ప్రాచీన సాహిత్యంలో స్త్రీలు రచన చేయడానికి సరైన మేథో సంపత్తి, విద్య ఉన్నా కూడా, వారికున్న అప్పటి పరిమితులు, వారి దృక్పథం, రచనా వ్యాసంగం పట్ల అనాసక్తి, నిర్బంధాలు, కట్టుబాట్లు, అంతకుమించి స్త్రీ రచనా సాంప్రదాయం ఆ కాలం నాటికి లేకపోవడం వల్ల మహిళా కవయిత్రులు ప్రారంభ దశలో అరుదుగా కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ ఛేదించుకొని సీతాకోక చిలుకలుగా పేరు తెచ్చుకొన్న విదుషీమణులూ లేకపోలేదు. అయితే వీరిలో వారి జీవిత కాలాదులు సరిగా తెలియకపోవడం, రచనలు అలభ్యం కావడంతో మనిషి ఉండి నీడ లేనట్లు, నీడ ఉండి మనిషి లేనట్లు అయిపోయింది. లభ్యమవుతున్న ఆధారాలను బట్టి దాక్షిణాత్య సాహిత్యంలోని తొలిదశ కవయిత్రులను పరిచయం చేస్తున్నాను. తమిళ సాహిత్యంలో కడసంగకాలంలో వెలసిన గ్రంథాలలో అగనానూఱు, పుఱనానూఱు పేర్కొనదగ్గ రచనలు. అగనానూఱు ప్రణయ గీతాలకు సంబంధించిన గ్రంథం, పురనానూఱు వీరగీతాల సంపుటం. ఈ రెండు గ్రంథాల్లోను తమిళ మహిళల విషయాలను తెలుసుకోవచ్చు. సంగం కాలానికి పురుషులతో ఉండేవారని, వారికి సంఘంలో విశేష గౌరవాలు దక్కేవని తెలుస్తోంది. సంగీత, సాహిత్యాలలోనే కాకుండా ఇతర శాస్త్రాల్లోను పాండిత్యాన్ని గడించారని అవగతమవుతోంది. సంగం కాలానికే యాభై మంది కవయిత్రులుండేవారు. పుఱనానూఱు గ్రంథంలో ఒక వీరనారి, ఆమె తండ్రి యుద్ధభూమిలో అశువులు బాస్తాడు. ఆమె భర్త కూడా యుద్ధ వీరుడే. శత్రువుల ఆధీనంలో ఉండే అలమందలను తన వశం చేసుకుని యుద్ధంలో చనిపోతాడు. ఈ వార్తలు విని కంటతడి పెట్టలేదు ఆమె. ధైర్యంగా తన కొడుకును దగ్గరకు తీసుకొని తలకు నూనె రాసి, జుట్టు ముడి వేసి తెల్లని గుడ్డలు వేసి, చేతికి ఖడ్గం ఇచ్చి యుద్ధభూమికి వెళ్ళమని ఆదేశించింది. ఇక్కడ తెలుగులో చానమ్మ గుర్తుకువస్తుంది. ఈ వీరగాథను ‘మాశాత్తియార్’ పద్యరూపంలో రచించారు (పుట.269 అఖిల భారత కవయిత్రులు) ఈమెను తొలి కవయిత్రిగా తమిళ సాహిత్యంలో కీర్తించబడలేదు. తొలిదశలో ఇంచుమించు దేశభక్తికి సంబంధించిన సాహిత్యాన్నే రచించినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తమిళ కవయిత్రులలో కాక్కైపాడినియర్… ఈమె లక్షణశాస్త్ర రచించినట్లు తెలుస్తున్నది కానీ అది అలభ్యం. అళ్ళూర్ నన్ ముల్లైయార్… ఈమె సంగకాలానికి చెందిన కవయిత్రుల్లో ఒకరు. ళిరుకాక్కై పాడినియార్, నచ్చెళ్ళెయార్ లాంటి కవయిత్రులు అడపా దడపా రచనలు చేసినా వీరి రచనలు అలభ్యం. అందువల్ల వీరికి గుర్తింపు దక్కలేదు. అవ్వైయారు తమిళ తొలి కవయిత్రి అని చెప్తారు. ఈమె సూక్తులను వివరించారు. తొలిదశ తమిళ సాహిత్యంలో అన్ని జాతుల వారు ఉన్నారు. దీన్నిబట్టి తెలిసిందేమంటే తమిళ మహిళలు దక్షిణాదిలో పురుషులతో సమానంగా చదువుకోవడం, తద్వారా వారి స్థాన మానాల్లో స్థాయిని పెంచుకోగలిగారు. ఈ విషయాల్లో తెలుగునాడు లోని మహిళలు వెనుకబడ్డారు. ఎప్పుడైతే విద్య లేదో అప్పుడు అన్ని రంగాల్లోను స్త్రీలు వెనుకబడిపోతారు. జాతి వ్యవస్థ కూడా వీరు వెనుకబడడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
