రాలిన పండుటాకు ` పూల దోసిళ్ళ నివాళి – కాత్యాయనీ విద్మహే

1978… చివరకు మిగిలేది నవలపై ప్రారంభించిన పరిశోధనే నన్ను శివరాజు సుబ్బలక్ష్మి గారిని వెతుక్కుంటూ వెళ్ళేలా చేసింది. బుచ్చిబాబు సాహిత్య కళాజీవిత సమగ్ర సమాచార సేకరణకు తొలి వనరు ఆయన భార్యే కదా! ఆవిడ ఎక్కడుంటారు, కలవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మొదలి నాగభూషణ శర్మగారు ఆవిడ హైదరాబాద్‌లోనే ఉంటారని, వస్తే పరిచయం చేస్తానని అన్నారు, చేశారు. మామూలుగా అయితే ఇలాంటి పరిచయాలు ఒకటి రెండుసార్లు కలిసి పరిశోధనకు అవసరమైన మేరకు సమాచారం సేకరించుకోవడంతోనో, ఇంటర్వ్యూ పేరు మీద కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవడంతోనో ముగుస్తాయి. కానీ మా సంగతి అలా కాదు. బుచ్చిబాబును ఆమె ఎంత ప్రేమించిందో, ఆయన మీద పరిశోధన చేస్తున్నానని నన్నంతగా చేరదీసి వాత్సల్యం చూపారు.
నా ప్రధాన సిద్దాంత రచన నవల వరకే అయినా, ఆయన సమగ్ర వాజ్ఞ్మయ సూచిక తయారు చేయాలన్న నా సంకల్పానికి బండి గోపాలరెడ్డి గారి సలహా కూడా తోడై ఆయనకు వచ్చిన ఉత్తరాలు, వ్రాసుకొన్న డైరీలు ఒక్క పేజీ కూడా వదలకుండా చూసి నోట్స్‌ వ్రాసుకోవలసి వచ్చింది. 1978`80 మధ్యకాలపు వేసవి సెలవులలో అదే పనిమీద హైదరాబాద్‌ వెళ్ళేదాన్ని. నేనెక్కడో బసచేసి పనికోసం వాళ్ళింటికి వెళ్ళడం ఆమెకు నచ్చేది కాదు. తార్నాకలో వాళ్ళది పెద్ద ఇల్లు. ఇంటికంటే విశాలం ఆమె హృదయం. ‘‘నేనూ మా తమ్ముడే కదా ఉండేది, నువ్వు కూడా ఇక్కడే ఉండు’’ అని నన్ను ఒప్పించారు. నా సహచరుడు వెంకటేశ్వర్లు అప్పుడు అక్కడ టిబి హాస్పిటల్‌లో ఛాతీ వైద్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా కోసం చదువుతున్నాడు. అతన్ని కూడా ఇక్కడికి రమ్మను, ఇక్కడినుండే వెళ్తాడు హాస్పిటల్‌కు అని ఆమె ఇచ్చిన ఆహ్వానంలో ఆర్ద్రత తలచుకుంటే ఇప్పటికీ గుండె తడి అవుతుంది. అలా నేను వాళ్ళింట్లో మనిషిని అయిపోయా.
ఇంటికి ఎవరు వచ్చినా మా అమ్మాయి అని పరిచయం చేసేవారు. లాలాగూడలో ఆమె రెండవ తమ్ముడు ఉండేవాడు. ప్రతి ఆదివారం సాయంత్రం వాళ్ళింటికి వెళ్తూ నన్నూ తీసుకువెళ్ళేవాళ్ళు. అక్కడ కబుర్లు, భోజనాలు పూర్తి చేసుకుని రాత్రి పదికో, పదకొండుకో ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ తమ్ముడి పెద్ద కొడుకు అప్పుడు చిన్నవాడు. బుజ్జి, బుజ్జామ్‌ అని పిలిచేవాళ్ళు. అసలు పేరు సుబ్బారావు. బుచ్చిబాబు అసలు పేరు కూడా సుబ్బారావే. సుబ్బలక్ష్మి గారు తర్వాతి కాలంలో ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉన్న ఆ మేనల్లుడి దగ్గరికే వెళ్ళి ఉన్నారు. తెలుగు ప్రాంతం నుండి వెళ్ళినా తెలుగు సాహిత్య రంగంలో అనేకమందితో స్నేహసంబంధాలు కొనసాగించారు. ఆత్మకథ వ్రాసుకున్నారు. సాహిత్య సభలకు హాజరయ్యారు. సత్కారాలు అందుకున్నారు. 96 ఏళ్ళ వయసులో ఫిబ్రవరి 6వ తేదీన బెంగుళూరులో మరణించారు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అందులోనూ పరిపూర్ణ జీవితమే ఆవిడది. అయినా స్నేహం, ప్రేమ పంచి ఇచ్చిన మనుషులు మాయం కావటం మనసుకు నొప్పిగానే ఉంటుంది. నాకైతే మళ్ళీ అమ్మను కోల్పోయినట్లు ఉంది.
