అదే నీవు అదే నేను -శైలజ కాళ్ళకూరి

 

ఆఫీసులో ల్యాండ్‌ లైన్‌ మోగింది. యధాలాపంగా ఎత్తి ”హలో! జానకి సిమెంట్స్‌” అన్నాను.

”యా! నా పేరు జానకే! కానీ నన్ను ఎవరో జానకీ, నా జానూ… అనేవారు” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి, స్వరం ఆగిపోయి ప్రాణం అత్యంత వేగంగా ఆ తీగల వెంబడి దొర్లిపోయింది. ఆమె నవ్వు చేసే అలికిడి అలల్లో 12 సంవత్సరాలు వెనక్కి. ”ఓయ్‌! మహీ! మహీ! ఓయ్‌” అని రెట్టిస్తున్న ఆ కంఠస్వరానికి ఏం బదులు ఇవ్వాలో తెలీక, ”ఆ! యా! ఆ… నేను…” అంటూ తడబడ్డాను. ”ఫర్లేదు! ఇంకా ఈ నాలుగు పదుల వయస్సుకి నిన్ను ఎవరూ ఏమీ అడగరు. హలో! ఇలలోకి రావయ్యా బాబూ! ప్రజెంటెన్స్‌కి రా” నవ్వు వినబడుతోంది మళ్ళీ అట్నుంచి. తను నా మనసును తీసి బావి దగ్గర బాల్చీ నీళ్ళల్లో ఝాడిస్తున్నట్లుగా ఉంది.

”జానకీ!” భారంగా అన్నాను. ”సరే! మహీ! ఓ పూట సెలవు… మీ ఎం.డీ.ని నేను అడగనా? నువ్వు అడుగుతావా? ఏంటి? ఓ పూట హైదరాబాద్‌ వస్తావా? ట్యాంక్‌బండ్‌ దగ్గరికి!” ఆమె కంఠంలో రెట్టింపు చిలిపిదనం. ఏదో చెప్పాను. తారీఖు, సమయం చెప్పి, ”మళ్ళీ రిమైండ్‌ చెయ్యనా? నోట్‌ చేసుకుంటావా?” తనేమన్నా ఫరవాలేదు. అసలు నాతో మాట్లాడడమే చాలు. ”ఆహా! నేను… వస్తాను” బదులిచ్చాను.

ఫోన్‌ పెట్టేసింది జానకి.

జానకి, సీత, మైథిలి, భూమిజ… ఎన్ని రకాలుగా పిలిచేవాడిని. తెల్లని ముఖానికి చైనా అమ్మాయిలా రెండు చిన్న కళ్ళు, నవ్వుతో విరిసే పెదాలు. ఆ మోము మరచిపోయేదా?!!

కాలేజీలో వెనక బెంచీలో కూర్చుని పక్కవాళ్ళను దాటించి, వెనక్కి వంగి చూపులతో అమ్మాయిల వైపు నేను, అబ్బాయిల వైపు తాను, ఏదో ఒక క్షణంలో కళ్ళారా చూసుకునే ఆ క్షణాలు… ఇంద్రధనుస్సుకు అటు, ఇటు మేమిద్దరం నిలబడి ఎక్కుతున్నట్లు… గత జన్మలో జరిగిందిప్పుడు తలచుకుంటే. లేచి, క్యాంటీన్‌ వైపు నడిచాను. అదీ మా కాలేజి క్యాంటీన్‌కే!

లంగా-ఓణిలో తాను, నాలుగు అడుగులు దూరంగా నేను… ఒకరినొకరు అనుసరిస్తూ అలా రైలు పట్టాలవైపు నడిచి వెళ్ళడం… గాలికి చెదురుతున్న క్రాఫ్‌తో నేను, ఎగిరే పైటను బిగించుకుని తను, తన పుస్తకాలు నేను మోస్తానని చేయి చాపడం, ‘హమ్మయ్య’ అని అందించి తను… ఇద్దరం రైలు పట్టాలకు అటు ఇటు నడిచి.. వెళ్ళి వెళ్ళి… ఎప్పుడైనా పట్టాలమీద పనిచేసే వారితో కబుర్లాడి… ఏదో కూనిరాగం… ”కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి… అసలా పాట ఏంటి? వెన్నెల పైట ఎలా?” అని తను అడగడం, తెలియనట్లు! నేనేమో చాలా సిన్సియర్‌గా ప్రతి పదానికి అర్థం చెప్పడం, నాకు తెలుసన్నట్టు!

