ఆమె కవితకి ”కభి అల్విదా న కెహనా”

స్త్రీకి శరీరం ఉంది, ఇంటిపని మొత్తం నెత్తికెత్తుకోడానికి, భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి!!
హ్రుదయంఉంది, ఉద్వేగాలన్నింటినీ అదుపు చేసుకోడానికి, ఎక్కడ స్రవించిన చెలమని అక్కడే ఇగరబెట్టడానికి!! మెదడు మాత్రం లేదా? అదీ వుంది, ఎప్పటికప్పుడు అంగీకృత భావజాలాన్ని ఇంకించుకుని ఆలోచనల్ని నిద్రపుచ్చుతూ మత్తులో జోగుతూండడానికి…కానీ ఇదంతా ఇష్టపడక ఎదురుతిరిగే శరీరాలు, హృదయాలు, మెదళ్ళు వున్నాయి. ఎప్పటికప్పుడు తమలో సహజంగా మొగ్గతొడిగే భావాలను గుర్తించేవాళ్లు కొందరైనా వున్నారు, వుంటారు.
వాళ్లు సమాజానికి వింతగా కనిపిస్తారు. వింతేమీలేదని తెలిసినా వాళ్ళ ప్రవర్తన అసహజమని ప్రచారం జరుగుతుంది. వాళ్లలాగా ఆలోచించలేకపోయినందుకు, స్వేచ్ఛగా మాట్లాడలేకపోయినందుకు, కొంత అసూయతో కూడా ఇలాంటి ప్రచారం జరుగుతుంది. నేననుకుంటాను కమలాదాస్‌ 1934లో కాక ఇప్పుడు పుట్టివుంటే, పోనీ అప్పటికన్న ఇంకో పదమూడు సంవత్సరాల తరవాత పుట్టివుంటే, ఆమె ఇంకా బాగా యూనివర్సిటీలో చదువుకుని, మరి కాస్త ఆలస్యంగా (మరీ పదిహేనేళ్ళకు కాకుండా) ప్రేమంటే ఏమిటో తెలిసినవాణ్ణి తనే ఎంపిక చేసుకుని పెళ్ళి చేసుకుని వుండేదేమో!! అప్పుడు మనకింత ఆర్తినిండిన కవిత్వం అందించగలిగేదా?…..పెళ్ళి సంగతేమోకానీ కమలకి యూనివర్సిటీ చదువులమీద నమ్మకం లేదు. ఆ చదువులు బుల్డోజర్లలాంటివంటుంది. అవి మన తెలివిని ఎదగకుండా చదును చేసి వదిలిపెడతాయంటుంది. నిజం కావచ్చు. హైస్కూలైనా పూర్తిచెయ్యని కమల నోబెల్‌ ప్రయిజుకి నామినేట్‌ కావటం అబద్ధం కాదు కదా!! పదహారేళ్ళకే పి.ఇ.ఎన్‌. ప్రయిజు రావడమూ నిజమే కదా. తరువాతంతా పురస్కార పరంపరే కదా!! ఇన్ని పురస్కారాలూ సత్కారాలూ పొందుతూ కూడా అనేక స్కాండల్స్‌కూ వివాదాలకూ గురైన రచయిత్రి మన కమల.
