మట్టిగోడల మధ్య గడ్డిపోచ – శివరాజు సుబ్బలక్ష్మి

ఆ ఏడు వేసంగి ఎండలు మండిపోతున్నాయి. పొద్దువాలినా వేడి తగ్గలేదు. పసిపిల్లలు తట్టుకోలేక కంఠం జారిపోయేలా గోలపెడుతున్నారు. ముసలి అవ్వ ఆపుకారా పక్కన పెట్టుకుని కంఠం తడుపుకుంటూ తడిబట్ట వంటికి చుట్టుకు వచ్చే పోయేవాళ్ళని ”టైం ఎంతయిందర్రా” అంటూ గడుపుతోంది.

ఆ ఊరిని చుట్టివున్న పుంత, సగం పడిపోయిన మట్టి గోడలు, శిథిలావస్థలో ఉన్నా నిత్యం ధూపదీప నైవేద్యాలందుకునే శివాలయం. ఊరి మధ్యన ఉన్న మోటబావి. దాని పక్కనే ఉయ్యాలలూగే ఊడల్ని పెంచుకున్న ముసలి మర్రిచెట్టు. ఆ ఊరికి వచ్చిన

వాళ్ళు వీటిలో ఏ ఒక్కటీ చూడకుండా వెళ్ళడానికి లేదు. ఆ ఊరి ఘనత అలాగే చెప్పుకు తిరుగుతారు రికామీ పెద్దలు.

పార్వతికి ఆ ఊరు రావటం రెండోసారి. ఈసారి ఆ ఊరికి కోడలిగా రావటం మనస్సుకు బాధగా ఉన్నా పైకి అందరిలాగే ఉత్సాహంగా ఉన్నట్లు మసులుతోంది. వేడికి తోడు చీకటి కలిగి విసిగిన ప్రాణాల్ని విసిగిస్తోంది.

పార్వతికి పగలు ఎండ భరించటమే హాయి అనిపిస్తోంది. పొద్దుగూకుతుందంటే తెలియని భయం చుట్టుకుంటోంది. ఎప్పుడో ఒకరోజు బావకి… తర్వాత ఊహించుకునేందుకు మనస్సు ఒప్పుకోవటం లేదు. అత్తగారి పిలుపుతో మనస్సుని కట్టేసి లోపలికి పరుగెట్టింది.

పడమటింటి వసారాలో నిల్చున్న రావమ్మ, కోడలి పరుగు చూసి ముక్కుమీద వేలేసుకుంది.

పార్వతి తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలవంచుకుంది. ”నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ పరుగు మానవా ఏం?” అంటూ కోడల్ని మందలించింది రావమ్మ.

పమిటకొంగు బొడ్డులో దోపుకుంది. తలుపు వెనక్కి జరిగి తలవంచుకుని దిగులుగా నిల్చుంది పార్వతి. కాస్సేపు మౌనంగా నిల్చున్న రావమ్మ ”సరేలే వెళ్ళి వసారాలో పీటలు వేసి మంచినీళ్ళు పెట్టు” అని కోడలికి పురమాయించి వీథి గుమ్మంవైపు వెళ్ళింది.

పార్వతి వచ్చి అప్పుడే వారం తిరిగింది. వచ్చిన కొత్తలో ఉన్నంత భయం లేకపోయినా, ఏమిటోలా ఉంది. ఏదో విసుగు పుడుతోంది తనమీద తనకే.

”ఏరా బాచీ ఇంతవేళ దాకా ఏమి చేస్తున్నావురా?” అప్పుడే వస్తున్న కొడుకుని అడిగింది రావమ్మ. కండువా కొంకెకి తగిలించి లోపలింట్లోకి వెళ్ళాడు భాస్కర్రావు.

అందరి భోజనాలూ అయ్యాయి అంటే పార్వతికి చేతినిండా పని. ఆ రోజు అదనంగా ఇల్లు కూడా అలకమని పురమాయించింది రావమ్మ. మట్టిముద్దలో చెయ్యి పెట్టాలంటే ఒళ్ళు జలదరించింది పార్వతికి. ఎట్లాగో అలకటం పూర్తయిందన్న ఇదితో గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

”మాసికలు పెట్టినట్లు ఆ అలకడం ఏమిటే! మళ్ళీ ఓసారి కలిసేటట్టు పాముకురా” అని కిటికీ ఊచల్లోంచి అత్తగారి కంఠం వినిపించింది.

