ్ళలో నీళ్ళను తాగుతూ గొర్రలెంబడి గుట్టలెక్కుతున్నట్టే ఉంది. కేవలం తమ గొర్రెలకు తిండి, నీళ్ళ కోసమే భీతావహమైన అడవిదారుల్లో తమ తిండి గురించి కానీ, తమ స్నానం గురించి కానీ, తమ నిద్ర గురించి కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా 50 రోజుల వనవాసం చేసిన ఆ గొర్లె కాపర్లందరికీ, కిలోమీటర్ల కొద్దీ నడిచిన ఆ పాదాలకు నమస్కరించాలనిపించింది.
పుల్లయ్య చెప్పే అడవికి సంబంధించిన నియమ నిబంధనలు, అడవిని ఎంత గౌరవంగా, ప్రేమగా చూడాలో చెప్పిన సందర్భాలు, పులులను ఎలా చూడాలో, వాటి ఆకలిని ఎలా అర్థం చేసుకోవాలో, వాటికి పుల్లరి ఎందుకు కట్టాలో వివరంగా చెప్పినప్పుడు అడవి న్యాయం అర్థమౌతుంది.
కసుగాయలాంటి పిల్లాడు రవి తొలిసారి కొండపొలం వెళ్ళి భయాల్లోంచి, బీభత్సమైన అనుభవాల్లోంచి అడవిని అర్థం చేసుకున్న తీరుని సన్నపురెడ్డి గారు అద్భుతంగా ఆవిష్కరించారు.
వాన పడకముందు ‘అడవంటే నెత్తిని మాడ్చే ఎండ అని, అంతులేని దప్పిక అనీ అనుకున్నాడు నిన్నటిదాకా’.’కాదు. మాకూ సువాసన నీడల్ని విప్పే గొడుగులున్నాయని, కరిగి వరదలయ్యే గుణముందనీ చెబుతూ ఉంది అడవి. మాకూ ఒక భరోసా ఇచ్చే హరిత తత్వముందనీ, బతుకు దారి చూపించే జలసిరి ఉందని చెబుతూ ఉంది అడవి”.
ఇలా రవికి బతుకు పాఠాలు నేర్పింది అడవి. యాభై రోజుల తన సహవాసంలో రవి వ్యక్తిత్వాన్ని సమూలంగా మార్చేసింది అడవి. అతడు ఒక కృత్రిమమైన, యాంత్రికమైన జీవితం నుంచి బయటపడి అడవితో కొనసాగే జీవితాన్ని ఎంచుకునే లాగా తయారుచేసింది. నవల చివరి అధ్యాయం వరకూ ఒకలాంటి మత్తు, అదీ అడవి కల్పించిన మత్తులో చదువుతున్నప్పుడు హఠాత్తుగా ఒక కృత్రిమమైన ముగింపు కొంచెం ఇబ్బంది పెట్టింది.
అడవిని రక్షించాలనే లక్ష్యంతో రవి అటవీ అధికారైన వైనం కొంత నాటకీయంగా, సినిమాటిక్‌గా అనిపించింది. విథ్వంసమవుతున్న అడవులు, ఆదివాసీల్ని అడవుల్నించి వెళ్ళగొట్టాలని జరుగుతున్న ప్రయత్నాలు, ముఖ్యంగా నల్లమలని ధ్వంసం చేసి యురేనియం తవ్వాలనే ప్రయత్నాలు… వీటి చుట్టూ కొంత కథ నడిపి ముగిస్తే ఇంకా బావుండేదని నాకు బలంగా అనిపించింది. కథానాయకుడిగా రవి ఎదిగిన తీరు, అడవి అతనికి నేర్పిన పాఠాలు అపురూపమైనవి.
ఉద్యోగంతో కాకుండా ఉద్యమంతో, పర్యావరణ ఉద్యమంతో ముడివేసి ముగిస్తే బావుండేదని నేను అనుకున్నాను. ఆయన ముగింపు తప్పని అనడం లేదు. గొర్రెల కాపరుల జీవితాలను జీవించి, వారి జీవన శైలుల్ని, వారి భాషనూ, యాసనూ గొప్పగా పట్టుకుని మనకు నవలా రూపంలో అందించిన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారికి అభినందనలు, హృదయ పూర్వక నమస్కారాలు.
అడవితో ఆకాశం, వెన్నెలని ఎన్నో చోట్ల చాలా హృద్యంగా, అందంగా వర్ణించారు.
అడవిలో ఆకాశాన్ని, చుక్కల్ని, పూర్ఱ చంద్రుడిని, పున్నమి వెన్నెలని ఎన్నెన్ని అనుభూతులతో వీక్షించానో.
ఆకాశంలో మెరిసే చుక్కల గురించి ‘ఉతికి ఆరేసిన నీలి రంగు ముత్యంలా ఎంత అందంగా ఉందని ఆకాశం’.
‘కొండకు పడమటి వైపు లోయ నిండా వెన్నెల రాశులు ఉన్నాయి. ఒక్క మేఘపు తునక కూడా అడ్డు రాపోవడం వలన నిరంతరాయంగా వెన్నెల కురుస్తూనే ఉంది’.
అందరం చదవాల్సిన పుస్తకం ఇది.