శరీరానికీ, మనసుకూ కూడా ఒక సహజమైన ఎదుగుదల క్రమం ఉంటుంది, రుతువులుంటాయి. ప్రేమంటే ”తలలో పువ్వులు అమర్చి, జుట్టు నిమిరి చెవిలో రహస్యాలు చెప్పడం, మెడచుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకోడం వంటి సున్నితమైన భావప్రకటనలని మాత్రమే ఊహించే వయసులో ”ఇంకా నువ్వు పసిపిల్లవే నీకప్పుడే పెళ్ళేమిటి” అని అందరూ అనే వయసులో తనకన్న దాదాపు ఇరవై ఏళ్ళు పెద్దవాడితో ఆమెకి చాలా అట్టహాసంగా పెళ్ళయింది. అతనికి మంచి ఉద్యోగం వుంది. కొక్కిరిపళ్ళున్నాయి. పొడుగ్గా వుంటాడు. కాస్త వంగినట్లు కూడా వుంటాడు. మేధావిలాగా కనిపిస్తాడు. ఆల్డస్‌ హక్సలీని పదేపదే కోట్‌ చేస్తుంటాడు. కమల చదువే ఒకచోట కుదురుగా సాగలేదు. చాలా స్కూళ్ళు మారింది. నాన్నకి కలకత్తాలో వుద్యోగం, అమ్మేమో తడవకీ మలబార్‌ పుట్టింటికి ప్రయాణం. అమ్మ బాలామణి ప్రసిద్ధ రచయిత్రి. ఆవిడ మేనమామ నారాయణమీనన్‌ ప్రఖ్యాత రచయిత. పొద్దుటినించి సాయంత్రందాకా వేరే పనేమీ లేకుండా వ్రాసుకుంటూనే వుండేవాడు. ఎంత హాయో కదా అలా రాసుకోడం, అమ్మ కూడా పగలే వ్రాసేది. పిల్లల్ని చూడ్డానికి బోలెడు మంది నౌకర్లు ఆయాలు. తనే చూడాలనేంలేదు. ‘ఒకరకంగా మేం నిర్లక్ష్యం చెయ్యబడ్డ పిల్లలం’ అంటుంది కమల. అమ్మ మలబార్‌లో నాన్న కలకత్తాలో ఉంటే కమలని ఎక్కడ వుంచాలో పెద్ద సమస్యే కదా. పెళ్లిచేసేస్తె మొగుడిదగ్గరే వుంటుంది దిగులుండదని అప్పుడే పెళ్ళి చేసేశారు. చుట్టమే అతను!! పెళ్ళి కుదురుతున్నప్పుడే ఆమెతో హోమో సెక్స్‌ గురించి మాట్లాడాడు ఆమెని అక్కడా అక్కడా ముట్టుకున్నాడు. కంపరం పుట్టేలాగా!!! పెద్దలు కుదిర్చాక తప్పదుకదా!! పెళ్ళి కుదిరాక కలకత్తా వచ్చాడా, అక్కడా ఇలాగే ముట్టుకోడానికి ప్రయత్నాలు…”హక్స్‌లీ పాండిత్యానికీ ప్రేమకీ సంబంధం లేదు. ఇతను నాకిష్టంలేదు. ఇతను నాకిష్టంలేదు” అని ఆత్మ ఘోషించినా పెద్దలు కుదిర్చిన పెళ్ళి తప్పించుకోవడం కష్టం…ఆమెకి సెక్స్‌ పరిజ్ఞానం లేదు. అతనేమో తన ఇంట్లో పనిచేసే పరిచారికలతో సంబంధాలు పెట్టుకుని ఆ విషయంలో సీనియర్‌ అయిపోయి వున్నాడు. ఇంట్లో అందులోనూ రాచరికంలాగా వుండే నాయర్ల ఇంట్లో సెక్స్‌ అనే మాటే ఆడవాళ్ళనోట రాకూడదు. పైగా శారీరక పరిపక్వత లేదు…పెళ్లినాటి రాత్రే ఆమెను అతను శారీరకంగా నొప్పించాడు. వొంటినిండా అతను చేసిన గాయాల తాలూకు నీలపు ఎర్రని మచ్చలు…కాపురానికి బొంబాయి వెళ్ళినా శరీరాల రాపిడేకానీ మానసిక సాన్నిహిత్యం లేదు. పైగా అతనికి హోమో సంబంధం కూడా