కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం -ఎ.నర్సింహారెడ్డి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రితుల కోసం, స్వదేశీ విదేశీ వ్యవసాయ వాణిజ్య సంస్థల కోసం రైతులను సంక్షోభంలోకి నెట్టే అతి ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలు చేయడం దారుణం. ఆదరాబాదరా తెచ్చిన చట్టాలు బడుగు రైతుల్ని బలిపెట్టేవిగా ఉన్నాయి. ఈ నూతన వ్యవసాయ చట్టాలు సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతాయనడంలో సందేహం లేదు. ఈ చట్టాలు రైతులను కార్పొరేట్ల దయాదాక్షిణ్యానికి వదిలేస్తాయి. రైతులను కార్పొరేట్లకు కూలీలుగా మార్చనున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. 60 శాతం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కలిగిస్తోందన్న క్షేత్రస్థాయి వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించి నిరాకరించడంలోని ఔచిత్యమేమిటి?

కార్పొరేట్‌ సేద్యానికి ఎర్ర తివాచీ పరిచే తాజా చట్టాలతో మండీల వ్యవస్థ సాంతం కుదేలై, సేకరణ బాధ్యతల నుంచి ఎఫ్‌సిఐ తప్పుకొంటుంది. దాంతోపాటే కనీస మద్దతు ధర కనుమరుగైపోతుందని రైతాంగం భీతిల్లుతోంది! కాంట్రాక్టు సేద్యంలో గొడవలొస్తే వివాద పరిష్కార బాధ్యతను అధికార శ్రేణులకు కట్టబెట్టి, సివిల్‌ కోర్టులను ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కునూ తొక్కిపట్టిన చట్టం అన్నదాతల భయానుమానాల్ని మరింత పెంచింది. కాబట్టే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతు లోకం గళమెత్తుతోంది. వస్తూత్పత్తిదారులు పెట్టుబడి వ్యయాల్ని, వడ్డీల్ని, ఉత్పాదన ఖర్చుల్ని, సిబ్బంది వేతనాల్నీ గణించి, వాస్తవిక వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి పంటల మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాథన్‌ కమీషన్‌ 2006లో సూచించింది. సేద్యరంగం కుదుపులకు లోనవుతున్న దశలో సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగలుగుతుంది? రైతన్నల హేతుబద్ధ డిమాండ్లపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

విధాన వైఫల్యమే వ్యవసాయ సంక్షోభానికి కారణం: 1947 ఆగస్టులో అధికార మార్పిడి జరిగి భారత పాలక వర్గాలకు అధికారం బదలాయింపు జరిగింది. 1950 నుంచి భారత్‌ యాభై ఏళ్ళపాటు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి విధానాలను అనుసరించినా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉందన్నది వాస్తవం. ఈ కాలంలోనే జాతీయాదాయంలో వ్యవసాయం నుండి వస్తున్న వాటా 50 శాతం నుండి 14 శాతానికి పడిపోయినప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న జనాభా సంఖ్య మాత్రం 55 శాతం నుంచి తగ్గడం లేదు. 1960వ దశకంలో ప్రవేశపెట్టిన సస్య విప్లవం రైతాంగాన్ని బహుళజాతి సంస్థల నుండి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా వ్యవసాయం ఉపకరణాల కొనుగోలుదార్లుగా మార్చింది. ఒక దశాబ్దం గడిచేసరికి సస్య విప్లవ వ్యూహం సంక్షోభంలో పడింది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులలో పెరుగుదల స్తంభించిపోయింది. భూసారం క్షీణించి, ఉత్పత్తి తగ్గింది. మరోవైపు వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కానందున రైతులు రుణగ్రస్తులయ్యారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ సేద్యం సమస్యల మయమైంది. రైతుల్లో అశాంతి ప్రబలింది.

