గమనమే గమ్యం – ఓల్గా

మర్నాడు ఉదయానికి శారద ముఖం తేటపడిరది. కొంత ఉత్సాహంగా తల్లి, నాన్నమ్మలతో మాట్లాడిరది. తండ్రిని ప్రశ్నలడుగుతూ బడికి తయారైంది. ‘‘ఎన్ని రోజుల తర్వాత శారద మళ్ళీ గలగలా మాట్లాడిరదో. ఇన్నాళ్ళూ దాన్ని చూస్తుంటే గుండెల మీద బరువు పెట్టినట్టుంది’’ అంది సుబ్బమ్మ.

శారద బడికి వెళ్ళిపోయాక రామారావు కూడా ఊళ్ళోకి వెళ్ళొస్తానని బయల్దేరాడు. తీరా చూస్తే నరసమ్మ కూడా బైటికి వెళ్తోన్న సూచనలు కనిపించాయి.
‘‘పొలం దగ్గరకు వెళ్తున్నట్లున్నావు. నేనూ వస్తాను పద’’ అన్నాడు రామారావు.
‘‘పొలానికి కాదురా. పురోహితుడు గారింటికి’’ అన్నదామె.
బహుశా కూతురు పోయిన దుఃఖంలో ఉన్న ఆయనను పలకరించి వస్తుందేమోననుకున్నాడు. తను కూడా వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత ఉందనిపించింది. ఆ సమయంలో తను ఊళ్ళో లేడు కానీ వచ్చిన తర్వాత ఆలస్యం చేయకూడదు. నిజానికి పురోహితుడు వెంకటావధానిని బాగా చీవాట్లు పెట్టాలని ఉందాయనకు. వెళ్తే కేవలం సానుభూతి చిలకరించి రావటం తనవల్ల కాదనుకున్నాడాయన. వెళ్ళి చీవాట్లు పెట్టి రావటమా, వెళ్ళకుండా తన అసమ్మతిని మౌనంగా తెలియజెయ్యటమా అనేది తేల్చుకోలేక ఉన్నచోటే నిలబడిపోయాడు. నరసమ్మ రామారావు కోసం ఎదురు చూడకుండా వాకిలి దాటుతోంది. ‘పోనీలే. ఇప్పుడు అమ్మతో వెళ్ళటం కంటే తర్వాత వెళ్ళటం మంచిది’ అనుకుని తన దారిన తాను ఊళ్ళోకి నడిచాడు.
ఊళ్ళో అందరూ రామారావంటే అభిమానంగా ఉంటారు. చదువుకున్న వాడనే గౌరవం, మెప్పు ఉండనే ఉన్నాయి. పుస్తకాలు రాస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు పెంచుకుంటాడు. ఎవరైనా అతనికి ఎదురుపడితే కాసేపు ఆగి పలకరించాలనిపించే మర్యాదా, మన్నన గలవాడు. మద్రాసు విశేషాలు, కాంగ్రెస్‌ వ్యవహారాలు చెప్పగలిగినవాడు.
రామారావుని చూస్తూనే నలుగురు పెద్దలూ రచ్చబండ దగ్గర చేరారు. పదిమంది కుర్రాళ్ళూ పోగయ్యారు.
స్వతంత్రం గురించి మాటలు సాగాయి. రామారావు మిత్రుడు హరిసర్వోత్తమరావు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆయన గురించి అందరూ అడిగారు. ఆంధ్రపత్రిక విశేషాలు, నాగేశ్వరరావు పంతులు గారి దాతృత్వం ప్రస్తావనకు వచ్చాయి.
మధ్యాహ్నం భోజనాలవేళ మించిపోతుంటే ఒకరొకరూ ఇళ్ళకు బయల్దేరారు. రామారావు లేచి వచ్చేసాడు.
వేళ మించి పోయిందని సుబ్బమ్మ ఎదురు చూస్తోంది. ఊళ్ళో ఉన్నరోజైనా భర్తకు ఇష్టమైనవి చేసి తృప్తిగా తినిపించాలని ఆమె ఆరాటం. అత్తగారి భోజనమై కాసేపు పడుకుని లేచింది. వత్తులు చేసుకోవటానికి ఇంత పత్తి ముందు వేసుకుని కూచుంది.
‘‘బోలెడు వత్తులున్నాయిగా అత్తయ్యా. మళ్ళీ ఎందుకిప్పుడీ పని’’ అంది సుబ్బమ్మ.
‘‘ఇంకా చాలా కావాలి’’ అన్న అత్తగారి మాటల్లో తనకు తెలియని అర్థం ఏదో ఉన్నట్లనిపించింది.
అంతలో రామారావు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ భోజనాల గదిలో తీరికగా కూర్చున్నారు. భర్తకు వడ్డించి తానూ వడ్డించుకుంది సుబ్బమ్మ. అలా చెయ్యకపోతే రామారావు ఊరుకోడు. అసలు తనకోసం చూడకుండా వేళకు భోజనం చెయ్యమంటాడు. అంత అఘాయిత్యం పని తను చెయ్యలేననీ, తను చేసినా అత్తగారు తనను బతకనివ్వదనీ నవ్వుతూ, నవ్వుతూ చెప్తుంది సుబ్బమ్మ. రామారావు భోజనం చేసి వచ్చి మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. క్రితం రోజు తన మాటలకు నొచ్చుకున్న తల్లిని ఓదార్చాలని, తల్లి కోపం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించాలనీ, అది తన బాధ్యత అనీ అనుకున్నాడాయన.
‘‘పురోహితుడుగారెలా ఉన్నారమ్మా?’’
‘‘బాగానే ఉన్నాడు. ఏం చేస్తాడు. కూతురితో పాటు పోలేడుగా’’.
‘‘నువ్వు ఓదార్చి వచ్చావుగా, కుదుట పడతాడులే. ఏమంటాడు?’’
‘‘వచ్చే నెల, మార్గశిర శుద్ధ ఏకాదశి గురువారం అన్ని విధాలా మంచిరోజన్నాడు’’. రామారావుకేమీ అర్థం కాలేదు.
ఇప్పుడు మంచిరోజు చూసి చేయవలసిన పనులేమున్నాయో ఆయనకు అర్థం కాలేదు.
శారద పెళ్ళి నిర్ణయించానంటుందా అనుకునేసరికి ఆయనకు రక్తం పోటెత్తింది.
తల్లిమీద కోపంతో ముఖం ఎర్రబడిరది.
‘‘మంచి రోజేమిటమ్మా’’ గద్దించినట్టు అంటున్న కొడుకుకి శాంతంగా సమాధానం ఇచ్చింది నరసమ్మ.
‘‘నా కాశీ ప్రయాణానికి’’.