తలెత్తి చూడకుండానే పార్వతి మళ్ళీ మొదలుపెట్టింది. అలకటం పూర్తిచేసి, తలుపులు మూసి, అరికెన్‌ లాంతరు తగ్గించి పెరట్లో గట్టుమీద పెట్టి తను వేసుకునే మడత మంచం ఈడ్చుకువచ్చింది నేరేడుచెట్టు కిందికి. కొంచెం దూరంలో అత్తగారి మంచం కనపడుతోంది.

చెట్టు ఆకులు గాలికి గలగల్లాడుతున్నాయి. ఆకుల మధ్యనుంచి నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ తనకేసి చూస్తున్నట్లు ఊహించుకుని కొంతసేపు వాటితో కలిసి మనస్సు తేలిగ్గా ఉన్నట్టు మంచంమీద అటూ ఇటూ దొర్లింది పార్వతి. మంచం చేసే కిటకిట చప్పుడికి రావమ్మ తలెత్తి చూసి ”ఆ చెట్టుకింద ఎందుకే ఇలా లాక్కో మంచం” అని కేకపెట్టి మళ్ళీ పడుకుంది.

ఈసారి కదలకుండా చూస్తూ పడుకుంది. కానీ నిద్ర రావటం లేదు. అసలు అక్కయ్య ఎందుకు నూతిలో పడింది? అన్న ప్రశ్న మనస్సులోకి వచ్చి కూర్చుంది పార్వతికి. అది మరచిపోవాలని ఏవేవో గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కయ్య పెళ్ళయిన కొత్తరోజులు ఎంత బాగుండేవో గుర్తుకు రాసాగాయి.

అప్పటికి తనకు ఏడెనిమిదేళ్ళ కంటే ఎక్కువ ఉండకపోయినా అన్నింటికీ అప్పగారితో పోటీకి వెళ్ళటం చూసి మేనత్తలు బుగ్గలు నొక్కుకుంటూ, ”రేపు మీ అప్పకి పెళ్ళయితే ఏం చేస్తావు?” అని అడగడం, తడుముకోకుండా ”నేనూ చేసేసుకుంటా” అనటం, వాళ్ళు అన్నట్లుగానే అక్కయ్య పెళ్ళిరోజు దగ్గరికి వస్తున్నకొద్దీ ఇంట్లో అన్నింటికీ తన పేచీలు ఎక్కువై అమ్మ ప్రాణం విసిగి కొట్టడం, బామ్మ అడ్డుకుని ”ఎందుకే దాన్ని కొట్టి చంపుతావు? ఇంకో నాలుగేళ్ళు పోతే దాన్నీ ఓ అయ్య చేతిలో పెట్టేదేనాయె” అంటూ సమర్ధిస్తూ ఓదార్చటం.

”అమ్మయ్యో నాలుగేళ్ళు వేగడమే! వచ్చేయేడే ఆ రామాన్ని పిలిపించి ముడెట్టించి వాళ్ళ అత్తయ్య దగ్గరికి పంపేస్తా” అని అమ్మ బెదిరించటం, మనుమడి పేరు విని బామ్మ తృప్తిగా నవ్వుకోవటం, ”నేనేం చేసుకోనులే” అంటూ తను శోకం పొడిగించటం గుర్తుకు వచ్చాయి.

మళ్ళీ వేరే ఆలోచన కోసం మనస్సు వెతుకుతోంది. ఆ ఏడు సంక్రాంతి నెల ఉందనగానే ఇంట్లో హడావిడి మొదలయింది. పెరటి గోడలకు సున్నాలు మొదలుపెట్టి ఇల్లంతా పూసుకొచ్చారు. గడపలకి రాత్రిళ్ళు రంగులు పూస్తున్నారు. ఎవరి కాలికయినా రంగు అంటుకుందీ అంటే బామ్మ చేతిలో చచ్చారన్నమాటే, అని ఒక సాయంత్రం తులసి కోట దగ్గర తీర్మానం చేసి పిల్లలకి తెలియచెప్పి, పటికబెల్లం విందు చేసింది బామ్మ.

”అన్నీ ఉట్టి మాటలే, బామ్మ ఎప్పుడూ కొట్టదు. అమ్మనే కోప్పడుతుంది, కొట్టొద్దని” అని తను చెప్పే మాట పూర్తికాకుండానే ఇంకో పటిక బెల్లం చేతికిచ్చి ”అలా అని వాళ్ళకు చెప్పొద్దని” బతిమాలటం పూర్తికాకుండానే నాన్న బట్టల మూట బామ్మ ముందు పెట్టించాడు. ఎంతో మంచి మంచి బట్టలు, మెరిసిపోయే గుడ్డలు. ఇంకా జరీ పంచెలు, ఏవేవో చీరలు… అన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయో అనిపించింది. ‘అన్నీ ఖరీదయినవే తెచ్చావెందుకురా అబ్బీ’ అంది బామ్మ.

