కుల పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

అవి 19వ శతాబ్దపు చివరి రోజులు. ఒకపక్క బ్రిటిష్‌ పాలనలో ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అర్రులు చాస్తుంటే సామాజిక అంతస్తుల్లో ఆఖరి మెట్టుపైన ఉన్న కులాలు, అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య చుట్టుముట్టిన చీకటి కుహరంలో దుర్భరమైన పీడనను అనుభవి స్తున్నారు. చదువంటే కేవలం అగ్రహారాలలో పుట్టి పెరిగిన వారికి తప్ప ఇతరులకు అంతగా అందుబాటులోకి రాని పరిస్థితి ఇంకా ఉంది. బ్రాహ్మణ అగ్రహారాలలో ఉండే మఠాలు విద్యా పీఠాలుగా భాషా సాహిత్యాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, ఆయుర్వేద వైద్యం వంటి విషయాలనే ప్రధానంగా బోధిస్తుండేవి. బ్రిటిష్‌ వారి రాకతో వచ్చిన ఇంగ్లీషు విద్య, తద్వారా వెలుగులోకి వచ్చిన పాశ్చాత్య భావజాల ప్రభావంతో కొందరు చైతన్యం పొంది భారతీయ సమాజంలో పేరుకు పోయిన అవిద్య, అంధ విశ్వాసాలు, సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం, సతీసహ గమనం వంటి దురాచారాలను రూపుమా పడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్రహ్మ సమాజం వంటి సంస్థలు నిర్మాణమయ్యాయి. బ్రహ్మసమాజం స్త్రీ విద్యతో పాటు వారి పరంగా అమలవుతున్న సామాజిక రుగ్మతలను రూపుమా పడానికి, అణగారిన కులాల సంస్కరణకూ కృషి చేసింది. అంటరాని కులాలుగా పరిగణించబడే అణగారిన కులాలకు క్రైస్తవ మిషనరీలతో పాటు బ్రహ్మ సమాజం వంటి సంస్థలు కూడా విద్యనందించడం ద్వారా వారి సంస్కరణకు దోహదం చేశాయి.

జ్యోతి లింగమ్మ నేటి ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలో రాజుపాలెంలో దళిత మాల కులంలో గోవతోటి వారింటి ఆడపడుచుగా 1866వ సంవత్సరంలో జన్మించింది. ఆ చీకటి రోజుల్లో కూడా దళితుల్లో బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం, సతీసహగమనం వంటి దురాచారాలు ఉండేవి కాదు. లింగమ్మకు యుక్త వయసు రాగానే ప్రస్తుత అద్దంకి సమీపంలోని తాళ్ళూరు గ్రామ వాసియైన జ్యోతి ఓబయ్య గారి కుమారుడైన కోటాదాసుతో వివాహం జరిపించారు. జ్యోతి వంశం కొన్ని తరాలుగా నేత వృత్తిని కుల వృత్తిగా చేసుకుని జీవించేవారు. ఈ కుటుంబం నేత పనిలో సాధించిన ప్రావీణ్యం ఇతరులకు కంటగింపుగా మారిన సందర్భం కూడా ఉంది. ఓబయ్య తండ్రి ‘మార్కాపురం’ మంచి పట్టు పంచె స్వయంగా నేసుకుని ధరించడాన్ని సహించని అక్కడ పెత్తందారీ కులం అతడిపై చేతబడి చేయించి చంపిందంటారు. అయితే తర్వాత ఆయనపై కుట్ర చేసిన వ్యక్తి కుటుంబం కూడా అంతుచిక్కని వ్యాధితో అనుమానాస్పదంగా మృతి చెందిందని తెలుస్తోంది. వారు నేత వృత్తితో సమృద్ధిగా జీవనోపాధిని పొందడంతో పాటు వెంకటగిరి సంస్థానంలో భూమి శిస్తు వసూలు చేసే గౌరవప్రదమైన ఉద్యోగం పొందడం వలన ఆ కుటుంబానికి తమ కులంలోనే కాక సమాజంలో కూడా కొంత పలుకుబడి

ఉండేది. వారికి ఆర్థిక స్థోమత, సాగు చేసుకోవ డానికి తమదైన స్వంత వ్యవసాయ భూమి కూడా పుష్కలంగా ఉండడమే ఆ గౌరవానికి కారణం. దీనికి తోడు వారిది తరాలనుంచి పల్నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న వంశం. పల్నాటి సంప్రదాయాన్ని పాటించడాన్ని ‘దాస సంప్రదాయం’ అంటారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చే కుటుంబాల వారు తమ పేరు చివర ‘దాసు’ అని పెట్టుకోవడం ఆచారం. ఆ విధంగా ‘కోటయ్య’ ‘కోటాదాసు’ అనే గౌరవ ప్రదమైన పేరుకు అర్హుడయాడు. కోటాదాసు బ్రహ్మసమాజపు మనిషి. దేశికాచారియైన శేషయ్య గారి దృష్టిలో పడ్డాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైనా, శేషయ్య బ్రహ్మ సమాజపు ఆశయాల కోసం కులపరమైన కట్టుబాట్లను వదిలి ఉదారవాదిగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రోత్సాహంతో కోటాదాసు చదువుకుని తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించి జానపద నాటకాలు, జంగం కథలు రాయడం ప్రారంభించాడు. ఆయన రాసిన నాటకాలు ఆ ప్రాంతంలో అనేకసార్లు ప్రదర్శించ బడ్డాయి. ఆయన రాసిన ‘చిరియాళ’ నాటకం 1903లో అచ్చయింది. ఆ విధంగా ఆయన తెలుగులో మొదటి దళిత రచయిత, కవి అయ్యాడు.

