మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి

డాక్టర్‌ మాధవరావు ఆ ఊరొచ్చి ఐదారు నెలలే అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళను ఎంతో దయగా చూసేవాడు. ఆ హాస్పిటల్‌లో అతనితో కలిసి పనిచేస్తున్న లేడీ డాక్టర్‌ కమల మొదట్లో ఇదంతా పేరు కోసం తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అనుకున్నా, తర్వాత్తర్వాత అతని పట్ల గౌరవభావం చూపసాగింది. ఆ రోజు మధ్యాహ్నం తాను హాస్పిటల్‌కి రానని డాక్టర్‌ మాధవరావుకి చెప్పడానికి వెళ్ళింది. అప్పుడే బయటికి వచ్చిన మాధవరావు ఆమె రావడం చూసి వెళ్ళకుండా నిల్చున్నాడు.

డాక్టర్‌! నేను మధ్యాహ్నం రాను. మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సీరియస్‌ కేసులేమీ లేవు అని చెప్పింది డాక్టర్‌ కమల. అంగీకార సూచకంగా నవ్వాడు డాక్టర్‌ మాధవరావు. ఇద్దరూ నడిచి వస్తున్నారు. ఒక చిన్న కుర్రాడు ఒక వృద్ధుడిని చేయి పట్టుకుని ఆస్పత్రి గేటు దాటించి తీసుకురావడం డాక్టర్‌ మాధవరావు చూశాడు. ఆ కుర్రాడు డాక్టర్‌కి చెప్పాలనుకున్నది చెప్పలేక, చేతిమీద చిరిగిన చొక్కాని రెండో చేత్తో పైకి లాగి పట్టుకుంటూ భయపడుతూ నిల్చున్నాడు.

ఆ వృద్ధుడి కాలిమీద రక్తం కారుతోంది. మోకాలిమీద చర్మం వేలాడుతోంది. ఒంట్లో ఉన్న రక్తమంతా అంతేనేమో అనిపించేంత సన్నగా, బలహీనంగా ఉన్నాడు.

”ఏమైంది?’ అని అడిగాడు మాధవరావు.

”కుక్క కరిచింది సార్‌” అనేందుకు ఆ కుర్రాడికి రెండు నిమిషాలు పట్టింది.

”ఈ సమయంలో వస్తే ఎవరుంటారు? మేము ఇంటికి వెళ్తున్నాం. పైగా దీనికి చాలా ఇంజక్షన్స్‌ తీసుకోవాలి, అవి నొప్పి పెడతాయి కూడా. ఇంటికి తీసుకెళ్ళి కాకరాకు నూరి కట్టు కట్టమను మీ అవ్వని” అంది కమల. మాధవరావు నవ్వుతున్నాడు. ”మనమే ఆ రకం వైద్యం మొదలెడితే, హాస్పిటల్‌ గదులు మరో సంస్థకి ఇచ్చేయొచ్చు” అంటూ ఆ వృద్ధుడ్ని లోపలకు తీసుకెళ్ళి, కట్టుకట్టి, మర్నాడు కనపడమని చెప్పాడు.

”డాక్టర్‌! వాళ్ళు ఏ టైంలో వచ్చినా మీరు ట్రీట్‌ చేస్తారు. అందుకనే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడొచ్చి వేధిస్తారు. ఆ కనికరం తోటివాళ్ళపైన ఉంటే ఎంత బాగుండునో” అంది కమల. హేళనగా అన్నా అందులో కరుకుదనం లేదు. ”మనం విసుక్కుంటే ఎలా? మన టైం కనిపెట్టి, ‘ఇతను ముసలివాడు, పేదవాడు కాబట్టి అతన్ని కరుద్దాం. ఆ డాక్టర్లేం చేస్తారో చూద్దాం’ అని కరుస్తుందంటారా కుక్క? మీరు మెడిసిన్‌ చదవకుండా స్కూల్‌ టీచర్‌గా ఉండాల్సింది” అన్నాడు మాధవరావు నవ్వుతూ.

”నా మాటలా ఉంచండి. మీరు ఏ ఫిలాసఫీ లెక్చరర్‌గానో ఉంటే ప్రతిదాన్నీ చూసి జాలిపడుతూ, అవతలవాళ్ళని కేవలం మీ మంచితనంతో బాధపెడుతూ ఉండేవారేమో. మీ ఇంటికొచ్చి మీ ఆవిడతో చెప్పాలి. మిమ్మల్ని కాస్త చెడ్డవాడిగా మార్చమని” అంది కమల పెద్దగా నవ్వుతూ.

