– శీలాసుభద్రాదేవి
ఒకప్పుడు ఏడాదికి అతి తక్కువ సంఖ్యలో కవితా సంపుటాలు వెలువడేవి. అందులోనూ కవయిత్రుల పుస్తకాలు మరీ తక్కువ. ఇటీవల ఏడాదికి కవయిత్రుల పుస్తకాలే అయిదారుకు తక్కువ కాకుండా వస్తున్నాయి.
కవయిత్రుల కవిత్వం పట్ల చూపుతున్న ఆసక్తినీ, సృజనాత్మకతనీ, పోటీపడి ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకొంటూ సమాజంలోని అనేక సమస్యల పట్ల తమ స్పందననీ తెలియజేస్తూ కవిత్వ రంగంలో ముందుకు దూసుకురావటం సంతోషకరమైన విషయం.
ఇటీవల కాలంలో వస్తున్న కవిత్వం చదువుతుంటే ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ వుంటుంది. వస్తు వైవిధ్యం, సామాజిక సమస్యల పట్ల అవగాహన, పటిష్టమైన దృక్పధం, కవిత్వ గాఢత, నిర్మాణ శిల్పంలోని పరిణత స్పష్టంగా కనపిస్తోంది. కొత్త టెక్నిక్ మెరుపులా గుండెల్ని తాకుతుంది.
అంతకుముందు కేవలం వచన సాహిత్యానికే ఆసక్తి చూపేవారు సైతం ఈనాడు కవిత్వంవేపు ఆకర్షితులౌతున్నారు. స్పందించిన విషయాన్నో, అనుభూతినో, ఆవేదననో, ఆవేశాన్నో, సంతోషాన్నో, దుఃఖాన్నో దేన్నైనా సూటిగా, స్పష్టంగా పాఠకుల హృదయాల్ని తాకేలా చెప్పటానికి కవిత్వం ఒక మంచి ప్రక్రియగా భావించి బహుశా వారు కూడా కవిత్వం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ ఏడాది మరీ ఎక్కువగా పుస్తకాలు వెలుగుచూసాయి. కొత్త కవయిత్రులు వేదికమీదికి వచ్చారు. నానీల ప్రక్రియ చేపట్టి సంపుటులు వేశారు. ఆగిపోయిందనుకున్న మినీ కవితలు, హైకూలు మైకందుకొన్నాయి.
ఈ ఏడాది వచ్చిన పాతతరం, కొత్తతరం కవయిత్రులు ప్రచురించుకొన్న కవితా సంపుటాల గురించి సంక్షిప్త పరిచయం చేయటానికి ప్రయత్నిస్తాను.
ఆదూరి సత్యవతి దేవిగారు కవిత్వాన్ని ప్రేమిస్తారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తారు. రోజురోజుకు మనిషి యాంత్రికంగా మారిపోవటాన్ని చూసి ఆవేదన చెందుతారు. ఈమె కవిత్వంలో భావాలు మనోజ్ఞంగా సాగిపోతుంటాయి. చక్కని పద చిత్రాలు చెక్కుతారు.
‘నిలువెల్లా స్పర్శించిన జలతరంగిణీ వాద్య విశేషమై చుట్టుకొన్నప్పుడు
తుప్పుపట్టి దశాబ్దాలుగా దేహపు కలుగుల్లో
మురికి నిద్రపోతున్న విద్యుత్ భావ చక్రాలకి ఊపిరందుతుంది’ అంటారు ‘కొత్త చిత్రం’ కవితలో.
కవిత్వం చదువుతున్నంతసేపూ మనల్ని పుష్పాలమధ్య కూర్చోబెట్టి స్నేహ పరిమళాల్తో చుట్టేస్తారు.
ఈమె కవిత్వం నిండా-
“కవిత్వపు వెన్నెల మొగ్గలు
కాలవాహినిపై రంగుల పడవలేసుకొని పయనిస్తుంటాయి.
ఈ పుస్తకంలో విశాఖపట్నంమీద రాసిన ‘సింఫనీ’. ఒక మంచి కవిత.