లింగమ్మకు చదువు లేదు. కానీ ఆమె భర్త కోటాదాసు నుంచి చదవడం, రాయడం నేర్చు కుంది. కోటాదాసు అన్న అయిన తిరుపతయ్య గొప్ప ఆయుర్వేద వైద్యుడు. లింగమ్మ తన బావ గారైన తిరుపతయ్య నుంచి ఆయుర్వేద వైద్య విద్య నేర్చుకుని అందులో ప్రావీణ్యం పొందింది. ఆమెకు మూలికలను చెట్లనుంచి గ్రహించడం, వాటితో వైద్యం చేయడం అలవాటయింది. తాళ్ళూరు గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆమె దగ్గరకొచ్చి వైద్యం చేయించు కునేవారు. కులం కారణంగా కొందరు దూరం జరిగిప్పటికీ వైద్య వృత్తిలో లింగమ్మ సాధించిన ప్రావీణ్యం ముందు కులం చిన్నబోయిందని చెప్పొచ్చు. ఆమె దగ్గర అన్ని కులాల వారు వైద్యం చేయించుకోవడంతో పాటు వైద్య వృత్తిని ఆమె వద్ద నేర్చుకున్న వారిలో కూడా అన్ని కులాల వారు ఉండడం విశేషం. లింగమ్మ భర్త కోటాదాసు, బావగారు తిరుపతయ్య చనిపోయాక ఆమె ఈ రెండు కుటుంబాలకు పెద్ద దిక్కై సాకింది. లింగమ్మకు కొడుకు చెన్నకేశవులుతో పాటు అచ్చమ్మ, ఈశ్వరమ్మ, కోటమ్మ, శేషమ్మ అనే నలుగురు కూతుళ్ళున్నారు. ఆమె కొడుకు చెన్నకేశవులు కూడా తండ్రిలాగే గొప్ప పాండిత్యం పొందినప్పటికీ ఆయన ఒక పక్క కులవృత్తి అయిన నేత పని చేస్తూనే తల్లి లింగమ్మకు వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు. లింగమ్మ తన మనవడు జ్యోతి శ్రీరాములుని వెంటబెట్టుకుని ఆయుర్వేద వైద్యం నేర్పించింది. ఆయన ఆమె శిక్షణలో గొప్ప వైద్యుడిగా, కవిగా ఎదిగాడు. తర్వాత తరంలో ఆమె ముని మనవడు విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి గారు విశిష్టమైన పండితుడిగా, అధ్యయన కారుడిగా, గుర్తింపు పొందడం విశేషం. ఆమె వ్యవసాయం కూడా చాకచక్యంతో చేసేది. ఎంతో ధైర్యం, తెగువ ఉన్న లింగమ్మ అంటే ఆ గ్రామస్తుల్లో కొందరికి భయం, మరి కొందరికి ఈర్ష్య, ఎక్కువమందికి ఆమె అపురూపం, ఆశ్చర్యం. ఒకసారి పొలంలో గడ్డి కోసుకురావ డానికి వెళ్ళిన లింగమ్మతో ఒక పెత్తందారీ కులస్తుడు అమర్యాదకరంగా ప్రవర్తించడంతో ఆ విషయమై పంచాయితీ ఏర్పాటు చేయించి లింగమ్మ అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె చూపిన ధైర్యం, చొరవ ఆనాటికే కాదు ఇప్పటికీ ఆశ్చర్యకరమైనదే!

జ్యోతి లింగమ్మ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఎంతో శక్తిమంతురాలు. ఆమె తన నిండైన జీవితాన్ని అర్థవంతంగా, సమాజ సేవకు అంకితం చేసి తన ఎనభై నాలుగో సంవత్సరంలో 1952లో మరణించింది. ఆమె సమాధి తాళ్ళూరు గ్రామంలో ఇప్పటికీ ఉంది. లింగమ్మ కుల సమాజం దళితులపై రుద్దిన కులపరమైన ఆంక్షలను, పితృస్వామిక వ్యవస్థ స్త్రీల బతుకులపై కుమ్మరించిన వివక్షనూ మొత్తంగా బ్రాహ్మణీయ భావజాలాన్ని సవాలు చేసి, అన్ని రకాల అవరోధాలను ఈడ్చి తన్నిన ధీర జ్యోతి లింగమ్మ. దళితుల పరంగా, ముఖ్యంగా దళిత స్త్రీల పరంగా కనీసపు వెలుతురు సోకని చీకటి రోజుల్లో ఒక దళిత స్త్రీ వైద్యురాలిగా రాణించడం, సొంత వ్యక్తిత్వంతో ప్రకాశించడం, ధైర్య సాహసాలతో పెత్తందారీ కుల మగ దురహంకారుల దాష్టీకాన్ని ధిక్కరించడం అసాధారణమైన విషయం. ఏ రంగంలోనైనా ప్రావీణ్యం సాధించడం అనేది ఒక కులానికో, జెండర్‌ కో పుట్టుకతో సంక్రమించే ప్రతిభ అని భావించే సమాజంలో వ్యవస్థీకృత సంప్రదాయ విలువల్ని ఈడ్చి తన్ని భావితరాలకు గొప్ప పోరాట వారసత్వాన్ని అందించిన లింగమ్మ ఓ సాహసి. దళిత సమాజం గ్రామాలలో పెత్తందారుల ఆగడాలను భరించడం, బలైపోవడం తప్ప ఎదురు తిరిగి వారితో కలబడి నిలబడిన ఇటువంటి అరుదైన సంఘటనలు చరిత్రలో పెద్దగా లిఖించబడలేదు. అటువంటి ధిక్కార చరిత్రకు లింగమ్మ జ్యోతి ప్రజ్వలన చేసిందనవచ్చు.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.