సంపాదకులకు,
అద్భుతం ‘కొండ ఒడిలో… కొండబడి’ ఫిబ్రవరి భూమిక సంచికలో ప్రచురించిన ప్రశాంతి గారి ‘కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి…’ ఎంత అద్భుతంగా ఉంది. ‘కొండ ఒడిలో… కొండబడి’ వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అమాయక ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపడానికి వారి భాగస్వామ్యంతోనే ‘కొండబడి’ ఆవిష్కరించబడడం మరింత అద్భుతం. మానవత్వంలో కొండంత ఎత్తుకు ఎదిగి, గిరిపుత్రులతో మమేకమై, ఈ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించడంతో వారి మనసులలో నిలిచారు ‘విజేత’గా. అలాగే ఈ అద్భుతాన్ని సృష్టించడంలో భాగస్వామ్యులైన వెంకట రమణ ఆకుల, వెంకటేష్ వంటి ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. చిన్న మొక్కగా ప్రారంభమైన ఆ ‘బడి’ వటవృక్షంలా ఎదగాలని, తద్వారా ఆ అడవిబిడ్డలు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గిరిపుత్రుల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. ఎక్కడో ఒక మూలన ఉన్న ‘కొండబడి’ని సందర్శించి గిరిబిడ్డల చదువు కోసం తన వంతు సహకారాన్ని అందించడమే కాక అడవి గర్భంలోని ఆ ‘బడి’ని అత్యద్భుతంగా పరిచయం చేసిన ప్రశాంతి గారికి ధన్యవాదాలు.
ప్రవీణ ఆర్, ఢిల్లీ