మానవీయత కరిగిపోతున్న ఈ కాలాన్ని చూసి ఆవేదన చెందుతుంటారు.
“నాకంటూ యింతలోకాన్ని అమర్చిన
భావుకతా వూటసిరిని
మరమనుషులెవరో వూడ్చుకుపోయారు”
ఆదూరి సత్యవతీదేవి గారు తమ “వేయి రంగుల వెలుగు రాగం” కవితా సంపుటిలోని-
పువ్వు పక్కన పూవు అమరినట్లు
మొగ్గలోంచి సుగంధం పైకెగసినట్లు
ఎంతో లాలిత్య తమకంగా
మనిషీ మనిషీ అల్లుకొంటూ వుండాల’ని
‘పచ్చని గీతం’లో పలవరిస్తుంటారు.
నాయని కృష్ణకుమారి గారు చాలాకాలం తర్వాత మళ్ళీ ఈ ఏడాది “సౌభద్ర భద్ర రూపం” పేరున కవితా సంపుటి అచ్చు వేయించు కొన్నారు. పుస్తకం ముఖచిత్రంగా వారి తల్లిగారి చిత్రంతో వేసి ఆమెకే అంకితం ఇచ్చారు.
తన తల్లిమీదగల ఆత్మీయత, ప్రేమ ఈ కవితల్లో చాలావాటిలో తొంగిచూస్తుంది.
నిన్నుచూడాలని/ మనస్సు తరతరలాడినప్పుడు
మూసుకొన్న రెప్పలలోపల / నిండుపున్నమి చంద్రుడు
పక్షుల కలకలారవంలో/ నీ తీయని గొంతుసవ్వడి”
ఈమె ప్రాచీన సాహిత్యం బాగా చదివినప్పటికీ, జానపద సాహిత్యంలో పరిశోధన చేయటం వల్లనేమో కమ్మని తేట తెలుగు పదాలే కవితల నిండా వుంటాయి.
సంస్కృత పదాడంబరం ఎక్కువగా కనిపించదు.
‘గాయపడిన రెక్క’ కవితలో
‘పొగలా ఒంటికి చుట్టుకుపోతున్న శూన్యం
దీనరాగాల మూర్ఛనల్లో
నుసినుసిగా రాలే దిగులు’ అంటారు.
మాతృమూర్తి ఆలాపనలో ఈమె తన కవితల్లో చాలా చోట్ల బాల్యాన్ని వెతుక్కుంటూ, బాల్య పరిమళాల్ని అద్దుకొంటూ వుండటం మనం గమనిస్తాం.
సుదీర్ఘ జీవితంలో చూసిన అనుభవాలు, జీవిత గమనంలోని వెదుకులాట, తన వెనక తానే పరుగులు తీసి, అలసి సొలసి పోవటం ఈ కవితల నిండా మనంకూడా సౌభద్ర రూపాన్ని దర్శించగలం.
ఒక మంచి పాటకీ, మంచి స్నేహానికీ, మంచు బిదువులకీ పులకరించిపోయే భావుకత్వం వున్న కె.బి. లక్ష్మి ‘గమనం’ పేరున సంపుటి వెలువరించింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో అన్ని కవితలు వివిధ కవి సమ్మేళనాలలో చదివినవే. ఆమె తన ముందు మాటలో చెప్పినట్లు ప్రేక్షకుల ఆదరణ, కరతాళ ధ్వనుల సాక్షిగా నడిచినవే.
వింటున్న శ్రోత లేదా ప్రేక్షకులకు చెప్పదలచుకొన్నది స్పష్టంగా, ఆకర్షణీయంగా ప్రయోజనాత్మకంగా అందించే ప్రయత్నం చాలా కవితల్లో కనిపిస్తుంది.
“జర ఖుషీ, తోడాసీ ముస్కురాహత్
హల్కాదిల్, గింత మొహబ్బత్ గంత దోస్తీ వుండాలె
గివేం లేకుంటే అదేం బతుకన్న
డ్రైనేజి నల్ల లెక్క
మన జిందగీ మనదే ఎవులకోసం కాదు”
ఇలా కొంత హైదరాబాదీ ఉర్దూ, తెలంగాణా మాండలీకంలో చాలా కవితలు సాగుతాయి.