”పొరపాటు. నన్ను మార్చమని చెప్పడం మర్చి మీరే మారతారేమో ఆవిణ్ణి చూసి” అన్నాడు మాధవరావు తనూ బిగ్గరగా నవ్వుతూ.

ఆ నవ్వులో ఆప్యాయత ఉందనిపించింది కమలకి.

”చాలా టైమయింది. ఇంక వెళ్ళి వంటలో పడాలి” అంది కమల.

”పోనీ మా ఇంటికి రండి ఈ పూట” అన్నాడు.

కాదనలేకపోయింది. ఇంటికి వచ్చారు ఇద్దరూ.

శకుంతలని కమలకి పరిచయం చేశాడు, ”ఈ పూట ఈవిడ కూడా మనతో భోంచేస్తారు” అన్నాడు.

శకుంతల ఎంతో నిండుగా నవ్వి ”వడ్డించమంటారా?” అంది.

”నన్ను మర్చిపోయావు కదూ?” అని ప్రశ్నార్థకంగా పలకరించింది కమల. శకుంతలకి వెంటనే గుర్తురాక తికమక పడింది. ”నేనూ, చిట్టిని. మీరూ, మేమూ పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు గుర్తొచ్చిందా?”

”నువ్వా? చాలా మారిపోయావు సుమా?” అంది ఆశ్చర్యంగా శకుంతల. చాలాసేపు చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఇద్దరూ. మధ్యలో కమల మాధవరావుకేసి చూసి ”శకుంతల చిన్నప్పుడు చాలా బాగుండేది. ఇంతమందిని చూస్తున్నా, అంత అందంగా ఎవరూ కనపడలేదు” అంది. ”ఆ అందం చూసే మోసపోయా” అన్నాడు మాధవరావు తమాషాగా నవ్వుతూ.

”అంటే, ఇప్పుడు బాగాలేదని కాదు” అంది కమల. శకుంతల కుట్టిన కుట్లు, ఇల్లు సర్ది పెట్టుకోవడం… అన్నీ శ్రద్ధగా చూస్తోంది కమల. చంటిపిల్లని కమలకి చూపించింది శకుంతల. ”ఎక్కువగా నీ పోలికే కనిపిస్తోంది. ఆ గౌను కుట్టడం చాలా బాగుంది” అంది కమల.

కమల బయల్దేరుతుండగా ”పిల్లలు స్కూలుకెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా ఉండకూడదూ” అంది శకుంతల. ”ఇంకోసారి వస్తా” అని వెళ్ళిపోయింది కమల. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కమల వెళ్ళేసరికి మాధవరావు ఇంట్లోనే ఉన్నాడు. కూర్చోమని కుర్చీ దగ్గరకు లాగాడు. శకుంతల వస్తే కాఫీ తెమ్మని పంపాడు. పెళ్ళిళ్ళ విషయం గురించి సంభాషణ ప్రారంభించాడు.

”ఈ కాలంలో ఇద్దరూ ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకుంటే సుఖంగా ఉంటుందనుకుంటా. మీరేమంటారు?” అన్నాడు. ఈలోగా శకుంతల కాఫీ తెచ్చింది. చివరి మాటలు విని ఎందుకో బాధపడినా, మొహంలో కనబర్చలేదు. తను అక్కడ కూర్చోవాలో, అక్కర్లేదో తోచక కాసేపు కుర్చీ పట్టుకుని నిల్చుని లోపలికి వెళ్ళింది. సంభాషణ సాగలేదు. కమల వెళ్ళిపోయింది.

ఇంకోరోజు కమల, మాధవరావు వర్షంలో తడిచి చీకట్లో నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. చాలా పొద్దుపోయింది. తలుపు తీసిన శకుంతల అలా ఇద్దరూ కలిసి రావడం చూసి ఆశ్చర్యపోయింది. మాధవరావు భోంచేస్తూ చెప్పాడు ‘అలా కొండల్లోకి నడిచి వెళ్ళామని, వర్షం రావడం వల్ల దారి తప్పామనీ, తిరిగి తిరిగి ఎలాగో ఇంటికి చేరామని’. కమల కొంచెం కంగారుపడింది. శకుంతల ఏదీ గుర్తించనట్లు తలవంచుకుని వడ్డిస్తోంది. వర్షం ఎక్కువయింది. ఉరుములు, మెరుపులతో బీభత్సంగా ఉంది ఆకాశమంతా. ఇంటికి వెళ్తానంటూ బయల్దేరింది కమల.