దిమ్మెరపోయాడు రామారావు. పోటెత్తిన రక్తం కుప్పకూలింది. కోపంతో ఎర్రబడ్డ ముఖం క్షణంలో నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది.
తనను తాను కూడదీసుకుని ‘‘కాశీ ప్రయాణమా? కాశీ వెళ్ళొస్తావా?’’
‘‘వెళ్ళి రావటం కాదురా. వెళ్తున్నాను. ఇక అట్నుంచి అటే వెళ్తాను’’.
పది నిమిషాల తర్వాత గానీ రామారావుకి తల్లి మాటల్లోని సారాంశమంతా ఒంటబట్టలేదు. ఒంటబట్టేసరికి ఒళ్ళంతా నీరయింది. ఎక్కడ లేని నీరసం కమ్ముకొచ్చి కాళ్ళూ చేతులూ తేలిపోయినట్లయింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. శారదకు బాల్య వివాహం చెయ్యకపోతే తల్లి తన ఇంట ఉండదు. ఈ అనాచారాన్ని ఆమె సహించదు. ఆ దురాచారాన్ని తను సహించడు. మార్గం ఏమిటా అని తల్లి ఆలోచించి ఉంటుంది. ఆమె కాశీ వెళ్తే సమస్య ఉండదనే నిర్ణయానికి వచ్చింది. ఇక ఆమెని ఆపటం బ్రహ్మతరం కాదు. ఆపాలంటే ఒక్కటే మార్గం. శారదకు వెంటనే పెళ్ళి చెయ్యాలి లేదా తల్లిని కాశీ వెళ్ళనివ్వాలి. తల్లి ఈ వయసులో కాశీలో ఒంటరిగా ఎలా బతుకుతుంది? ఆమెనక్కడ ఉంచి తనిక్కడ శాంతిగా ఎలా బతుకుతాడు? ఇక మళ్ళీ తల్లి తనకు కనిపించదు. కాశీ వెళ్ళి చూస్తే తప్ప కనిపించదు. ఆమెను చూడకుండా ఉండగలడా? తండ్రి చిన్నప్పుడే పోతే ఇద్దరి పాత్రా తనే నిర్వహించి పెంచింది.
తన ఇష్టప్రకారం చదివించింది. ఏం చేసినా, ఎలా తిరిగినా, కొన్ని ఆమెకు ఇష్టం లేని పనులు చేసినా సహించింది. ఎంతో ప్రేమ తనమీద. ఎంత తెలివి, ఎంత సమర్థత. తనకీ సంసారం సంగతేం తెలుసు? డబ్బు పట్టుకెళ్ళి తనకు తోచిన పనులు చేయటం తప్ప డబ్బు సంపాదించటం రాదు. తల్లి వ్యవసాయం చేయిస్తుంది. ధాన్యం అమ్ముతుంది. రైతులకు అప్పు ఇచ్చి వసూలు చేస్తుంది. పాడీ పంటా అన్నీ ఆమే నిర్వహణ. ఇప్పుడామె వెళ్తే తను నిరాధారం అయిపోతాడు. ఎట్లా బతుకుతాడు. రామారావు ఒక్కసారి తనమీద తనే జాలిపడి దీనంగా అయిపోయాడు. అంతలోనే పౌరుషం తన్నుకొచ్చింది. తను అసమర్థుడు కాడు. ఆలోచించాల్సింది తల్లి నిరాధారమవుతుందని గానీ తన గురించి కాదు. తల్లి ఒక్కత్తే అంత దూరానా…
‘‘అమ్మా’’ అంటూ తల్లి ఒడిలో పడిపోయాడు.
‘‘నమ్మినవాటి కోసం ధైర్యంగా ఉండాలి. సాహసంగా బతకాలి. ఇట్లా ఏడిస్తే నీ పిల్లని డాక్టర్నెలా చేస్తావు? ఎంతమందితో తలపడాలి?’’ కొడుకు తల నిమురుతూ ప్రశాంతంగా చెప్పింది నరసమ్మ.
‘‘నువ్వుంటే నాకు ఎవరి భయమూ లేదమ్మా. నువ్వు లేకపోతే నేను నిలబడలేను’’.
‘‘నాది వెళ్ళే కాలం. నీది నడిచే కాలం, నీ కూతురిది రాబోయే కాలం. నువ్వు నిలబడాలి, నీ కూతుర్ని నిలబెట్టాలి. నీకే సాహసం లేకపోతే ఆడపిల్ల… అది లోకంలో ఎలా నెగ్గుకొస్తుంది’’.
‘‘అన్నీ తెలిసినదానివి. ఈ విషయంలో ఇంత మూర్ఖంగా ఉన్నావెందుకమ్మా’’.
‘‘నా నమ్మకాలు నీకు మూర్ఖంగా ఉంటాయి. నీ ఆలోచనలు నాకు వెర్రితనం అనిపిస్తాయి. నా నమ్మకాలకు తగినట్టు నిన్ను పెంచుకోలేకపోయాను. నువ్వలా పెరగలేదు. ఇప్పుడిక ఇంతకంటే మార్గం లేదు. నన్ను గౌరవంగా కాశీ పంపు. నరసమ్మ కొడుకు మీద అలిగి కాశీ వెళ్ళిందని నలుగురూ అనుకుంటే అది నీకు గౌరవం కాదు. పెద్ద వయసులో తల్లి కాశీ చూడాలనుకుంటే అన్ని ఏర్పాట్లూ చేసి పంపాడు. నరసమ్మ అదృష్టవంతురాలని అందరూ చెప్పుకోవాలి. నువ్వు నలుగురి మెప్పు పొందాలి. అందుకని నీ దుఃఖాన్ని దిగమింగు. నేను మింగేసాను. నిజంగా నాకు ఇప్పుడే బాధా లేదు. ఈ సంసార తాపత్రయం నుంచి నన్ను విముక్తం చెయ్యటానికి ఈశ్వరుడే ఈ నెపం కల్పించాడనుకుంటాను. నిత్యం గంగాస్నానం, ఈశ్వరాభిషేకం, పరమేశ్వర దర్శనం, అన్నపూర్ణాదేవి ఆలింగనం ఎవ్వరైనా కోరుకుంటారు. కానీ ఎవరికో గాని దొరకదు. నాకు దొరుకుతోంది. అది మహాదృష్టం. నువ్వు శారదాంబ పెళ్ళికి ఒప్పుకునుంటే చచ్చేదాకా ఈ సంసారంలో పడి కొట్టుకునేదాన్ని. ఇది నా మంచికే. నా మంచికే నీకీ బుద్ధి పుట్టిందనుకుందాం. అన్ని ఏర్పాట్లూ చేసి నన్ను కాశీ పంపు నాయనా’’ తల్లి ఓర్పుగా, నేర్పుగా, ప్రేమగా చెప్తున్న మాటలు రామారావుని ఇంకా ఇంకా శక్తిహీనుడిని చేసాయి.