అవ్వైయార్ :
ఈమె అసలు పేరు తెలియడంలేదు. కాలం పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. ఇదే పేరుతో ముగ్గురు వేర్వేరు కాలాల్లో ఉన్నారు. సంగ కాలానికి చెందిన అవ్వైయారుకు సంబంధించిన కథలు నేటికీ చాలా ప్రచారంలో ఉన్నాయి. అవ్వైయారు ఒకసారి రాజాస్థానానికి వెళ్ళుంటుంది. వారు ఎంతో ఆనందంతో, సాదర స్వాగతం పలికి అక్కడున్న ఆయుధశాలను ఈమెకు చూపించారు. ఎలా ఉందో చూశారా అని అడగ్గా ఆమె బిగ్గరగా నవ్వి మా రాజు ఆయుధాలు శత్రువులను సంహరించడంతో వంకరలు పోయి నెత్తుటిధారలతో ఉంటాయి. ఇవేంటి ఇంత శుభ్రంగా అలంకరించబడ్డాయి అన్నది. తమిళ సాహిత్యంలో అవ్వ మాట అమృతతుల్యం అంటారు. అంతటి స్థానం సంపాదించుకొన్నది అవ్వైయార్.
కన్నడ ప్రారంభ కవయిత్రి కంతి :
కన్నడ సాహిత్యంలో పేరుగాంచిన మొదటి కవయిత్రి ”కంతి” అని అంటారు. ఈమె అభినవ పంప లేదా నాగచంద్ర కాలానికి చెందిన వారని తెలుస్తోంది. ఈమె 11వ శతాబ్దానికి చెందిన కవయిత్రి.
బౌద్ధులు కన్నడ సాహిత్యానికి ఆద్యులని విమర్శకుల ఊహ తప్పితే, కన్నడ సాహిత్యానికి ప్రారంభకులు జైనులే. పంప మహాకవే ఆదికవి అయినట్లు, జైన కవయిత్రి ‘కంతి’ ఆది కవయిత్రి అయినట్లు దొరికిన ఆధారాలను బట్టి తెలుసుకోవచ్చు. కన్నడ మౌఖిక భాషను గ్రంథస్థ భాషగా చేసినవారు జైన కవులే. పంపడు భారతాన్ని రచిస్తే, 12వ శతాబ్దపు అభినవ పంప రామాయణాన్ని రచించారు. ”పిరరెనిసిదరె రామ కథెయా కిరిదాగిదె” ఇదే కన్నడంలో వచ్చిన మొదటి జైన రామాయణం. ఈ అభినవ పంపకి సమకాలికురాలే కంతి.
”కంతి అంటే జైన సన్యాసి అని అర్థం. అది ఆమెకు పెట్టిన పేరా లేదా ఆమెకిచ్చిన బిరుదా అనే అనుమానం కూడా సాహిత్యాభిమానుల్లో ఉంది”.
కర్ణాటక చరిత్రలో 12వ శతాబ్దపు ప్రారంభకాలం హొయ్సళ వంశంలో పేరుగాంచిన విష్ణువర్ధనుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలం. పంప, రన్న కాలం నుండి ఆనవాయితీగా వచ్చిన జైన కావ్య పరంపర ఈ కాలంలో కూడా కొనసాగింది. హొయ్సళ రాజధాని హళేబీడు. వీరి కాలంలో సాహిత్య, సంగీత కళకు ప్రోత్సాహం ఇవ్వాలనే పరంపరను కొనసాగించాలనేదే కాకుండా ఇంకా ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వడానికి విష్ణువర్ధనుడి రాజస్థానంలో అభినవ పంప అనే పేరుగలతను (నాగచంద్ర) విరాజిల్లుతుండేవాడు. ఇతను మల్లినాథ పురాణం మరియు రామచంద్ర చరిత పురాణం రచించిన కవి. ఆ ఆస్థానంలో అభినవ పంపడికి కవయిత్రి ‘కంతి’యే. రాజాశ్రయం ఉన్నా కూడా స్వభావతః కంతికి స్తుతించే అలవాటు లేదు. తననెవరు స్తుతించినా ఆమె అంతగా ఇష్టపడేవారు కాదు.
