పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక, అరవింద స్కూల్ అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు…
నేను సంతోషంగా ఉన్నానా…
నేను సంతోషంగా లేను, ఎందుకంటే నేను బడికి వస్తున్నాను కానీ ఎక్కువ మంది పిల్లలెవరూ రావటం లేదు. కనుక ఇప్పుడు నాకు ఎంతో మంచి సమయం దొరికింది. ఎందుకంటే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
బడిలో ఆటలు, పాటలు, నాటకాలు ఎన్నో చేశాను కానీ ఇప్పటి కాలంలో ఏమీ లేవు. మొదటి లాక్‌డౌన్‌లో నేను ఏమనుకున్నానంటే అసలు లాక్‌డౌన్ పదిరోజుల తర్వాత అయిపోతుంది. అన్ని వర్క్స్ పూర్తి చేసిన తర్వాత ఇంక స్కూల్ పెడతారని అనుకున్నాం. కానీ అమ్మా వాళ్ళు ఇంకా స్కూల్ పెట్టరని అన్నారు. నేను అస్సలు నమ్మలేదు. స్కూల్స్ ఎందుకు పెట్టరు కరోనా తగ్గిపోయింది కదా అన్నాను.
మా నాన్నగారికి పొలంలో సహాయం చేస్తూ ఆ పొలంలో పంటలను పరిశీలించాను. మా పొలంలో మినుము పంట వేశారు. ఆ పంటను కోత కోశారు. ఇంకా ఇంటికి తీసుకు రాలేదు. ఒక పక్కేమో బంగాళాఖాతంలో వాయుగుండం అని అన్నారు. ఈ రోజు సాయంత్రానికి తీరం దాటుతుందని అంటున్నారు. తుఫాన్, వర్షాల వల్ల ఎన్నో పంట పొలాలు పాడైపోతాయి. కనుక అందరూ తొందరగా ఇంటికి చేరవేసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ప్రజలు లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు వేరే ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పారు.
ఇప్పుడు లాక్‌డౌన్ అయిపోయేసరికి అందరూ బైక్‌లు, కార్లు, ఆటోలు వాడుతున్నారు. వాటివల్ల కాలుష్యం పెరుగుతుంది. ఆ కాలుష్యాన్ని ఆపివేయాలి. మామూలుగా అయితే బడిలో ఎన్నో జరిగేవి, అన్నీ ఆగిపోయాయి. కనుక నేను బాధపడుతున్నాను.
– ఎమ్.అర్చన, 8వ తరగతి
ఈ కరోనా ఎన్నో కష్టాలను తెచ్చింది. నాకు బాధగానూ ఉంది మరియు సంతోషంగానూ ఉంది. ఎందుకంటే ఈ కరోనా వల్ల మన స్నేహితులకు, బంధువులకు ఎంతో దూరమైనట్లు అనిపించింది. ఇంట్లో ఉంటే జైలులో ఉన్నట్లు అనిపించేది. సంతోషం ఏంటంటే ఈ లాక్‌డౌన్ వల్ల కాలుష్యం తగ్గుముఖం పట్టింది. నాకు ఎందుకో కొంచెం సంతోషంగా ఉన్నానని అనిపిస్తోంది. కానీ ఎందుకో సంతోషంగా లేనని కూడా అనిపిస్తోంది. అది ఎందుకో నాకు ఒక్కొక్కసారి తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఎందుకు అలా ఉంటుందో అసలు అర్థం కాదు.
ఎప్పటికైనా నా సంతోషానికి కారణం మాత్రం నా తల్లిదండ్రులు మాత్రమే అని నేను నమ్ముతాను. నా బాధకి కారణం నేనే…నా…? అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది నిజమే కావచ్చు. ఎందుకంటే నేను చేసే తప్పులే నన్ను బాధపెట్టవచ్చు కదా అందేకేనేమో…! అప్పుడప్పుడూ నాలో నేనే బాధపడుతూ ఉంటాను. నాలో నేనే సంతోషపడుతూ ఉంటాను.
– జి.గౌమిక, 9వ తరగతి
నేను ఇప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు కరోనా వచ్చింది. మాకు ఒక పదిరోజులు సెలవు అని చెప్పారు. మాకు అప్పుడు చాలా ఆనందం వేసింది. ఆ పది రోజులు చాలా ఆనందంగా గడిపాను. తర్వాత లాక్‌డౌన్ విధించారు. మాకు చాలా బోర్ కొట్టింది. పుస్తకాలు చదువుతూ, బొమ్మలు గీస్తూ, రాసుకుంటూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా 8 నెలలు గడిపాను.
– జె.అదిరి, 8వ తరగతి