నరసమ్మ రామారావుని లేపి కళ్ళు తుడిచి ‘‘ఇంకొక్కమాట కూడా దీని గురించి మాట్లాడటానికి లేదు. ఆఖరికి నీ భార్యతో కూడా. నా ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యటం తప్ప నీకింకో మార్గం లేదు. నా జీవితం నా ఇష్టం కాదా? నీ నమ్మకాల ప్రకారం అదంతే కదా’’.
కొడుకుని ఆలోచనలో పడేసి తనక్కడ నుంచి లేచి వెళ్ళింది నరసమ్మ.
రామారావు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. సుబ్బమ్మకు ఏం జరిగిందో అర్థం కాలేదు. తల్లీ కొడుకుల మాటలు ఆమె వినలేదు. ఆమె పెరట్లో బట్టలు తీసి, మడతలు పెట్టి, సర్ది, బడి నుంచి వచ్చే శారదకు చిరుతిండి ఏర్పాట్లు చేసి, పిల్లవాడిని నిద్రబుచ్చేసరికి తల్లీ కొడుకులు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకున్నారు. సుబ్బమ్మ హాల్లోకి మంచం లాక్కుని నడుం వాల్చింది. ఆమె ఎన్ని సమస్యలున్నా ఇట్టే నిద్రపోగలదు. సాయంత్రం బడి నుంచి వచ్చేవరకూ ఆ ఇంట్లో ఇద్దరు గుండెలు పగిలేలా దుఃఖిస్తుంటే సుబ్బమ్మ హాయిగా నిద్రపోయింది.
శారద బడినుంచి ఒక్కత్తే వచ్చింది. ధనలక్ష్మి చనిపోయిన దగ్గర్నుంచీ స్నేహితులు ఆటలు మానేసారు. సాయంత్రం బడి వదలగానే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్తున్నారు. ముగ్గురూ ఒకచోట పనిలేకుండా కూర్చుంటే ధనలక్ష్మి గుర్తొచ్చి ఏడుపొస్తోందని ఎవరికి వాళ్ళకు తెలిసింది. ఒక్కమాట కూడా దాని గురించి మాట్లాడుకోకుండానే ఆటలు మానేసారు. ముగ్గురికీ ఒక్కసారిగా పెద్దరికం మీద పడినట్లయింది. దానికి తోడు విశాలాక్షి కటికి గర్భాదానం అంటే ఏంటో ఇంట్లో ఎవరో మాట్లాడుకున్న మాటలు విని అవి కాస్తా స్నేహితులతో చెప్పింది. దాంతో ముగ్గురి మనసుల నిండా ఏదో తెలియని ఆందోళన నిండిరది. అల్లరి, నవ్వులు, ఆటలు అన్నీ బందయ్యాయి. మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో, అసలు మొదలవుతాయో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా బడికి వెళ్ళి వస్తున్నారు. బళ్ళో పాఠాలే వాళ్ళకు కాస్త ఊరటగా ఉన్నాయి. కొత్త పద్యాలు, లెక్కలు, కాస్త చరిత్ర ఇవి వాళ్ళ పసి మెదడులకు ఎక్కువ ఆలోచించనివ్వకుండా తాము స్థిరపడ్డాయి. ఆడపిల్లలు బాగా చదువుతున్నారని పంతులుగారన్నప్పుడు వాళ్ళకు చాలా సంతోషం కలిగింది. ఆ మాట ఎప్పుడెప్పుడు తండ్రితో చెబుదామా అని వచ్చింది శారద. తండ్రికంటే ముందు తమ్ముడు కనిపించాడు. వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘సూర్యం, ఆడపిల్లలే బాగా చదువుతారు తెలుసా’’ అంది. వాడు తల అడ్డంగా ఊపి ‘‘నేనూ చదువుతా’’ అన్నాడు. ‘‘నువ్వంటే నా తమ్ముడివి. బాగా చదువుతావు. నేను చెప్పేది మా తరగతిలో ఉంటారే ఆ పిల్లల సంగతి. వాళ్ళకంటే నేనే బాగా చదువుతా’’. అక్క తెలివికి తమ్ముడు గర్వపడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో రామారావు గది తలుపులు తీసుకుని బైటికి వచ్చి ముఖం కడుక్కున్నాడు. లేకపోతే ఏదో జరిగిందని శారద కనిపెట్టేదే. అక్కడికీ తండ్రిని చూడగానే అడిగింది ‘‘నీ ముఖం ఏంటి నాన్నా అలా ఉంది?’’ అని.
‘‘బాగా నిద్రపోయానమ్మా. పగటి నిద్ర అలవాటు లేదుగదా. కళ్ళు బరువెక్కాయి. తలనొప్పి వచ్చింది’’ అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు.
‘‘నాన్నా ఇవాళ పంతులు గారన్నారూ… ఆడపిల్లలే బాగా చదువుతారని. నేను పద్యాలన్నీ వప్పజెప్పాను. లెక్కలన్నీ సరిగా చేసాను. విశాలాక్షి కూడా బాగా చేసింది. నాన్నా… విశాలాక్షికి నాట్యం కూడా వచ్చు. వాళ్ళమ్మ నేర్పుతుంది. నేనూ నేర్చుకోనా?’’ ఆశగా అడిగింది.
‘‘వద్దమ్మా. చదువు తప్ప మరేదీ పట్టించుకోకూడదు నువ్వు. ధ్యానం వేరే విషయాల మీదకు మళ్ళితే డాక్టర్‌వి కాలేవు. చెప్పు! నీకు నాట్యం ముఖ్యమా? వైద్యం ముఖ్యమా’’ గట్టిగా అడిగింది రామారావు.
‘‘వైద్యమే’’ అంది మరో ఆలోచనే లేని శారదాంబ.
‘‘మరి వెళ్ళి చదువుకో’’.
‘‘నువ్వు మద్రాసు కబుర్లు చెప్పలేదు’’.
‘‘రాత్రికి మంచి కథ చెప్తాను. ఇప్పుడు నన్ను ఒదులు.’’
‘‘కథా? నిజమా?’’ తండ్రి కథలు చెప్పటం చాలా అరుదు. నిజంగా జరిగేవే చెప్తాడు.
‘‘కథంటే కథ కాదు. నిజంగా జరిగిందే. చాలా బాగుంటుంది.’’
‘‘ఇప్పుడే చెప్పవా?’’ మారం చేయబోయింది శారద.
‘‘ఇప్పుడు నేను బైటికి వెళ్ళాలమ్మా. రాత్రికి తప్పకుండా చెప్తాను’’.
రామారావు శారదను బుజ్జగిస్తుంటే నరసమ్మ వచ్చి తన దగ్గరకు లాక్కుని ‘‘నేను చెప్తాను రావే’’ అంది.
