అభినందనలతో వ్రాయునది జనవరి-07 పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు కథలోని స్త్రీ పాత్రలు – ఎలసాని వేదవతిగారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఒక్కొక్క కథలోని స్త్రీ పాత్రల విశ్లేషణ వేదవతిగారు బాగా చేశారు. లిడియో శాఖో గురించి ఆలోచించండి – ఓల్గాగారి రిపోర్టు చాలా బాగుంది. కవర్పేజీ, కవిత చాలా సహజంగా వున్నాయి. ఏమైనా క్రమం తప్పకుండా ‘భూమిక’ తెస్తున్న మీ కృషికి అభినందనలు.
బి. జ్యోతి, ఎడిటర్, మహిళామార్గం
భూమిక దినదినాభివృద్ధి పొందడంలో మీ భూమిక చెప్పుకోదగింది. ప్రతి అంశం అర్ధవంతంగా తీర్చిదిద్దబడుతోంది. కృతజ్ఞతాభినందనలు.
ఎ.బి. ఆనంద్, విజయవాడ
మీరు పంపుతున్న ‘భూమిక’ పత్రిక క్రమం తప్పకుండా అందుతోంది. పత్రిక చాలా బాగుంటోంది. ప్రతి సంచికలోను ఒక్కో సమస్యను ప్రధానాంశంగా చేసుకొని అందరికి అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా జనవరి భూమికలోని ప్రతి అంశం మమ్మల్ని చాలా ఆకట్టుకొంది. ప్రసన్న కుమారిగారు రాసిన ‘ప్రపంచీకరణ నేపధ్యంలో స్త్రీల సమస్యలు’ వ్యాసం చాలా బాగుంది. ప్రపంచీకరణ ముసుగులో గ్రామీణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయాలు, కుట్రలను వీటి కారణంగా ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే పరిణామాలను ముందు హెచ్చరికగా ప్రజానీకానికి బాగా తెలియజేశారు. బహుళజాతి సంస్థల ప్రభావం ముఖంగా వ్యవసాయరంగం, చేనేత వృత్తులు, చిన్నతరహా కుటీర పరిశ్రమలపై ఎనలేని ప్రభావం చూపుతోంది. వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది కార్మికులు నేడు పొట్టనింపుకోవడానికి కూడా నాలుగు మెతుకులు కరువై ఆకలి చావులతో వీధినపడి ఎంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. ధనార్జనే ధ్యేయంగా అవి ఎంతటి ఘోరమైన పనులకు పూనుకున్నాయో గత అనుభవాలే మనకు తెలియజేశాయి. సమస్త భారతానికి ఆహారం ఉత్పత్తి చేసే రైతుకి తినే తిండి లేక పస్తులుండాల్సిన పరిస్థితి. మన శరీర అవయవాలను కప్పుకోవడానికి వస్త్రోత్పత్తి చేసే చేనేత కార్మికుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన హీనస్థితి. ప్రజా జీవితాలతో వ్యాపారం చేస్తున్న ఈ సంస్థల కారణంగా ఎక్కువగా నష్టపోతున్నవారిలో మహిళలే అధికం అన్నది వాస్తవం. రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబ పోషణభారం, అప్పుల భారం రెండూ స్త్రీ మీదే పడుతోంది. ఈ సమాజం విధించిన కట్టుబాట్ల సంకెళ్ళమధ్య మహిళ తరతరాల నుంచి నలిగిపోతూ వస్తోంది. ఈ బంధనాలనుంచి స్త్రీని విముక్తి చేసి తన శక్తి ఏమిటో ప్రపంచానికి సాటి చెప్పాలంటే స్త్రీవాద పత్రికలు, రచనలు ఎంతో అవసరం.
అనిల్, సెంట్రల్ జైల్, మైసూర్
భూమిక నవంబర్ సంచికను వి. ప్రతిమగారు ఇచ్చారు. ఆసాంతం చదివాను. చక్కటి పుస్తకం. ఇంతకాలం మిస్సయినందుకు బాధపడ్డాను. శైలిని మించి భావం – భావాన్ని మించి సంస్కారం రచనల్లో ప్రస్పుటంగా కనిపించింది. టోటల్గా ఆర్ధ్రతకి పెద్ద పీట వేసింది భూమిక. చదువుతుంటే మనసుని దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది. అభినందనలు.
కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు
మీ కలత నిద్ర ఎలా వున్నా కవిత మాత్రం చాలా బాగుంది.
కృష్ణ ( వెబ్లో చదివి )
నాకీ రోజు పూలు కానుకగా వచ్చాయి కవితని చాలా బాగా అనువాదం చేసారు. మీ శైలి బాగుంది. “నేలరాలిన మొగ్గ” కవిత చదివి నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. కానీ నా కళ్ళు మాటలాడుతున్నాయి. కన్నీటిభాషలో మాయమవుతున్న మనసు కథ చాలా బాగుంది. నిజమే. మమతల సంకెళ్ళు తెంచుకుని స్వేచ్ఛ సాధించామనుకోవడం, మూలాలు మరిచి మిధ్యా ప్రపంచంలో మిణుగురులా తిరగడం ఈ కాలంలో సర్వసాధారణం అయిపోయింది. కోటమ్మలాంటి వాళ్ళు ఇపుడు కోట్ల సంఖ్యలో వున్నారు.
“తెల్లారేక కళ్ళు విప్పితే
కళ్ళల్లో దాచుకున్న కలలూ లేవు
మనసులో మూటకట్టాననుకున్న
పద్యపాఠాలు లేవు
నిర్లిప్తంగా మిగిలిపోయిన నేను” – అద్భుతం. నాకు కూడా ఇలాగే జరుగుతూంటుంది.
రాధిక (వెబ్లో చదివి)