”ఆ ఇదే మొదటిసారి ఆయె. ఆ మాత్రం ఉండకపోతే బాగుండదని” అన్నాడు నాన్న.

‘ఇంత మాత్రం పెట్టకపోతే ఏం బాగుంటుందీ’ అని అమ్మ అనటం, ‘మరి నా పెళ్ళికి అలాంటి అంగోస్త్రం గుడ్డలు కొనిపించావేం?’ అని చిన్నత్తయ్య అడగటం, ‘అప్పుడు నా పెత్తనం ఏముందీ? అంతా మీ అమ్మగారిదేగా’ అని అమ్మ అక్కడనుంచి వెళ్ళిపోవటం, పండగకి వచ్చిన అక్కయ్య అత్తగారితో లాకుల దగ్గరికి షికార్లు, అక్కయ్య మరిదిని అన్నింటికీ ఎగతాళి చేసి ఏడిపించడంతో ఎంతో సరదాగా గడిచింది ఆ పండగ. రాత్రిళ్ళు కూడా పగలుగానే సందడిగా జరిగింది.

అక్కయ్య బావని తలుపు వెనక నుంచి చూడడం, బావ రహస్యంగా పుస్తకాలను అక్కయ్య చేతిలో పెట్టడం, తను వెళ్ళి బామ్మకు చెపితే బామ్మ చెవిలో ఏదో చెప్పి ‘భడవా నీకెందుకే అవన్నీ’ అని తనని తిట్టడం గుర్తుకు వచ్చాయి.

అవును తనెందుకు చెప్పిందో మళ్ళీ బావ రెండేళ్ళదాకా రాలేదు. అనుకునేవారు ఆ ఏడు అక్కయ్య మామగారు పోయారట. అత్తగారు, కోడల్ని చూడనని పట్టు పట్టిందట. అక్కయ్య మాత్రం వారంలో రెండు రోజులు టపా సంచి కోసం ఎదురుచూసేది. ఒక్కోసారి రాకపోతే కోపంతో ఆ రోజంతా విసుక్కుంటూ ఉండేది.

ఆ ఏడు వేసంగుల్లో బావ వస్తున్నాడని మళ్ళీ ఇల్లంతా సుబ్బరం చేయిస్తున్నారు. నీళ్ళ గది గోడ పడిపోయింది. కట్టిస్తున్నారు. దక్షిణం వైపు గదికి, గుమ్మాలకి గుడ్డలు కట్టి, పెద్ద పెద్ద అద్దాలు, ఫోటోలు ఎవరెవరివో తెప్పించి పెట్టారు. గది అంతా కాయితాల పందిరిలా ఎన్నో రంగుల కాయితాలు కట్టారు.

హడావిడిగా ఉన్న ఇంట్లో బావ ఒక్కడే వచ్చాడన్న మాటతో అంతా ఒక్కసారిగా దిగాలుపడ్డారు. అంతా తలోసారి వెళ్ళి ‘ఏం బాబు మనవాళ్ళు ఎవరూ రాలేదేం?’ అని అడగటం, బావ ముభావంగా నవ్వి ఊరుకోవడం చూస్తున్న తను ‘బావని మాట్లాడవద్దని చెప్పి పంపారేమో వాళ్ళ వాళ్ళు, మూడు మాటల కథలాగా’ అంటుంటే, ”ఊరుకోవే ముదిపేరక్కా” అంటూ బామ్మ నవ్వును కొంగులో దాచుకుంటూ పక్కకి తప్పుకుంది.

బావకి కావలసినవి కనుక్కునే పని నర్సిగాడికి పడింది. వాడి అల్లరి భరించలేక ఒక బంతిని చేతిలో పెట్టి బావ వాడిని బయటికి తరిమాడు. ఏది కావాల్సినా తనను పిలవడంతో ఏదో ఘనంగా ఉంది. ఆ సంతోషంతో మెళ్ళో గొలుసు చూసుకోలేదు.

సంధ్యవేళ మెడ తడుముకుంటే కనబడక ఇల్లంతా కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. బావ గదిలోకి తొంగి చూసింది. ఇంకెవరో కూర్చుని కబుర్లు చెబుతున్నారు.