‘‘నీవన్నీ పాత కథలు. నాన్న కొత్త కొత్తవి చెప్తాడు’’ శారద గింజుకుంది. రామారావు, నరసమ్మలు ఒకరినొకరు చూసుకున్నారు.
నరసమ్మ నవ్వింది.
‘‘ఔనే. నువ్వే ఒక కొత్త కథవి. పాతవి నీకెందుకు పో. పోయి పూలు కోసుకుని మాల కట్టి తీసుకురా’’ అంది.
శారద మర్చిపోయిన పని జ్ఞాపకం వచ్చినట్లు తోటలోకి పరిగెత్తింది.
‘‘అమ్మా. నేను పురోహితుడితో మాట్లాడతా. నీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తా’’.
నరసమ్మ ముఖం వికసించింది. ‘‘నువ్వు నా కొడుకువి కాదూ’’ అంది.
‘‘ఐతే ఇందులో ఏదన్నా తప్పుంటే అది నీదేనమ్మా’’.
‘‘తప్పేమీ లేదు. ముందు అది నమ్ము. జీవితాంతం తప్పు చేశానని బాధపడకు. నువ్వట్లా బాధపడితే నేను చేస్తున్న పని వృథా. అంత దూరం వెళ్ళి ఈశ్వరుడి గురించి కాక నీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అది అనవసరం’’. రామారావు తల్లి తెలివికి ఆశ్చర్యపోతూ బైటికి నడిచాడు.
ఊళ్ళోని తన సన్నిహితులతో తల్లి కాశీయాత్ర తలపెట్టిందని చెప్పాడు. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని అడిగాడు. సోమేశ్వరరావు ఆనందంగా ఒప్పుకున్నాడు. అతనికి ఎప్పటినుంచో కాశీ చూడాలని ఉందట. రామారావు కూడా వస్తే బాగుంటుంది కదా అన్న ప్రశ్న కూడా వచ్చింది. తనకు మద్రాసులో అత్యవసరమైన పనులున్నాయని చెప్పాడు రామారావు. కానీ నిజం అది కాదు. తల్లిని కాశీలో ఒదిలి తనొక్కడే తిరిగి రాగలిగిన గుండె దిటవు తనకు లేదని అతనికి అనిపించింది
ఆ రాత్రి ఇంట్లో భోజనాలు కూడా మామూలుకు భిన్నంగా హాసాలూ, పరిహాసాలూ లేకుండా నడిచాయి. భర్త ఇంత విముఖంగా భోజనం చెయ్యటం సుబ్బమ్మ ఎన్నడూ చూడలేదు. రామారావు పెద్ద తిండి పుష్టి కలవాడు కాదు గానీ తినేదేదైనా ఇష్టంగా తింటాడు. బాగుంది బాగుందంటూ దాని రుచిలో ఉన్న ప్రత్యేకత చెప్తూ తింటాడు. మౌనంగా, వీలైనంత పక్కకు తోసేస్తూ భోజనం ముగించాడు. తల్లీ కొడుకుల మధ్య ఏదో నడిచిందని సుబ్బమ్మ గ్రహించింది. రాత్రికి భర్తనడిగి తెలుసుకోవచ్చులే అని తనూ మౌనంగా ఉండిపోయింది.
తండ్రి చెబుతానన్న కథ కోసం రాత్రెప్పుడవుతుందా అని కాచుక్కూచున్న శారద భోజనాలవగానే తండ్రి పక్కన చేరి ఇంకా మొదలెట్టవేం అన్నట్టు చూసింది.
‘‘నీకొక మంచి డాక్టర్‌ కథ చెబుతానమ్మా’’ అన్నాడు రామారావు. అటుగా వచ్చిన తల్లినీ, భార్యనూ పిలిచి ‘మీరూ వినకూడదూ’ అని అడిగాడు. నరసమ్మ అలాగేనన్నట్లు తలాడిస్తూ వచ్చి శారద పక్కన కూచుంది. సుబ్బమ్మ తనకింకా వంటింట్లో పని ఉందన్నట్లు చేతులు తిప్పుతూ లోపలికి వెళ్ళింది.
‘‘వెల్లూరు అని మద్రాసు దగ్గర ఒక ఊరుంది. ఆ ఊరికి క్రైస్తవ మతం గురించి బోధించడానికి ఒక ఫాదర్‌ వచ్చాడు.’’
నరసమ్మ తల కొట్టుకుని ‘‘బాగుంది కృష్ణా రామా అనుకుంటూ పడుకోవలసినదాన్ని కూర్చోబెట్టి ఈ కిరస్తానపు కథా వినమంటున్నావు’’ అంటూ లేవబోయింది.
‘‘ఉండమ్మా. ఇది కిరస్తానం కథ కాదు. మానవత్వం కథ. మంచితనం కథ. ఈ ఒక్కరోజుకీ ఈ కథ వినమ్మా’’.
నరసమ్మ అసహనంగా కదిలింది కానీ కూచునే ఉంది.
‘‘ఆ ఫాదర్‌ అక్కడ ఒక్కడే ఉంటున్నాడు. చుట్టుపక్కల పేదవాళ్ళకు సేవ జేస్తున్నాడు. వైద్యం తెలుసు. జబ్బులతో తన దగ్గరకు వచ్చేవారికి వైద్యం చేసేవాడు. క్రీస్తు గొప్పతనాన్ని గురించి చెప్పేవాడు. ఆయన కుటుంబం అమెరికాలో ఉంది. ఎప్పుడన్నా వచ్చి వెళ్తారు. ఆయన కూతురు పదహారేళ్ళ పిల్ల ఒకసారి అమెరికా నుంచి వచ్చింది. తండ్రితో పాటు బీదవాళ్ళ ఇళ్ళకు తిరుగుతుండేది. ఇక్కడ ఎండలు అలవాటు లేక చికాకు పడేది. అయినా శలవులు తండ్రితో గడపాలని అంత దూరం వచ్చింది. వెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ అక్కడి విశేషాలు తెలుసుకుంటూ సంతోషంగానే ఉండేది. ఒకరోజు రాత్రి తండ్రీ కూతుళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉండగా వారి ఇంటి బైట నిలబడి ఎవరో కేకలు వేస్తున్నట్లు అనిపించి నిద్రలోంచి లేచారు. నిజంగానే ఎవరో కేకలు వేసి పిలుస్తున్నారు. ఎవరో బాధలో, దుఃఖంలో ఉండి పిలుస్తున్నట్లుగా ఉంది. ఇద్దరూ లేచి బైటికి వచ్చారు. ఆ వచ్చిందొక పేద కుటుంబీకుడు.