వుంది అంతలోనే ముగ్గురుపిల్లలు ఇరవై ఏళ్ళకే…అప్పటికి ఆమెకి తన శరీరం గురించిన ఎరుక కలిగింది. భర్త ప్రవర్తన ఆమెని ఎంతగా నొప్పించిందంటే వివాహేతర సంబంధం పెట్టుకుని అతనిపైన పగ తీర్చుకోవాలనేటంత… ప్రేమకోసం తపన. ఈ శూన్యంలో కవిత్వం ఒక సంగీతంగా ఆమె హృదయాన్ని నింపింది, తన వైయక్తిక జీవన సంఘర్షణ, ఆవేదన నంతా ఆమె కవిత్వంలో వెళ్ళబోసింది…స్త్రీపురుష సంబంధాలలోని బోలుతనాన్ని, ప్రేమరాహిత్యాన్ని స్త్రీల లైంగికతని నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా నిర్ద్వందంగా తన రచనల్లో ప్రవహింపచేసింది. ఆమె ఆలోచన, ఆమె ఆవేదన, ఆమె తపన స్త్రీలందరి తపన, స్త్రీలందరి ఆవేదన. తనని తానో ఫెమినిస్టునని చెప్పుకోకపోయినా నలభై సంవత్సరాలనాడే స్త్రీల లైంగికత గురించి కేరళ సంప్రదాయ సమాజం ముందు మాట్లాడింది.
కాపురానికొచ్చీ రావడంతోనే గర్భం…నిండా పదహారేళ్ళు లేవు. అతనికి దగ్గర కావాలని అతనితో జీవితాన్ని అలవాటు చేసుకోవాలని ప్రయత్నిస్తుండగానే పురిటికని పుట్టింటికి పంపేశాడు.
పోనీ మంచి మంచి ఉత్తరాలైనా వ్రాశాడా అంటే అదీ లేదు. పిల్లవాణ్ణి చూడ్డానికొచ్చినా ఆ చిన్నారి మాతృమూర్తిని మనసుతో పలకరించలేదు. మళ్ళీ వచ్చాక ఆమెకి అర్థం అయింది. ఇంక అతనినించి ప్రేమని ఆశించడం అనవసరం. ఒకరోజు డాబాపైనుంచీ దూకేద్దామని కూడా అనుకుంది. కానీ, దిగివచ్చి దుఃఖం ఉపశమించేదాకా ఏడ్చేసి ”రంగులన్నీ చెరిపేసెయ్‌, మూసలోంచి మట్టిని తీసెయ్‌, నిన్నటి శేషం లేకుండా చెయ్‌” అనుకుని కలం పట్టుకుని కవితల్లో మనసు తెరిచింది. ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆ కవితే ఎ.ఇ.ఎన్‌లో పడింది.
ఒకచోట ఆమె ఇలా అంటుంది, ”నా వివాహం విఫలమైందని నేనందరితో చెప్పలేను. తిరిగి నా పుట్టింటికి పోలేను. విడాకులు అడగలేను..ఎందుకంటే, మూడుతరాలుగా మా ఇద్దరి కుటుంబాల మధ్య వున్న సత్సంబంధాలని చెడగొట్టలేను…..నా తల్లితండ్రులు, బంధువులు అందరికి కుటుంబ పరువు ముఖ్యం, ప్రాణం…, కుటుంబంలో విడాకులంటే కుష్టువ్యాధి సోకినంతగా బాధపడతారు. నా ఆత్మబోధ ప్రకారం మా ఆయన్ని విడిచిపెట్టి వచ్చినా మళ్ళీ నన్నెవరూ పెళ్ళి చేసుకోరు. నేను అంత అందగత్తెను కాకపోవటం ఒకటి, పైగా నా రెండేళ్లకొడుకు నన్ను పెళ్ళిచేసుకునే వాడికి ఒక బాదరబందీ అవుతాడు. ఉద్యోగం చేసి బ్రతికేందుకు తగ్గ విద్యార్హతలూ నాకులేవు, వ్యభిచారం చెయ్యలేను. నాకు నా భర్తపై వుండే ప్రేమ ఆ పని చెయ్యనివ్వదు. నేను దేంట్లోనూ ఒదగలేను”.