అక్షరాల గారడీ లేకుండా ఆమె మాటల్లాగే అలవోకగా చెప్పినట్లు ఉన్నా సామాజిక ప్రయోజనాన్ని మర్చిపోదని అక్కడక్కడ కొన్ని కవితలు చదివినప్పుడు అర్థం అవుతుంది.
“ఒక స్త్రీ ఆవహించి వున్న ఈ శరీరం
ఎంతకూ లేవదు యుగయుగాలుగా స్త్రీ
ఎగరడానికి ప్రయత్నిస్తూనే వుంది” అంటూ కనపడీ కనబడకుండా కొంత స్త్రీ స్పృహని స్పష్టపరుస్తుంది.
శ్రీమతి శారదా అశోకవర్ధన్ తమ కొత్త పుస్తకం “అక్షరం నా ఆయుధం” పుస్తకం జీవితంలో ఎలా తోడుగా నిలుస్తుందో తెలియజేస్తూ-
“చెయ్యి పట్టుకొని ఆడుకోవడానికి
లాక్కుపోతున్న స్నేహితుల్లా
పేజీల్లోకి లాక్కుపోతుంది అక్షరం”
ఇందులోని కవితల్లో కొంత కొత్త దృష్టికోణం కనిపిస్తోంది. రాత్రికి రాత్రే ఫాక్షనిష్టులు పొట్టన బెట్టుకొన్నట్లు ఇంటిప్రక్క కూల్చబడిన గుల్మొహర్ చెట్టుని చూసి “మమతలు మాసిపోతున్నాయి మానులనీ బతకనివ్వరా” అంటూ ఆవేదన చెందుతారు.
భావ కవిత్వ ఛాయలు అక్కడక్కడ తొంగి చూస్తున్నా అంతరించి పోతున్న తెలుగు భాష పట్ల ఆందోళన, దేశభక్తి పూరిత కవితలు, బీటలు వారిపోతున్న కుటుంబాల పట్ల ఆవేదనతో కూడిన కవితలూ ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
శైలజామిత్ర “అంతర్మధన వేళ” లో సమాజంలోని అనేక సమస్యల గురించి ఆలోచించాల్సి వుందని తెలియజేస్తుంది.
“బాల బాలికలు విద్యాఖైదీలుగా చేస్తున్న
నేటి విద్యా వ్యవస్థ నుండి…” జాతీయ అంతర్జాతీయ విషయాల పట్ల స్పందన వుంది.
కవిత్వం ఒక బ్రహ్మ పదార్థంగా వుండకూడదు. రాస్తున్న విషయం పట్ల ఒక అవగాహన, స్పష్టతా వుండాలి. అది లేనప్పుడు కవిత్వం యొక్క ప్రయోజనం సిద్ధించదు. శైలజామిత్ర అక్షరాన్ని ప్రేమిస్తూ, సున్నితంగా, మృదువుగా ప్రతీ విషయాన్ని స్పర్శిస్తారు. ఈమె కవిత్వంలో అంతర్లయగా నిర్వేదం ప్రవహిస్తూ వుంటుంది.
ఈ ఏడాది వచ్చిన సి. భవానీదేవి కవితా సంపుటి “అక్షరం నా అస్తిత్వం” లో ఉద్యోగ బాధ్యతలో స్త్రీల సంఘర్షణలూ, కుటుంబం, సమాజం, సంప్రదాయం, మతం ఇవన్నీ స్త్రీని ఎలా అణచివేతకు గురి చేస్తాయో చెప్తూ “నేనిప్పుడు అక్షరమై లేస్తున్నాను’ అంటారు.
భావ కవిత్వ పోకడలతో, లాలిత్యంతో ఆమె కవిత్వం లలిత గీతంలా సాగుతుంది.