కంతి జైన ధర్మానికి చెందిన కవయిత్రి. ప్రతిభా పాండిత్యం ఉన్న కవయిత్రి. ”కంతిపంపన పర సమస్యగలు” అనే సమస్యను పూరించిన పద్యాలు తప్పితే వేరే కృతి ఏదీ లభ్యం కాలేదు.
ఈ పద్యాల నుండి వారి పాండిత్యాన్ని కొలవడానికి అవకాశం ఉంది. పంపడు ఒక పంక్తిని ఇచ్చి మిగతా పంక్తుల్లో పద్యాన్ని పూరించమని కంతిని కోరడంతో, కంతి దిగ్విజయంగా దాన్ని పూర్తిచేశారు. పంపడిచ్చిన సమస్యా పూరణాలన్నీ వారి ఇంటి సమస్యకు సంబంధించినవై ఉన్నాయి.
కంతిని పరీక్షించడానికి పంపడు నిరోష్ఠ్యమైన పద్యం ఒకటి చెప్పు అని అనగా కంతి ఈ క్రింది పద్యాన్ని చెప్పారు.
”సురనర నాగధీశ్వర
హిర కిరీటాగ్ర లగ్న చరణ సరజా
ధీరోదార చిరిత్రో
త్యాంత కలుక్షాఘ రక్షిసళ్ళరినహో”
కంతికి ఓటమి తెలీదు, పంపడి మరొక సమస్యకూ జవాబిచ్చింది.
”గటె ఇద్దుడు జైన గృహదొళేను విచిత్రం
కట కట సటె యాతదిరై
స్ఫటికద మణి – భిత్తి బెళెదు భోజన కాలం”
ఈమె తరువాత వచన సాహిత్యం ప్రారంభమయ్యేదాకా కవయిత్రులు లేరు. బసవ యుగం నుండి భక్తి కవయిత్రులు తమ గళాన్ని కన్నడ సాహిత్యంలో వినిపించారు. బసవయుగంతో మహిళలకు రచనా వైదుష్యాన్ని వెలికితీయడానికి అనువైన అవకాశం దొరికినట్లయింది.
శైవ మరియు వైష్ణవ భక్తి మార్గాలు మహిళల ఆశయాలను జీవంతంగా ఉంచాయి. మహిళల్ని పీడిస్తున్న ధార్మిక దిగ్బంధాలను తొలగించారు. స్త్రీకి వివాహం మోక్షదాయని అని పతిని ప్రత్యక్ష దైవంగా చూపించి కల్పనా వాక్కులతో స్త్రీలను మభ్యపరచి స్వతహాగా స్త్రీలు నిర్వహించాల్సిన కర్తవ్యాలను, సాధించాల్సిన విజయాలను నిషేధానికి గురిచేశారు. ఏయే అంశాలు స్త్రీ పురోగమనాన్ని అడ్డుకొంటున్నాయో వాటినన్నింటిని వచన కవయిత్రులు వేర్లతో సహా తొలగించేశారు. స్త్రీ విమోచన, స్త్రీ వ్యక్తిత్వం, అస్తిత్వం వచనయుగంలో అప్పుడప్పుడే చిగుర్లు తొడిగాయి. ఆధ్యాత్మిక రంగంలో స్త్రీలను రాక్షసులుగా భావించుకొన్న మధ్యయుగ పురుషుడి ప్రధాన సంస్కృతిగా
ఉన్న రోజుల్లో కర్ణాటక శరణులు వ్యక్తం చేసిన లింగ సమానత్వం మన దేశంలోనే మానవత్వాన్ని చాటి చెప్పే సంఘటనగా కనిపించింది.
దక్షిణాదిన తొలిదశ కవయిత్రులైన అవ్వైయార్, చానమ్మ, ప్రోలమ్మ, నాచి, కంతి కవయిత్రుల్లో చానమ్మ, ప్రోలమ్మ దేశభక్తికి సంబంధించిన చాటువులు చెబితే, కంతి కూడా వీరిలాగే చాటువులు చెప్పారు. తొలిదశ తెలుగు కవయిత్రులు ఏ రాజు ఆశ్రయం పొందలేదు కానీ తమిళ, కన్నడ కవయిత్రులకు రాజాస్థానం దొరికింది. మొత్తంగా ప్రారంభ కవయిత్రులకు మంచి తెగింపు, ఓటమి ఎరుగని తత్వం దర్శనమిస్తుంది. కంతి, నాచిలో సంస్కృత సాహిత్య ప్రతిభ కనిపిస్తుంది. కన్నడ, తమిళ కవయిత్రులైన మత సాహిత్య ప్రభావం కనిపిస్తుంది. తెలుగు కవయిత్రులపై మత ప్రభావం మచ్చుకైనా కనిపించదు.
