పురాణాల్లో పూజలందుకొనేది ఆదిశక్తే
కానీ ఈ దేశంలో మగాడి చేతుల్లో ఈనాటికీ
ఆడది ఒక పనిమనిషి! మరమనిషి!!
కొందరికైతే వాడి విసిరేసే వస్తువు!!
పెరట్లో గంగిగోవును కట్టిపడేసినట్టుగా
పంజరంలో పక్షికి రెక్కలున్నా విరిచినట్టుగా
విజ్ఞానపథంలో సైతం పురుషాధిక్య ప్రపంచంలో
ఆమె నిర్విరామ యాత్ర కొనసాగుతూనే ఉంది!!
నిన్నటివరకూ వెలుగు చూపుల్ని చల్లి
తన ప్రాణభూమిక అస్తమించినా నా
కంటి ఇంట ధారణగా మిగిలే ఉంది!
ఆమె నాకు జన్మనిచ్చి పెంచిన అమ్మ!
ఆడిపాడి అల్లరి ఆగం గుప్పించినా
అలాక్కాదురా ఇలా ఇలా అంటూనే
నీడలా తోడై నా వెలుగు కళ్ళలో చీట్లు
చొరనీయనంత ప్రేమ పంచింది నా అక్క!
తొలకరి ప్రాయపు వెలుగు ముసురులో
అబ్బా ఎంతందంగా ఉన్నావంటే మేలిమి
బంగారు ముద్ద హారం కాదురా ముందు మనం
చదువుకుందామని దారిలో దీపమైంది నా ప్రేయసి!
మీరే నా సర్వం మీరు లేని నేనుండలేనంటూ
ఒత్తూ చమురూ దీపదారుఢ్యంతో వెలిగి
భాగస్వామ్యంలో భాగ్యం మగాడి స్వామ్యం
ఆడదేనని నను వెలిగించిన తాను నా భార్య!
గుండెపోటు భంగపాటుతో ఉన్నప్పుడు
దుఃఖ మేఘాలు ముఖతా కమ్మిన బాధ చెరిపే
ఉషోదయ సూర్యదీపమై నిలువెల్లా తాకే నవ్వు
కిరణాల్తో ఆర్తి చల్లార్చిన ఆమె నా కూతురు!
రేపో మాపో జీవన నౌక చావురేవు చేరికతో
మిట్టమధ్యాహ్న రవి కిరణాలిక సోకనివ్వక
నీడపడని వెలుగుగా తన ఒడిగుడిలోనికి
ప్రేమగా చేర్చుకునేది నా పుడమి తల్లి!
మీరు మగవారుగా పుట్టి అబలలతో ప్రబలంగా
ఎన్నెన్నో అనుబంధాల వెలుగు పంచుకుంటున్నందుకు
స్త్రీలను లాలనతో గౌరవించండి! ఆరాధించండి!!
చాన్నాళ్ళ స్త్రీ భూమికపై చీకట్లు చీల్చే వెలుగులివ్వండి!!
లేదా
ఆడ నిష్పత్తి ప్రశ్నార్థకానికి జవాబుగా
రేపు రోబోలతో కాపురాలకు సిద్ధం కండి