‘పాట పాడు మహీ’ అనగానే గుండెలో విచిత్రమైన పొంగు… ”మదనసుందా…రి, మదన సుందారి..” అంటూ ‘రంగుల కల’ లో పాట పాడుతూ నేను గొంతు హెచ్చించి ఎదురొచ్చే గాలికి దీటుగా దమ్ము నిలబెట్టి పాడుతూ…”దొరగాడు కాసే” వాక్యం మానేయడం…”అరే! దొర లైన్‌ మరచిపోయావు!” అనేది జానకి. నేను ”అది వద్దులే”, ”బాగుంది! దొరా, దొర కొడుకు చూసినా పాట పాడితేనే చెలికాడు”. జానకి నన్ను ఉడికించడం.

కనుకొలకలు ముడతలు పడి, ఎర్రగా మండిపోతూ వచ్చినప్పుడల్లా, ”ఎందుకో అంత కష్టం! రాత్రి పడుకున్నావా?” అని జానకి గదమాయిస్తే, ”తెల్లవారితే ఓ సారి నిన్ను చూసి, మన కెమిస్ట్రీ క్లాసులో, ఇంగ్లీషు క్లాసులో పడుకుంటానుగా” అని నేను సర్ది చెప్పేవాడిని.

నాన్నకు సుస్తీ చేయడంతో అమ్మ, అక్క ఉన్న కుటుంబ పోషణ కోసం కర్రల అడితిలో నైట్‌ డ్యూటీ చేసేవాడ్ని. స్టాకు లారీలు వచ్చినా, వెళ్ళినా నిద్ర ఉండదు.

ఉదయం పూట డిగ్రీ వెలగబెట్టడం, సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది దాకా ట్యూషన్లు, తర్వాత నైట్‌డ్యూటీ. మళ్ళీ అదే… మళ్ళీ, మళ్ళీ అదే. జానకి కోసమే కాలేజికి వెళ్తున్నానన్నట్లుగా ఉండేది. సున్నుండో, పులిహోరో తను తెచ్చిస్తే మహా ప్రసాదంగా తీసుకునే పరమ భక్తుడిని నేను. ”నీలా నేను వaతీఅ షష్ట్రఱశ్రీవ వశీబ శ్రీవaతీఅ కాదు. ఒకటే మంచి ఉద్యోగం చేస్తాను. నాకైతే బాటనీలో పి.హెచ్‌.డి. చేయాలని ఉంది. ఇన్ని రకాల ఆకులు, మొక్కలు… వీటికన్నా చదవాల్సింది ఇంకేముంది అనిపిస్తుంది.” స్పష్టంగా చెప్పేది జానకి.

ఆరంభంలోనే కాస్త ఖాళీ ప్రదేశంతో ఓ ఇల్లు, పూల మొక్కల వరుసలు, రెండు పూటలా పాటలు, ముగ్గులు… మా భవిష్యత్తు ఏదో ఒక నిలువెత్తు చిత్రపటంలా కనబడేది నా మూగమనసుకు కలలో.

డిగ్రీ ఆఖరు సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు ‘తెలిసిన అబ్బాయి’ అంటూ సంబంధం కుదిర్చేస్తానన్నారు. జానకి మా ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఏదో సిమెంట్‌ ఫ్యాక్టరీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. ముగ్గురు ఆడపిల్లలలో జానకి మొదటి పిల్ల.

ముందు గదిలో కూర్చున్న జానకికి గ్లాసులో నిమ్మరసం పట్టుకుని వచ్చి అమ్మ, ”అంతా బాగుందమ్మా! నువ్వు నాకు నచ్చావు. కానీ, ఇంకో రెండేళ్ళు మహీధర్‌ మాకు కావాలి. వాళ్ళ అక్కకి సంబంధాలు చూస్తున్నాం. ఆ తర్వాతే వీడికి. మళ్ళీ వారం మహికి ఒడుగు చేస్తున్నాం. నువ్వు కూడా రామ్మా!” నిక్కచ్చిగా చెప్పిన అమ్మ మాటలు మా ఇద్దరికీ కళ్ళాలు వేశాయి.

