అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిబిఓ లీడర్లు, వాలంటీర్లు మరియు పారాలీగల్ వాలంటీర్లతో ఒక అడ్వకసీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జి.ఉదయ్‌కుమార్, సెక్రటరీ మరియు సివిల్ జడ్జి, పి.ఆంజనేయులు,
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సీనియర్ సివిల్ జడ్జి, తెలంగాణ లీగల్ సర్విసెస్ ఆధారిటీ, జి.రాధారాణి, ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి మరియు ఆర్‌ఆర్‌డి ఛైర్‌పర్సన్, జి.అనుపమ చక్రవర్తి, జిల్లా సెషన్స్ జడ్జి, మెంబర్ సెక్రటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మనం ఈ మీటింగ్ జరుపుకుంటున్నా ఇది ఉత్సవం కాదు అన్నారు. భూమికతో
ఉదయ్‌కుమార్ గారికి ప్రత్యేక అనుబంధం ఉందని, ఏ కార్యక్రమానికి పిలిచినా వెంటనే వస్తారని, అలాగే నేడు జరుపుకొంటున్న కార్యక్రమం కూడా మొత్తం తన భుజస్కందాలపై వేసుకుని ముఖ్య అతిధులను పిలిచినందుకు కృతజ్ఞతలు చెపుతూ నేటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సవివరంగా తెలియచెప్పారు. కార్యక్రమాలను ప్రారంభించవలసిందిగా ఉదయ్‌కుమార్ గారిని కోరారు.
ఉదయ్‌కుమార్ గారు మాట్లాడుతూ లీగల్ సర్వీసులు అందరికీ అందే విధంగా మండల మరియు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారని, దీనిలోని సేవలు ఏ విధంగా ఉంటాయన్నది వివరించారు. లీగల్ సర్వీసులు అందించేందుకు ప్యానెల్ అడ్వకేట్స్ మరియు పారా లీగల్ వాలంటీర్లు ఉంటారని, ఒకవేళ కేసు వేయవలసిన పరిస్థితులలో ఏ విధంగా కేసు వేయాలో దీనికి కావలసిన డాక్యుమెంట్లు రూపొందించడానికి తమ అడ్వకేట్లు ఉంటారని తెలియచేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత లీగల్ ఎయిడ్ సహాయం కూడా ఉంటుందన్నారు. ఈ లీగల్ సర్వీసులు అందించడానికి ముఖ్య కారణం పెండిరగ్‌లో ఉన్న కేసులు త్వరితగతిన పూర్తి చేయడానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని. ఈ లోక్ అదాలత్ కనీసం నెలకు ఒకసారి ఖచ్చితంగా నిర్వహిస్తారని చెప్పారు. లీగల్ సర్వీసెస్‌లో భాగంగా మహిళలకు అవసరమైన చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారన్నారు. అందులో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉచిత స్కీంల గురించి కూడా తెలియచేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వీసుల గురించి ప్రజలకు ఎక్కువ అవగాహన లేకపోవడం వలన వారు ఎక్కువగా లబ్ది పొందలేక పోతున్నారన్నారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సీనియర్ సివిల్ జడ్జి పి.ఆంజనేయులు గారు మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో మహిళలే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తున్నారని, కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వస్తున్న ఉచిత స్కీంలను మహిళలు అందిపుచ్చుకోవాలని కోరారు. దానికి కావలసిన విధంగా మహిళలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.
అనంతరం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జి.రాధారాణి గారు మాట్లాడుతూ ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. మార్చి 8 మాత్రమే మహిళలు జరుపుకునే దినోత్సవం కాదని, ప్రతిరోజూ మహిళల దినమేనని అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారని, ఉదాహరణకు, తమ బ్యాచ్‌లో 12 మంది ఉండగా అందులో ఏడుగురు మహిళా జడ్జిలు ఎంపిక కావడం ఒక పెద్ద గుర్తింపని అన్నారు. నేడు మహిళలు ఎంతో ముందంజ వేస్తున్నప్పటికీ ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లకు గురవడం జరుగుతూనే ఉందన్నారు. బాల్యవివాహాల వల్ల చాలా ఎక్కువగా నష్టాలు ఉన్నాయని, చదువు లేకపోవడం, శారీరక పరిపక్వత లేకపోవడం, తల్లిదండ్రులు తమకు ఆమోదమైన అబ్బాయితో వివాహం జరిపించడం, నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం మొదలైనవన్నీ కూడా ముఖ్య కారణాలని అన్నారు. తల్లిదండ్రులకు స్థోమత లేకపోవడం, అమ్మాయిని ఎక్కువగా చదివిస్తే అంతకన్నా ఎక్కువ చదువుకున్న అబ్బాయిని తీసుకురావాలంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, అమ్మాయిల చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారని అన్నారు. కానీ ఆడపిల్లలకు కూడా అవకాశాలు ఇవ్వాలని, వారి నిర్ణయాలను గౌరవించాలని తల్లిదండ్రులకు సూచించారు. నిర్ణయాధికారం లేకపోవడం వలన ఆమె దృఢంగా ఉండలేదని, పిల్లలను కనే విషయంలో కూడా ఆమెకు ఎటువంటి నిర్ణయాధికారం ఉండదని అన్నారు. మరి అలాంటప్పుడు ‘సమానత్వం’ ఎక్కడ ఉందని అన్నారు. దీన్ని అధిగమిస్తే కానీ మహిళలు ముందంజ వేయలేరని అన్నారు. ఎప్పుడయితే మహిళ స్వేచ్ఛగా నిర్ణయాధికారం తీసుకోగలుగుతుందో ఆనాడు మనం ‘సాధికారత సాధించిన మహిళ’గా గుర్తించబడతామని అన్నారు. మహిళలు వారి హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తుంటే తమకు చాలా గర్వంగా అనిపిస్తుందని రాధారాణి చెప్పారు. ఒకనాడు ప్రతి విషయంలో సర్దుకుపోయిన వాళ్ళు నేడు ఏ విషయంలో సర్దుకుపోవాలో తెలుసుకుని, సర్దుకుపోలేని సందర్భంలో కోర్టును ఆశ్రయిస్తున్నారని అన్నారు. పురుషులు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినం కూడా వారే చేయవలసిన అవసరం కూడా ఉందన్నారు. ఆస్తి హక్కు ఇచ్చినప్పటికీ ఎంతమంది మహిళలు తీసుకోగలుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. తల్లిదండ్రుల బాధ్యత కేవలం అబ్బాయిలది మాత్రమే కాదని, ఇద్దరికీ ఆ బాధ్యత ఉందని గుర్తించాలని అన్నారు. హక్కులను అడుగుతున్నప్పుడు భార్యకున్న హక్కులను కూడా విస్మరించకూడదని, హక్కులు, బాధ్యతలు రెండిరటినీ చూడగలగాలని అన్నారు. ఆలోచనా తీరు మార్చుకోవలసి అవసరం ఎంతగానో ఉందని, విశాలత్వం చాలా అవసరమన్నారు. నేడు పాఠశాలల్లో బాలికలకు కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని, బాత్రూములు, శానిటరీ నేప్‌కిన్స్ కూడా పాఠశాలల్లో అందుబాటులో లేవని అన్నారు. పిల్లలు ఎదిగే క్రమం నుండి మహిళలు, బాలికల పట్ల సరైన ఆలోచనా దృక్పథం అలవర్చాలని ఆమె చెప్పారు. నేడు మహిళలపై జరుగుతున్న హింస, రేప్‌లకు కారణమేంటని ప్రశ్నించారు. రేప్ అనేది ఒక ఆధిపత్య భావనకు నిదర్శనమని, సమానత్వం లేదని అన్నారు.
బాలికలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం, వారి శరీర భాగాలను స్పృశించడం మొదలైనవి ఈ ఆధిపత్య భావనకు కొన్ని
ఉదాహరణలని అన్నారు. చిన్నతనం నుండీ పిల్లలకు ముఖ్యంగా బాలురకు, బాలికలపై సరైన భావన కలిగించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. ఆడపిల్లల పట్ల సున్నితత్వం ఉండేలా పిల్లలను పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. ఈ విధంగా పెంచడం వలన మున్ముందు బాలికలపై, మరియు మహిళలపై జరుగుతున్న హింస కొంతైనా తగ్గే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ‘దిశ’ అత్యాచారం కేసు విషయంలో అమ్మాయిలు ఇంటికి తొందరగా వెళ్ళాలనే వాళ్ళు అదే విషయాన్ని అబ్బాయిలకు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. అదే విధంగా అమ్మాయిలకు పెళ్ళి విషయంలో ఎందుకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని, ప్రతి ఆడపిల్లకు ఆస్తి హక్కు ఉన్నప్పటికీ ఎంతమంది తీసుకోగలుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. మనమంతా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, మన బాధ్యతల కోసం కూడా మనం పాటుపడాలని అన్నారు. అత్తమామలను చూసుకొనే మనం తల్లిదండ్రులను ఎందుకు చూసుకోలేకపోతున్నామో ఆలోచించినట్లయితే పితృస్వామ్య భావనలే దానికి ముఖ్య కారణమని అన్నారు. మన ఆలోచనా తీరు మార్చుకోవలసిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. పిల్లలను పెంచే క్రమంలో వారికి సమానత్వం గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆమె స్పష్టం చేశారు. నేడు పాఠశాలల్లో అమ్మాయిలకు కావలసిన కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు అరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని, ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే మనం మగపిల్లలను చిన్నతనం నుండే ఆడపిల్లల విలువను తెలియచేయాలని, అలాంటప్పుడు మాత్రమే నేడు జరుగుతున్న అకృత్యాలు ఆగిపోతాయని ఆమె అన్నారు. ఉదయ్‌కుమార్ గారు మాట్లాడుతూ రాధారాణి గారు ప్రస్తుత పరిస్థితులను చాలా చక్కగా వివరించారని, నేడు మహిళా దినోత్సవం సందర్భంగా అందరం హక్కులను మరియు బాధ్యతలను సమానంగా నిర్వహిద్దామని చెప్పారు.