ఉదయం సుబ్బలక్ష్మి గారితో ఫిల్టర్‌ కాఫీ సంభాషణలు, భోజనాల దగ్గరి సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. బుచ్చిబాబు గారు, తాను పుట్టి పెరిగిన గోదావరి జిల్లాల ప్రకృతి పరిసరాలలోకి నన్ను తీసుకువెళ్ళి తిప్పేవి. 1930, 40ల నాటి నియోగి బ్రాహ్మణ కుటుంబ సంప్రదాయ సంస్కృతిని పరిచయం చేసేవి. బుచ్చిబాబుతో తన పెళ్ళి దగ్గరి నుండి కలిసి చేసిన జీవితకాలపు ప్రయాణంలోని భిన్నఘట్టాలను ఆమె కథనం చేసిన తీరు, నేనెప్పుడూ చూడని బుచ్చిబాబుతో నాకెంతో పరిచయాన్ని ఏర్పరచింది. బుచ్చిబాబు గారి కథల గురించి, ఆయన సున్నిత హృదయ తత్వం గురించి ఆమె చెప్పే మాటల్లో ఎంతో స్నేహం, ఆరాధన పెనవేసుకుని ప్రకాశించేవి. వెల్లుల్లి పాయలు దట్టంగా వేసిన కొత్తావకాయ రుచి అలవాటు చేసిందీ ఆవిడే.
బుచ్చిబాబు గారికి రావలసినంత పేరు ప్రఖ్యాతలు రాలేదన్నది ఆవిడ ఆరోపణ. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులు, పుస్తకాలు అన్నీ అపురూపమే. అన్నింటినీ భద్రంగా దాచిన గది నా పని స్థలం. డబ్బాలు, సంచీలు, బస్తాలు బోర్లించి ప్రతి కాగితం చదివి నోట్స్‌ వ్రాసుకొన్నానంటే, రచనల ప్రచురణ కాలం వంటి వివరాలు సేకరించగలిగానంటే, డైరీలు, లేఖలు ఎడిట్‌ చేసి వాజ్ఞ్మయ సూచికలో చేర్చగలిగానంటే అదంతా సుబ్బలక్ష్మి గారి సహృదయత కారణంగానే. నాలాంటి పరిశోధకులు ఉండవచ్చు గానీ, పరిశోధన విలువ తెలిసి సహకరించగల సుబ్బలక్ష్మి గారి వంటి వ్యక్తులు మాత్రం అరుదు. బుచ్చిబాబు జయంతులు, మరీ ముఖ్యంగా 2014లో శత జయంతి జరపడానికి, ఆయన పుస్తకాల పునర్ముద్రణకు, ఆయన పెయింటింగ్స్‌ను పుస్తకంగా తీసుకురావడానికి ఆవిడ మౌనంగా ఎంత పని చేశారో, బుజ్జి ఆమెకు ఎంత వెన్నుదన్నుగా ఉన్నాడో నాకు తెలుసు. హైదరాబాద్‌, బెంగుళూరు, ఏలూరు మొదలైన చోట్ల బుచ్చిబాబు జయంతి, శతజయంతి సభలలో పలుమార్లు ఆవిడతో కలిసి పాల్గొనటం నాకు మంచి జ్ఞాపకాలు. మూడు, నాలుగేళ్ళ క్రితం బెంగుళూరు వెళ్ళినప్పుడు నా కూతురిని, మనవడిని తీసుకొని ఆవిడ దగ్గరకు వెళ్తే ఎంత ఆప్యాయతను పంచారో…! అలాంటి వ్యక్తి ఇక కనబడరు అని దిగులుగా ఉంది. బుచ్చిబాబుపై సాహిత్య అకాడమీ ప్రచురించవలసిన మొనోగ్రఫీ గురించి చివరివరకు ఆమె కలవరిస్తూనే ఉన్నారు. అది ఆమెకు బుచ్చిబాబుతో సంఖ్య సంబంధ గాఢత. చిత్రం ఏమిటంటే ఈ క్రమంలో ఆమె తాను రచయిత్రిని, చిత్రకారిణిని అన్న విషయం మర్చిపోవడం. స్త్రీలందరూ ఇంతేనా?