అతని భార్య ప్రసవ వేదన పడుతోంది. ఈ ఫాదరీ కూతురు వచ్చి తన భార్యకు ప్రసవం చేయాలని అడుగుతున్నాడతను. ఫాదరీకి వైద్యం తెలుసు గాబట్టి వాళ్ళమ్మాయికి కూడా వచ్చని అతని నమ్మకం. ఫాదరీ ఓపిగ్గా నచ్చచెప్పాడతనికి ‘‘మా అమ్మాయి చదువుకుంటోంది గానీ అది డాక్టర్‌ చదువు కాదు. మా అమ్మాయికి వైద్యం తెలియదు. ప్రసవం చెయ్యటం గురించి అసలేమీ తెలియదు. కావాలంటే నేనొచ్చి ఏదైనా సహాయ పడగలనేమో చూస్తాను’’ అని. అతనీ మాటలు వినిపించుకోడు, ఏడుస్తాడు, మొత్తుకుంటాడు. ఫాదరీ మగవాడు కాబట్టి ఆడవాళ్ళ ప్రసవం దగ్గరికి రాకూడదు. మీ అమ్మాయి వచ్చి నా భార్యను కాపాడాలని కాళ్ళమీద పడి లేవటంలేదు. చివరికి తండ్రీ కూతుళ్ళిద్దరూ బయల్దేరక తప్పలేదు. దారిలో తండ్రి చెప్పాడు ఈ ప్రాంతంలో ఆడవాళ్ళ పురుడు పోసేది మంత్రసానులనీ, మగ డాక్టర్లను ఆడవాళ్ళ దగ్గరకు రానివ్వరనీ, తను నిస్సహాయుడననీ. ఆ అమ్మాయి మేరీకి అది అన్యాయమనిపించింది. ప్రాణం పోయినా ఫరవాలేదు గానీ మగ డాక్టర్‌ని అనుమతించకపోవటం చాలా క్రూరమనిపించింది. అది ఇక్కడ సంప్రదాయమని వివరించాడు తండ్రి. ప్రసవించలేక బాధపడుతూ చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ యువతిని చూసి మేరీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ అమ్మాయి ఈ లోకంలో లేదు. మరి కాసేపటిలో పరలోక ప్రవేశం చేయబోతోంది. ఆ సమయంలో కూడా పరాయి మగవాడి నీడ ఆమె మీద పడకూడదు. పరాయి మగవాడి స్పర్శ తగలకూడదు. ఆ యువతి చనిపోవటాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేకపోయింది మేరీ. తండ్రితో కలిసి ఇంటికొచ్చింది. కానీ ఆ దృశ్యాన్ని మర్చిపోవటం ఆ అమ్మాయికి అసాధ్యమయింది. ఆ ఆవేదనలోంచి ఒక విషయం ఆ అమ్మాయికి అర్థమైంది. ఈ దేశంలో ఆడ డాక్టర్లుంటేనే తల్లీ పిల్లలు బతికి బట్టకడతారని అనుకుంది. ఆయుష్షుండి మంచి మంత్రసాని సమయానికి అందుబాటులో ఉండే అదృష్టం, వైద్యం లేక మరణించే ఆడవాళ్ళ సంఖ్య గురించి తండ్రినడిగి తెలుసుకుంది. ఈ దేశంలో ఆడ డాక్టరుంటే తప్ప లాభం లేదని గ్రహించింది. ఈసారి తన దేశం వెళ్ళి నాలుగేళ్ళు వైద్యం చదివి డాక్టర్‌గా తిరిగొచ్చింది. ఈసారి తనకోసం ఆశగా వచ్చిన వాళ్ళకు ‘‘నాకు వైద్యం రాదు’’ అని చెప్పనక్కర్లేదనే ఉత్సాహంతో, ధీమాగా తిరిగొచ్చింది. నిజంగానే ఆ ధీమాతోనే పని చేయటం మొదలుపెట్టింది. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఆడవాళ్ళకు పురుళ్ళు పోస్తోంది. పక్కనున్న ఊళ్ళకు తిరుగుతోంది. విరామం లేకుండా ఆడవాళ్ళు, పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టడానికి శక్తంతా ధారపోస్తోంది. కానీ ఒక్కతి ఎంతకాలం ఆ పని చెయ్యగలదు? తనకు తోడుగా ఇంకొందరుంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు నిలబెట్టవచ్చనిపించింది. కానీ ఎట్లా? అమెరికా నుంచి తనలాగా ఎందరొస్తారు? ఇక్కడి పరిస్థితులను, వాతావరణాన్ని తట్టుకుని పని చెయ్యటం తేలిక కాదు. తన దేశంలోనూ ఆడ డాక్టర్లు ఎక్కువమంది లేరు. కాకపోతే మగ డాక్టర్ల చేత ఆడవాళ్ళూ వైద్యం చేయించుకుంటారు. ఇక్కడి సమస్యకు పరిష్కారం ఒక్కటే. ఇక్కడి ఆడవాళ్ళే డాక్టర్లు కావాలి. ఆ ఆలోచనే సరయినదనిపించింది. కానీ ఆడపిల్లలను మద్రాసు మెడికల్‌ కాలేజీలో చేర్పించి మగపిల్లలతో పాటు కూర్చుని చదివించటానికి ఎవరొప్పుకుంటారు? ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారు? అది జరిగే పని కాదు. శరీరానికి సంబంధించిన విషయాలన్నీ మగవాళ్ళతో కలిసి ఆడపిల్లలు వింటారనే ఆలోచనే పెద్దవాళ్ళకు నచ్చదు. వాళ్ళు సహించలేరు. ఈ సమస్యకు పరిష్కారం ఆడపిల్లలకు వేరుగా ఒక కాలేజీ ఉండటమే. అందులో ఆడవాళ్ళే పాఠాలు చెప్పాలి. అది జరగటం సాధ్యమా? ఎందుకు కాదు? తనే ఒక కాలేజీ పెట్టొచ్చు. తనే పాఠాలు చెప్పొచ్చు. ఈ ఆలోచనతో మేరీకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తన ఆలోచన మద్రాసు మెడికల్‌ కాలేజీ వాళ్ళకు చెప్పింది. వాళ్ళు నవ్వారు. నిరుత్సాహపరిచారు. అయినా ఆమె పట్టు వదల్లేదు. తను పెట్టదలచుకున్న కాలేజీ గురించి ప్రచారం చేసింది. సాధించింది. పదిమంది అమ్మాయిలు వైద్యం చదవటానికి సిద్ధపడి వచ్చారు. వాళ్ళ ఆలనాపాలనా కూడా ఈమే చూడాలి. వసతి చూపాలి. అన్నింటికంటే కష్టం ఆస్పత్రి లేకుండా పాఠాలు చెప్పటం, రోగులను చూపించి రోగాల గురించి వివరించాలి కదా. ఈమె పదిమందినీ వెంటబెట్టుకుని రోగుల ఇళ్ళకు వెళ్ళేది. ఒక ఊరు కాదు. పది ఊళ్ళు తిరగాల్సి వచ్చేది. ఎలాగైతేనేం వదలకుండా ఒక యజ్ఞంలా ఆ విద్యాదానాన్ని సాగించింది. నాలుగేళ్ళు గడిచాయి. ఈ పిల్లలు కూడా పరీక్షలు రాసి పాసయితేనే