‘తోటలో ప్రతిరెమ్మా ఒళ్ళు విరుచుకొంది
సుప్తాణువుల్లో చైతన్యం కళ్ళు విప్పింది
ఆ రాగధార మట్టి వేళ్ళదాకా యింకిపోతుంది’
ఇలా మార్దవంగా సాగుతూనే సామాజిక సమస్యలను స్పర్శించినపుడు తీవ్రంగా ప్రశ్నిస్తుంది.
‘సకల మానవ హనన కౄర నేరస్తుడికి
ఒంటినిండా వ్యాపిస్తున్న చమురువాసనేం తెలుసు?’
అని అగ్రరాజ్య నియంతని నిలబెట్టి ప్రశ్నిస్తుంది.
కవిత్వ నిర్మాణ శిల్పంలో సాధించిన పరిణత చాలా కవితల్లో తొంగిచూస్తుంది.
‘శిశువునుండి మనిషిగా ఎదిగే అద్భుత పరిణామంలో
కొత్త రూపాల పాత వంచనల జాబితాలోంచి
మనిషితనం పతనమయ్యే మలుపులో
రాలిపోతున్న ఆశల మూల్గులు విన్పిస్తాయి’
(పసివాళ్ళుగానే వుంటాం)
ఇందులో ఎలిజీలైనా, వార్తా కథనాల నైనా దేనిని కవితా వస్తువుగా తీసుకొన్నా తనదైన శైలిలో చక్కగా కవిత్వీకరించారు.
కె. గీత ‘సీత సుమాలు’ నిండా ఒక ఆర్తి ,ఒక వేదన, ఒక తపన, ఒక మోహం, అనుభూతిపరమైన అనురాగం, మానసిక సంఘర్షణ, ఒక సున్నిత భావ ప్రకటన, అందమైన ప్రకృతి దృశ్య చిత్రణ అంతర్లీనంగా కవిత్వం అంతటా ప్రవహిస్తుంటాయి. అంతే కాకుండా తమతోపాటు అక్కడక్కడ ఆగి దృశ్య చిత్రాల్ని భావపరంగా ఫ్రేము కట్టినట్లు మనకి చూపిస్తూ వుంటాయి. అటువంటి వాన చిత్రాలలో ఒకటి- ‘తొలకరివాన వెన్నెలకే చెట్లు వివశమై చేతులు చాపి నిల్చున్నాయి.
కొమ్మ కొమ్మకో వేలాడే వానలాంతరు’
మాతృత్వ భావనమీద ఈమెకి గల మమత, గౌరవం రెండుమూడు కవితలో కనిపించుతాయి. ఉద్యోగిని అయిన బాలింత తల్లి పాలరాతి గుండెలో
‘వెల్లువై పాపాయిని అభిషేకించే అవ్యాజ ప్రేమ క్షీరం
గుండెకడ్డంపడి రాత్రంతా కళ్ళనుండి ప్రవహించింది’
రెండో అమ్మ, పాపాయిలోకం, మా అమ్మకేంకాదు వీటిలో కూడా ఇటువంటి గుండెకి హత్తుకునే భావ చిత్రాలు ఉన్నాయి.
ప్రేమ, తపన, మోహం, వియోగం కొన్ని కవితలలో అమిత నైపుణ్యంతో స్పష్టంగా కవిత్వీకరించింది.
‘చీకటితో చిక్కనయ్యే హృదయం దాపున
మాటలు జ్ఞాపకాలయ్యే మౌనపరవశం’ (శీతసుమాలు)
‘వీడలేని శరీరాలు కలిపే ఏకైక హృదయంగా మారి
కలల జాబిలి పాన్పుమీద జంటగా స్వప్నిస్తాయి” (జాబిలిపాన్పు)
స్పందించిన ప్రతీ సంఘటననీ కవిత్వీకరించటం కవులందరూ చేస్తారు. అయితే ఆ స్పందన ప్రతిబింబం పాఠకుడి గుండెపై వాలినప్పుడే కవి ప్రయోజనం సాధించినట్లు. శీతసుమాలులోని కవితల దృశ్యాలన్నీ మనం ఆస్వాదించగలుగుతాం. అతి సున్నితమైన కవిత. బాల్కనీలోని జాజిపూలు.