లిగల్ సర్వీసెస్ అధారిటీ మెంబర్ సెక్రటరీ అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ రాధారాణి పూర్తిగా మహిళలు, బాలికల పరిస్థితి గురించి ఎంతో చక్కగా వివరించారని అన్నారు. ఇప్పుడు మనం అసలు చట్టాలు ఎందుకు వస్తాయని ఆలోచిస్తే, ప్రజలు సమాజంలో ఇబ్బంది పడుతున్న క్రమంలోనే మనకు ఈ చట్టాలు వస్తాయని అన్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు ఎక్కువవుతున్న క్రమంలో చట్టం అంటే ఒక భయం
ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్భయ చట్టం వచ్చిందని అన్నారు. చట్టంలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే అప్పుడు కోర్టులు వాటిని విశ్లేషించి మార్పులు తీసుకొని వస్తాయని, హక్కుల గురించి మాట్లాడుకునేవారు బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే హక్కులు పొందవచ్చని చెప్పారు. ఆస్తి హక్కు కోసం మనం పోరాడుతున్న క్రమంలో, తల్లిదండ్రుల బాధ్యత మనలో ఎంతమంది తీసుకొంటున్నామని అమె అన్నారు. కొన్ని సందర్భాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చూసినట్లయితే పాతకాలంలో పని విభజన బాగా స్పష్టంగా కనిపిస్తుందని, ఆడవాళ్ళు సుకుమారులు కాబట్టి వారు ఇంటికి సంబంధించిన పని చేసేవారని, అలాగే పురుషులు బయటకు వెళ్ళి పని చేస్తుండేవారని అన్నారు. అప్పట్లో బాల్యవివాహాలు ఎందుకు జరిగేవనేది ఆమె విశ్లేషించి చెప్పారు. నేడు మహిళలు లేదా బాలికలు అన్ని రంగాల్లో ముందంజ వేయడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉందని, కుటుంబం యొక్క సహకారం లేకపోతే ఇంత ముందంజ వేయలేరని ఆమె అన్నారు. మన కుటుంబం, మన సమాజాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చునని, అదేవిధంగా పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారికి సరైన విలువలను నేర్పిస్తే సమాజంలో జరుగుతున్న అకృత్యాలను కొంతవరకు ఆపినవాళ్ళమవుతామని ఆమె అన్నారు. భూమిక సంస్థ డైరెక్టర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ ‘నాటి మహిళ`నేటి మహిళ’ గురించి ఇద్దరు న్యాయమూర్తులూ చాలా బాగా వివరించి చెప్పారని, అయితే బాధ్యత అంతా కూడా కేవలం తల్లిది మాత్రమే కాదని, మొత్తం కుటుంబం యొక్క బాధ్యత అని, పిల్లల పెంపకంలో కూడా తల్లిదే తప్పు అనే భావన తప్పని తండ్రికి కూడా బాధ్యత ఉండాలని అన్నారు. కన్యాశుల్కం లేకపోవచ్చు కానీ వరకట్నం పేరు మీద హింస ఎక్కువవుతోందన్నారు. అలాగే హింస గురించి మాట్లాడుకుంటే కుటుంబంలోనే ఎక్కువగా హింస జరుగుతోందని, మీరన్న ఇంత పవిత్రమైన, ఇంత ప్రేమపూరిత కుటుంబ వాతావరణంలో హింస ఎందుకు జరుగుతోందో మనం ఆలోచించాలని ఆమె అన్నారు. ఒకప్పుడు మహిళలకు ఇన్ని చట్టాలు లేవు కానీ నేడు చాలా చట్టాలు ఉన్నాయని చెప్పారు. నేడు మనమంతా ‘హింసలేని సమాజాన్ని’ కోరుకుంటున్నామని అన్నారు. సున్నితమైన భావాలు ఉన్న మనం మన హక్కులకు తీసుకోలేకపోతున్నామని, దీనికి కారణం మనలోని ‘పితృస్వామ్య భావజాల’మేనని అన్నారు. కుటుంబంలో జరుగుతున్న వివక్ష, అసమానతలపై మనం మాట్లాడాలి కాబట్టి నేడు మనం ఈ మహిళా దినం జరుపుకొంటున్నామని ఆమె చెప్పారు. నేడు మన మధ్య జరిగిన చర్చ బయట సమాజానికి తెలియచెప్పవలసిన బాధ్యత ఉందన్నారు.
అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.