గొలుసు పోయిందని ఇల్లంతా మారుమోగింది. అంతా తలోటి తిట్టడం, హడావిడిగా పెంటకుప్పలు వెతకటం, ఏడుపుతో తన కళ్ళు వాయటం చూసిన బావ గంభీరంగా ఏమీ ఎరగనట్టు ‘పోతే పోయిందిలే, ఇది పెట్టుకో’ అంటూ మెళ్ళో పెట్టి కొక్కెం తగిలించాడు. పక్కన ఉన్న పిల్లలు గొల్లుమని నవ్వారు. ఇల్లంతా ఆ మాట చేరి నవ్వుతున్నారు. మేనత్త కూతురు వచ్చి పార్వతి బుగ్గలు గిల్లి మా అన్నయ్య వచ్చేదాకా ఈ అన్నయ్య కట్టాడులే అని ఎగతాళి చేసింది.

తన మెళ్ళో ఉన్నది తన గొలుసేనని అప్పుడు తెల్సుకుంది. సిగ్గుపడటం, మళ్ళీ బావ పిలిచినా ఆ చుట్టుపక్కలకి వెళ్ళకుండా తప్పించుకుని తిరగడం గుర్తుకు వచ్చాయి.

గాలి బుడగలు ఎగరేసుకున్నంత సందడిగా మళ్ళీ ఓ వారం గడిచిపోయింది. ఈ సారి అక్కయ్యని తీసుకుని బావ వెళ్ళిపోయాడు.

మళ్ళీ వెనకటిలాగానే ఇల్లు నిద్దరపోవటం మొదలుపెట్టింది. తనకి ఎవరు ఊరెళ్ళినా ఎందుకో ఏడుపొస్తుంది. అలాగే అక్కయ్య వెళ్ళేటప్పుడూ ఆగలేదు. ‘తప్పు, ఏడుపేమిటే’ అని బామ్మ కసిరింది.

అక్కయ్య వెళ్ళిన కొత్తలో ఎక్కువ ఉత్తరాలు వచ్చేవి కావు. ఎప్పుడయినా బావ ఒక కార్డు రాసేవాడు. అంతే, అక్కయ్య వస్తున్నట్లు వచ్చిన ఉత్తరం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ చదువుకున్నారు. ఈ సారి ఇల్లు అంతా ఎట్లా ఉన్నది అలాగే ఉన్నా పక్కన అన్నయ్య గది మాత్రం శుభ్రం చేయించారు.

వస్తుందనుకున్న రోజుకి అక్కయ్య రాలేదు. మరో పదిరోజులు పోయాక పాలేరును తోడిచ్చి పంపారు. అంతా తలోసారి అక్కయ్యని కౌగలించుకుని పలకరిస్తున్నారు. చాలా చిక్కి నల్లబడిపోయింది పిల్ల అనుకుంది అమ్మ.

”ఎలా ఉందే కొత్త కాపురం?” అని బామ్మ అక్క వీపుమీద చెయ్యేసి అడిగింది. అప్పటిదాకా ఆపుకున్న దుఃఖం ఒక్కసారి పైకి వచ్చింది. ఎందుకే అంటూ ఓదార్చి లోపలికి తీసుకెళ్ళారు. అక్క మరిది పోయాడని అప్పుడు తెలుసుకున్నారు ఇంటిల్లిపాదీ. ‘ఇది విన్నారా!’ అంటూ నాన్నతో ‘మనమ్మాయిని చేసుకోబట్టి పిల్లాడూ, తండ్రీ పోయారని సాధిస్తోంది వియ్యపురాలు’ అని అమ్మ చెప్పింది.

”ఏదో అనుకుంటారులే! ఇంతకీ అతను జాగ్రత్తగా చూస్తున్నాడా?” అని నాన్న అడగటం. ”నీకెందుకే అవతలికి పో” అని అమ్మ కసిరితే అక్కడనుంచి తను వెళ్ళిపోవటం బుర్రలో తిరిగాయి.

ఈసారి అక్కయ్య బండెక్కే ముందు నాన్నతో ”పార్వతికి అప్పుడే పెళ్ళి చేయండి, చదివించండి” అని పదిసార్లు చెప్పింది.

అమ్మ ఈసారి కంటతడి పెట్టింది. వారానికి ఒకసారయినా ఉత్తరం వ్రాయమని అక్కతో ఎన్నోసార్లు చెప్పింది. ఈసారి అక్కయ్య వచ్చి వెళ్ళాక అస్సలు తోచడం లేదు ఎవరికీ. ఎప్పుడైనా అక్కయ్య దగ్గర్నుంచి ఒక ఉత్తరం వస్తుంది. అదే కాలక్షేపం ఆ ఇంట్లో. తెల్లవారటం, పొద్దుగూకటం, బామ్మ మడికట్టుకోవటం… అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయి. అమ్మ వీర్రాజు మాస్టార్ని పెట్టి పురాణాలు నేర్పిస్తోంది. రుక్మిణీ కళ్యాణం కంఠస్థం చేయిస్తున్నారు మాస్టారు. పద్యం వదిలేసి మంచి భర్త ఎలా ఉండాలో అని ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోతున్నారు.