నాచి : తెలుగు వారందరూ గర్వించదగిన క్రీ.శ.7వ శతాబ్దానికి చెందిన విదుషీమణి ఏలేశ్వరోపాధ్యాయులంటే వేదవేదాంగ పారంగతులు. సర్వశాస్త్రాలలో నిష్ణాతులు, శాస్త్ర విషయాల్లో ఎవరికి ఏ అనుమానం వచ్చినా ఏలేశ్వరోపాధ్యాయులే తీర్చవలసి వచ్చేది. అందుకే ఇప్పటికీ ఎవరన్నా, ఏదయినా విషయం మీద సాధికారకంగా చెబుతుంటే నీవేమన్నా ఏలేశ్వరోపాధ్యాయుడవా అనడం కద్దు. వీరిది పల్నాడు ప్రాంతంలోని (గుంటూరు జిల్లా) ఏలేశ్వరం. ఏలేశ్వరోపాధ్యాయుల వారికి ముగ్గురూ కుమార్తెలే. పురుష సంతతి లేదు. నాచి ద్వితీయ కుమార్తె. ఆమెకు చిన్న వయసులోనే వివాహమైంది. దురదృష్టవశాత్తూ కొంత కాలానికే భర్త మరణించాడు. వితంతువుగా పుట్టిల్లు చేరింది. పుట్టెడు దుఃఖంలో మునిగిన దశలో ఆమెకు చదువు ఒక ఆశారేఖగా తోచింది. నిరంతరం తండ్రి ఏలేశ్వరోపాధ్యాయుల వారి సమక్షంలో విద్యార్థులు వల్లించే శాస్త్ర పాఠాలు ఆమెలోని జిజ్ఞాసను తట్టి లేపాయి. ఆమెనూ విజ్ఞాన సముపార్జన వైపు అడుగులేయించాయి.
తండ్రి అసమాన ప్రోత్సాహంతో అనతికాలంలోనే నాచి గొప్ప విద్యాంసురాలిగా పేరుతెచ్చుకొంది. నాచి చిన్నతనం నుండి మేధావి కాదనీ, జ్యోతిష్మతి అనే ఆయుర్వేద మూలిక ప్రభావంతో అసమాన మేధా సంపత్తి నార్జించిందనీ లోకంలో ఒక కథ వాడుకలో ఉంది. ఇది నమ్మశక్యంగా లేదు. గొప్పవారైన వారి గురించి ఇలాంటి ఆధారం లేని గాథలెన్నో పుడుతూ ఉంటాయి. తండ్రి గారి గురుత్వం వల్ల, తన కఠోరమైన సాధనవల్ల మాత్రమే ఆమె అంత విద్యనార్జించిందని నా నమ్మకం.
ఇంతటి అసమాన విద్యా వైదుష్యం సాధించిన నాచి వివిధ నగరాలలోని పండితులతో శాస్త్ర చర్చలు చేసింది. అనేకమంది కాశీ పండితులను సైతం తన వాదనలతో ఓడించింది. జయపతాకాలనందుకుంది. అనేక బహుమానాలను, సన్మానాలను పొందింది. ఎప్పుడో వెయ్యేళ్ళకు ముందు స్త్రీలు గడప దాటడానికి భయపడే రోజుల్లో నాచి దాదాపు భారతదేశమంతటా పర్యటించి, అఖండ ఖ్యాతిని గడించిందనే విషయం తెలుగువాళ్ళమైన మనకెంతో ఆనందాన్ని, గర్వాన్నీ కలిగించక మానదు. నాచి సంస్కృతంలో నాచీ-2 పేరుతో గొప్ప కరుణ రసాత్మక నాటకాన్ని రచించింది. నాడు వితంతువులు సమాజంలో పడుతున్న బాధలు, ఇబ్బందులను ఇతివృత్తంగా స్వీకరించింది. అది ఒకరకంగా ఆమె కథే. కానీ ఈ నాటకం ఇప్పుడు అలభ్యం. సంస్కృత నాటక కర్తగా నాచి పేరు అజరామరం. పరిస్థితుల ప్రాబల్యం వల్ల కష్టాల కడలిలో చిక్కుకున్న వనితలకు నాచి చరిత్ర ఒక స్ఫూర్తిదాయక పాఠ్యాంశం. జీవితంలో కలిగిన గొప్ప లోటును అధిగమించి నిలిచి గెలిచిన నాచి విధివంచిత కాదు విద్యా సమన్విత అని పండితుల అభిప్రాయం. ఈమె సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ తప్పితే, తెలుగులో అంత ప్రావీణ్యత చూపలేదు.