1991 నుంచి ఆరంభమైన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు రైతుల పాలిట పెను శాపంగా పరిణమించాయి. వ్యవసాయానికి ఇచ్చిన సబ్సిడీలను ఒకటొకటిగా ఎత్తివేయడం ప్రారంభమైంది. మరోవైపున రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దీంతో వ్యవసాయంలో ఎన్నో సాంకేతిక వనరులకు సంబంధించిన నూతన పరిణామాలు చాలా పుట్టుకొచ్చాయి. మన దేశంలో 86 శాతం సన్న, చిన్నకారు రైతులే. వీరి ఆధీనంలో 40 శాతం భూమి ఉంది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ఉపేక్షించడం, నిర్లక్ష్యం చేయడం వల్ల రైతు బతుకు బాగుపడలేదు. 90వ దశకం మధ్యలోకి వచ్చేసరికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించింది. దీంతో మన వ్యవసాయాన్ని స్వేచ్ఛా విపణి దిశగా మళ్ళించడం జరిగింది. ప్రపంచ మార్కెట్‌ పోటీని తట్టుకుని ఎగుమతి చేసే స్థాయికి మన రైతు ఎదగాలంటే ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరం కానీ ప్రభుత్వాలు అందుకు తోడ్పాటునందించడం లేదు. పైగా ఆహార ధాన్యాల దిగుమతులపై పరిమితిని ఎత్తివేయడం వల్ల విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల చౌక ధరలతో భారత రైతు పోటీ పడలేక నష్టపోతున్నాడు. విదేశాలతో పోలిస్తే వ్యవసాయంలో మన రైతుల ఉత్పాదకత చాలా తక్కువ. అందువల్లనే అంతర్జాతీయ పోటీకి తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణగ్రస్తులై అప్పులు తీర్చలేక దేశంలో మూడున్నర లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2008లో అమెరికాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ వ్యాపితమైంది. దశాబ్దం గడిచినా అది ఇంకా కుదుట పడలేదు. ఈ స్థితిలో అంతర్జాతీయ ద్రవ్యసంస్థల, స్వదేశీ, విదేశీ బహుళ జాతి సంస్థల దృష్టి మన వ్యవసాయ రంగం మీద పడింది. మన వ్యవసాయాన్ని పారిశ్రామికీకరించాలని కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను, ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాలను, మరింత నిర్దాక్షిణ్యంగా అమలు పరుస్తున్నందున దేశంలోని రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతాంగం వెన్నువిరిచి భూమిని కార్పొరేట్‌ వర్గాలకు కట్టబెట్టే విధంగా ఉన్నాయి. ఈ దుస్థితి ప్రపంచంలో ఏ దేశంలోని రైతుకు లేదనుకుంటా. మొత్తంగా చూస్తే మన వ్యవసాయ రంగంపై స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ శక్తుల పట్టు పెరిగింది. మోడీ ప్రభుత్వ చర్యలు వాటికి మరింత ఊతం ఇచ్చేలాగున్నాయి.

ఈ నూతన చట్టాలు రూపంలో రైతు వ్యతిరేకంగా మాత్రమే కన్పించినా సారంలో ప్రతి పౌరుడు ఆహార పదార్థాల కోసం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) మీద కాకుండా కార్పొరేట్‌ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి నెలకొననుంది. ఈ మూడు నూతన వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్‌ చేతుల్లో బంధిస్తుంది. వీటి వెనుక ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టి.ఓ), ప్రపంచ బ్యాంకు, స్వదేశీ, విదేశీ బహుళ జాతి సంస్థలు, మోడీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలు ఉన్నాయి. ఈ చట్టాలతో భారత్‌ ఆత్మనిర్భర్‌ కాలేదు. ఇది భారత్‌లో నూతన జమీందారీ విధానాన్ని తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. 2013లో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సమావేశం భారత ప్రభుత్వ దాస్య సేకరణ విధానానికి 5 సంవత్సరాలలో ముగింపు పలకాలని నిర్ణయించింది.

మన దేశంలో 60 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. 26 కోట్ల మంది ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. భూమిలేని గ్రామీణ ప్రజలు మరో 40 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ఉత్పత్తి, మార్కెటింగ్‌, ఆహార పంపిణీ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. వీటి ప్రభావం రైతులు, వ్యవసాయ కార్మికుల సంక్షేమం, జీవనోపాధిపై ఉంటుంది. పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు అవతరించి ఆధునిక సాంకేతికతను, భారీ యంత్రాలను వ్యవసాయంలో వినియోగించినట్లయితే అత్యధిక వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఒక కోటికి పైగా ఉన్న కౌలు రైతులు కూడా ఉపాధి కోల్పోతారు. ఇప్పటికే గ్రామాల్లో పేదరికం తీవ్రంగా ఉంది.