బామ్మ వచ్చి ”అవి ఎందుకు లెద్దురూ? పద్యం క్షుణ్ణంగా చదవటం చెప్పండి” అని విసుక్కుంది. ”అలాగే అలాగే” అని నసిగి మాస్టారు పుస్తకం అటూ ఇటూ తిరగేసి ఆ రోజుకి చాలించారు.

కొద్దిరోజుల్లో పెద్దవాళ్ళ జతలో కలిపారు. ఇప్పుడు కొత్తరకం నిబంధనలు… వీథిలోకి ఎక్కువ వెళ్ళకూడదు. వంచాళింపుగా నడవాలి. గట్టిగా నవ్వకూడదు. పెద్దవాళ్ళు కింద కూర్చుంటే మంచాలూ ఏవీ ఎక్కి కూర్చోకూడదు. ఈ పాఠాలు బామ్మ రోజూ కొద్ది కొద్దిగా చెపుతుంది.

ఇప్పుడు మరీ బాధగా ఉంది. పొద్దుగూకులూ నాలుగు గోడల మధ్యే ఉండాలంటే, అక్కయ్యకి తను ఉండేది కనక కాలక్షేపం అయ్యేదేమో! తనకి ఎవరూ లేరు… నరసిగాడు ఉన్నా ఎప్పుడూ బొంగరాలు, గోళీలు ఈ ధ్యాసతోనే సరిపోతుంది.

బామ్మ పాఠాలు కూడా లేకుండా అత్తయ్యగారి ఊరికెళ్ళింది. మళ్ళీ మూడోనాడే నాన్నతో తిరిగి వచ్చేసింది. వచ్చిన దగ్గరనుంచి రాముడు బావని తిడుతోంది.

”కిరస్తానీ దాన్ని చేసుకున్నాడు రేపు” అంటూ మధ్య మధ్య ఏడుపుతో అమ్మకి చెప్పేది. కొన్నాళ్ళు జరక్కుండానే అమ్మ నాన్నని ఎక్కడెక్కడికో పంపేది.

ఓ రోజు రాత్రి టెలిగ్రామ్‌ రావటం అంతా ఒక్కసారి గొల్లుమనటం జరిగింది. పిల్లంటే పిల్లా అది అంటూ బామ్మ అక్కని వర్ణించి ఏడుస్తుంటే అక్క ఏమయిందో అర్థం కాలేదు. కొంతసేపటికి విషయం తెలిసినా ఏడుపు రాలేదు. మర్నాడు అమ్మా, నాన్నా అక్కయ్య అత్తగారి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అంతా అమ్మకి తలోరకంగా చెప్పారు.

అక్కయ్యని ఎవరూ చూడలేదు. బావకి ఏదో వైరాగ్యం వచ్చినట్లు ఉన్నాడని ఇంకెవరో అమ్మకి చెపుతున్నారు. ”మీ అమ్మాయి పాదం ఎలాంటిదయినా కడుపులో పెట్టుకున్నాను. అయినా ఇలా అన్యాయం చేసి పోయింది” అంటూ గట్టిగా బొబ్బలు పెట్టి అత్తగారు ఏడుస్తోంది.

”అబ్బో! అంత ఇదిగా సూత్తే నూతిలో ఎందుకు దూకుద్దీ” అని గుసగుసలాడారు వచ్చినవాళ్ళు. మర్నాడే తిరుగు ప్రయాణం. అమ్మా, నాన్నని చూస్తే దుఃఖం ఆగటం లేదు. ఎద్దుబండి పుంత దాటుతోంది. ఎవరో పెద్దలు నాన్నని దిగమని సైగ చేశారు. ఏదో కొంతసేపు మాటలు జరిగాయి. నాన్న ముఖం కండువాతో దాచుకోవటం, మళ్ళీ బండి కదలటం గుర్తుకు వచ్చి ఏడుపు ఆగటం లేదు.

అమ్మ తేరుకునేసరికి చాలా నెలలు గడిచాయి. ఓరోజు చీకట్లో మళ్ళీ ఆ పెద్దలు దిగబడ్డారు. నాన్న, బామ్మ అంతా ఏంటో మాట్లాడుకున్నారు. అమ్మ వచ్చి ”నువ్వు ఒప్పుకోవద్దు వాళ్ళు అడిగితే” అని రహస్యంగా చెప్పింది.