జానకి ఇంట్లో దెబ్బలాడి మరీ ఉస్మానియా యూనివర్శిటీలో పీజీలో చేరింది. అప్పట్లో ఆమె రాసిన ఉత్తరాలే ఊపిరిగా బతికాను. సుందర స్వప్నం నేలపై ఎలా నిజం చెయ్యాలో చెప్పేది తను. వెన్నెల మబ్బుల్లో వెండి మెరుపులా ఆమె ప్రణాళికలన్నీ చూడడమే నా పని. ఏడాదిలో నేనేం చేయాలో, తానేం చేస్తుందో, ఒక క్యాలెండర్‌ వేసి మరీ చెప్పేది. అమ్మాయిలు తమ వయస్సు అబ్బాయిలకన్నా పరిణతిలో ముందుంటారు అన్నమాట ఇప్పుడు తెలుస్తోంది. రోజువారీ శ్రమలో, దిగులులో, జానకి ఒక అందమైన వర్ణం. ఆ రోజు ఆ రంగులో మనసును ముంచి ఓ బుడగలా గాలిలో ఎగరేయడమే తప్ప నాకింకేం తెలిసేది కాదు. రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. తన పరీక్షలయి వచ్చింది జానకి. నన్ను కలిసింది. అదే రైలు పట్టాలు. అక్కడ ఉన్న ఒక సిమెంటు తిన్నె మీద కూర్చున్నాక , ”మనిద్దరం ఇంక పెళ్ళి చేసుకుందామా మహీ!” అంది. అందులో కొంచెం నిరాశ, కాస్త విసుగు కనబడ్డాయి, కాదు వినబడ్డాయి.

”అరె! ఎప్పుడూ ఇదే ప్రశ్నేనా?” అన్నాన్నేను.

”మరి, ఇంకేమిటి? చెప్పు. నాన్నగారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఇక ఇంతకన్నా నావల్ల కాదు. అసలే నాన్నగారికి నిజామాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా ఉంది. ఆర్డర్స్‌ పెండింగ్‌. నేనిక వరంగల్‌ రాలేనేమో మహీ!” నేను ఆలోచిస్తున్నాను. మా నాన్నగారు చనిపోయి ఏడాదయింది. అక్క ప్రసవానికి ఇంటికి వచ్చింది. నేనొక మెయిన్‌ జాబ్‌, రెండు పార్ట్‌టైం జాబ్‌లు చేస్తూనే ఉన్నాను. ఈసారి నేనే, ”ఇంకొక ఆరు నెలలూ” అన్నాను. ”మహీ! ఆరు నెలల తర్వాత ఓయూ హాస్టల్‌ రూం నెంబర్‌ 32. అది జూన్‌ 20, శనివారం. ఆ తర్వాత…” సుమారుగా హెచ్చరించింది.

అక్కకి బాబు పుట్టాడు. ప్రసవ సమయంలో ఫిట్స్‌ వచ్చాయి. ఒక పక్క వైద్యం. మరో పక్కన వాళ్ళ అత్తగారి సూటిపోటి మాటలు. ఓ 3 నెలలు ఉఫ్‌మని గడిచిపోయాయి.

నిస్సహాయుడిని నేను. పరిస్థితులకు బందీని.

కాదు… నాకు తెగువ లేదు.

ఉహు… నాకు భయం.

అమ్మ… కుటుంబం.. కట్టుబాట్లు… ఎన్నయినా కారణాలు… అవన్నీ వంకలు.

అది నాకు లోలోపల తెలుసు. మహీధర్‌… పిరికివాడు. పైకి బుద్ధిమంతుడు.

కాలం పరుగులో ఆరు నెలలు గడిచిపోయాయి. అక్క కోలుకుంది. కాపురానికి పంపాం. ఊపిరి పీల్చుకున్నాం. అమ్మ మాటమీద ఎం.బి.ఎ.లో చేరాను. మళ్ళీ కాలేజీలో బెంచీ మీద కూర్చుంటే జానకి గుర్తొచ్చింది. ఒక బలమైన క్షణంలో గడువు దాటిందని తెలిసినా రాత్రి బస్‌కి వెళ్ళాను, హైదరాబాద్‌కి.

”జానకా? తను జూన్‌ నెలాఖరికి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మీకు తెలియదా? తనకు పెళ్ళి అయిపోయింది. ఎవరో అమెరికా కుర్రాడు” హాస్టల్‌లో చెప్పారు.