ఈ నూతన చట్టాలతో ఎపిఎంసి (మండీల)లో కనీస మద్దతు ధరకు కొనుగోళ్ళు ఆగిపోతాయి. అప్పుడు వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రతరమవుతుంది. సంక్షోభం తీవ్రం కావడానికి ప్రభుత్వమే కారణమవుతుంది. దేశ ఆహార భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎఫ్‌సిఐ పాత్ర క్రమంగా క్షీణిస్తున్న కొద్దీ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ది పొందే వారంతా కార్పొరేట్‌ శక్తులు నియంత్రించే మార్కెట్ల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే… ఎఫ్‌సిఐ అదృశ్యం కావడం తప్పకపోవచ్చు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ కుప్పకూలిపోయిన తర్వాత, లబ్దిదారులకు ఇవ్వని దుస్థితి ఏర్పడుతుంది. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల పాలక వర్గాలకు సన్నిహితంగా ఉండే ఆశ్రిత పెట్టుబడిదారీ శక్తులు మినహా సమాజంలోని ఇతర అన్ని విభాగాల ప్రజలు తీవ్ర కష్టాలకు గురవుతారు.

ప్రపంచీకరణ పరిణామాల చేదు అనుభవాలను ఇప్పటికే చవిచూస్తున్న మన దేశ రైతాంగం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. నిజానికి పండించే వారికే కాకుండా వినియోగదారులైన అన్ని వర్గాల ప్రజలకు తరతరాల ద్రోహం తలపెట్టిన అత్యవసర సరుకుల చట్ట సవరణ, విద్యుత్‌ చట్టం-2020 లను దేశ ప్రజలంతా ఎదిరించి రద్దు చేయించుకోవాల్సి ఉంది. మధ్యతరగతి ప్రజలతో పాటు చాలామందిని మోసగించడానికి ఇది రైతుల సమస్య మాత్రమేనని భ్రమింపచేయడానికి ప్రయత్నం జరుగుతోంది. బిజెపి అధికారంలో ఉన్నచోట్ల మీడియా ద్వారా ఆరెస్సెస్‌ మూకలు వారి దేశద్రోహాన్ని దేశభక్తిగా నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ శక్తులు వేర్వేరు కాదని అంతకంతకూ రైతాంగానికి అర్థమై అంబానీలు, అదానీల వంటి దళారీ శక్తుల నిజస్వరూపం బయటపెడుతూ వారి దిష్టిబొమ్మలు తగలబెడుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతాంగం వ్యతిరేకిస్తోంది. అసంఘటితంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల భవితవ్యాన్ని, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేటు శక్తులకు బలిపెడుతుందన్న ఆందోళన వెల్లువెత్తుతోంది. కంపెనీలకు స్వేచ్ఛ, రైతులకు నష్టదాయకం అవుతుందన్న రైతుల ఆందోళన సహేతుకమైనదే.

నిత్యావసరాల సరుకుల (సవరణ) చట్టం-2020: అధికార బదిలీ జరిగిన తర్వాత ప్రజలకు నిత్యావసరాలు అందకుండా చేసే నల్ల వ్యాపారులకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఆందోళన ఫలితంగా 1955లో నిత్యావసరాల చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించింది. నిత్యావసర సరుకుల చట్టానికి చేస్తున్న సవరణ వల్ల పప్పు ధాన్యలు, తృణధాన్యాలు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటివి నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగించబడ్డాయి. పైగా వీటి నిల్వల పట్ల పరిమితులు ఎత్తివేశారు. పంట నిల్వల మీద, అమ్మకం మీద ఎటువంటి ఆంక్షలు విధించరాదని ప్రభుత్వం సంకల్పించింది. నిత్యావసర సరుకుల నిల్వపై ఉన్న నియంత్రణలను తొలగిస్తే ప్రైవేటు వ్యాపార వర్గాలు అక్రమ నిల్వలు చేసి, కృత్రిమ కొరత సృష్టించి, ధరలను పెంచి, వినియోగదారులను దోపిడీ చేయడాన్ని ఎలా కట్టడి చేస్తారంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే నల్లబజారుకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. విదేశాల నుండి వ్యవసాయోత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసి స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ లేకుండా చేసే ప్రమాదాన్ని ఎలా నియంత్రిస్తారో చెప్పరు. స్వేచ్ఛా విపణిలో మార్కెట్‌ శక్తుల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించే వ్యవస్థ లేని దుస్థితిలోకి నెట్టడానికి మాత్రమే ఈ చట్టం దోహదపడుతుందన్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది.