‘వసంతం రాగానే పూలాడాలని తెల్సిపోయింది కాబోలు
ఒకటే రోజు నాలుగు నక్షత్రాల్ని హఠాత్తుగా
నల్లని ఒత్తైన పాదుచివర మెరిపించింది’
ఏ విషయాన్ని వస్తువుగా తీసుకొన్నా అలవోకగా చిక్కని కవిత్వంతో అభివ్యక్తీకరిస్తూ ఇటీవల కాలంలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ బలమైన కవిత్వం రాస్తున్న కొత్తతరం కవయిత్రి కె. గీత.
ఈ ఏడాది కొత్తగా కవయిత్రిగా వెలుగులోకి వచ్చిన రేణుక అయోల పుస్తకం ‘పడవలో చిన్నిదీపం’.
ఈమె కవిత్వంలో కేవలం అనుభూతిపరమైనవే కాక సామాజిక విశ్లేషణతో పరిసరాన్ని గమనించిన ఆకలి గాయాల్ని, అనాధ దుఃఖాల్నీ కవిత్వీకరించారు. ఆమె మంచి భావుకురాలు. ప్రకృతి దృశ్య చిత్రణతో నదితో పాటు మనల్ని ప్రయాణింపజేసి రెండు పాయల సంగమంలో నిద్రపోవాలనిపించుతారు. వర్షం అందాల్ని చాలాచోట్ల చినుకుల్లా కురిపించారు.
‘మెల్లగా పాకే ఆరుద్ర పురుగు
కొలనులో కమలానికీ
వేకువ తొలిసంతకం’
కవిత్వం కోసం పడే తపన చాలాచోట్ల చూపారు. నిజానికి కవికి కావలసింది అదే, అ తపనే.
‘బాగుందన్నా బాగులేదన్నా
నేను అక్షరాల మూటని భుజాలమీద మోస్తూ
మీకు ఎదురు పడుతూ వుంటాను’ అంటారు (తెల్లకాగితం)
వీటిని చదువుతున్నంతసేపూ ఒక ఏకాంత దుఃఖం మనల్ని వెంటాడుతుంది. అస్తిత్వం కోసం ఆరాటంతో ప్రశ్నిస్తుంది. భాషాడంబరం లేని హృదయానికి హత్తుకునే కవితలు దీనిలో ఉన్నాయి.
ఈ ఏడాది “ఆకాశమల్లె”తో సాహిత్యవేదిక మీదికి వచ్చిన మరొక కవయిత్రి హిమజ.
ఒక దృశ్యాన్నో, చిత్రాన్నో, ఒక సంఘటననో చూసిన అనుభూతినీ స్పందననూ తానొక్కతే కాక నలుగురితో పంచుకోవాలని కవిత్వీకరించి అందరిచేతా ఆ అనుభూతిని ఒప్పింపజేసేదే కవిత్వం. మనదిగా అనిపించి ప్రతిస్పందింపజేసేది మంచి కవిత్వం.
‘సూర్యనాగలి భుజానేసుకొని
అక్షరాన్ని వెలుతురు విత్తనాలుగా నాటుతున్నవాడు
గుండెగూటికి గొడుగు తానైనవాడు
ష్…అలసి నిదురిస్తున్నాడు
అస్సలు సడిచేయకు…’
సున్నితమైన భావప్రకటనతో విషయాన్ని మార్దవంగా చెబుతూనే వుంటుంది.
‘నా కలల కన్నీటి కూజాను వంచి
తాగుతాను ప్రేమ దాహార్తినై
తాగిన ప్రతి నీటిచుక్కా
మండుటెండ మనసుపై బడి
ఇంకిపోయి… ఆవిరై
ఫెటీల్మని… ఇలా…నాలా’
ఒక వేదన ఆకాశమల్లె వీచే పరిమళంతోబాటూ మనల్ని చుట్టుకొంటుంది.