అయిపోయింది. అంతా అయిపోయింది. జానకి వెళ్ళిపోయింది. భారంగా ఇంటికొచ్చి అమ్మకి చెప్పాను. మరో రెండేళ్ళకి నా పెళ్ళి. ఇంకో నాలుగేళ్ళలో ఉద్యోగం. జీవితం ఓ చక్కని దారిలోకి వచ్చేసింది. సరోజ అదృష్టం అన్నారందరూ.

కంపెనీ ప్రారంభపు రోజులలో ముభావంగా ఉన్నా, ఆ మధ్య హైదరాబాద్‌లో, తర్వాత బెంగుళూరులో ట్రైనింగ్‌ కోర్సులకు వెళ్ళాను. ఆ తర్వాత నాలో కూడా మార్పు. మరీ అంత సైలెంటుగా

ఉండడం లేదు. నలుగురితో కలుస్తున్నాను.

అమ్మ మేమున్న సిటీకి రాలేదు. నేను, నా భార్య, పాప… అప్పుడప్పుడూ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుంటాం. సౌకర్యాలతో, సాదాసీదాగా బ్రతుకుతూ, సంతృప్తితో, నా సంసారం సాగిపోతోంది.

ఇప్పుడిప్పుడే కాస్త కంపెనీ యాజమాన్యానికి, పనివాళ్ళకి మధ్య మంచి సంబంధాలను నెలకొల్పగలిగే హెచ్‌.ఆర్‌. మేనేజర్‌ కం కౌన్సిలర్‌గా కూడా నేనో కొత్త అవతారం ఎత్తాను. మా కంపెనీ కూడా శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది.

మళ్ళీ ఇన్నాళ్ళకు, జానకి…!

… … …

కుమార్‌ వచ్చాడో, సీట్‌లో ఉన్నాడో ఏంటో చూడాలి. ఈ వీకెండ్‌ నేను హైదరాబాద్‌ వెళ్ళాలంటే కుమార్‌ కాస్త అలర్ట్‌గా ఉండాలి. అతని క్యూబికల్‌ దగ్గరకెళ్ళాను. కొంచెం దూరంగా ఫోన్‌ మాట్లాడుతున్నాడు, వీడియో కాల్‌లా ఉంది. నన్ను ఆగమని ఒక వేలితో చూపిస్తూ ఒక్క నిమిషం అని సైగచేసి త్వరగానే వచ్చాడు.

”హాయ్‌ సర్‌! వాట్స్‌ అప్‌!” అన్నాడు. ”సోమవారం వస్తాను. ఈ వీకెండ్‌ కాల్‌ ఉంటే నువ్వూ…” ఇంకా ముగించకుండానే ”ఫరవాలేదు. ఐ విల్‌ మేనేజ్‌! యు నో. అన్నీ సార్ట్‌ ఔట్‌ చేశాను. మహీ సర్‌! నిర్మొహమాటంగా అమ్మ, నాన్నతోను, ఒపెన్‌గా మంజుతోను మాట్లాడాను. ఇప్పుడందరూ ఒకరితో ఒకరు కలుస్తున్నారు. అంతా సరిగ్గా అయితే మంచిది. ఒకవేళ సరిపోకపోయినా… నా వంతు నేను ప్రయత్నించిన తృప్తితో ఉంటాను. నా మూడ్‌ పాడవదు. గ్యారంటీ”. హాయిగా నవ్వుకున్నాం. నేను లేచాను నా ఛాంబర్‌ వైపు…

”మహీ సర్‌! థాంక్యూ…” అన్నమాట హుషారుగా వినబడింది. హాయైన ఆనందపు ఈలపాట పెదవులపైకి అప్రయత్నంగా వచ్చింది.

… … … కుమార్‌ తన జూనియర్‌ కొలీగ్‌. అవడానికి తెలివైనవాడు. కానీ ఏం లోపల లేనట్టు ముభావంగా, చెప్పాలంటే అభావంగా ఉంటాడు. గత నెల తనకూ, కుమార్‌కూ కాసేపు భేటీ పడింది. ఇంటరెస్టింగ్‌ ఫెలో…

”కుమార్‌! బ్రేక్‌ఫాస్ట్‌ అయిందా”. ”ఏం సార్‌ మీరు పెడతారా?”

”పెడితే తప్పేముంది?”

”ఉద్యోగం కాక స్నాక్‌ సెంటర్‌ కూడా ఓపెన్‌ చేస్తారా” అతని మాటలకు నిజంగా నవ్వొచ్చింది.

”అది లాభసాటి అయితే అదే చేద్దాం” అంటూ అతని సిస్టమ్‌ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను.