ఇప్పటిదాకా ప్రజా పంపిణీ వ్యవస్థ, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) వంటివి ఆహార ధాన్యాల కొనుగోలు, నిర్వహణ, సరఫరా చేయడం వంటి చర్యల ద్వారా ప్రజలకు ఆహార భద్రతను ఎంతో కొంత కల్పించాయి. నూతన చట్టం ద్వారా ఇవన్నీ రద్దవుతాయి. అసాధారణ పరిస్థితుల్లో, అంటే యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు, అసాధారణంగా ధరలు పెరగడం వంటి సందర్భాల్లో తప్ప చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు సహా పలు నిత్యావసర వస్తువుల నిల్వ, సరఫరాపై ఎటువంటి నియంత్రణలూ

ఉండబోవన్నది నిత్యావసర సరుకుల చట్ట సవరణ ప్రధానోద్దేశం. రైతుల నుంచి ఉత్పత్తుల్ని కొనేసి పెద్ద ఎత్తున నిల్వ చేసుకునే సావకాశం ఈ బిల్లు వల్ల కలుగుతుంది. ఫలితంగా ధర తక్కువ ఉన్నప్పుడు రైతుల నుంచి కొనేసి ఈ బిల్లు ద్వారా లభించిన స్వేచ్ఛతో అపరిమితంగా నిల్వలు ఉంచి, ధరలు పెరిగిన కాలంలో వ్యాపారులు వినియోగదారులకు అమ్ముకుని లాభపడతారు.

కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం-2020: రెండవ బిల్లు – ‘రైతుల (సాధికారత, రక్షణ) ధరల భరోసా వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు-2020’ పరిశీలిస్తే, ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తుల విక్రయానికి ముందస్తుగా నాణ్యత ఆధారం కాకుండా కంపెనీలతో ఒప్పందాలను పంట వేయకముందే కుదుర్చుకొనే అవకాశం ఉంది. దీనిద్వారా ఏ పంటకు ఎంత ధర వస్తుందో రైతులకు ముందే తెలుస్తుందని, అప్పుడు రైతు ఏ పంట వేయాలో నిర్ణయించుకుని లాభపడవచ్చని చట్టంలో పేర్కొన్నారు. కాంట్రాక్టు సేద్యం దేశంలో ఇప్పటికే అక్కడక్కడా అమలు జరుగుతోంది. దీనిపై అనేక న్యాయపరమైన విమర్శలు వెల్లువలా వచ్చాయి. అయినా ఇదే రైతులకు అత్యుత్తమమైందని ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యకరం. దళారీ వర్గాలు, విదేశీ బహుళజాతి విత్తన, ఎరువులు, పురుగు మందు కంపెనీల వారంతా కలిసి రైతుల కష్టార్జితాన్ని, ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం గ్రామీణ భారతాన్ని కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టు వ్యవసాయం పేరుతో బడా దేశీయ, విదేశీ బహుళజాతి కంపెనీలు వస్తాయి. నిన్నటిదాకా వ్యవసాయ ఉత్పాదకాల అమ్మకం ద్వారా దోపిడీ చేసినవారు, ఇక నుండి మొత్తం వ్యవసాయ ఉత్పత్తి క్రమాన్నే శాసిస్తారు. రైతు కూలీలను, భూసారాన్ని, ప్రకృతిని మరింతగా దోపిడీ చేస్తారు, ధ్వంసం చేస్తారు. అనేక దేశాల అనుభవాలు దీన్నే రుజువు చేస్తున్నాయి.

