కోడి కూతతో పాటే చూరులో పిచ్చుకల కిచకిచలకి మెలకువ వచ్చింది అరుణకి. అర్థరాత్రి దాటాక ఎప్పటికో నిద్రపట్టింది కానీ నిద్రనిండా కలలే. బద్ధకంగా ఉన్నా లేచి కూర్చుంది. తొందరగా పనులు పూర్తి చేసుకుని మండలంలో ఉన్న బ్యాంక్‌కి ఎల్లాలను కుంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. రాత్రి జరిగిన గొడవ, భర్త అసహాయంగా కూలబడిన దృశ్యం రెప్పల వెనక కనబడగానే కళ్ళు తెరిచేసింది. మంచంమీద పడుకున్న భర్తవైపు చూసింది. మెలకువ వచ్చినా కదలకుండా పడుకున్నాడని అర్థమైంది. లేచి భర్త దగ్గరకొచ్చి కూర్చుని నుదుటిమీద చెయ్యేసి ‘నువ్వేమీ దిగులు పెట్టుకోమాకు. మనేద మనిషిని తినేసుద్ది. ఏదోటి సేద్దాంలే. నేనోపాలి బ్యాంకుకి పోయొత్తా. మా సంఘంలోనూ మాట్టాడతా. సూద్దాం ఏమౌతాదో. నువ్వు మాత్రం ధీమాగుండాల. అప్పుడే నాకు దైర్నం’ అంటూ లేవబోయింది. ‘అరుణా…’ అంటూ ఆగిపోయిన భర్తకేసి చూసి ‘చెప్పు బావా’ అంది. ‘ఏం లేదులే పో’ అంటూ లేచి కూచ్చున్నాడు సూర్యం. ఒక నిట్టూర్పు విడిచి పనిలో పడింది.
ఎకరంన్నర మాగాణి, అరెకరం మెట్ట ఉన్న చిన్న రైతు కుటుంబం. ఇంటికి సరిపోయే వరితోపాటు కాస్త పెసర, మినుము పండిస్తారు మాగాణిలో. కంది, మొక్కజొన్న, మిరప లాంటివి మెట్టభూమిలో నీటి వీలుని బట్టి వేస్తుంటారు. గట్లమీద అక్కడక్కడ కూరగాయల మొక్కల పాదులు పెట్టి ఇంటికి కావల్సినవి వాడుకుని ఏవన్నా మిగిలితే ఊర్లో పేదలకి సర్దుతారు. పాడి కోసం పొదుపు గ్రూపులో లోనుతో గేదె కొంది అరుణ. వాడుకోగా మిగిలిన పాలు, పెరుగుతో పాటు వెన్న, నెయ్యి చేసి అమ్మి సూక్ష్మ వ్యాపారం చేస్తుంది. నాలుగు కోళ్ళు పెంచుతూ పిల్లలకి పోషణ లోపం లేకుండా చూసుకుంటోంది. సున్నిత మనస్కుడైన భర్త మెతకదనం చూసి ఊరోళ్ళు కొందరు రెచ్చగొడుతుంటారు. ఇంకొంతమంది బాధలు చెప్పుకుని చిన్నా, చితకా డబ్బు చేబదులంటూ తీసుకుని ఎగ్గొడుతుంటారు. ‘ఇట్టాగైతే ఎట్టా బావా… కొద్దిగా గట్టిగా ఉండాలి గాని. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు. ఖచ్చులు పెరగట్లా? అమ్మాయి పెళ్ళి కోసం కొద్దిగన్నా దాయాలిగా’ అంటూ ఉంటుంది భర్తతో. ‘పాపం ఆళ్ళు కట్టంలో ఉన్నారు. ఇచ్చేత్తారులే’ అంటున్న భర్తని జాలిగా చూడ్డం తప్పించి ఇంకో మాటనదు.