”రాత్రి ఏం చేశావు?” లాలనగా అడిగాను. కుమార్‌ తల అడ్డంగా ఊపి, ”నిద్రయితే సరిగ్గా పట్టలేదు. ఏదో ప్రైమ్‌ సిరీస్‌… చూస్తూ…” భుజాలెగరేశాడు.”చూడు నీలో నీవు మధనపడితే తేలనిదే ప్రేమ. దాన్ని సంఘానికి ఆమోదయోగ్యం చేసి, ఒక పద్ధతిగా నడిపేదే పెళ్ళి. నువ్వు ఎక్కడ డిలే చేస్తున్నావో… నాతోనైనా మాట్లాడవచ్చుగా?” అన్నాను.

”సర్‌! పెండింగ్‌ పనుల గురించే బోర్‌ కొట్టిస్తారనుకుంటే, పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌ కూడా వదలరా” చిరాకు, వ్యంగ్యం కలిపి అన్నాడు. ”హేయ్‌! నో. నీకు లైఫ్‌లో కూడా కాస్త సీనియర్‌ని కదా అని, పోనీ అలా అయితే మాట్లాడవద్దులే.”

”మహీ సర్‌! అదేంకాదు. ఎవరూ ఎవర్నీ అర్థం చేసుకోరే? అదే నా బాధ”.

మళ్ళీ కూర్చుంటే ఒక నవ్వు నవ్వాను. ”ఎవరినైనా కన్విన్స్‌ చేయకూడదు. మన ఆలోచన లోపలే దాచుకోకుండా మరో మనిషితో కలిసి డిస్కస్‌ చేయాలి కుమార్‌. నీ ఆశలో పక్కవారి ఆశ కలగలిసి

ఉందంటేనే ఇద్దరు పార్టనర్స్‌ అవుతారు”.

”కాకపోతే…?”

”అప్పుడు విడిగా ప్రయాణించాలి. కానీ నిష్టూరాలు, నిందలు అనే బురద పూసుకోకూడదు.”

”సరే నిందించం. కానీ హార్డ్‌ ఫీలింగ్స్‌ ఉండిపోతాయేమో మాస్టారూ…” సందేహంగా అన్నాడు కుమార్‌.

”నో… నీ ప్రయత్నం పాజిటివ్‌గా ఉండాలి. జీవితం పెద్దది. అందులో ఐదేళ్ళకోసం జీవితకాలపు కాంప్రమైజ్‌ ఎంచుకోకు. కుదరనపుడు సర్దుకో అంతేకానీ అణిగిపోకు” లేచాడు మహీధర్‌.

”మీకివెలా తెలుసు?”

అతని భుజంపై చెయ్యి వేశాను. ”ఒక్కో అనుభవం స్వయంగా చూస్తేనే తెలిసేది. నేనేం బయాస్డ్‌గా చెప్పట్లేదు. ఏ బరువులూ ఎత్తుకోకు. అలా అని బాధ్యతలు వదిలేయకు. నీ డెయిలీ రొటీన్‌ పాడవకుండా ఉంటేనే నీ స్వేచ్ఛ. అది కానిదంతా…”

”… అనవసరపు బరువే” అన్నాడు కుమార్‌.

”పచ్చి నిజం చెప్పావు”.

… … …

బస్సెక్కి హైదరాబాద్‌ వచ్చేసరికి మూడవుతోంది. దగ్గర్లో హోటల్‌కెళ్ళి దోశ తిని, కాఫీ తాగి రిలాక్స్‌ అయ్యాను. ఐదవుతుండగా లిబర్టీ దగ్గర బస్‌ దిగి నడుచుకుంటూ వెళ్ళాను. అంబేద్కర్‌ విగ్రహం, ట్రాఫిక్‌ తప్పించుకుంటూ ట్యాంక్‌బండ్‌ చేరాను.

ఏ మాత్రం ఛాయ తగ్గని రూపం. చిరునవ్వు నిండిన కళ్ళు ఫ్యాషనబుల్‌ కళ్ళజోడు లోంచి మిలమిల మెరుస్తున్నాయి.

జానకి ఎదురైతే, ఒక్కసారిగా నాకేం చేయాలో తెలియలేదు.