”ఇప్పుడా? ఈ వాతావరణంలో ఎలా వెళ్తారు? పొద్దున్న వెళ్ళొచ్చుగా” అన్నాడు మాధవరావు.

రాత్రి అక్కడే పడుకుంది కమల.

ఉదయాన్నే వెళ్తానంటూ కమల బయల్దేరింది.

”కాఫీ తాగకుండా వెళ్తారా?” అన్నాడు.

‘బేబీ’ అని పిలిచి కాఫీ తెమ్మన్నాడు. చిన్న కూతురు సుశీ పరిగెత్తుకుంటూ వచ్చి తూలి బల్లపైన పడింది. కమల కళ్ళజోడు, పెన్ను కిందపడ్డాయి. మాధవరావు సుశీని కొట్టాడు. కిందపడిన అద్దం ముక్కలు తీసి కాగితంలో పెడుతున్నాడు. అంతలో కాంపౌండర్‌ వచ్చి ”రాత్రి చేరిన పేషెంట్‌ పల్స్‌ అందటం లేదు సార్‌” అని చెప్పి వెళ్ళాడు. మాధవరావు కొంచెం విసుక్కుని అటూ, ఇటూ తిరిగి, బట్టలు మార్చుకుని బయలుదేరాడు. కమలని కూడా రమ్మన్నాడు.

”శకుంతలతో చెప్పి వస్తా” అని లేచింది.

”ఇప్పుడు కాదు. రండి తొందరగా” అన్నాడు. ఇద్దరూ బైటికి నడిచారు. కూతురు ఏడుపు విని గదిలోకి వచ్చింది శకుంతల. కిటికీలోంచి ఇద్దరూ కలిసి వెళ్ళడం కనిపించింది. వేపచెట్టు కింద పనిమనిషి మల్లయ్య లక్ష్మికి వాళ్ళను చూపించి నవ్వుతున్నాడు. లక్ష్మి ఏదో చెప్పబోయి కిటికీ దగ్గర శకుంతలను చూసి తలవంచుకుని ఊడుస్తోంది. హాస్పిటల్‌ వెనకాలే ఉంది ఇల్లు.

దారి పొడుగునా వేప చెట్లు, చింత చెట్లు ఉన్నాయి. రోగులకు తోడుగా మూలుగుతున్నట్లు గాలికి మర్రిచెట్టు ఊడలు ఊగుతున్నాయి.

శకుంతల మనస్సు చికాగ్గా ఉంది.

హాస్పిటల్‌లో గోల వినిపించింది. లక్ష్మి పరిగెట్టుకెళ్ళింది. మల్లయ్య కుర్చీలు తుడుస్తున్నాడు. శకుంతలను చూసి తుడిచే బట్టను చేతులతో నలుపుతూ అన్నాడు ”మరండి, అందరూ అయ్యగార్ని గురించి, ఆ అమ్మగోర్ని గురించి ఏటేటో అనుకుంటన్నారండి…” అని ఇంకా ఏదో చెప్పబోయాడు.

”సర్లే, నీ పని కానియ్యి” అని కసిరింది శకుంతల. ఆ రోజు మాధవరావుని అడగాలనుకుంది. కానీ అతనితో పాటు ఇంకో డాక్టర్‌ రావడంతో ఊరుకుంది.

ఇంకోరోజు కమల వచ్చేసరికి పిల్లలకి చక్కగా ముస్తాబు చేసింది శకుంతల. తను కూడా మంచి సిల్కు చీర కట్టుకుంది. కమల ఒక క్షణం అలా తెల్లబోయి చూసింది.

”ఈ చీర నువ్వు కట్టుకుంటే చాలా బాగుంది కదూ?” అంది.

”ఎవరికైనా బాగుంటుంది” అంది శకుంతల.