చానమ్మ : ఖడ్గతిక్కన చోళవంశపు రాజు. మనుమసిద్ధికి ఆయన సామంతుడు. కనిగిరి ఎర్రగడ్డపాడు యాదవరాజు కాటమరాజుకు పుల్లరి విషయమై శత్రుత్వం మొదలై పెను యుద్ధానికి కారణమయింది. సైన్యాధ్యక్షుడైన ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడినా, సైన్యాన్ని పోగొట్టుకుని యుద్ధభూమి నుండి వెనక్కి వచ్చేస్తాడు. ఖడ్గతిక్కన భార్య పేరు చానమ్మ. పరాజితుడై ఇంటికి చేరిన భర్తకు రెండు బిందెల నీళ్ళు, పసుపు ముద్ద పక్కన పెట్టిచ్చి స్నానానికి ఏర్పాటు చేసిందంట. అలా చేయడానికి కారణం చెప్తూ ఇలా అంటుంది.
”పగఱకువెన్నెచ్చినచో
నగరే మన మగతనంపునాయకలెందున్
ముగురాడువారమైతిమి
వగపేలాజలకమాడవచ్చినచోటన్”
(ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్త్రీ స్వభావ చిత్రణ. పుట 5)
చానమ్మ, ప్రోలమ్మ ఆడవాళ్ళు. యుద్దభూమిలో పోరాడకుండా తిరిగివచ్చిన భర్త కూడా ఆడదానితో సమానమయ్యాడని భర్తలో వీరోచిత బలాన్ని తట్టిలేపుతుంది.
ప్రోలమ్మ : భార్య చేసిన పరాభవానికే బాధపడుతున్న తిక్కనకు తల్లి ప్రోలమ్మ చెప్పిన మాటలు మరీ అవమానం కలిగించాయి. భోజనంలో అన్ని పదార్థాలను వడ్డించిన తల్లి చివరగా విరిగిన పాలను వడ్డించింది. పాలు విరిగిపోయాయని అడిగిన తిక్కనకు ఆమె చెప్పిన సమాధానం ఇది.
”అసదృశముగ నరివీరులం
బస మీఱగ గెలువలేక పందక్రియన్న
వసి వైచి విఱిగి వచ్చిన ఁ
బసులున్విఱిగినవి తిక్క పాలున్విఱిగెన్”.
(ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్త్రీ స్వభావ చిత్రణ. పుట 5 ఎ)
భార్య, తల్లి తమ శూలాల వంటి మాటలతో చేసిన పరాభవాలు తిక్కనలో ధైర్యాన్ని రగిల్చాయి. ఉత్తేజితుడైన ఖడ్గతిక్కన తిరిగి యుద్ధభూమికి వెళ్ళి శత్రువులతో పోరాడి విగతజీవి అయినా విజయం సాధించాడు. దేశ స్వాతంత్య్రం కోసం దేశ రక్షణకు కడుపు తీపిని, తన మాంగల్యాన్ని లెక్కపెట్టని వీర మాతలుగా నిలిచారు ప్రోలమ్మ, చానమ్మ. వీరి పేరువుతో చాటువులు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా ఏ రచనలు దొరక్కపోవడం వల్ల వీరిని తొలి కవయిత్రులుగా పరిశోధకులు గుర్తించలేదు. ఇక మళయాళ సాహిత్యంలోని కవయిత్రుల్ని ఇతర భాషా కవయిత్రులతో పోల్చి చూసినప్పుడు సంఖ్యలో తక్కువగానే కనిపిస్తుంది. మళయాళ సాహిత్యంలోని ప్రారంభ కవయిత్రుల పట్ల ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మళయాళ సాహిత్యంలో కవయిత్రులు ప్రారంభంలోనే అభ్యుదయ సాహిత్యం రాయడం చెప్పుకోదగ్గ విషయం. రాబోయే రోజుల్లో దాక్షిణాత్య ప్రాచీన మహిళా సాహిత్యం మీద తులనాత్మకంగా అధ్యయనం జరిగితే అనేక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.