ఎవరూ వచ్చి అడగలేదు. అమ్మని నాన్న కోప్పడటం మాత్రం అందరికీ వినబడింది. అచ్చి రాలేదు. కనుక గుళ్ళో పెళ్ళి అని ఒప్పించారట. అమ్మకి ఇష్టం లేదు. అయినా అయిపోయింది. అక్కకి అన్యాయం జరిగింది అని మనస్సు ఘోష పెట్టినా తన ఇష్టాయిష్టాలతో పని ఎవరికి? రామం బావ చేసుకునుంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్న ఆలోచన మళ్ళీ వెనక్కు వెళ్ళింది. అయినా తనకు చదువా, సంగీతమా! ఏమి ఉన్నాయి కనుక! చేసుకోలేదన్న బాధ ఎందుకు! ఏమో బామ్మ ”మంచి మొగుడు రావాలని” దీవించినప్పుడల్లా రామం బావనే తలుచుకోవటం. ”ఛీ! ఇప్పుడు జరిగిందేమిటి? పెళ్ళి చేసుకోకపోయినా రామం బావ ఎలాగూ చేసుకోడు” అనుకొని తల దిమ్ముగా ఉంది. భోజనాల దగ్గర అత్తగారు అన్న మాటలు మళ్ళీ కొత్తరూపంతో తిరుగుతున్నాయి.

”ఆ రాధ ఊళ్ళో ఉంటే నీకు ఇంటి గొడవ ఎందుకు పడుతుందిలే. అయినా దీన్ని మళ్ళీ ఒకదాన్ని కట్టి పెట్టారు” అని విసుక్కోవటం.

ఎవరు కట్టారట? అసలు రాధ ఎవరు? అక్కయ్య అలా చెయ్యడానికి ఆమే కారణమేమో! రకరకాల ప్రశ్నలు తిరుగుతున్నాయి. రాధ పేరుమీదే ఈర్ష్య పుడుతోంది. పోనీ ఆవిడనే చేసుకోక ఇదేమిటి? దీనికి సమాధానం మనస్సు ఇవ్వటం లేదు. నూతి గోడమీద తెల్లగా మనిషి కనబడుతోంది. భయంతో ఒంట్లో వణుకు పుట్టింది. ఒకవేళ అక్కయ్య వచ్చి అక్కడ కూర్చోలేదు కదా! వెళ్ళి చూస్తేనో అనిపించింది. మళ్ళీ భయంతో ఒంట్లో దడ ఎక్కువయింది. గుండెలు గట్టిగా పట్టుకుని నూతివైపు పరుగుపెట్టింది.

తను చూసిన మనిషి నూతిలోకి దూకుతోంది. గట్టిగా అరవాలని, కంఠం ఎత్తి పిలవాలని ఎంతో ప్రయత్నించినా మాట రావటం లేదు. తనను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు ఉంది. కింద పడిపోవటం తెలుస్తోంది. అత్తగారి కేకలకి ఇంటిల్లిపాదీ అక్కడ చేరారు.

తెలివి వచ్చాక లేచి కూర్చోబోయింది పార్వతి. ”ఏమయిందే తల్లీ నీకు? నేను చెట్టు క్రింద వేసుకోకే అని చెపుతూనే ఉన్నా మాట వినిపించుకుంటేనా? అయినా వాడిని అనాలి. దాని ఆలనా పాలనా కనుక్కోడాయె. ఇదివరకు ఆవిడని నెత్తినెట్టుకు ఊరేగాడు, ఎవరు ఎన్ని అన్నా లెక్కచెయ్యకుండా. ఇప్పుడు మాత్రం ఎవరు వద్దన్నారు కనుక!” అంటూ స్వగతం చెప్పుకుపోతోంది రావమ్మ.

పార్వతి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పక్క ఇంట్లో ఎవరితోనో విభూతి పెట్టించింది కోడలికి రావమ్మ. తెల్లవారి ఒకరొకరే పరామర్శకి వస్తున్నారు. పార్వతి తప్పుకు తిరుగుతోంది. వచ్చినవాళ్ళకి ఓ కథలా చెప్పుకొస్తోంది రావమ్మ.

కొడుకు ఆ విషయమే అడగలేదు అని మనస్సు పీకుతోంది. తనే అడిగేసింది వడ్డిస్తూ, ”అబ్బీ! రాత్రి జరిగిన గొడవ విన్నావా?” అని రావమ్మ. భాస్కరరావు ముభావంగా ఊ కొట్టి వెళ్ళిపోవటం అర్థం కాక రావమ్మ తెల్లబోయి చూస్తూ నిల్చుండిపోయింది.

