మూలం- కమలా (దాస్) సురయ్యా
తెలుగుసేత- పసుపులేటి గీత
హిజ్రాలు వచ్చేదాకా ఒకటే ఉక్కపోత
చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద లంగాలు,
చేతుల్లో చిడతలు, అందెల సవ్వడులు
మంకెన పూల ఎర్రని చిత్తడిలో
వాలుజడల ఊయలలు,
చిక్కని కాటుక రేఖల కాంతిపుంజాలు,
వాళ్ళు నర్తిస్తున్నారు, నర్తిస్తూనే ఉన్నారు
పాదాలు చిట్లి నెత్తురోడేలా
వాళ్ళు నర్తిస్తున్నారు
వాళ్ళ చెక్కిళ్ళపై పచ్చబొట్లు,
సిగలో మల్లెలు, కొందరు కారునలుపు
మరికొందరు పాలతెలుపు
కరుకైన గొంతుల్లో
దిగులుపడిన పాటలు
భగ్న ప్రేమికులు, ఛిద్ర గర్భస్థ శిశువుల
గురించి వాళ్ళు పాడుతున్నారు
మరికొందరు గుండెలు బాదుకుంటున్నారు
ఇంకొందరు శూన్యానందంలోకి ఒరిగిపోతున్నారు
ముప్పిరిగొన్న కరవు బరువుతో
చితిలో సగం కాలిన కట్టెల్లా
వాళ్ళు బలహీనంగా ఉన్నారు
చెట్ల మీద కాకులింకా నిశ్శబ్దంగా ఉన్నాయి
పిల్లలింకా రెప్పవాల్చ లేదు,
ఇప్పటికీ,
మెలికలు తిరుగుతున్న వాళ్ళనింకా
అందరూ చూస్తూనే ఉన్నారు
ఉరుములు, మెరుపులతో ఆకాశం విచ్చిపోయింది
సన్నటి వానజల్లు
అటక మీద బల్లులు, ఎలుకల మూత్రంతో తడిసిన
మట్టికంపును మోసుకుంటూ
సన్నటి వానజల్లు….
ప్రియమైన మొగుడు, మనసులో తిష్ఠ వేసిన ప్రాచీన ప్రవాసి
గాబరా గూళ్ళనల్లుతున్న ముసలి బొంత సాలీడు
దయ చూడు,
నువ్వు నన్నొక రాతిబొమ్మని చేశావు
గ్రానైట్ పావురాన్ని చేశావు
నా చుట్టూ పాతగోడల ఇరుకు గదిని కట్టావు
నువ్వు చదువుతూ, చుదువుతూ సొట్టలు పడిన నా ముఖాన్ని
అనాలోచితంగా విసురుగా తాకావు
చెవులు చిల్లులు పడే నీ మాటలు
నా తెల్లవారుజాము నిద్రని చెదరగొట్టాయి
కలలు కంటున్న నా కంటిని నీ వేలితో గుచ్చావు
అప్పటికీ, నా పగటి కలల్లోకి
దృఢకాయులైన పురుషుల నీడలు ప్రవహించాయి
పోటెత్తిన నా ద్రవిడ రక్తంలోకి వాళ్ళు శ్వేతసూర్యులై ఇంకిపోయారు
పవిత్ర నగరాల కింద
రహస్యంగా మురుగు కాల్వలు పారుతున్నాయి
నువ్వు నన్ను వదిలి వెళితే
నేను నా నీలిరంగు కారులో
నీలికడలి ఒడ్డునే ప్రయాణించి
నలభై అలజడి అడగుల దూరం పరుగెత్తి
మరొకరి తలుపు తడతాను
కిటికీల సందుల్లోంచి ఇరుగుపొరుగు చూస్తూనే ఉంటారు
వానలా నేనొచ్చి, వెళ్ళడాన్ని చూస్తూనే ఉంటారు
అడగండి, అందరూ నన్నడగండి…,
నాలో వాడేం చూశాడో అడగండి,
వాణ్ణందరూ దుస్సాహసి అనీ, పోకిరీ అనీ
ఎందుకంటారో అడగండి
నా పొత్తికడుపు కింద పట్టు చిక్కేముందు
వాడిచెయ్యి పాము పడగలా ఎందుకు ఊగుతుందో అడగండి,
నా రొమ్ములపై వాడో మహావృక్షమై తెగిపడి, ఎలా నిద్రిస్తాడో అడగండి
జీవితం మరీ ఇంత చిన్న దవడమేమిటని అడగండి,
అందులో ప్రేమ మరీ చిన్నదవడమెందుకో అడగండి,
నన్నడగండి,
ఆనందమంటే ఏమిటో, దాని మూల్యమేమిటో
నన్నగడగండి…..