వ్యవసాయ బడా వాణిజ్య కంపెనీలు మోసం చేస్తే న్యాయం కోసం న్యాయస్థానాలు లేవా అంటే, లేవు అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ చట్టంలో సెక్షన్‌ 19 ప్రకారం సివిల్‌ న్యాయస్థానాలు ఇందులో జోక్యం చేసుకోరాదు. అంటే ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఉంటుంది. దానికి వెళ్ళి కేసు వేయాలి. గుత్తాధిపత్యం గల ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని తగ్గించి ఎగుమతి పంటలను పండిస్తారు. వలస పాలనలో ఆహార ధాన్యాలకు బదులుగా నల్లమందు, నీలిమందు పంటలను పండించి ఎగుమతి చేశారు. నీలిమందు వ్యాపారులు రైతులను ఎంత దారుణంగా దోపిడీ చేసిందీ చూశాం. ప్రస్తుత చట్టంతో మళ్ళీ ఆనాటి దీనస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం ఉత్పత్తుల ఏర్పాటును ధ్వంసం చేస్తే దేశ ఆహారభద్రత ప్రమాదంలో పడుతుంది.

సాగు స్పాన్సర్‌ చేసిన కంపెనీలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయిస్తాయి. తమ లాభాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొన్ని తరహా పంటలే వేయాలని రైతులపై ఒత్తిడి చేస్తాయి. రైతులు, కంపెనీల మధ్య కుదిరే ఒప్పందాలు సమానంగా ఉండవు. కంపెనీలు ఆర్థికంగా బలం గలవి. ఇద్దరి మధ్యా వివాదం వస్తే రైతులు అత్యంత అన్యాయానికి గురవుతారు. కార్పొరేట్‌ దిగ్గజాలు భారీ యంత్రాలతో వ్యవసాయ క్షేత్రాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తారు. అలాంటి పారిశ్రామికవేత్తల ఆధీనంలోకి భూములన్నీ వచ్చే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. కాంట్రాక్టు వ్యవసాయం రైతును భూమి నుండి వేరు చేస్తుంది. రైతు జీవితం దుర్భరమవుతుంది. భూమిని నిజంగా దున్ని సాగుచేస్తున్న చిన్న రైతులు, కౌలు రైతులు భూమి నుండి గెంటివేయబడతారు. మార్పు చేసిన చట్టంలో వ్యవసాయ కూలీల గురించి, వారి వేతనాల గురించి, హక్కుల గురించి చెప్పనే లేదు. ఈ చట్టం ద్వారా రైతులు కార్పొరేట్‌ సంస్థల కబంధ హస్తాల్లో బంధించబడతారు.

వ్యవసాయ మార్కెట్‌ చట్టం-2020: రైతుల ఉత్పత్తి-వ్యాపారం-వాణిజ్యం (ప్రమోషన్‌-సదుపాయం) చట్టం-2020 ప్రకారం రైతు తాను పండించిన పంటను రెగ్యులేటెడ్‌ వ్యవసాయ మార్కెట్‌లో కాక దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. నిజానికి ఈ చట్టం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను, మార్కెట్‌ యార్డులను దెబ్బతీసేందుకు చేసిన చట్టం. ఈ చట్టంపై ప్రధాన విమర్శ ఇప్పటికీి మార్కెట్‌ వెలుపల ప్రైవేటు వ్యక్తులు రైతుల దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు కొంటున్నారు; ఇప్పుడు మళ్ళీ చట్టం తెచ్చి మరో అవకాశం ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసం? దేశంలో 85 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతుల్లో ఎంతమంది తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకోగలరు? ఎపిఎంసిలలో అమ్మితేనే కనీస మద్దతు ధర దొరకని ఈ పరిస్థితుల్లో బయట మార్కెట్‌లో అమ్మితే కనీస మద్దతు ధర దొరుకుతుందా? నేతలు దీన్ని మరోలా చెబుతున్నారు. తిరగేసి చూస్తే, బాధ్యత-జవాబుదారుతనం లేని ప్రైవేటు మార్కెట్లొస్తాయి.