అంతకన్నా అన్యాయం నవలలు, అందులో స్త్రీల నవలలు విరివిగా చదివే నాకు సుబ్బలక్ష్మి గారి ఇంట్లో బుచ్చిబాబు రచనల కోసం ప్రతి బీరువా గాలిస్తున్నప్పుడు కానీ ఆమె కథలు, నవలలు వ్రాశారన్న విషయం తెలిసిరాలేదు. సిగ్గుపడ్డాను. ఒక రచయిత్రిని ఇప్పటికైనా తెలుసుకోగలిగానని ఆనందపడ్డాను. కుతూహలం ఆగక అప్పుడే అక్కడే నా పరిశోధన పని చేసుకుంటూనే మధ్య మధ్య ఆమె కథలు, నవలలు చదువుకున్నా. సంభాషణల మధ్య ఆమె రచనానుభవాల ఆచూకీ కనిపెట్టడం సంతోషంగా ఉండేది. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, బుచ్చిబాబుకు రాసిన ఒక ఉత్తరంలో (30`3`1960) సుబ్బలక్ష్మిగారి ‘‘కాపురం’’ కథ సరళంగా, మనుషుల మధ్య సంబంధాలు ఎంత సామరస్యపూర్వకంగా, సంస్కారవంతంగా ఉండాలో చూపిందని మెచ్చుకుంటూ, నువ్వు ఇంత శుభ్రంగా కథలు వ్రాస్తావా అని బుచ్చిబాబును సవాలు చేశారు. ఆ ఉత్తరం చదువుతుంటే నాకెంత సంతోషం కలిగిందో. తక్షణం శివరాజు సుబ్బలక్ష్మి సాహిత్యంపై పరిశోధన చేయించాలని గట్టిగా అనిపించింది.
అప్పటికే ఆమె కథలు ‘మగతజీవి చివరి చూపు’ అనే పేరుతో సంపుటిగా వచ్చాయి. దానికి పింగళి లక్ష్మీ కాంతం ముందుమాట వ్రాస్తూ ‘సుబ్బలక్ష్మి కథల విశిష్టత చాలా భాగం ఇవి స్త్రీ మాత్రమే వ్రాయగలదు అనిపించటం’ అని పేర్కొన్నారు. ‘‘పురుషుడు స్త్రీ, ప్రకృతిని చిత్రించినప్పుడు అతడెంత నిపుణ రచయిత అయినా పురుష నేత్రాలలో ప్రతిఫలించిన దృశ్యమే చిత్రించగలడు. స్త్రీ స్వభావాన్ని సాటి స్త్రీ వర్ణించినప్పుడు అది అన్యునాతిరిక్తంగాను, వాస్తవికతకు సన్నిహితంగానూ ఉండడంలో ఆశ్చర్యం లేదు’ అని సుబ్బలక్ష్మి స్త్రీ పాత్ర చిత్రణా స్వభావానికి ఉన్న అదనపు విలువ వైపు దృష్టిని తిప్పారు. ఒక గొప్ప పరిశోధకుడి మెప్పును పొందిన శివరాజు సుబ్బలక్ష్మి సాహిత్యంపై పరిశోధన చేయించడం తక్షణ కర్తవ్యం అనిపించింది. దాని ఫలితమే శివరాజు సుబ్బలక్ష్మి నవలలపై శశిరేఖ చేత ఎమ్‌.ఫిల్‌ డిగ్రీ కోసం పరిశోధన చేయించటం. కథలపై పరిశోధన ఇంకా మిగిలే ఉంది.