మా బామ్మ ఇల్లు
మూలం- కమలా (దాస్) సురయ్యా
తెలుగుసేత- పసుపులేటి గీత
అక్కడొక ఇల్లుండేది…
ఒకప్పటి నా ప్రేమనగరది
ఆమె మరణంతో ఆ ఇల్లు మూగబోయింది
అప్పుడు నేనింకా చిన్నపిల్లనే
పుస్తకాల్లో కదిలే పాములతో
నా నెత్తురు తెల్లగా పాలిపోయేది
ఎన్నిసార్లనుకున్నానో
అక్కడికి వెళ్ళాలని
కిటికీల గుడ్డికళ్ళలోంచి తొంగి చూడాలని
గడ్డకట్టిన గాలి సవ్వడి వినాలని
కనీసం, భయంకరమైన నిరాశలోంచి
గుప్పెడు చీకటినైనా తెచ్చి
నా పడకగది వెనుక కుక్కపిల్లలాగా
కట్టేసుకోవాలని,
నువ్వు నమ్మవు కానీ నేస్తం,
నేనెలాంటి ఇంట్లో పెరిగానో,
ఆ ఇల్లంటే నాకెంత ప్రేమో,
నాకెంత గర్వమో…!
ఇప్పుడు నేను దారితప్పి,
ప్రేమకోసం, ఒక్క చిన్న మార్పు కోసం
అపరిచితుల తలవాకిట అడుక్కుంటున్నాను
పునీత
మూలం- కమలా (దాస్) సురయ్యా
తెలుగుసేత- పసుపులేటి గీత
నిజం,
ఒకటి, రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ దైవాన్ని కాని, సమాజాన్ని కాని
క్షమాభిక్ష కోసం అర్థించను
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు,
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!
జబ్బు పడ్డాక…
మూలం- కమలా (దాస్) సురయ్యా
తెలుగుసేత- పసుపులేటి గీత
మరణమూ లేదు, అంతమూ లేదు,
ఉన్నదల్లా అలసిన దేహం అలవాటైన నేలచాళ్ళలోకింక పోవడమే!
నా మోకాలి మీద తన బాధాతప్త ముఖాన్నుంచి అతనంటాడిలా…
‘ప్రియా, నీకేం కాదు, నువ్వు బతుకుతావని నాకు తెలుసు,
నేకోరుకునేదదే…’
నా జబ్బు పచ్చపచ్చగా ఎదగడాన్ని చూస్తున్నాడతను
ఎండి, వదులైన చర్మం కింద ఎముకలు మొనదేలు తున్నాయి
గాజుకళ్ళలో పచ్చని మరకలు, దుర్గంధమైన శ్వాస,
అన్నింటినీ చూస్తున్నాడతను
అపరిచిత దైవాలకు నిత్యప్రార్థనలిప్పుడు
అతనికి అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి.
నేను నా నొప్పితో పోరాడుతున్నప్పుడు
నిర్లక్ష్యం అతణ్ణి బాధిస్తుందా?
వేకువనే నాలుగింటికి ఒంటరిగా అతను మేలుకుంటాడా?
ఆకలికి తగినంత మాంసం మిగల్లేదు
నెత్తురు కాముకత్వపు ఆటుపోట్లనిప్పుడు తట్టుకునేలా లేదు
స్వాస్థ్యపు అభ్యంగనం లేక చర్మం మొద్దుబారి, ఆపేక్ష రహితమైంది
మరతను దేన్ని మోహిస్తున్నాడు,
లోలోపల దాగిన అంతరాత్మనేనా…?!
గీత గారూ కమలా సురయ్యా హృదయాన్ని మీరు తెలుగులోఅత్యంత శక్తివంతంగా ఆవిష్కరించారు .అభినందనలు __________బెందాళం క్రిష్ణారావు, శ్రీకాకుళం