కాస్త ఒళ్ళు చేసింది. ఆరోగ్యంగా ఉంది. సెకండ్‌ చిన్‌ తయారయింది. నీలం రంగు పట్టుచీర మీద లేత పసుపు పచ్చని బ్లౌజు. ఏదో పెద్ద జ్యువెలరీ షాప్‌ తాలూకు డిజైనర్‌ హారం. గూచి బ్యాగ్‌. సుతారమైన పెర్ఫ్యూమ్‌ వాసన. చెవులకు మెరిసే లోలాకులు… కడిగిన ముత్యంలా ఉంది జానకి.

చూపులు కలిసిన వెంటనే ముందుకొచ్చి, నా చెయ్యి లాగి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, గట్టిగా ఊపి, వదలకుండా నన్ను లాక్కెళ్ళి ”రా మహీ!” అంటూ ట్యాంక్‌బండ్‌ బెంచిమీద కూర్చోబెట్టింది. బాగా పెరిగిన ట్రాఫిక్‌. అస్తమిస్తున్న సూర్యుడు. ”ఫస్ట్‌…” అన్నాం ఇద్దరం ఒకేసారి. బాగా నవ్వుకున్నాం. నా గుండె తేలికపడింది. ఆప్యాయంగా నా చెయ్యిని వెనక్కి తిప్పి చూసింది. నా ముంజేతి మీద పచ్చబొట్టు… విల్లు! తడిమి, నవ్వి ”సరే, నేనే చెప్తాను” అంది. నేను మొహమాటంగా చెయ్యి వెనక్కి లాక్కుని, ”చెప్పు, వింటాను” అన్నాను. ”మహీ!” నా గొంతులో ఉసిరికాయ ప్రమాణంలో బరువు పైకి ఎగసి, కిందకి జారింది.

”నాన్న నాకు పెళ్ళి చేసి అమెరికా పంపించారు. నేను ఏడాది తిరిగేసరికి తల్లిని అయ్యాను. ఆ కాన్పు తర్వాత ‘బాలింత మాంద్యం (జూశీర్‌జూaత్‌ీబఎ జూరవషష్ట్రశీరఱర) అంటారు, అది వచ్చింది. ఒక ఆరునెలల పాటు నా భర్త, మా కజిన్‌… వాళ్ళక్కడే ఉంటారులే… కౌన్సిలర్‌ అమాండా… వీళ్ళందరి కృషితో, ప్రేమతో నేను మళ్ళీ మనిషినయ్యాను.

”ప్రతిరోజూ పురోగమన దృష్టితో ఆలోచించే నా మెదడే, ఆ ఆరు నెలల్లో చింపిన కాగితంలా అయిపోయింది. ఎంతో దృఢంగా ఉండే నన్ను, ఎన్నో భయాలు, అనుమానాలు అవరించాయి. బేలనైపోయాను. పుట్టిన బిడ్డను కూడా ఏదో దెయ్యంలా చూసేదాన్ని. తన పుట్టుకతో నా జీవితం పరాధీనం అయిపోయిందన్న తెలియని కోపం. నా భర్తపై అసహనం. చనిపోయిన వాళ్ళెవరో రోజూ కనిపించి, నన్ను కూడా రమ్మన్నట్లుగా అనిపించేది”, జానకి గొంతు జీరవోయింది.

”కానీ, అమాండా పర్యవేక్షణలో మా అన్నయ్య, వదిన, మా శ్రీవారు రమణ… నన్నెంతో బాగా చూసుకున్నారు. ఆ పాటికి ఈ దేశంలో ఉన్న మూఢనమ్మకాలకైతే తప్పకుండా నన్ను పిచ్చాసుపత్రిలో పడేసేవారు. పుట్టింటికి పంపడం, ‘మీ ఇంట్లో పిచ్చి ఉందా?’ లాంటి ప్రశ్నలు, ఒంటరితనం, చుట్టూ అమ్మలక్కలు, కేజీల కొలదీ మాత్రలు, రకరకాల శాంతులు… ఊపిరాడకుండా చేసి ఉండేవారు. అక్కడ వైద్యం మానసికశాస్త్ర నిపుణులు, హెల్ప్‌ గ్రూప్స్‌ ఇవన్నీ నన్ను అక్కున చేర్చుకుని నిదానంగా, సహనంగా… అటు మందులతో, ఇటు ఓర్పుతో… నా వీక్‌ పాయింట్‌ నుంచి, ఒక చిన్నపిల్లలా ఆదరించి,, షఱ్‌ష్ట్రశీబ్‌ తీబరష్ట్ర… ఆరోగ్యంవైపు అడుగులు వేయించారు. సరిగ్గా ఎనిమిది నెలలకు నా మరో నేను జన్మించింది”.