స్త్రీల రచనలపై పరిశోధనలు చేయిస్తున్నా, చేసినా వింత వింత వ్యాఖ్యానాలు ఎదుర్కోవలసి వస్తుంటుంది. బుచ్చిబాబు భార్య అనా సుబ్బలక్ష్మి నవలలపై పరిశోధన చేయిస్తున్నావు అని నన్నడిగినవాళ్ళు, శశిరేఖను సతాయించినవాళ్ళు లేకపోలేదు. స్త్రీలకు స్వంత వ్యక్తిత్వం, స్వంత ఆలోచనలు, అనుభూతులు ఉంటాయని అంగీకరించడానికి ఇష్టంలేని వర్గం మన పక్కన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ మన చరిత్ర మనం పునర్నిర్మించుకోవడానికి సమాజంలోనైనా, సాహిత్యంలోనైనా మన తోటి స్త్రీల అనుభవాలను మనవిగా చేసుకుంటూ పని చేసుకుపోవలసిందే. 1970లో అదృష్టరేఖ నవల వ్రాసి సుబ్బలక్ష్మి తన అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు అన్నీ ఆంతర్యపు లోతులకు నెట్టి జీవించాల్సిన అనివార్యతలో ఉన్న స్త్రీల జీవిత విషాదాలను, అందులోనే విజయాలను వెతుక్కొని సంతృప్తి చెందే తీరును చిత్రించి కాపురాల గురించిన భ్రమలను తనదైన పద్ధతిలో బద్దలు కొట్టారు. 1975లో ‘నీలంగేటు అయ్యగారు’ నవలను శ్రామిక వర్గ స్త్రీ అనుభవ కోణం నుండి వ్రాస్తూ ఏకకాలంలో మధ్యతరగతి, ఉన్నత వర్గాల స్త్రీల జీవితం కూడా లోలోపలి నుండి ఎలా ధ్వంసమవుతోందో చూపించారు. ‘మరో పది జన్మలదాకా పెళ్ళొద్దు, మగవాళ్ళతో మాటలు వద్దు’ అనిపించేంతగా విసిగిపోయిన స్త్రీల స్వరాన్ని వినిపించిన నవల ఇది. ఆమె తీర్పు అనే నవల కూడా వ్రాశారు. కానీ అది దొరకటం లేదు. సమాజ సాహిత్య రంగాలలో ప్రముఖుల భార్యలను వారి నీడలుగా కాక ఆలోచించే మెదడు, అనుభూతి చెందే హృదయం, అనుభవం కోరే శరీరం ఉన్న సహజ మానవ వ్యక్తులుగా చూడడం నేర్చుకోవాలని సుబ్బలక్ష్మి గారి కథలు, నవలలు చదివాక కూడా అర్థం కాకపోతే అంతకన్నా దౌర్భాగ్యం లేదు.