కదా డిగ్రీ చేతికి వచ్చేదీ, డాక్టర్లుగా గుర్తింపు వచ్చేదీ. పరీక్షలు పెట్టటానికి మద్రాసు మెడికల్‌ కాలేజి ఒప్పుకుంది. ఈ పిల్లలను ఫెయిల్‌ చేసి పంపటానికి వాళ్ళకి పెద్ద అభ్యంతర పెట్టాల్సిందేమీ లేదనిపించింది. ఈ అమ్మాయిలకు భయం. పరీక్షలు మద్రాసు మెడికల్‌ కాలేజీలో చదివిన మగపిల్లలతో పాటు రాయాలి. ఆ కాలేజీలో ఎన్నో సౌకర్యాలు, మంచి ఉపాధ్యాయులు. పెద్ద ఆస్పత్రి. వాళ్ళతో పాటు సమానంగా తమకూ పరీక్షలనే ఆలోచనకే ఒణికిపోయారు. కానీ మేరీ సంతోషించింది. వీళ్ళలో ఒక్కరు పాసయినా, వాళ్ళకు మద్రాసు మెడికల్‌ కాలేజీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్‌ ఇస్తానని ఆ కాలేజీ ఒప్పుకోవటమే తను సాధించిన విజయమని ఆమె ఆనందపడిరది. ఈ సంవత్సరం ఒకరు పాసైతే మరుసటి ఏడాది ఇద్దరు పాసవచ్చు. పిల్లలకూ, తనకూ కూడా ఈ పరీక్ష విధానం అలవాటవుతుందని అనుకుంది ఆమె. కానీ ఆ పిల్లలు మాత్రం భయంతో ఏడ్చారు. తాము పరీక్షలకు వెళ్ళమని మొండికేసారు. మేరీ అందరికీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళింది. లోపల ఆమెకీ బెదురే. ఏ సౌకర్యం, ఏ పరికరాలూ సరిగా లేకుండా చదివిన వీళ్ళు పరీక్షలేం రాస్తారు. అందరూ నవ్వుతారు. ఒక్కరైనా పాస్‌ కాకపోతే ఇంకెవరూ చేరాలనుకోరేమో. నాలుగేళ్ళు ఇంత కష్టపడటం వృథా అనుకుంటారేమో. ఎన్నో సందేహాలు.
ఎలాగైతేనేం ఆ అమ్మాయిలు పరీక్షలు రాసొచ్చారు. ఈ డాక్టరమ్మ దైవం మీద భారం వేసి తన పని తాను చేసుకుంటోంది.
చివరికి ఫలితాలు వచ్చాయి. ‘‘శారదా… వాళ్ళు పాసయ్యారంటావా?’’ ‘‘కొందరైనా తప్పక పాసై ఉంటారు నాన్నా’’ శారద ఆందోళన, ఉత్సాహం కలగలసిన గొంతుతో అంది. ‘‘కొందరు కాదమ్మా. అందరూ పాసయ్యారు. పాసవటం కాదమ్మా ఫస్టు క్లాసులో పాసయ్యారు. మద్రాసు మెడికల్‌ కాలేజీలో చదివిన మగపిల్లలెవరికీ వీళ్ళకొచ్చినన్ని మార్కులు రాలేదు. వీళ్ళు అన్నింటిలో ఫస్టు వచ్చారు. ఇక వాళ్ళ ఆనందం పట్టగలమా? ఇప్పుడు మన భారతదేశపు ఆడవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి పదిమంది ఆడవాళ్ళు డాక్టర్లుగా తయారై ఉన్నారు. అదెంత గొప్ప విషయం. వెల్లూరులో ఆడపిల్లల కోసం మెడికల్‌ కాలేజీ పెట్టడానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. సహాయం చేస్తానంది. విరాళాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పని ఇంకా బాగా జరుగుతోంది’’.
శారద సంతోషం పట్టలేక తండ్రి మెడను కావలించుకుని ‘‘నేనా కాలేజీలో చదువుతాను నాన్నా’’ అంది సంబరంగా.
నరసమ్మ శారదను తన దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది.
‘‘నేను ఫస్టున పాసవుతా. అందరి ప్రాణాలు రక్షిస్తా’’ శారద నాన్నమ్మ ఒళ్ళోనుంచి దిగి గంతులేసింది.
‘‘నువ్వంతపని చేస్తావు. బంగారు తల్లివి. పొద్దుపోయింది. పోయి పడుకో’’.
శారదకు వెళ్ళాలని లేదు కానీ నాన్నమ్మ మాట వినక తప్పదని తెలుసు. శారద వెళ్ళిపోయాక నరసమ్మ కొడుక్కి దగ్గరగా జరిగి ‘‘కథ బాగుందిరా నాన్నా. నా కోసమే చెప్పావు. నీ ఉద్దేశ్యం మంచిదే. నాకూ అర్థమైంది. అర్థమవటం వేరు. ఆచరించటం వేరు. నన్ను కాశీ పంపించి శారదను బాగా చదివించు. డాక్టర్ని చెయ్యి’’.
‘‘అంతేనా అమ్మా’’.
‘‘అంతేరా. నేను మారలేను. రేపో మాపో పిల్ల పుష్పవతై పెళ్ళి కాకుండా ఉంటే చూసి నేను భరించలేను. ఆ అనాచారపు కొంపలో నేనుండలేను. నువ్వు మంచిపనే చేస్తున్నావు. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది’’ నరసమ్మ లేచి వెళ్ళింది.
రామారావుకి కూడా గుండెలోంచి కొంత బరువు దిగినట్లయింది. తల్లిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఇక రామారావు తల్లిని కాశీ పంపాకే తను మద్రాసు వెళ్ళాలని అనుకున్నాడు. అమ్మ సంకల్పం సవ్యంగా జరగాలి. తొందరగా జరగాలి. ఇంటి విషయాల్లో తనకింత కార్యదక్షత ఉందని రామారావుకి తెలియదు. ఈ విషయంలోనే తెలిసొచ్చింది. తన మిత్రులు కొందరు కాశీలో చదువుతున్నారు. వారికి ఉత్తరాలు రాశాడు. తల్లి వెళ్ళే సమయానికి ఆవిడకు వసతి సౌకర్యాలు చూసే పని వాళ్ళకు అప్పగించాడు. నెల రోజుల సమయం ఉంది. ప్రయాణాయాసమే తల్లికి కష్టం అనిపించింది గానీ చేయగలిగింది లేదు. నాగపూర్‌లో, ఇంకా ఇతర స్టేషన్లలో ఉన్న తన స్నేహితుల ఇళ్ళల్లో ఒకటి రెండు రోజులు ఆగి ప్రయాణం కొనసాగించేలా ఏర్పాటు చేసాడు. రైళ్ళు మారుతూ ఏకధాటి ప్రయాణం తట్టుకునే శక్తి తల్లికి ఉండదని అతని ఆలోచన. నరసమ్మ గుంటూరు తప్ప ఎక్కడికీ వెళ్ళిన మనిషి కాదు. రామారావు ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంటే నరసమ్మ వ్యవసాయం పనులు కొన్ని చక్కబెట్టి కొడుక్కి చెప్పబోయింది.