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జేబులోంచి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాను. ఎన్ని జరిగాయి?! గుండెలో ఏదో అపరాధ భావం తాడులా బిగబట్టింది. జానకి నిట్టూర్చింది. ”మహీ! నీకు తెలుసా? నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భయపడడం, బెరుకుతో మాట్లాడలేకపోవడం, పదుగురితో కలవలేకపోవడం… ఇవన్నీ చేతకాకపోవడం కాదు. నిన్ను అప్పట్లో నేను అలా అనే అనుకున్నాను. వంశపారంపర్యమూ కాదు.

ఒక్కో వ్యక్తికీ ఒక్కో మానసికమైన లోపం (ూఅaస్త్ర) ఉంటుంది. అది ఉందన్న విషయం వాళ్ళకే తెలియదు. కాస్త శాస్త్రీయంగా చూడాలి. తమ చుట్టూ జరిగే విషయాల వల్ల, సంఘటనల వల్ల వాళ్ళ మనసు లోపలి పొరల్లో మార్పులు, ఇవి ఒక వ్యక్తి బిహేవియర్‌కి కారణం. దాన్ని ఈసడింపుతో చూసి, ఒక పేరు పెట్టి విమర్శించడం, ‘ఇక నువ్వు పనికిరావు’ అని పక్కన పెట్టడం సరికాదు. వాటికి కారణాలు వెతకాలి. వాళ్ళ సుతిమెత్తని మనసును మరింత గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. ఏ మనసుకైనా కాస్త తోడ్పాటు, ప్రోత్సాహం ఇవ్వాలి. అసలైన ప్రేమ ఇదే.”

నేను కళ్ళార్పకుండా వింటున్నాను. ‘ఏ మేరే హమ్‌సఫర్‌… ఏక్‌ జరా ఇంతెజా…ర్‌” సూపర్‌ హిట్‌ హిందీ పాట వినబడసాగింది. పక్కన పార్క్‌ చేసిన ఒక కారులోంచి కుర్రాళ్ళు దిగి కబుర్లాడుకుంటున్నారు. మేం ఆ పాటని విన్నాం. ఇద్దరి ముఖాలపైనా చల్లని చిరునవ్వు. ”మజ్రూ సుల్తాన్‌ పురి” నెమ్మదిగా అన్నాను.

”ఫరవాలేదే” నవ్వింది నిండుగా జానకి.

నేనూ నవ్వాను హాయిగా. పాట అయ్యాక మొదలుపెట్టింది. ”నేను అదే చదువుకున్నాను. సైకాలజీ. కౌన్సిలింగ్‌లోకి అడుగుపెట్టాను. ఊ…” క్షణం ఆగింది. మళ్ళీ కొనసాగించింది. ”నీ పిరికితనం, నా అసంతృప్తి, మా కుటుంబ కట్టుబాట్లలోని అవివేకం… ఇవన్నీ వేసిన బలమైన ముద్రలను దాటి వెళ్ళాను. నా అనారోగ్యం నా బలహీనతలను బయటపెట్టింది. నిజజీవితంలో అరేబియన్‌, అట్లాంటిక్‌ అనే సముద్రాలను దాటితే, జీవితంలో శాస్త్రీయత, సహనం అనే కొత్త జలపాతాలను చూశాను ”అండర్‌ పెర్ఫార్మర్స్‌ కౌన్సిలింగ్‌” అనే కోర్సుని తయారుచేశాను.”

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను, ఎక్కడో విన్న పేరులా ఉంది అనుకున్నాను. నేను కంపెనీ ద్వారా చేసిన కోర్సు!

మీద పడుతున్న ముంగురులను సరిచేసుకుంటున్న జానకిలో కొత్తగా ఒక వెలుగు చూశాను.

”ఇవాళ, ప్రపంచంలో పదిమందిలో ఆరుగురు ముందుకు దూసుకుపోవచ్చు. కానీ ఆ వెనకబడిన నలుగురిలో ఇద్దరు ఆత్మహత్యకో, పర్వర్షన్‌కో మారిపోతే?! అందుకే కౌన్సిలింగ్‌ అవసరం. అలా మీ ఎం.డి. శ్రీకాంత్‌ పరిచయమయ్యారు! ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ నా ప్రయాణంలో ఒక కొత్త మలుపు. అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్‌కి వెళ్తూ, వస్తూ ఉంటాను. నిన్ను ట్రేస్‌ చేశాక నిన్నే ట్రెయిన్‌ చేయాలని పట్టుబట్టాను. ఆయన ఓకే అన్నారు. అదిలా మనం మళ్ళీ కలుసుకున్న కథ”.

