రత్నమాల, మల్లీశ్వరి
వారికి జ్ఞానంపట్ల వినయం, సాహిత్యం అంటే మమకారం, కార్యాచరణపట్ల విశ్వాసం.
వారిలో ఉన్నదంతా చైతన్యమే. స్త్రీలు ఎన్నో కారణాలచేత వివిధరకాల వివక్షలకి గురవుతున్నారని అసమానతలు అణచివేతలనుంచి స్త్రీవాద సాహిత్యం స్త్రీలకి ఆసరాగా నిలబడగలదన్న నమ్మకంతో ఎదురుచూస్తున్న యువకెరటాలు వాళ్ళు.
2009 మార్చి 21, 22 తేదీల్లో వరంగల్‌లో మహిళాధ్యయనకేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయం మరియు ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, తెలంగాణ స్త్రీల సాహిత్యాధ్యయన సమావేశాల్లో ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు స్కాలర్లు పత్రసమర్పణ చేశారు. పేరుమోసిన విమర్శకులు సైతం తీసుకోడానికి జంకిన అంశాలను తీసుకుని అతితక్కువ సమయంలో శక్తివంచన లేకుండా ప్రయత్నించి మంచి మెటీరియల్‌ని సేకరించడమే కాకుండా విశ్లేషణాత్మకంగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పాత శ్రీలక్ష్మి సమర్పించిన పత్రంలోని అంశాలు, వాటిపట్ల తనకున్న అవగాహన, స్థిరమయిన, స్పష్టమయిన స్వరంతో ప్రసంగించడం రచయిత్రలను ఆకట్టుకున్నాయి. జూపాక సుభద్ర రాసిన ‘కొంగు నా బొచ్చె మీన కావలుండె బొంత పేగ్గాదు’ అనే కవితకు జయప్రభ రాసిన ‘పైటని తగలెయ్యాలి’ కవితతో తులనాత్మక అధ్యయనం చేసి ఆ పత్రాన్ని వేదికపై చదివినపుడు రచయిత్రులు హోరుమనే చప్పట్లతో అభినందనలు తెలిపారు.
దళిత స్త్రీ వ్యాసప్రక్రియపై పత్రసమర్పణ చేసిన కందాళ శోభారాణి ఇదే విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో స్కాలర్. అనివార్య కారణాలచేత అతితక్కువ సమయంలో పత్రాన్ని తయారుచేయాల్సివచ్చినప్పటికీ జంకకుండా కాత్యాయనీ విద్మహే సలహాలను స్వీకరిస్తూ మంచి వ్యాసాన్ని తయారుచేసింది. అంతేకాకుండా ఈ సదస్సు నిర్వాహకులకు నిర్వహణలో పూర్తిస్థాయి సహాయసహకారాలను అందించింది.
ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు స్కాలర్ నిదానకవి నిశ్చల తెలంగాణికా రచయిత్రుల కథలపై పత్రసమర్పణ చేసింది. విస్తృతమయిన అంశాన్ని ఎంచుకోవడమే కాకుండా తగిన న్యాయం చేసింది నిశ్చల. కేవలం డేటా యివ్వడం కాకుండా కథలను విమర్శనాత్మకంగా పరిశోధించి కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది.
‘అసెంబ్లీలో ఉండాల్సిన అమ్మాయి’ గా ముదిగంటి సుజాతారెడ్డి ప్రశంసలు పొందిన జనగామ రజిత కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ ద్వితీయ చదువుతోంది. అనిశెట్టి రజిత రాసిన ‘ఓ లచ్చవ్వ’ దీర్ఘకవితపై విశ్లేషణ చేసింది. నాటకీయ హావభావాలతో అందరి హృదయాలకీ హత్తుకుపోయేట్లు ప్రసంగించింది.
కాకతీయ విశ్వవిద్యాలయంలోనే తెలుగు ఎం.ఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న సుమలత ‘గెద్దాడ కస్తూరి’ రాసిన ‘మాస్టారికో శిక్ష’ కథను విశ్లేషిస్తూ పత్ర సమర్పణ చేసింది. ప్రారంభంలో అంతమంది రచయిత్రుల సమక్షంలో ప్రసంగించడానికి జంకుతున్నట్లు కన్పించినా ప్రసంగం ముగిసేసరికి తనలో అంతులేని ఆత్మవిశ్వాసం కన్పించింది.
మొదటిరోజు సమావేశాలు ముగిసేసరికి రచయిత్రుల ఆసక్తి అంతా వీరితో మాట్లాడటంపైనే వుంది. ఈ క్రమంలో మేం కొంతసేపు ఈ అయిదుగురితో కలిసి సాహిత్య సామాజిక అంశాలపై చర్చించాము. అంతేకాకుండా ప్రస్తుత స్త్రీల సాహిత్యం ఎలావుంది? దాని ప్రభావం, ఇలాంటి ఉమ్మడివేదికల గురించి వారి అవగాహన సలహాలు మొదలైన అంశాలపై వారికి కామన్‌గా కొన్ని ప్రశ్నలు యిచ్చి సమాధానాలు తెలుసుకోవడం జరిగింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే
పాత శ్రీలక్ష్మి :- స్త్రీవాదం అంతకుముందు గుర్తింపుకిరాని ఎన్నో సమస్యల్ని చర్చించింది. స్త్రీలుగా చెప్పుకోడానికి యిబ్బంది పడే అనేక సమస్యల్ని ‘మల్టినేషనల్ ముద్దు’ లాంటి కవితలు నిర్భయంగా చెప్పాయి. మాకు ఈ సదస్సులో పత్రసమర్పణ చేసే అవకాశం రావడం ద్వారా మేము కూడా రాయగలం అన్న నమ్మకం ఏర్పడింది. మాలోని సృజనాత్మకతని మెరుగుపర్చుకోడానికి ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక మాకు సహకరిస్తుందని బలంగా నమ్ముతున్నాం. పురుషులకి స్త్రీల సమస్యలు భిన్నంగా కన్పిస్తాయి, స్త్రీలు ఎంత బాగా రాసినప్పటికీ పురుష విమర్శకులు వాటిని అంగీకరించరు. యిలాంటి సమస్యలను గడ్డిపోచలన్నీ కలిసి బలమయిన తాడుగా మారినట్లు రచయిత్రులంతా కలిసి ఈ పితృస్వామిక సమాజాన్నీ, కులమత వివక్షలతో కూడిన సమాజాన్ని సమిష్టికృషి ద్వారా మార్చాలి.