కోడల్ని తనైనా జాగ్రత్తగా చూడాలి అనుకుంది. ఇప్పుడు ఏ పనీ చెయ్యనివ్వటం లేదు. తన పక్కనే మంచం వేయిస్తుంది. చుట్టుపక్కల అమ్మలక్కలకి కొడుకు మీద నేరాలు చెప్పుకునేది. ”చిన్నపిల్లదాన్ని కట్టుకున్నాడన్న మాటేగాని ఇంతవరకూ కన్నెత్తి చూడలేదంటే నమ్ము. ఇది అట్టే గడసరి కాదు, నన్ను పట్టుకు పాకులాడుతుంది పాపం” అని రావమ్మ పక్కింటి ఆవిడకి చెప్పటం కొడుకు విన్నా ఎరగనట్లు వెళ్ళిపోయాడు.

ఎండలు వెనకపట్టి జల్లులు పడుతున్నాయి. ఇంట్లో ఉక్క, బయట వానతో నిద్రపట్టక అటూ, ఇటూ తిరుగుతోంది రావమ్మ. పార్వతి వెనక వసారాలో వేసుకుంది మంచం. కొద్దిగా జల్లు పడుతున్నా ముడుచుకు పడుకుంది. బావ నిజంగా ఎంత మంచివాడో అని అంతా అనుకునేవారు. నిజానికి బావలో తనకేమీ మంచితనం కనపడటం లేదు, వేళకి వచ్చి తిని పోవటం తప్ప. అత్తగార్ని అంతా తిట్టుకున్నారు. తనకి ఎన్నో చెప్పి పంపారు, ఆవిడని గురించి. కానీ ఆవిడలో ఉన్న జాలి, అమ్మలో కూడా లేదేమో. తనను ఎంత ప్రాణంగా చూసుకుంటోందో పాపం! బావతో ఎప్పుడూ మాట్లాడకూడదు అన్న నిర్ణయానికి వచ్చేసింది పార్వతి.

దానికి తోడు రాధకి కొడుకు పుట్టాడని ఎవరో అత్తగారితో రహస్యంగా చెప్పడం వింది. అక్కయ్య పోవటానికి కారణం తెలిసినట్లు మనస్సుకి స్థిమితం వచ్చింది. బావ మాట ఇంక తనకెందుకు? ఏదో ఉన్నన్నాళ్ళూ అత్తగారి దగ్గరే ఉండాలి. తర్వాత ఏం చెయ్యాలి? తనకి నుయ్యంటే భయం. అక్కయ్య ఎలా చెయ్యగలిగిందో? తను ఏదో చేసినట్లు ఊహించుకుని ఏడుస్తోంది పార్వతి.

భాస్కరం మొదటిసారి అనవచ్చు పార్వతిని పిలవటం. ”ఎందుకురా? అది పడుకుంది” అని తల్లి సమాధానం.

”ఇంకా ఎనిమిదన్నా కాలేదు. అప్పుడే పడకేమిటి?” అని విసుక్కుంటూ వసారాలోకి చూశాడు.

”బాగుందిరా వరస. నువ్వేమో ఊరు చుట్టి రెండో జాముకి కానీ రావాయె. అది చిన్నపిల్ల ఏం చెయ్యమంటావు నిద్దరోక” అంటూ తను వెన్ను వాల్చింది రావమ్మ. బావ తన మంచం దగ్గరికి రావటం చూసి లేచి నిల్చుంది పార్వతి.

బుగ్గమీద నీటి చారలు కళ్ళ కాటుక కిందకి జరిగి కళ్ళు మరీ పెద్దగా కనబడుతున్నాయి. రేగిన జుట్టుపై గుడ్డి దీపపు కాంతి పడి గాలి అలలా కదులుతోంది. భాస్కరం రెప్ప వేయకుండా చూస్తున్నాడు.

”ఏమంటున్నావురా అబ్బీ” అంటూ తల్లి రావటం చూసి, భాస్కరం లేని గాంభీర్యం తెచ్చుకుని ”పిలిస్తే పలకదేం?” అని పార్వతిని విసుక్కుని విసురుగా తన గదివైపు వసారాలోకి వెళ్ళిపోయాడు.

”పోనీ ఏమిటో అడక్కపోయావే” అని మెల్లగా పార్వతి కళ్ళలోకి చూసింది. నిండిన కళ్ళనీళ్ళు ఎండిన చారికలపైకి దిగుతున్నాయి. ”ఏమిటో వాడి మనస్సు రాయిలా మారింది. ఇదివరకు ఇట్లాగే ఉండేవాడా!” అని తనలోనే అనుకుని, ”పోనీ, నువ్వైనా వెళ్ళి కనుక్కోవాయె” అంటూ పార్వతిని కొద్దిగా కోప్పడి, భాస్కరం గదిలోకి వెళ్ళింది రావమ్మ.