జానకి, నా జాను… నా జీవితాన్ని ఎలా మార్చిందో!

జానకి నాకేసి చూసింది. రెండు భుజాలు కొంచెం ఎగరేసి, ”నో రిగ్రెట్స్‌, హౌ ఎబౌట్‌ యూ?” అమెరికన్‌ యాక్సెంట్‌ ధ్వనిస్తోంది. తల ఊపాను.

ఒక పక్క ఆలోచిస్తూనే… ”పిల్లలూ!” అన్నాన్నేను.

”ఇద్దరు. అనంత్‌… వాడికి వయొలిన్‌ ఇష్టం. అమ్మాయి మహతి… తనకు ట్రెక్కింగ్‌ ఇష్టం” మెరిసే కళ్ళతో చెప్పింది.

మౌనంగా కూర్చున్నాం. సూర్య కిరణాలు హుస్సేన్‌సాగర్‌ అలలపై తెరలుగా విస్తరిస్తున్నాయి. ఎవరో మురళి ఊదుతూ, వెదురు వేణువులను బుట్టలో పెట్టుకుని అమ్ముకుంటూ వెళ్తున్నారు. వేయించిన వేరుశనగల వాసన తాకుతోంది. దూరంగా బిర్లామందిర్‌ గోపురం మీద లైట్‌.

”ఇంకా??” అన్నది తను.

నిజమే నేను చెప్పాల్సినది మిగిలే ఉంది.

”సరే, ఓ! ఇదంతా నీ మహిమా?” నవ్వుతూ అన్నాను. ”ఏడాది క్రితం మా బాస్‌ నన్ను వర్క్‌ షాప్‌ కోసం బెంగుళూరు పంపితే ఇదేంటబ్బా కొత్తగా అనుకున్నాను. నాలో లోపాలను ఎత్తి చూపిస్తున్నారేమో అని కూడా అనిపించింది.” ”కానీ ఎందుకో ఆ వర్క్‌షాప్‌ తర్వాత నాకు నేను పునఃపరిచయం అయ్యాను. నిజం జానకీ! నా లోపలి చిక్కుముడులను విప్పుకోగలిగాను. రైట్‌ నౌ మా ఆఫీసులో బిహేవియరల్‌ సమస్యలను గురించి సలహా ఇవ్వగలుగుతున్నాను. కస్టమర్‌ శాటిస్ఫాక్షన్‌ కూడా పెరిగింది”.

”పర్సనల్‌ ఫ్రంట్‌… నా భార్య సరోజ. ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తోంది. పాప… రాగమాలిక. ఆరవ తరగతి. కర్నాటిక్‌ ఓకల్‌ నేర్చుకుంటోంది. నేను ఇలా…”

”య్యా!” తమాషాగా ఒత్తి పలికింది జానకి, నా కళ్ళల్లోకి తిన్నగా చూస్తూ.

”విన్నాను మహీ! కుమార్‌ మా బావగారి అబ్బాయి. నీ గురించి చెప్పాడు. దట్స్‌ గూ…డ్‌. ఇన్‌ఫాక్ట్‌ వెరీగుడ్‌. నాకు నువ్వు తెలుసని అతనికి తెలీదు. ఉత్సాహంగా మాట్లాడాడు” అంది.

నేను ఆశ్చర్యపోయాను.

తృప్తిగా నేను, సంతోషంగా తాను వీడ్కోలు చెప్పుకున్నాం.

… … …

జానకి ఇన్నాళ్ళూ… ఒక జ్ఞాపకం. ఇప్పుడొక సాకార స్వప్నం. తనను నేను కోల్పోయాను అనే మాట, ఫిర్యాదులా నాలో పెరిగి పెరిగి పర్వతంలా అయ్యి, నా జీవితంపై నాకున్న అసంతృప్తిగా మారినప్పుడు నేను వెళ్ళిన కౌన్సిలింగ్‌ నన్నెంత హుందాగా మార్చిందో!

అవును నా జానకి నాలో, నాతో ఉంది. నేను వేసే ప్రతి అడుగులోనూ తానుంది, ప్రేమగా.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.