‘‘అదంతా నాకొదిలెయ్‌ అమ్మా. నువ్విక్కడి చీకూ చింతలేవీ కాశీ తీసుకెళ్ళటం లేదు. సరేనా?’’ అన్నాడు రామారావు.
నరసమ్మ నవ్వి ఊరుకుంది.
సుబ్బమ్మకు ముందు చాలా దిగులనిపించింది. భర్త ఎప్పుడూ మంది మనిషే గానీ ఇంటి మనిషి కాడు. ఇంట్లో అంతా సవ్యంగా ఏ లోటూ లేకుండా జరుగుతోందంటే అదంతా అత్తగారి నిర్వహణ వల్లే. ఇప్పుడావిడ లేకపోతే తను ఒంటరిదైపోదా? ఈ మాట అత్తగారితో అని చూసింది గానీ అక్కడి నుంచీ బదులేమీ రాలేదు. సరే ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందిలే అనుకుంది. అది సుబ్బమ్మ స్వభావం. దేని గురించీ ఎక్కువ ఆలోచించదు, బాధపడదు. అంతమందిని చూసుకునే భర్త తననూ, కూతుర్నీ చూసుకోడా? అసలు కూతురంటే ఆయనకు ప్రాణం. ఆ పిల్ల చదువుకే తల్లీ కొడుకూ దూరమవుతున్నారు. తల్లంటే రామారావుకున్న ప్రేమ సుబ్బమ్మకు తెలియనిది కాదు. అలాంటి తల్లిని దూరం చేసుకుంటున్నాడంటే కూతురి భవిష్యత్తు గురించి ఎంత శ్రద్ధ, ముందుచూపు ఉండి ఉండాలి. ఇలా ఆలోచించి సుబ్బమ్మ నిశ్చింతురాలైంది.
మొత్తానికి ఇంకొక ఇంట్లో అయితే రచ్చ కావలసిన వ్యవహారం ఆ ఇంట్లో మనుషుల మధ్యనున్న ప్రేమానుబంధాల వల్లా, తెలివితేటల వల్లా, సంస్కారం వల్లా ఒక సంబరంలాగా జరిగిపోతోంది.
బంధువులు వచ్చి నరసమ్మను చూసి వెళ్తున్నారు. కాశీ పంపించే కొడుకుని కన్నందుకు అభినందించి వెళ్తున్నారు.
శారదకు మాత్రం నాన్నమ్మ వెళ్ళటం నచ్చలేదు. సూర్యానికి అసలే నచ్చలేదు.
‘‘నాన్నమ్మా. నువ్వెందుకు కాశీ వెళ్ళటం. నా దగ్గరే ఉండు’’ అని రోజూ పేచీ పెడుతూనే ఉంది శారద. ‘‘నువ్వెక్కడికీ వెళ్ళొద్దు. వెళ్తే నేనూ వస్తా’’ అని బిక్కముఖం పెడుతున్నాడు సూర్యం.
నరసమ్మ కాశీ మహత్యాన్ని గురించి మనవరాలికీ, మనవడికీ రోజూ కథగా చెబుతోంది. ఎన్ని చెప్పినా నాయనమ్మను తననుంచి లాక్కుంటున్న కాశీ అంటే శారదకు ఇష్టంగా అనిపించటం లేదు. సూర్యానికీ ‘కాశీ’ అంటే కోపం వచ్చేస్తోంది.
‘‘మళ్ళీ ఎప్పుడొస్తావు’’ అని శారద అడిగితే
‘‘నేను రాను. నన్ను చూడటానికి నువ్వే రావాలి. నీ పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి రా’’ అంది మనవరాలి బుగ్గలు ముద్దాడుతూ.
ఆ మాటలు చెబుతున్నప్పుడు తన కంఠంలో దుఃఖం పలకకుండా ఉండటానికి ఆమె కఠిన ప్రయత్నమే చేసి జయించింది. అది కనిపెట్టలేని శారద ‘‘నేను పెళ్ళి చేసుకోనుగా’’ అంది.
‘‘ఐతే నేను నిన్ను కాశీ రానివ్వను’’ నవ్వింది నరసమ్మ.
‘‘కాశీ నీదా? ఎవరైనా రావొచ్చు. నేను వస్తా. నాన్నను తీసుకునే వస్తా’’ అంది శారద పంతంగా.
‘‘అలాగే. మీ నాన్నతో కలిసి రా’’ ఒప్పుకుంది నరసమ్మ.
‘‘అయితే కాశీ కథ చెప్పు’’ అంది నాన్నమ్మకు దగ్గరగా జరుగుతూ. నరసమ్మ వ్యాసుడు కాశీ వదిలి వెళ్ళాల్సిన పరిస్థితినీ, కాశీలో ఎక్కడా తినటానికి ఇంత తిండి కూడా దొరకక కాశీనే శపించాలనుకున్న తీరునీ చక్కని కథలాగా చెబుతోంది.
శారదకు వ్యాసుడి మీద చాలా జాలి వేసింది. నాన్నమ్మ చెబుతున్న కథను ఆపి ‘‘ఆకలి బాగా వేస్తున్నప్పుడు అన్నం లేకపోతే చాలా కష్టం కద నాన్నమ్మా. అమ్మో ఎలా ఆపుకోవాలి ఆకలిని… కళ్ళు తిరిగిపోతాయి కదా’’ అంది.
‘‘ఔనమ్మా ఆకలితో ఉండడం చాలా కష్టం. ఆకలేసినప్పుడు దాన్ని చల్లార్చుకోవటానికి మనుషులు ఎంత పనైనా చేస్తారు. చేయకూడని పనులను కూడా చేస్తారు’’.
‘‘ఆకలేసినప్పుడు అందరికీ అన్నం దొరకాలి’’ తీర్మానం చేసింది శారద.
‘‘కొందరు దురదృష్టవంతులకు దొరకదు తల్లీ’’.