నూతన చట్టంలో కేంద్రం ప్రకటించే మద్దతు ధరలకు చట్టబద్ధత లేకపోవడం రైతుల ఆందోళనకు ప్రధాన కారణం. మార్కెట్‌ కమిటీలను పట్టించుకోకుండా గ్రామాలలో నేరుగా రైతుల నుండి వ్యాపారులు అతి తక్కువ ధరలకు పంటలను, ఇతర ఉత్పత్తులను సేకరణ చేయడం కూడా మరో కారణం. గతం నుండి ఇది కొనసాగుతున్నదే అయినా, కనీసం మార్కెటింగ్‌ కమిటీల ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌ యార్డులయినా రైతులకు కొంత భరోసా ఇచ్చే వ్యవస్థగా ఉండేవి. ఇప్పుడు ఆ వ్యవస్థకు కేంద్రం ఆమోదించిన చట్టాలు చెల్లు చీటీ రాసేశాయి. కేంద్రం తెచ్చిన చట్టాలు తమ బతుకును, భవితను కార్పొరేట్లకు బలిపెడతాయని రైతులు ఆక్రోశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌)ను క్రమంగా బలహీనపరచి, బదులుగా లబ్దిదారులకు నగదు బదిలీని ప్రోత్సహిస్తోంది. తాజా చట్టాలతో సర్కారు మార్కెట్‌ కమిటీలు క్రమంగా బలహీనపడతాయి. ధాన్యం సేకరణ తగ్గుతుంది. మద్దతు ధర ఉండదు, మార్కెట్‌ స్వేచ్ఛ వల్ల పెద్ద ప్రైవేట్‌ సంస్థలు బరిలో దిగి ఆధిపత్యం చెలాయిస్తాయి. గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీస మద్దతు ధరకూ రైతు నోచుకోడు. ఇదీ భయం! వ్యవసాయం చేయలేక, విధిలేని పరిస్థితుల్లో భూములను కార్పొరేట్లకు అప్పగించి, ఒప్పంద వ్యవసాయానికి తలపడేలా చిన్న, సన్నకారు రైతాంగాన్ని నెట్టడమే అన్నది వారి ఆందోళన. ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌’ అధ్యయనం ప్రకారం దేశంలో అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌లో పది సంవత్సరాల క్రితమే తెచ్చిన ఇలాంటి చట్టాలు అక్కడ ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని నిగ్గు తేల్చింది. చట్టాలు తెచ్చాక బీహార్‌ రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని ఆ అధ్యయనం తెలిపింది. అయినా కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టాలను దేశమంతటికీ వర్తించేలా రూపొందించడం దారుణం.

రైతుల ఢిల్లీ ముట్టడి :