ఆధునిక కవిత్వంలో “మొలకెత్తిన కవితాక్షరం” డా|| సుమతీ నరేంద్ర పుస్తకం
‘నన్ను నేను పారేసుకున్నాను
నన్ను నేను పోగొట్టుకున్నాను’
అంటూ తన ఆత్మశోధన అనేక కవితల్లో వినిపించారు.
జీవితానుభవ సారాన్ని మేళవించి అనేక అంశాల్ని స్పష్టంగా అర్థమయ్యేలా సాధారణీకరించి కవిత్వాన్ని చెప్పటం ఇందులో మనం గమనించవచ్చును.
‘జీవితం ఒక సముద్రం
నిలదొక్కుకోలేకపోతే తేలిపోతావు’ అంటారు.
ఎస్. శరత్ జ్యోత్స్నా రాణి కొత్త పుస్తకం ‘అక్షర వసంతం’. ఇందులోని కవితలు సమకాలీన సమస్యల్ని స్పృశిస్తూ పదాడంబరం లేకుండా సులభ శైలిలో సూటిగా అర్థమయ్యేలా వుంటాయి.
కల్లూరి శ్యామల కవితా సంపుటి “స్వగతాలు” మానవీయ దృక్పథంతో నిండి వుంటాయి. సమాజం పట్ల గల ప్రేమ, అనురక్తి వీటిలో వ్యక్తమౌతాయి.
సమాజమంతా ప్రేమమయమై ప్రశాంతంగా వుండాలని కోరుకుంటారు.
సుమారు 30 ఏళ్ళ క్రిందట సాహిత్య రంగంలో మెరుపుగా వచ్చింది మినీ కవిత. అప్పట్లో కొందరు కవులు విరివిగానే మినీ కవితలు రాశారు.
ఏనుగుని అద్దంలో చూపినట్లు గగనమంత సామాజిక సమస్యల్ని చిన్న కవితల్లో సూక్ష్మీకరించారు శ్రీమతి వాసా ప్రభావతి “అలలకొలువు” మినీ కవితలలో.
‘హృదయ సరోవరంలో
విరబూసిన
ఓ అద్భుత సుగంధం
మందారం కవిత’ అని కవిత్వం గురించి నిర్వచించారు.
‘రెక్కలు విప్పిన పక్షికి
హద్దులే లేవు
ధైర్యం పరచుకొన్న స్త్రీకి
సంకెళ్ళే లేవు’ ఇలా స్త్రీ అనుభూతులే కాక సామాజిక రాజకీయ విషయాల్నీ వ్యంగ్యంగానూ వీటిలో చేర్చారు.
‘ఉత్సాహాన్ని జోకొట్టి
జీవితాన్ని నిద్రపుచ్చకు’ అంటూ జాగృతి పరుస్తారు 378 మినీ కవితల ‘అలల కొలువు’లో శ్రీమతి వాసా ప్రభావతి.
మినీ కవితలతో పాటే కవిత్వంలోకి వచ్చినవి హైకూలు. జీవిత గమనంలో ఎదురైన సంఘటనల్ని, అనుభూతుల్ని మూడు నాల్గు లైన్లలో ఇమిడ్చి దృశ్యమానం చేయటం వీటి ప్రత్యేకత. అద్దేపల్లి జ్యోతి తాను రాసిన హైకూల్ని “పున్నమి” గా ప్రచురించింది.
‘మదర్స్ డే
ఈ ఒక్క రోజైనా అమ్మ మాట విందాం’
చాలావరకు కుటుంబ పరిధికి చెందిన అంశాలతోనే వుంటాయి.
‘తాగుబోతు
అయ్యప్పమాల
ఎప్పుడూ వుంచేసుకుంటే బావుండు’
గృహహింస అనుభవించే భార్యకి 40 రోజుల పాటు కలిగే ప్రశాంతతని తెలియజేస్తుంది.
ఇటీవల వచ్చిన నానీల ప్రభంజనంతో చాలామంది కవయిత్రులు తమ నానీల పుస్తకాల్ని వెలుగులోకి తెచ్చారు.