ఇంటర్ పూర్తిచేసి ఇక చదవలేనన్న పెద్ద కూతురికి ఆర్నెల్లనాడు పెళ్ళి చేశారు. అబ్బాయికి గవర్నమెంట్ ఆఫీసులో చిన్న ఉద్యోగమైనా పర్మనెంట్‌దని పిల్లనిచ్చారు. అప్పు చేసి కట్న కానుకలివ్వడంతో పాటు, ఊర్లోనే వైభవంగా పెళ్ళి చేశారు. అత్తారింట్లో తక్కువ కాకూడదని ఓపికకి మించి బంగారం పెట్టారు కూతురికి. ఆ అప్పు సగమన్నా తీరలా. ఇప్పుడేమో చిన్నకూతురు పెద్దమనిషైంది. ‘పదిహేనేళ్ళు వచ్చినా పుష్పవతి కాలేదంటే ఏదన్నా లోప ముందేమో’ అని చెవులు కొరుక్కునే వారు అమ్మలక్కలు. చిన్న ఊరు కాబట్టి ఈ విషయం మగాళ్ళు కూడా మాట్టాడుకునేవారు. అది నచ్చక, వాళ్ళనేమీ అనలేక మనస్థాపం చెందే వాడు సూర్యం. అలాంటప్పుడు ఇంట్లోవాళ్ళ తోనూ ముభావంగా ఉండేవాడు. అరుణే ఏదోకటి మాట్లాడుతూ వాతావరణాన్ని తేలికచేసేది. కొడుకు ఇంకా చిన్నపిల్లాడు. వాడికి చదువు అంతగా అబ్బట్లేదని అనిపిస్తోంది. అదో దిగులు వాళ్ళిద్దరికీ.
వారమైంది చిన్నకూతురు పెద్దమనిషయ్యి. ఊళ్ళో అందరూ ఫంక్షన్ బాగా చెయ్యాలని సూర్యాన్ని ఎగేస్తున్నారు. ఇంటి కొచ్చి అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటున్న భర్తకి నచ్చచెప్పడానికి చూస్తోంది. కానీ ‘అందరూ ఆశిస్తున్నారే. మనం చెయ్యకపోతే బాగోదమ్మీ….’ అంటుంటే ఎలా చెప్పాలో అర్థంకాక నెత్తికొట్టుకుంటోంది. ఒకెకరం మాగాణి అమ్మేస్తే ఇటు పిల్లకి ఫంక్షన్ చెయ్యగా అటు పెళ్ళికి చేసిన అప్పూ తీరిపోతుంది అని అరుణని ఒప్పించాలని చూస్తున్నాడు సూర్యం. ‘భూమి కదిపేదే లేదు. ఫంక్షన్ అక్కర్లేదు. అందర్నీ పిలిచి స్వీట్లు, పళ్ళు పెట్టి బొట్టు, తాంబూలం ఇద్దాం. అంతే’ అని అరుణ ఖచ్చితంగా అనడంతో చిన్నబోయాడు సూర్యం. ‘నామాటంటే నీకు లెక్కేలేదు. చేతగాని వాడని అందరూ అంటారు. ఇప్పటికే పెళ్ళాం ఆడిచ్చినట్టల్లా ఆడతాడని ఎద్దేవా చేస్తున్నారు. నువ్వు నోర్మూసుకుని నే చెప్పింది విను’ అని గట్టిగా అరిచాడు. ఎప్పుడూ ఎరగని ఈ సూర్యాన్ని చూసి బిత్తరపోయింది అరుణ. తేరుకుని ‘బావా నా మాటిను. ఇప్పుడు భూమికి రేటే లేదుగా. అమ్ముకుంటే నష్టపోతాం. మా సంఘం నుంచి అప్పు తీసుకుంటా. లేదంటే బ్యాంకులో లోను తీసు కుని ఉన్నంతలో ప్రస్తుతం కార్యం నడుపుదాం. ఎచ్చులి కిపోవద్దు. ఇయ్యాల అనేవాళ్ళెవరూ మన కట్టంలో తోడురారు. నా మాటిను…’ అంటుంటే ‘వీల్లేదు. నువ్వే నా మాటిను. నేను నీ మొగుడ్ని. చెప్పినట్టు చెయ్’ అంటూ కోపంగా లేచి భుజంమీది తువ్వాల్ని గట్టిగా విదిలించాడు. తల్లిని కొట్టబోతు న్నాడనుకుని పదేళ్ళ కొడుకు ‘నాన్నా’ అంటూ అడ్డుపడ్డాడు. దాంతో మరింత రెచ్చిపోయి ‘ఏరా నీక్కూడా లోకువయ్యానా’ అని