నిత్యం ప్రభుత్వ వ్యవసాయ మండీలతో ముడిపడిన రైతు జీవితాన్ని 3 నల్ల చట్టాలు చీకటిలోకి నెట్టాయి. ఇంతకుముందే పెప్సీ కంపెనీ ద్వారా బంగాళదుంప రైతు బానిస బతుకులను ముందుగా అనుభవించిన పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి ఉత్తర భారత రాష్ట్రాల రైతాంగం రానున్న మహా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి పెద్ద ఎత్తున కదిలింది. బీహార్‌లో 2006లో తెచ్చిన ప్రైవేటు మార్కెటింగ్‌ చట్టాల పుణ్యమాని ప్రభుత్వ మండీలు చాలావరకు మాయమయ్యాయి. అక్కడి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే వరి, గోధుమ పంటను తక్కువకు అమ్ముకుంటున్న అనుభవం మన ముందుంది. మధ్యప్రదేశ్‌లో బిజెపి ఆర్భాటంగా తెచ్చిన మోడల్‌ మండీల వల్ల ఏర్పడిన దిక్కుతోచని స్థితిని చర్చలలో రైతులు ఎంత ఉదహరించినా మోడీ, అంబానీ, అదానీ మిత్రత్రయం ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం జూన్‌ 5న తెచ్చిన ఆర్డినెన్స్‌లు సెప్టెంబర్‌ చివరి నాటికి చట్టాలుగా మారాయి.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆరు నెలలుగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులు ఉద్యమిస్తున్నారు. మొదట స్థానికంగా నిరసనలు సాగాయి. ఆర్డినెన్స్‌లు చట్టరూపం దాల్చడంతో క్రమంగా ఢిల్లీకి మారింది. 35 రైతు సంఘాల నేతృత్వంలో వేలాది మంది రైతులు నవంబర్‌ 27న ఢిల్లీకి చేరారు. ఈ ఉద్యమంలో అన్ని రాష్ట్రాల రైతుల భాగస్వామ్యం, మద్దతు ఉంది. వందలాది రైతు సంఘాలు ఐక్యంగా ఈ ఆందోళనకు పిలుపునివ్వడం గమనార్హం. తరలివస్తున్న కర్షకులను ఢిల్లీ సరిహద్దుల్లోనే నిలిపివేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపింది. ముళ్ళతీగలు, ఇనుప చువ్వలతో ఉన్న కంచెలు, వీటిని దాటి ముందుకు వస్తే అంచెలంచెలుగా బారికేడ్లను ఏర్పాటు చేసింది. వీటిని దాటి ముందుకు వస్తే… భారీ కంటైనర్లు, సిమెంట్‌ దిమ్మలు… అయినా ఆగకపోతే దారికడ్డంగా పెద్ద ఇనుప గొలుసులు. వాటిని దాటేలోగానే విరుచుకుపడే వాటర్‌ కెనాన్లు, భాష్పవాయువు గోళాలు సిద్ధంగా ఉన్నాయి.

రైతుల ఛలో ఢిల్లీ యాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం శత్రు సేనలను నిలువరించే రీతిలో రహదారులపై కందకాలను తవ్వింది. వేలాది ట్రాక్టర్లతో వస్తున్న రైతులపై విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. వందల మంది రైతులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీని మిగతా దేశంతో అనుసంధానించే ఆరు ప్రధాన మార్గాలను ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) నేతృత్వంలో దిగ్బంధం చేశారు. ఇప్పటికే 34 మంది రైతులు ఎముకలు కొరికే చలి తీవ్రతతో చనిపోయినా రైతులు ఉద్యమాన్ని కొనసాగించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు. ప్రభుత్వం చర్చల పేరుతో తాత్సారం చేస్తూ రైతులకు అలసట తెప్పించి వారి ఓపికను పరీక్షకు పెట్టాలన్న వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది.

భారత్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. దేశంలోని 30 రైతు సంఘాలు ఏకమై నూతన చట్టాలు రద్దు చేయాలంటూ నెల రోజులుగా ఢిల్లీలో ఉద్యమిస్తున్నారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతాంగం ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీని ముట్టడించడంతో ప్రభుత్వం బెంబేలెత్తింది. ఎముకలు కొరికే చలిని, కరోనా భయాన్ని కూడా లెక్కచేయకుండా రైతాంగం చేస్తున్న పోరాటం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేసింది. కరుకు లాఠీ దెబ్బలకు కానీ, రైతులపై హత్యా నేరారోపణ కేసులు పెట్టినా కానీ వారు వెరవడం లేదు. 30 రోజులు దాటిపోయింది. అయినా, రైతుల పట్టుదల ఏ మాత్రం సడలకపోగా రోజురోజుకీ మరింత ద్విగుణీకృతమవుతోందంటే రైతులు లేవనెత్తిన సహేతుకమైన డిమాండ్లే అందుకు కారణం. ఢిల్లీ వీథుల్లో నిరసనలు హోరెత్తిపోతున్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.

రైతాంగ ఉద్యమానికి అంతర్జాతీయ సంఘీభావం: ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం సాగిస్తోన్న వీరోచిత పోరాటానికి దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున సంఘీభావం వెల్లివిరుస్తోంది. మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతల పట్ల బిజెపి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రతినిధి స్టీఫెన్‌ దుజారిక్‌ భారత్‌లో రైతాంగ పోరాటంపై స్పందిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని, ఆ హక్కును ఉపయోగించుకోనివ్వాలని అన్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన ఎంపిలు రైతాంగంపై మోడీ ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించారు. ఈ దేశాల్లోని ప్రవాస భారతీయులు, మానవ హక్కుల గ్రూపుల ఆధ్వర్యంలో పలుచోట్ల సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌లో రైతుల శాంతియుత నిరసనకు తన సంఘీభావాన్ని తెలిపారు. రైతు

ఉద్యమ వార్తలు విదేశీ పత్రికల్లో ప్రముఖంగా రావడం విశేషం.