‘‘దొరకాలి… అంతే. మనం వాళ్ళకి అన్నం పెట్టొచ్చు.’’
‘‘అందరికీ నీ అంత పెద్ద మనసుండొద్దూ, పెట్టాలనిపించొద్దూ. వ్యాసుడంతటి వాడికే కాశీలాంటి నగరంలో అన్నం దొరకలేదు. ఇక మామూలు వాళ్ళెంత. ఒక్కోసారి ఎవరికీ పెట్టాలనిపించదు’’.
‘‘కాదు. ఎవరైనా పెట్టటం కాదు. ఎవరూ పెట్టనక్కర్లా. వాళ్ళకి అన్నం ఉండాలి అంతే. ఈశ్వరుడు అలా చెయ్యలేడా?’’ శారద తీవ్రంగా ఆలోచిస్తోంది.
‘‘చెయ్యలేడా… అయితే నేను చేస్తా’’ శారద ఆ మాట అన్న తీరుకి నరసమ్మ ఆపకుండా నవ్వింది. నవ్వీ నవ్వీ పమిటి చెంగుతో కళ్ళల్లోకి వచ్చిన నీటిని తుడుచుకుంటూ శారద వంక చూస్తే ఆ పిల్ల ముఖం చిన్నబోయింది.
నరసమ్మ నవ్వు ఆపి ‘‘చిట్టితల్లీ. ఎందుకంత చిన్నబుచ్చుకుంటావు? నువ్వూ, మీ నాన్నా ఏమైనా చెయ్యగలమని అనుకుంటారు. నిన్ను డాక్టర్ని చేసి లోకంలో అందరి ప్రాణాలూ రక్షిస్తాననుకుంటాడు వాడు. నువ్వేమో ఆకలేయగానే అందరికీ అన్నం దొరికేలా చెయ్యగలననుకుంటావు. మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. నవ్వితే నీకు కోపం’’ శారదను ఒళ్ళో కూచోబెట్టుకుని ముద్దాడి మిగిలిన కథ చెప్పింది నరసమ్మ. శారద కథ వింటున్నదే గాని ఆకలేయగానే అన్నం తినేలా అందరికీ అన్నం ఇచ్చే దేవుడెవరా అని ఓ పక్క ఆలోచిస్తూనే ఉంది. నాన్నమ్మ కథ పూర్తయ్యాక అందరికీ అన్నం దొరికే కథ ఒకటి కల్పించి తమ్ముడికి చెప్పింది. సూర్యం కథ సగంలోనే నిద్రపోయాడు గానీ శారద మాత్రం కథ పూర్తిచేసే నిద్రపోయింది.
మొత్తానికి ఊరంతా అన్న సంతర్పణ చేసి నరసమ్మ కాశీ వెళ్ళేందుకు రైలెక్కింది. తల్లిని రైలెక్కించి వచ్చాక ఒక రోజంతా రామారావు చాలా నిరుత్సాహంగా, దీనంగా ఉండిపోయాడు. మళ్ళీ తల్లిని చూడగలనా అనే ప్రశ్న చాలా వేధించింది. అయితే అప్పటికే ఆయన మనసులో ఒక ఆలోచన స్థిరపడిరది. తల్లిని చూడటానికి వచ్చిన బంధువులంతా శారద పెళ్ళి గురించే మాట్లాడటం ఆయన గమనించాడు. శారద ఆ ఊళ్ళోనే ఉండిపోతే అదొక సమస్య అవుతుందనిపించింది. శారద మనసుకి ఆ సమస్య మంచిది కాదనే అనిపించింది. ఆయన మద్రాసు వెళ్ళి కూచుంటే విశాఖపట్నం, హైదరాబాదు తిరుగుతుంటే సుబ్బమ్మ ఈ బంధుగణాలకు సమాధానం చెప్పలేక సతమతమవుతుంది. బంధువులు సుబ్బమ్మనడిగి ఊరుకోరు. ఆమెను తోసుకుంటూ శారద దాకా వస్తారు. చిన్న శారదకా చికాకెందుకు? పైగా ఆ ఊళ్ళో చదువు శారద భవిష్యత్తుకు సరిపోదు. ఇప్పటినుంచే మద్రాసులోని మంచి స్కూల్లో చేర్పిస్తే గట్టి పునాది పడుతుంది. ఆ ఆలోచనతో దాదాపు వెంటనే కాపురం మద్రాసుకు మార్చాలనే నిర్ణయం తీసేసుకున్నాడు. ఆయన వెళ్ళినప్పుడు
ఉండేందుకు అక్కడ ఒక ఇల్లు ఉండనే ఉంది. సుబ్బమ్మ, శారదలను తీసుకెళ్తే ఆ ఇల్లు కళకళలాడుతుంది. బంధుమిత్రులు అక్కడికి వచ్చినా ఆ వాతావరణంలో ఈ ఇరుకు ప్రశ్నలు వెయ్యలేరు. శారద జీవితం విశాలమైన రహదారిలో ప్రయాణిస్తుంది.
రామారావుకి ఆలోచన వస్తే అమలు చేయటమే తెలుసు. కాదనేవారెవరూ లేరు. పొలమంతా మంచి రైతులను చూసి కౌలుకిచ్చాడు. ఇంట్లో కొన్ని గదులలో పురోహితుడి గారి కుటుంబం ఉండేలా ఏర్పాటు చేసాడు. వాళ్ళు ఇల్లంతటినీ శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకుంటారు. గంపెడు సంతానంతో ఇరుకింట్లో ఉంటున్న పురోహితుడు ఈ ఏర్పాటుకి పరమానందపడ్డాడు. ఈ పనులన్నీ అయ్యేసరికి నెలరోజులు పైనే పట్టింది. నరసమ్మతో పాటు కాశీ వెళ్ళిన సోమేశ్వరరావు వచ్చాడు. నరసమ్మ రాకపోవటం ఊరివాళ్ళను ఆశ్చర్యపరచలేదు. ఈ నెలరోజులు రామారావు చేస్తున్న మార్పులు చూసి వాళ్ళు నరసమ్మ కాశీనుంచి ఇప్పుడప్పుడే రాదనే అనుకున్నారు. నరసమ్మకు కాశీలో మంచి వసతి దొరికిందనీ, తెలుగువాళ్ళ పొరుగునే ఉందనీ, చాలా సంతోషంగా ఉందనీ సోమేశ్వరరావు చెప్పాడు. రామారావుకి అప్పటికప్పుడే వెళ్ళి తల్లిని చూడాలనిపించింది. నిగ్రహించుకున్నాడు. తల్లికి ఉత్తరం రాశాడు. తన స్నేహితులకు తల్లి యోగక్షేమాలు చూస్తుండమని ఉత్తరాలు రాసి ఆగని కన్నీళ్ళను అడ్డుపెట్టకుండా ఉండిపోయాడు.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.