దబాదబా నాలుగు బాదాడు కొడుకు వీపుమీద. అనుకోని సంఘటనకు అందరూ బిత్తరపోయారు. ఎప్పుడూ దెబ్బవెయ్యడం కాదు కదా కనీసం తిట్టనన్నా తిట్టని సూర్యం ప్రవర్తన ఇవ్వాళ కొత్తగా ఉంది. గదిలో ఆకులమీద కూర్చున్న కూతురు గభాల్న లేచొచ్చి గుమ్మం దగ్గర నుంచొని ‘నాన్నా , నువ్విలా కాదు. మమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనవు. ఇవ్వాళేమ యింది. మీ నాన్న బుద్ధుడిలాంటోడు. మీరు అదృష్టవంతులు అని నా ఫ్రెండ్సందరూ అంటుంటే గర్వంగా ఉంటుంది. నువ్వు మనిషివి నాన్నా… మనసున్న మంచి మనిషివి’. తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు తెలివైందని తెలుసు. కానీ ఇవ్వాళ తను ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయిన తన బలహీనతని గుర్తించి తనకి చెప్తుంటే సిగ్గుతో తల వాల్చుకుని మంచం మీద కూలబడిపోయాడు.
తెల్లారి చకచకా పనులు ముగించుకుని పిల్లలకి జాగ్రత్తలు చెప్పి, పొలమెళ్ళిన సూర్యం కోసం భోజనం పక్కనపెట్టి బ్యాంకుకి బయలు దేరింది. తిరిగొచ్చేసరికి పొద్దుపోయింది. పిల్లలిద్దరూ ఎదురు చూస్తూ గుమ్మంలోనే ఉన్నారు. తల్లిని చూడగానే పరిగెత్తుకొచ్చి ‘నాన్న రాలేదమ్మా ఎక్కడికెళ్ళాడు’ అంటున్న కొడుకు మాటలకి అయోమయంగా చూసింది. పొలంవైపు పరిగెత్తింది. దారిలో కనపడినాళ్ళని అడుగుతూపోయింది. ఒక్కసారిగా ఊరు ఊరంతా గాభరాపడి, అన్ని దిక్కులా వెతకడానికి చెల్లాచెదురుగా అందరూ పరిగెత్తారు.
‘బావా… బావా…’ అని అరుచుకుంటూ గట్లెమ్మట, చెట్లెమ్మట వెతుక్కుంటూ పరిగెడుతున్న అరుణ కాలుకి ఏదో తట్టుకుని బోర్లాపడింది. చూస్తే పరక గడ్డితో పేనిన తాడు కాలుకి చుట్టుకుంది. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. సూర్యం ఇష్టంగా పేనే తాడది. నిశ్చేష్టగా కూర్చుండి పోయింది. వెనకే వెతుక్కుంటూ వచ్చిన కొడుకు, ఊరి జనం చుట్టూ చూసొచ్చారు. చివరికి నాలుగ్గ జాల దూరంలో గోతిలో పడున్న సూర్యం శవం కనబడింది. నోట్లోంచి నురగలొచ్చి ఎండిపో యింది. పురుగుమందు వాసన. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. అవేమీ అరుణకి చేరట్లేదు. ఫోన్లో లోన్ శాంక్షనయినట్టు వచ్చిన మెసేజ్‌కి విలువే లేదు. మరో రైతు ఆత్మహత్య అని వచ్చింది మర్నాటి పేపర్లో.
వాళ్ళ ముగ్గురికీ తెలుసు సూర్యం పోయింది అప్పు తీర్చలేక కాదని… తను మంచి భర్తగా, మంచి తండ్రిగా… ఒక మంచి మగాడిగా… సక్సెస్ కాలేకపోయిన ఫీలింగ్, అలా సమాజానికి తను నిరూపించుకోలేకపోయానన్న ఫాల్స్ ఇమేజ్‌తో, ఫాల్స్ ఇగోతో తనని తను అంతం చేసుకున్నాడని. ఇది రైతు ఆత్మహత్యా?… లేక ఓడిన పురుషత్వపు భావనా?