రైతాంగాన్ని దశాబ్దాలుగా నిత్యం మోసగింప చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్క మౌలిక సమస్యను పరిష్కరించలేని దళారీ పాలనలో పెరుగుతున్న నిరుద్యోగం, రోజురోజుకీ పెరుగుతున్న పేదరికం లక్షలాదిమంది యువతను, మహిళలను, రైతాంగాన్ని రోడ్లపైకి రప్పిస్తోంది. వివిధ రాష్ట్రాలలో ఉద్యమిస్తున్నా, ఇప్పుడు ఢిల్లీ రహదారుల్ని దిగ్బంధిస్తూ గ్రామాల నుంచి లక్షలాది మంది చేరుకుంటున్నారంటే అదంతా ఇన్నాళ్ళూ వారనుభవిస్తున్న పీడనపై ఆగ్రహమే. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వారు పెంచుకున్న వ్యతిరేకత ఫలితమే. దోపిడీ శక్తులకు ఇక ఎప్పటికీ ఎదురులేదనే మధ్యతరగతి నిరాశా వాదనలను బద్దలు కొడుతూ ఈ ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వివిధ దేశాలలో ఉన్న భారతీయులతో పాటు ఆ దేశాల ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు కూడా రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. చాలా దేశాల్లో రైతుల సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మీడియా ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తోంది. ప్రజాస్వామిక, లౌకిక శక్తులు దృఢంగా నిలబడాలి.

కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్‌ నెరవేరేవరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని ఉధృతికి ఎప్పటికప్పుడు నూతన కార్యాచరణను ప్రకటిస్తూ ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు చర్చల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నట్లు కనిపిస్తూనే తన మొండి వైఖరితో వాటిని మోడువారుస్తోంది. అదే సమయంలో రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే పదే పదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి తోమర్‌ అయితే ఈ ఉద్యమం వెనుక చైనా, పాకిస్తాన్‌ అనుకూల భారత వ్యతిరేక శక్తులున్నాయని రైతు నేతలకు రాసిన లేఖలోనే ఆరోపించారు. ఆ లేఖకు మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఆ ఆందోళనలో ఖలిస్థానీయులు, మావోయిస్టులు ఉన్నారనే బరి తెగింపు ప్రచారం చేయడం సిగ్గుచేటు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు బిగించిన పిడికిలి ఉక్కు సంకల్పం అప్రతిహతంగా సాగుతూ రైతాంగ ఉద్యమాల సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. స్వేచ్ఛా మార్కెట్‌ రైతులకు కాదు కార్పొరేటర్లకేనన్న ప్రభుత్వ కుట్రను గ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఎడ్లబండ్లతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులపై సాగిస్తున్న బైఠాయింపు ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కేంద్రం మొండిగా వ్యవహరించినా, సంఘ విద్రోహ శక్తులని రెచ్చగొట్టినా రైతులు ఇసుమంతైనా వెనక్కి తగ్గలేదు. తరతరాలుగా భూములను నమ్ముకుని వ్యవసాయాన్నే జీవన విధానంగా మార్చుకుని ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న రైతాంగం నెల రోజులుగా ఏకబిగువున సాగిస్తున్న పోరాటం రోజురోజుకూ మరింత ఉధృతం, విస్తృతం కావడం సాధారణ విషయం కాదు. రైతుల పోరాటానికి వందలాది రైతు సంఘాలు, పాతిక వరకు రాజకీయ పార్టీలు, ఎన్నో ప్రజాసంఘాలు, మేధావుల విశాల మద్దతు, సంఘీభావం లభిస్తోంది. కార్పొరేట్‌ అనుకూల మోడీ ఫాసిస్టు విధానాలను ముక్తకంఠంతో ఖండించాల్సిన సందర్భం ఇది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.