శివరాజు సుబ్బలక్ష్మి తండ్రి ద్రోణంరాజు సూర్యప్రకాశం, తల్లి సత్యవతి. ముగ్గురు అక్కచెల్లెళ్ళలో సుబ్బలక్ష్మి రెండవ వారు. ఆమెకు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళది రాజమండ్రి దగ్గర ఇప్పనపాడు. తండ్రి బి.ఎ. చదివినవాడు కావటం, కాంగ్రెస్‌ పార్టీలో ఉండడం, ఊళ్ళో వయోజన పాఠశాల పెట్టి నడపడం… ఈ కారణాలన్నింటి వల్లా ఇంట్లో అందరికీ చదివే అలవాటు ఉంది. పన్నెండేళ్ళ వయసులో అంటే 1937 డిసెంబరు 23న సుబ్బలక్ష్మికి బుచ్చిబాబుతో వివాహమయింది. పురాణాలు చదివి అర్థం చెప్పగల బుచ్చిబాబు నాయనమ్మ సుబ్బమ్మ గారి వద్ద భారత, భాగవతాలు చదవటం అలవాటైంది. నిత్య చదువరి, రచయిత అయిన బుచ్చిబాబు సాహచర్యం, ఆయన కోసం ఇంటికి వచ్చిపోయే మొక్కపాటి, విశ్వనాథ సత్యనారాయణ, జరుక్‌ శాస్త్రి, ఆచంట జానకీరామ్‌, ఆచంట శారదాదేవి, పింగళి లక్ష్మీకాంతం వంటి వాళ్ళతో సాహిత్య సంభాషణలలో పాలుపంచుకోవడం ఆమెలో సాహిత్య సృజనాభిలాషను ప్రోది చేశాయి. భర్త కథలకు తొలి పాఠకురాలు కావటం, కథ నడిపే నేర్పును పెంచింది. అలా 1960లలో ఆమె కథా రచన ప్రారంభమయింది. 1964లో ఎనిమిది కథలతో ‘మగతజీవి చివరి చూపు’ కథల సంపుటం వచ్చింది. ఆదర్శ గ్రంథమండలి వారు ప్రచురించారు. ‘మనోవ్యాధికి మందుంది’ అనే 28 కథల సంపుటి వేదగిరి కమ్యూనికేషన్స్‌ వారి ప్రచురణ ఇప్పుడు అందుబాటులో ఉంది. మధ్యతరగతి స్త్రీల సంవేదనలకు స్వరం ఇచ్చిన సాహిత్యం ఆమెది.
సుబ్బలక్ష్మి మంచి చిత్రకారిణి కూడా. ఆదివారం కానీ, మరే సెలవు రోజైనా కానీ చిత్రలేఖన కళతో పొద్దంతా గడిపే భర్త బుచ్చిబాబు అందుకు ఆమెకు ప్రేరక శక్తి. బుచ్చిబాబు పెయింటింగ్స్‌తో పాటు ఆమె వేసిన పెయింటింగ్స్‌ కూడా అనేకం. ప్రత్యేక శ్రద్ధతో బుచ్చిబాబువి, తనవి ఎంపిక చేసిన కొన్ని పెయింటింగ్స్‌తో అందమైన ఇంద్రధనుస్సు రంగుల పుస్తకాన్ని వ్యయప్రయాసలకోర్చి ప్రచురించారు. ఆ పుస్తకాన్ని అపురూపంగా ఒళ్ళోపెట్టుకుని పేజీలు తిప్పి చూపిస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో సంతృప్తితో కూడిన చిరునవ్వు ప్రసారం నా కళ్ళముందు ఇంకా కదలాడుతూనే ఉంది. బుచ్చిబాబు భౌతికంగా తన నుండి వేరై యాభై ఏళ్ళవుతున్నా ఆయనను తనలో ఎంత సజీవంగా నిలుపుకున్నారంటే సంభాషణ ఎక్కడ మొదలైనా బుచ్చిబాబు దగ్గరకు తీసుకెళ్ళకుండా అది ముగిసేది కాదు. ఆమె పరమేశ్వరుడి శరీరాన్నే కాదు, కళాసాహిత్య సృజన వ్యక్తిత్వాన్ని తనలో సంలీనం చేసుకొన్న పార్వతి. తనవి, బుచ్చిబాబు గారివి పెయింటింగ్స్‌ కలిపి పుస్తకంగా ప్రచురించటంలో ఆ విడదీయలేని జీవితతత్వాన్ని సంకేతించారేమో సుబ్బలక్ష్మి గారు. అది తనకు తాను ఇచ్చుకున్న జీవన సాఫల్య పురస్కారం.
‘‘ప్రశాంతంగా ఉండాలంటే పాతవాటిని కలుపుకొని కొత్త ఊహల్లో జీవించటం అలవరచుకోవాలి’’ అని ఇరవయ్యేళ్ళ క్రితం ఒక స్త్రీల సాహిత్య సదస్సులో ఆమె ప్రతిపాదించిన జీవన సూత్రం తాళం చెవిగా ఆమె సాహిత్యం అధ్యయనం చేయటం ఆమెకు మనం ఇవ్వగల నివాళి.

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.