”ఆడవాళ్ళు ఒకర్ని ఒకరు మెచ్చుకోరంటారు. మీ ధోరణి వేరుగా ఉందే!” అన్నాడు మాధవరావు ఏ ఒక్కర్నీ

ఉద్దేశించకుండా. ”ఇద్దరూ అందమైన వాళ్ళయితే ఆ ఇబ్బంది. నాకు ఆ బాధ లేదులెండి” అంది కమల.

”అందం కంటే కూడా ఆకర్షణ, కళ ఉండాలి. అవి ఉన్నాయనుకుంటా మీలో” అన్నాడు మాధవరావు. ఆ మాటలు శకుంతల అనుమానాన్ని మరింత దృఢపరిచాయి. ”మేము సినిమాకు వెళ్దామనుకుంటున్నాము. మీరు కూడా వస్తారా” అన్నాడు మాధవరావు కమలనుద్దేశించి. చంటిపిల్ల ఉయ్యాల్లోంచి కిందపడి దెబ్బ తగిలి ఏడుపు మొదలుపెట్టింది. శకుంతల సినిమాకి రానంది. మాధవరావు క్లబ్బుకి వెళ్తానని బయలుదేరాడు. కమల కూడా కారులో వెళ్ళింది.

కొంతసేపటికి కాంపౌండర్‌ వచ్చి ”మీ అన్నయ్యగారు ఫోన్‌ చేశారండీ, మిమ్మల్ని వెంటనే రమ్మనమని చెప్పారు. మీ అమ్మగారికి జబ్బుగా ఉందట. డాక్టర్‌గారు వచ్చేసరికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమన్నారు!!” అమ్మ జబ్బుగా ఉందనగానే కాళ్ళు వణికాయి శకుంతలకి. కార్లోనే వెళ్దామన్నాడు మాధవరావు. బేబీని ముందు కూర్చోమని శకుంతల, మిగిలిన పిల్లలు, పనిమనిషి లక్ష్మి వెనక కూర్చున్నారు. ఇంటికి చేరేసరికి అర్థరాత్రి దాటింది.

ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లలంతా కార్లో నిద్రపోయారు. శకుంతలని దిగమని చంటిపిల్లను ఎత్తుకున్నాడు మాధవరావు. అప్పటిదాకా ఆపుకున్న దుఃఖం ఒక్కసారి పైకి వచ్చి శకుంతల ఏడుపు మొదలుపెట్టింది. ఆమె అన్నగారు తలుపు తీసి, ”ఇప్పుడే నిద్రపట్టింది. ఇంక భయం లేదంటున్నారు డాక్టర్లు” అన్నాడు మెల్లిగా. శకుంతల కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది.

”పొద్దున్నే కూర్చున్నదల్లా పడిపోయింది గుండెల్లో నొప్పి అంటూ. డాక్టర్‌ లాభం లేదన్నాడు. ఇంకో డాక్టర్‌ని కూడా తీసుకువచ్చాడు. ఆయన కూడా అలా అంటేనే మీకు ఫోన్‌ చేశా. రాత్రి పది దాటాక పల్స్‌ నార్మల్‌గా ఉందని, ఇంక భయం లేదని అన్నారు” అని మాధవరావుకి చెప్పాడు. ఆమె కోలుకుంటుందన్న ధైర్యం చిక్కింది. మర్నాడు సాయంత్రానికి మాధవరావు, శకుంతల పిల్లలతో కలిసి ఇంటికి చేరుకున్నారు. రాగానే మల్లయ్య రెండు కవర్లు తెచ్చి ఇచ్చాడు. ”డాక్టర్‌ అమ్మగారు నాలుగ్గంటల బండికి ఊరుకి వెళ్తున్నానని మీతోను, అమ్మగారితోను చెప్పమన్నారండీ”. మాధవరావు ఆశ్చర్యపోయాడు.

”నేను రాకుండానే తను వెళ్ళడమేంటి? పేషేంట్స్‌ని ఎవరు చూస్తారు? ఇలాగే ఉంటాయి ఆడవాళ్ళ పనులు” అని విసుక్కున్నాడు.