పార్వతికి ఇప్పుడు అయోమయంగా ఉంది. అకారణంగా అత్తగారికి ఈ కోపమేమిటి? అసలు ఈ ఇంట్లో అంతా తనని అదోలా ఎందుకు చూస్తున్నారు? తనలో లోపమేమిటి? తన తోటి సుశీల గుర్తుకు వచ్చింది. వాళ్ళ అత్తారింట్లో ఎప్పుడూ తనమాటే వస్తూ

ఉంటుందని చెప్పింది. సుశీల అత్తగారు ఎన్నోసార్లు బామ్మతోను, అమ్మమ్మతోను అనటం ‘మీ పార్వతిలాంటి కోడలు రావాలంటే ఏం అదృష్టం పట్టాలో. ఆ కాస్త శాఖా భేదానికీ ఏమిటి లెద్దురూ! మీరు ఊ అంటే రేపే పెట్టిస్తా ముహూర్తం’ అంటూ తను దగ్గరకు లాక్కోవటం జ్ఞాపకం వచ్చి పార్వతి సిగ్గుతో ఇంకా ముడుచుకుని మూలకు జరిగి కూర్చుంది. మళ్ళీ మళ్ళీ ఆవిడ మాటలే మనస్సులో తిప్పుకుంటోంది.

వర్షపు గాలి తుప్పర్లతో వంటికి తగిలి చలితో కలిసి హాయిగా ఉంది ప్రాణానికి. ఎప్పుడో కునుకు పట్టింది. రామం బావ ఒళ్ళంతా కితకితలు పెడుతున్నాడు. తన నవ్వుతూ తప్పించుకుంటోంది. ఛా అంటూ గట్టిగా పైకి నవ్వి కళ్ళు తెరిచింది అరికెన్‌ లాంతరు వెలుతురులో దగ్గరగా బావ కళ్ళు మెరుస్తున్నాయి.

నిజమో, కలో తెలియక కళ్ళు మూసుకుంది. ”ఎందుకు నవ్వుతున్నావు?” అని బావ అడగటంతో భ్రాంతి విడిచి భయం చుట్టుకుంది. అరిచేతుల వెనక మొహన్ని దాచుకుంటోంది. తన చేతులు బావ చేతుల్లో ఇరుక్కున్నాయి. దీపపు పురుగులా కదిలేందుకు వ్యవధి లేదు. తనకి ఇష్టం లేదు. చెప్పేందుకు ప్రయత్నిస్తే గొంతురాక మూగవోయినట్లుంది. తన మొహంలో భావాలు తెలవకుండా దీపం రెపరెపలాడి గాలిలో కలిసింది. జీవితంలో తనకి ఇక కోరికలు ఉండకూడదు. ఉన్నా అవి తనలోనే భద్రంగా దాచుకోవాలి.

మామూలుగానే తెల్లవారింది. ఇంట్లో అంతా కాలంతో పరుగులు పెట్టినట్లు పనులు పూర్తి చేసుకుంటున్నారు. నీరులేని ఏటిలా మనస్సు కదలటం లేదు. చెట్టు మొదట్లో చలనం లేకుండా కూర్చుంది. పాల చెంబుతో వస్తున్న భాస్కరం పార్వతిని చూసి నవ్వాడు. మడిబట్ట ఆరవేసే అత్తగారిలో ఎండవేడి రగిలింది. వడగాలిలా మాటలు పార్వతిని చుట్టుకున్నాయి. గతంలో పార్వతి అంటే జాలి. ఆ క్షణంలో పార్వతి మనస్సు పెరిగింది. ఆ ఊరి ఆకారం ఆ ఇంట్లో కదిలింది. తుప్పలూ, పుంతలూ, శిధిలాలూ, వాటిని చుట్టి మొండిగోడలు. అందులో తను జీవించాలి గడ్డిపోచలా. మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం. అక్కయ్య జీవితం శూన్యంలో వెలిగించిన ప్రమిదలా తను ఎంతకాలం నిలవగలనో అనుకుంది పార్వతి.

కాలం వేసిన ఎగుడు దిగుడు బండలపైన జీవితం సాగుతోంది.

(దీపతోరణం – వంద మంది రచయిత్రుల కథానికలు సంకలనం పుస్తకం నుండి)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.