కమల తన తల్లి మేనమామలాగ పగలంతా వ్రాసుకుంటూ వుండలేదు. అమ్మలాగా పగలు మాత్రమే వ్రాయలేదు. ఇంట్లో ఉండే ఒక టేబిల్‌ మీద అంతా భోజనాలు చేశాక, దాన్ని శుభ్రం చేసుకుని, తెల్లవార్లూ వ్రాసుకునేది. పాలుతెచ్చే అతని సైకిల్‌ బెల్‌ వినపడే దాకా. అది ఆమె స్వంత సమయం. ఒక వ్యక్తిగా, రచయితగా తనని తాను ఆవిష్కరించుకునే సమయం. కవిత్వంతో మొదలుపెట్టి కథలూ నవలా, కాలమ్‌ ఇవ్వన్ని వ్రాస్తూ వుండటానికి కూడా కారణాలున్నయ్యంటుంది కమల…రచనల ద్వారా వచ్చే డబ్బు వేన్నీళ్లకు చన్నీళ్లు అని భర్త భావించి ఆమెని వ్రాసుకోనిచ్చాడట.
ఇట్లా ఇంటిపనంతా అయినాక డైనింగు టేబిల్‌ శుభ్రం చేసుకుని రచయిత అవతారమెత్తిన అనుభవం మనలో చాలామందికి ఉండే వుంటుంది. మనకి వ్రాసుకోవాలన్న ఉత్సాహం వచ్చినప్పుడు, స్త్రీలుగా గృహిణులుగా మనకి సమాజం నిర్దేశించిన కర్తవ్యాలూ, ప్రాథమ్యాలూ, ఆ ఉత్సాహం మీద నీళ్ళు చల్లిన సందర్భాలు కూడా వచ్చే వుంటాయి. అందుకే కమల అంటుంది ”ఇంకా నయం, మా ఆయన వ్రాసుకోనిస్తున్నాడు, అట్లా భర్తలు పర్మిషన్‌ ఇవ్వక ఎన్నెన్ని నైపుణ్యాలు అణిగిపోయాయో!” ఏ మాటకామాటే చెప్పాలి. కమలా వాళ్ళాయన మంచివాడే, ఎందుకంటే ”నువ్వు ఇలా ఎందుకు వ్రాశావు? ఇలా వ్రాయడం తప్పు” అని అన్నాడనుకోండి. కమలాదాసూ లేదు, మాధవీ కుట్టీ లేదు. ”మై స్టోరీ” అసలే లేదు. కమలా వాళ్ళాయనకి ఉద్యోగం ప్రాణం. ఫైళ్ళే ప్రపంచం.
రచన ఆమెకొక ”కంపల్షన్‌ న్యూరోసిస్‌” అయింది, ఆమె కవిత్వ నిర్మాణంపైనా, శిల్పంపైనా కొన్ని విమర్శలున్నప్పటికీ భారతీయాంగ్ల సాహిత్యంలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. మళయాళ పాఠకులకి ఎంతో ప్రీతిపాత్రమైంది. వివాహం, మాతృత్వం స్త్రీలకు వారి శరీరాలతో ఉండే అనుబంధం, వారి లైంగికతపై ఉండే కౌటుంబిక సామాజిక అదుపు, సంప్రదాయ సమాజంలో స్త్రీలకు నిర్దేశించిన పాత్రల పోషణపై విమర్శ, ఆమె కవితా వస్తువులు…ఎంతో సూటిగా పొదుపైన పదాలతో స్త్రీ సంవేదనని ఆవిష్కరిస్తుంది. ప్రేమాన్వేషణ కవిత్వమంతా ఒక విషాద సంగీతంలా చుట్టుకుని వుంటుంది.
”ఇంతకాలం కలిసి బ్రతికి, ప్రేమించుకోలేకపోయిన మనని ఎవరు మాత్రం రక్షించగలరు?” అంటుంది.
”నేను ఒక బిక్షాన్ని, సరైన పాత్రలో రాలడం కోసం తపిస్తున్నాను” అంటుంది.
”నేనెక్కడ వున్నా అక్కడంతా ప్రేమ వ్యాపించి వుంటుంది. నేను ప్రేమని పంచుతాను. ఆ ప్రేమని నాకు అంత గాఢంగానూ తిరిగి ఇచ్చేవారెవరూ దొరకలేదు. ప్రేమ పొందడంలో నేను విఫలమయినాను” అంటుంది.
”కన్నీళ్ళతో మెత్తగా చేసిన పడక మీద ఆమె దుఃఖిస్తూ పడుకుంది” అని వైవాహిక జీవితానికి ఉపమానం ఇస్తుంది.
తన బాల్యంన్నించీ తనకి 42 సంవత్సరాల వయస్సులో మృత్యువు అంచులు తాకేదాకా వెళ్ళిన జబ్బు చేసినదాకా ఆమె వ్రాసిన ఆత్మకథలో తనకి కల కొన్ని వివాహేతర సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు ”అది ప్రేమ రుతువు. నేను ఆకర్షణీయంగా వుండేదాన్ని కనుక చాలామంది నా వెంట పడేవారు. నేను ప్రేమకోసం తపించాను. అది ఇంట్లో లభించనప్పుడు కాస్త పక్కకి మళ్లడం వుంటుందేమో!” అన్నది. ఎన్నో విషయాలనూ తనకున్న వివాహేతర స్నేహాలనూ భర్తపై తనకున్న అసంతృప్తినీ నిస్సంకోచంగా బహిర్గతం చేసినప్పుడు కూడా తన భర్త ఏమీ అనలేదని అతని సలహాతోనే ఆ పుస్తకాన్నీ సీరియల్‌గా వెయ్యడానికిచ్చాననీ, అందువల్ల వచ్చిన డబ్బు తన హాస్పిటల్‌ బిల్లులకేకాక తన పిల్లలకు కూడా ఉపయోగపడిందనీ, తన భర్తకే కనుక అసూయ వుంటే తన వివాహం ఇంతకాలం నిలిచివుండేది కాదనీ అంటూనే తను ప్రేమ వ్యవహారాల గురించి వ్రాసివుండచ్చుగాక, కానీ శారీరక సంబంధాలనెప్పుడూ ఉన్నతీకరించలేదనీ తను ఆశించిన ప్రేమ రాధాకృష్ణుల ప్రేమవంటిదనీ అంటుంది.
”నేను నా ఆత్మకథ వ్రాసినప్పుడు అంతా షాక్‌ అయినట్లు నటించారు కానీ నిజానికి ఎవరూ షాక్‌ అవలేదు…మా భూస్వామ్య కుటుంబాలలో వ్యవహారాలు లేని మగవాళ్లెవరు? రాత్రిపూట రహస్యంగా పనికత్తెల ఇళ్లలో చొరబడి వాళ్ళకి కడుపులొస్తే నదిలోకి తోసినవాళ్ళున్నారు. ఇవ్వన్నీ అందరికి తెలుసు. షాక్‌ అయాం అని చెప్పటం అంటే తమని తాము అమాయకులమని చెప్పుకోటం అన్నమాట. నేనెవర్ని చంపలేదు. ఎవర్నీ ద్వేషించలేదు. ప్రేమకోసమే పరితపించాను.”
”నేను ప్రేమకోసం పరితపించాను. కానీ అది నాకు చాలా ఆలస్యంగా లభించింది. యౌవ్వనకాలంలో లభించలేదు. ప్రేమాన్వేషణలోనే అనేక సంబంధాలలోకి వెళ్ళాను. కానీ అది తప్పు” అని తన అరవైనాలుగేళ్ళ వయసులో శోభా వారియర్‌కిచ్చిన ఇంటర్‌వ్యూలో చెప్పింది. నమ్మలేనివిధంగా తన జీవనసంధ్యాకాలంలో తనకి ప్రేమ దొరికిందని అది తన అసంఖ్యాకమైన సామాన్య పాఠకులనించీననీ అన్నది.
”ఆమె తన ఒంటరి ప్రపంచంలో తన ఒంటరితనపు భావాలతో జీవించినా, సంప్రదాయాన్ని పాటిస్తూ తన ఇంటిని అందులోని భద్రతనూ నిలుపుకున్నది” అన్నాడు ఒక విమర్శకుడు….పిల్లలు, జబ్బులు, భర్త స్నేహితులు, ఇరుగుపొరుగు, తనకనేక సుస్తీలు, ఇట్లా అతిసామాన్య గృహిణిగా ఒకవైపు, రచయితగా, రచన తెచ్చిన ప్రఖ్యాతీ. అందువల్ల లభించిన మిత్రులూ, దేశవిదేశాలలో పర్యటనలూ ప్రసంగాలు కొన్ని సామాజిక కార్యక్రమాలూ, వివాదాలూ, విమర్శలూ, కొసకంటా ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే, సురయ్యాగా మారి బురఖా వేసుకునీ మంచి గులాబిరంగు బురఖాతో ఒక అమెరికన్‌ జర్నలిస్ట్‌ని ఆశ్చర్యపరిచిందట.
కమలకి కవిత వ్రాయడమే చాలా ఇష్టం. కానీ మనదేశంలో అది ”అమ్ముడుపోదు” కనుక ఆమె తక్కిన ప్రక్రియలపై ఎక్కువ కృషిని ఖర్చుపెట్టింది. డబ్బొచ్చే ప్రక్రియ అయిన కాలమ్‌ వ్రాయడంకూడా అందుకే మొదలుపెట్టింది.
అయినప్పటికీ ఆమె కొన్ని మంచికథలు వ్రాసింది. పద్మావతీ ద హార్లట్‌ అనే కథా సంకలనం ఇంగ్లీష్‌లో వచ్చింది. మేధావుల మెప్పుకన్న సామాన్య పాఠకుల మన్ననలే తనను ఎక్కువ సంతోషపెట్టాయట, అలా అని శోభావారియర్‌కి చెప్పింది.
మంచి చిత్రకారిణి అయిన కమల చిత్రాలు అనేక ఎగ్జిబిషన్‌లలో ఎక్కువ ధరలకే అమ్ముడుపోయాయట.
1976లో కమలాదాస్‌ ”మై స్టోరీ” వచ్చినప్పుడు అందర్లాగే నేనూ చాలా ఆత్రంగా కొని చదివాను. తరువాత ఎవరికో చదవడానికిచ్చి పోగొట్టుకున్నాను. మళ్ళీ అదే ఎడిషన్‌ నాకు భూమిక సత్యవతి కొరియర్‌లో పంపించింది, కమలాదాస్‌ ”నెయ్యి పాయసం” కథలో అమ్మ చనిపోయిందని తెలియని పిల్లలు ఆమె చేసిపెట్టిన నెయ్యి పాయసాన్ని ఆత్రంగా తిన్నట్లు, నేను ఆ పుస్తకాన్ని కళ్ళు చికిలించుకుని అంత ఆత్రంగానూ చదివాను. ఇరవైమూడు సంవత్సరాల తరవాత ఆ పుస్తకాన్ని ఇప్పుడు చదవడం నాకొక కొత్త అనుభవాన్నిచ్చింది. పుస్తకం అట్టమీద ”సిజిలింగు, స్పైసీ, లవబుల్‌, ఆటోబయాగ్రఫీ, ద మోస్ట్‌ ”సెన్సువస్‌ లైఫ్‌ స్టోరీ ఎవర్‌ రిటెన్‌” అని చదివి ఇప్పుడు నేను చాలా గాయపడ్డాను, ఒక స్త్రీ తన ఆవేదనని, సంవేదనని, పుస్తకంలా తెరిచిపెడితే అది ”స్పైసీ” అనీ సెన్సువస్‌ అనీ ప్రచారం చేసి అమ్మకాలు పెంచుకోడం ఎంత దుర్మార్గం అనిపించింది, ఆమె అంతరంగ కథనం మనని వెంటలాక్కుపోతుంది. ఎందుకంటే ఆమె అనుభవాలు చాలామంది స్త్రీల అనుభవాలు. ఈ పుస్తకాన్ని ఒక సంచలనాత్మక, బెస్ట్‌సెల్లర్‌ గ్రంథంలా కాక అనంతకోటి స్త్రీల మౌనభావాలను అధ్యయనం చెయ్యడానికి మళ్ళీ చదవాల్సిన అవసరం వుంది. ఇప్పటికింకా మనం నిషేధ వస్తువుగా భావిస్తున్న స్త్రీల లైంగికత గురించి నలభై సంవత్సరాల కిందటి కమలాదాస్‌ అభిప్రాయాలని మళ్ళీ స్త్రీవాద తాత్విక దృక్కోణం నించీ చూడాలి. ఆమె ఒక మెరుపు, ఒక విషాద గీతం, ఒక సెలెబ్రిటీ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రచయిత, యూనివర్సిటీలలో పాఠ్యాంశాలలో తన కవితల్ని పొదిగిన శిల్పి. అత్యంత మానవీయ లక్షణమైన ప్రేమ కోసం అలమటించిన స్త్రీ. ఒక తృషిత…ఆమె శరీరానికి అల్విదా…
(కమలాదాస్‌ని చూడాలంటే ఆమె తన నలాపట్‌ హౌస్‌లో తిరుగుతూ మాట్లాడటం, కవిత చదవడం చూడాలంటే యూ ట్యూబ్‌కి వెళ్ళొచ్చు.)

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

2 Responses to ఆమె కవితకి ”కభి అల్విదా న కెహనా”

  1. pasupuleti geetha says:

    సత్యవతి గారు,
    కభి అల్విదా నా కెహనా – అంటూ కమల సురయ్యా స్మ్రుతులతో మనసును కదిలించారు. కమల కథలు, కవితలు చదివాను. ఆమె అంతరంగ వేదనకు మీ ఆర్టికల్ అద్దం పట్టింది. స్త్రీలుగా మనందరి అనుభవాలన్నీ ఇంచుమించు ఇలాంటివే. మంచి విషయాన్ని మనమం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    – పసుపులేటి గీత

  2. రహంతుల్లా says:

    ఊరుమారినా ఉనికి మారునా
    మనిషి దాగినా మమత దాగునా
    మనిషి దాగినా మమత దాగునా
    మరలిరాని పయనంలో మజిలీ లేదు
    ఆడదాని కన్నీటికి అంతేలేదు

    అనురాగ దీపం అసమాన త్యాగం
    స్త్రీజాతికొరకే సృజియించె దైవం
    చిరునవ్వులన్నీ పెరవారికొసగి
    చీకటులలోనే జీవించు యువతి
    తలపులే వీడవు వీడేది మనిషే
    వలపులే వాడవు వాడేది తనువే

    మగవానికేమో ఒకనాటి సుఖమూ
    కులకాంతకదియే కలకాల ధనమూ
    తనవాడు వీడా అపవాదు తోడా
    పదినెలలమోతా చురకత్తి కోతా
    సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
    సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
    –ఆరుద్ర

Leave a Reply to pasupuleti geetha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.