ఎన్. అరుణ నానీల పుస్తకం “గుప్పెడు గింజలు” పేరులోనే కవితాత్మకత వుంది. వీటిలో గుప్పెడు మనసులోని ఆత్మీయతని, ఆర్తిని, ఆలోచనల్ని చక్కని తెలుగు పదాలతో నానీలుగా ఎగరేసింది.
‘కవిత్వం
అలా ఎగిరొచ్చి
మా ముంగిట్లో వాల్తుంది
అక్షరాల గింజలకోసం’!
సున్నితమైన భావాల్ని కవిత్వంలో పొదుగుతుంది. ఒక్కోసారి అందులోనే నిప్పురవ్వల్నీ మెత్తగా తాకించే కవిత్వం ఈమెది.
‘కిటికీ లోపల
నేఖైదీని
బయట
నీది మరీ పెద్ద జైలు’
సమాజాన్ని నిశితంగా పరిశీలించటం గమనించగలం.
నాంపల్లి సుజాత నానీల పుస్తకం ‘నెమలీకలు’. నెమలీక అనగానే గుర్తొచ్చే బాల్యం చాలా నానీలలో కనిపిస్తుంది.
‘బొమ్మరిల్లాట
కూరంట బువ్వంట
అప్పుడే
వంటింటి రిహార్సల్’ బాల్యం గురించి చెప్తూనే ఆడవాళ్ళకు సంకెళ్ళు వేసే వంటిల్లుని చెప్పటం వుంది.
హాస్టళ్ళలో/బాలకుంతి/ కీచకులకు/ ఇక్కడా లోటు లేదు.
వాస్తవ సంఘటన్లమీద అవగాహనని చిన్న నానీలో ఇమిడ్చే ప్రయత్నం కనిపిస్తుంది.
కందేపి రాణీ ప్రసాద్ నానీలు “నంది వర్ధనాలు” గా పూసాయి.
‘కుటుంబానికి
కేంద్రబిందువు పేరు
హౌస్వైఫ్
గుర్తింపులేని జాబ్’
అంటూ కుటుంబం, పిల్లలూ, చదువులూ నేపథ్యంలో అనేక నానీలు రాసారు.
‘నెమలీక
పాఠాలు చదువుతోంది
గాలిపటం
స్కూల్లో చిక్కుకుపోయింది’ అంటారు.
డా|| బండారు సుజాత శేఖర్ నానీలు “జొన్న కంకులు” లోంచి గింజల్లా రాల్తాయి.
‘డాలరు అంచున
నువ్వున్నావు
గడప అంచున
నేను మిగిలాను’ మేధో వలస మీద రాసినది.
‘చెత్తకుండీలో
పసిప్రాణం
ఆకాశం నుండి
రాలిన ఒంటరి నక్షత్రం’ అంటూ సమాజానికి చెందిన అనేక విషయాలనే కాక, స్వగ్రామం దేవరకొండ మీద చాలా నానీలు రాశారు.
షహనాజ్ ఫాతీమా తమ నానీలను “మౌనశబ్దాలు” గా వినిపించారు. వీటిలో తమ చుట్టూ గమనించిన విషయాలకు అద్దం పడ్తూ మౌనంగానే ప్రతిధ్వనించారు.
ఈ ఏడాది ఇన్ని పుస్తకాలు రావటం అనేక అంశాలను స్పృశిస్తూ వైవిధ్యభరితమైన కవిత్వం రావటమే కాక కొత్త కవయిత్రులు చాలామంది పుస్తకాలతో వేదిక మీదికి రావటం ఆనందకరమైన విషయం. కానీ దళిత, మైనారిటీ వాదాలకు చెందిన కవిత్వం లేదు. అంతేకాక అంతకు ముందు కవులతో పోటీపడి సమాన స్థాయిలో కవిత్వం రాసిన సీనియర్ కవయిత్రుల పుస్తకాలు ఏవీ ఈ ఏడాది రాకపోవటం కొంతవరకూ కొరతగానే వుంది.
నొత