శకుంతల ముందు ఉత్తరం చదవకూడదనుకుంది. కానీ చదవడం మొదలుపెట్టింది. ముందు అతనికి వ్రాసిన

ఉత్తరాన్ని తీసింది. అందులో కాగితం చాలా చిన్నది. ఉద్యోగం మానేస్తున్నాననీ, తర్వాత విపులంగా మళ్ళీ వ్రాస్తాననీ వ్రాసి తనను ఆదరంగా చూసినందుకు ధన్యవాదాలు చెప్పి ముగించింది.

రెండో ఉత్తరం తనకు, పెద్దది. ”చిన్నప్పుడు పిల్చినట్లు నిన్ను చిన్నా అని సంభోదిస్తాను. శకుంతల అంటే కొత్తగా ఉంటుంది. నీకంటే పెద్దదాన్నయినా, నీలా ఆదరణ చూపడం నాకు చేతకాలేదు. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని తరచూ మీ ఇంటికి వచ్చేదాన్ని, కానీ చెప్పకుండానే వచ్చేసేదాన్ని. అనుకోకుండా నీ మనసు నొప్పించానేమోనని ఇంటికి వచ్చి బాధపడేదాన్ని.

చిన్నప్పుడు నీకు తెలుసుగా. పెళ్ళిచూపుల కోసం వచ్చిన చాలామంది నేను నచ్చక వెళ్ళిపోయేవారు. తర్వాత నాకు ఇష్టంలేక పెళ్ళి చేసుకోలేదు. నా స్నేహితుల్లో చాలామంది చదువు పూర్తి కాకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ, కొన్నాళ్ళకే ఏదో ఒక రకమైన అసంతృప్తి కనబరచేవాళ్ళు. వాళ్ళని చూస్తూ నాలాంటివాళ్ళకి ఈ జన్మలో పెళ్ళి చేసుకోకూడదనిపించడం సహజం కదూ! మీ ఇంటికి తరచూ రావడం వల్లనేమో నాలో కొంత మార్పు వచ్చింది. నిన్నూ, పిల్లల్నీ, నువ్వు సంసారం నడిపే రీతీ, అన్నీ చూస్తే ఎంతో ముచ్చటగా ఉండేది. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ డాక్టర్‌ గారు ఏ వేళకు వచ్చినా విసుగు లేకుండా కావాల్సినవి అమర్చడం చూసి సంబరపడేదాన్ని. డాక్టర్‌ అంత మంచివాడు కావడానికి నువ్వే కారణమనిపిస్తోంది, నాకు. సహజంగా నీలో ఉన్న సంస్కారం చాలామంది చదువుకున్న వాళ్ళల్లో లేదేమోననిపిస్తుంది నాకు.

నన్ను నాలుగేళ్ళ క్రితం ఒకతను పెళ్ళి చేసుకుంటానన్నాడు. అప్పుడు నేను ఇష్టపడలేదు. కానీ అతను ఎందుకో ఇంకా పెళ్ళి చేసుకోలేదు. మా అక్కకి వరసకి మరిది అవుతాడు. ఇప్పుడు మా పెళ్ళి నిశ్చయమయింది. మీరిద్దరూ పెళ్ళికి తప్పకుండా రావాలి. వీలుపడకపోతే మీలాగే జీవితం గడపాలని ఆశీర్వదిస్తారు కదూ? నేను చేసుకునే అతనిది అంత పెద్ద చదువు కాదు. ఆస్తి ఉంది. నాలో ఏ ప్రత్యేకతా లేకపోయినా నన్నే చేసుకోవాలని ఉందని విన్నాను. నీలా ఓర్పుగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఆ రోజు మేము వర్షంలో రావటం చూసి నువ్వు కనుక ఏమీ అనకుండా ఉండగలిగావు. నేను అలా ఊహించుకుంటేనే కోపమొస్తోంది. ఇంకా ఎన్నో వ్రాయాలనుకున్నా. ఎలా వ్రాయాలో తెలియడం లేదు. మీ ఇద్దరికీ నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. సెలవు. నా కంటే చిన్నదానివి కనుక మళ్ళీ ఆశీర్వదిస్తున్నా. – నీ కమల”

తర్వాత మాధవరావు చదివాడు, శకుంతలకేసి చూశాడు నవ్వుతూ. శకుంతల కళ్ళు కిందకి దింపి నేలకేసి చూసి మళ్ళీ మొహం పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అందులో ఒక కన్నీటి బిందువు మెరిసింది.

(నూరేళ్ళ పంట పుస్తకం నుండి)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.