కందాళ శోభారాణి :- తొలితరంతో పోలిస్తే స్త్రీల సాహిత్యం యిపుడు బలంగా వస్తోంది. ఇలాంటి వేదికల వలన రచయిత్రుల మధ్య భిన్నభావజాలాలకి సంబంధించిన అవగాహన పెరుగుతుంది. లోటుపాట్లు తెలుస్తాయి. మార్పు గురించిన చర్చలు చేసుకోవచ్చు. మిగతా సాహిత్య సంస్థల్లో రచయిత్రులకు గుర్తింపు ఉండదు. రచయిత్రులు విడిగా అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ప్రధానస్రవంతి సాహిత్యచరిత్రలో భాగం కోసం పోరాడాలి. వివిధ అస్తిత్వాల మధ్య సంఘర్షణ ఏర్పడినపుడు ఉమ్మడి శత్రువు అయిన పితృస్వామిక సంస్కృతికి లోకువ అవుతాం కాబట్టి జెండర్ అస్తిత్వచైతన్యం ప్రాధమిక ఉమ్మడి సూత్రంగా రచయిత్రులు స్వీకరించాలి.
నిదానకవి నిశ్చల : స్త్రీల సాహిత్యం యిప్పుడు పలుకోణాల్లోకి ప్రవేశించింది కాబట్టి ఆశాజనకంగా వుంది. యిలాంటి ఉమ్మడి వేదికల ద్వారా కొత్త రచయిత్రులు సాహిత్యంలో తమని గందరగోళపరిచే అంశాలపై స్పష్టమయిన సమాధానాలు పొందగలరు. సమకాలీన స్త్రీ సమస్యల మీద రచయిత్రులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. సాధారణ సమాజంలోకి పురుషాధిక్యతకు సాహిత్య సమాజం మినహాయింపు కాదు కాబట్టి రచయిత్రుల ఉమ్మడివేదిక సమర్ధవంతంగా పనిచేయాల్సిన అవసరం వుంది. ఈ వేదిక కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా సామాజిక సమస్యలతో సమన్వయం సాధించాలని కోరుకుంటున్నాను.
జనగామ రజిత : ఇప్పటివరకూ వచ్చిన స్త్రీల సాహిత్యం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఎలాంటి కమ్యూనికేషన్ సదుపాయాలూ లేని గిరిజన ప్రాంత స్త్రీలను గురించిన సాహిత్యం యింకా రావాల్సి వుంది. కొత్తగా రచనలు చేసేవారికి ఈ సదస్సులు, రచయిత్రులతో చర్చలు బాగా ఉపయోగపడుతున్నాయి. జాజుల గౌరి లాంటి రచయిత్రులు మంతో ఈ రెండురోజులూ స్నేహపూర్వకంగా మెలిగి తమ రచనానుభవాలను వివరిస్తుంటే ఎంతో నేర్చుకున్నట్లుగా అన్పిస్తోంది. నేనెందుకు రచనలు చేయకూడదు అన్పిస్తోంది. ఈ వేదిక తరచూ సమావేశమవుతూ వుండాలి. దాని ద్వారా స్త్రీ సమస్యల్ని కలసి గుర్తించడమూ, చర్చించడమూ రచయిత్రులకు ఉపయోగ కరంగా వుంటుంది. ఈ చర్చల ప్రభావం వారి సాహిత్యవ్యక్తీకరణపై కూడా ఉంటుంది.
సుమలత : విస్మరించబడిన ప్రాంతాల, దృక్పథాల స్త్రీల సమస్యల్ని వారే రాయాలి. ఆ చైతన్యాన్ని అందరూ అధ్యయనం చెయ్యాలి. మహిళా దినోత్సవం రోజు అందరినీ చూసి నేనూ రచనలు చెయ్యాలనుకున్నాను కానీ నాకా శక్తి లేదనిపించింది. కానీ ఈ రోజు ఈ వేదిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా నాకు నమ్మకం పెరిగింది. ఇట్లా స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకున్నట్లు పురుషులు వుండే వేదికలపై సాధ్యం కాదు. కొత్త రచయితల్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త తరాన్ని తయారుచేసుకోగలం. యిప్పటికీ యువతరంలో సాహిత్యం పట్ల అనాసక్తి ఎక్కువ వుంది. దానిని పోగొట్టాలంటే యిలాంటి సదస్సుల అవసరం వుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags