సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళి అక్కడే మకాం పెట్టిన ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు వుండాలని మీరింకా ఎందుకనుకుంటున్నారు? అంటూ ఇటీవల ఒక విలేఖరి నన్ను ప్రశ్నించాడు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి ఎనిమిది గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అతను పై ప్రశ్న వేసాడు. సునీత అంతరిక్ష యానం ఈ దేశంలోని ఆడవాళ్ళందరి సమస్యలను హాంఫట్ మని ఊదేయగలిగితే బాగానే వుంటుంది. ఇండియా వెలిగిపోతోంది అంటూ చీకటి కోణాలని మరింత చీకటిలోకి నెట్టేయడం లాగానే వుంది ఈ ఆర్గ్యుమెంటు. ఒక దేశ అభివృద్ధిని మహానగరాల అభివృద్ధి అద్దాల్లోంచి చూసి, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కంటే దిగజారిపోయిన దుస్థితిని విస్మరించడంలాగే వుంటుంది ఈ వాదన. హైదరాబాదు అబ్బో ఎంత మారిపోయింది? ఏం రోడ్లు, ఏం ఫ్లై ఓవర్లు? ఏమి మాల్స్, ఏమి మల్టీప్లెక్స్లు, ఏమి ‘ఫ్రెష్’ కూరగాయలు అంటూ నోరెళ్లబెట్టేవారికి, “అభివృద్ధి” అంటే నగరాన్ని సుందరీకరించే ప్రాజెక్టులు అనుకునే వారికి, ఈ సౌందర్యీకరణ హింసకి బలవుతున్న పేదప్రజలు అస్సలు ఆనరు. పెద్ద పెద్ద కార్లు తిరగడానికి పెద్ద పెద్ద రహదారులు కావాలి? ఎకాఎకిన అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ వే లు కావాలి. వీటన్నింటిని అభివృద్ధి నమూనాలుగా చూపించి, మనమెంత అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పినట్లుగానే వుంటుంది. ఈ కొందరి అభివృద్ధికి బలౌతున్న కోట్లాది ప్రజల దుర్భర బతుకులు లెక్కలోకి రాకుండా పోతాయి.
అలాగే కొంతమంది స్త్రీలు తమ తమ వ్యక్తిగత విజయాలతో తారాజువ్వల్లా దూసుకెళుతున్న నేపధ్యం. మొత్తం స్త్రీల సాధికారిత కింద లెక్కగట్టడం ఇలాంటిదే. ప్రపంచీకరణ ప్రక్రియ వేగవంతమౌతున్న కొద్దీ స్త్రీల జీవితాలు మరింత దుర్భరమౌతున్నాయని ఎన్నో సంకేతాలు విన్పిస్తున్నాయి. బొంబాయి, కలకత్తాలాంటి మహానగరాల్లోని వేశ్యావాటికల్లో ఆంధ్రయువతులు, ఆడపిల్లల సంఖ్య అనూహ్యంగా పెరగడానికి కారణమేమిటో ఏ సామాజిక వేత్తయినా అధ్యయనం చేసారా ? అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో శంషాబాదు చుట్టు పక్కల కళ కళలాడే పూల, పండ్ల తోటలు ధ్వంసమై, ఇచ్చిన అరకొర నష్టపరిహారం హారతి కర్పూరంలా హరించుకుపోయి, పనుల్లేక పడుపువృత్తిలోకి తరలిపోతున్న వేలాది స్త్రీల దు:ఖ గాథల్ని ఎందుకు ఎవరూ రికార్డు చేయడం లేదు? ఆంధ్ర రాష్ట్రం వరుస క్రమంలో ముందున్నట్టుగానే మిగతా అన్నింటిలోను నెంబర్వన్గా ఎందుకుంది? హెచ్ఐవి ఎయిడ్స్లో నెంబర్ వన్, కుటుంబహింసలో, అత్యాచారాల్లోను నెంబర్వన్. సెక్స్ వర్క్లోను నెంబర్వన్గా నిలబడిన చోట స్త్రీలు సుఖ సంతోషాలతో తులతూగుతున్నారని, సాధికారత, స్వయం నిర్ణయాధికారం స్త్రీలకు వచ్చేసిందని సునీతా విలియమ్స్ని చూపించి నమ్మమనడం, నమ్మించబూనడం ఎంత విభ్రాంతికరం.
నగరాభివృద్ధి కళ్ళద్దాలలోంచి చూసినపుడు, సెన్సెక్ బూమ్లో పరవశించిపోయినపుడు, కొందరు అతి భాగ్యవంతుల జీవన శైలులు చూసినపుడు, ఐదంకెల జీతాల్లో అలరారుతున్న వాళ్ళని చూసినపుడు ఈ దేశం అభివృద్ధి పధంలోకి దూసుకెళుతోందని భ్రమలు కలగడం సహజం. దానిని దేశ ప్రజలందరి అభివృద్ధిగా చూపించడంలోనే వుంది చిక్కంతా.
స్త్రీల స్థితి కొన్ని రంగాల్లో మెరుగవుతున్న విషయం కాదనలేం. ఎందరో స్త్రీలు ఎన్నో ఛాలెంజింగ్ పదవుల్లో వెలుగుతున్న విషయం కూడా కాదనలేం. అయితే సగటు స్త్రీ పరిస్థితిలో ఏమీ మార్పులేదు. గ్రామీణ స్త్రీల పరిస్థితి మరింత దిగజారింది. వ్యవసాయాధార కుటుంబాల్లోను, చేనేత కుటుంబాల్లోను, చేతి వృత్తుల కుటుంబాల్లోను మృత్యు ఘోష వినబడుతోంది. కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యల వేపు అడుగువేయడం ఎక్కువైంది. కుటుంబం మొత్తానికి తిండి పెట్టాల్సిన స్త్రీల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిల్లాడుతోంది. ప్రపంచీకరణ మరింత హింసని ఈ స్త్రీల మీద ఎక్కుపెట్టింది. ఫలితం గ్రామీణ, పట్టణ ప్రాంత మురికివాడల స్త్రీలు మరిన్ని సమస్యల్లో మునిగిపోయారు.
ఈ నేపధ్యంలోంచి చూసినపుడు అంతర్జాతీయ మహిళాదినం జరుపుకోవాల్సిన ఆవశ్యకత మరింత ఎక్కువైంది. స్త్రీల వాస్తవ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువైంది. సునీతావిలియమ్స్ గెలుపు కంటే పంటలెండి పోయి, మగ్గం విరిగిపోయి, చేతివృత్తుల పరికరాలు నాశనమై పోయి ప్రపంచీకరణ పెంచుతున్న హింసలో కుమిలి కుమిలి ఏడుస్తున్న కోట్లాది స్త్రీలకి అండగా వుండాల్సిన ఆవశ్యకతని మార్చి ఎనిమిదిన మనం అనివార్యంగా అలవర్చుకోవాలి. మరింత నిబద్ధతతో మనం మార్చి ఎనిమిదిని ఒక పోరాట దినంగా జరుపుకోవాలి. మార్చి ఎనిమిది మార్గంలో నడవాలి మనం.
మహిళల సమస్యలు తీరిపోయినట్టు ప్రవర్తించడం మనని మనం మోసగించుకున్నట్టే ఉంటుంది. దీన్ని కొంతవరకూ తల్లులు నివారించగలరేమో. తమ కొడుకులని జెండర్ విషయంలో సెన్సిటైజ్ చెయ్యగలిగితే వారి దృక్పథంలో మార్పు కలుగుతుంది. చిన్నప్పటినించీ “మగమహారాజుల్ని” తయారు చెయ్యడంలో తల్లి పాత్ర లేదనలేము. పెద్దయాక ఎలాగూ సమాజం అటువంటి మెసేజ్ ఇస్తుంది కనక చిన్నప్పుడే దీన్ని సరిదిద్దడం అవసరమేమో తల్లులు గుర్తించాలి. ఈ విషయాన్ని “మగ వెధవలకి” వదిలెయ్యడం మంచిది కాదు.