పరదాలను తగలేసిన ఫాతిమాషేక్‌ -డా॥ చల్లపల్లి స్వరూపరాణి

సంస్కరణ అంటే సమాజంలోని ఆఖరు మనిషి విముక్తితోనే ముడిపడి ఉందని భావించి అణగారిన కులాలను, స్త్రీలను, రైతులను పీడన నుంచి విముక్తి చెయ్యడం కోసం విశాలమైన ప్రాపంచిక దృక్పథం తో బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి దానికోసం తమ జీవితాలను ధారపోసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయిలతో పాటు వారి ఉద్యమ సహచరి అయిన ఫాతిమా

షేక్‌ల కృషి చాలాకాలం పాటు వెలుగులోకి రాకపోవడం యాదృచ్ఛికం కాదు. అయితే ఫూలే దంపతులపైన జరిగిన అధ్యయనాలు, వచ్చిన పుస్తకాలతో పోల్చితే ఫాతిమా షేక్‌ కృషిపైన జరిగిన పరిశోధన చాలా తక్కువ, దాదాపు అసలు లేదనే చెప్పాలి. వారితో కలిసి పనిచేసిన ముస్లిం మహిళ ఫాతిమా షేక్‌ గురించి ఫూలే, సావిత్రీబాయి రాసుకున్న ఉత్తరాలు, పుస్తకాలలో నామమాత్రపు సమాచారం తప్ప ఆమె తాలూకు ఇతర విషయాలు లభ్యం కాకపోవడం చూస్తాం. అందుకు కారణాలు లేకపోలేదు.
ముస్లిం స్త్రీ అనగానే గంపెడు సంతానంతో, వారికి బిర్యానీ వండిపెడుతూ ఎటువంటి స్వతంత్ర భావాలు లేకుండా కేవలం భర్తకి, పిల్లలకి సేవలు చేసే ఒక మర యంత్రం అని అందరికీ గుర్తుకొ స్తుంది. పంతొమ్మిదవ శతాబ్దంలోనే అటువంటి దృశ్యాన్ని తన చేతులతో చెరిపేసిన ధీశాలి ఫాతిమా షేక్‌. మనువాదపు ఉచ్చులో జంతువులకంటే హీనమైన స్థితికి గురైన ‘అంటరాని’వారికి, ఆడపిల్లలకి చదువు చెప్పి వారి బతుకుల్లో వెలుతురు నింపిన చదువుల తల్లి, ఈ దేశంలో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని ఫాతిమా షేక్‌. ఆమె భారత ముస్లిం సమాజంలోనే ఆధునికత వైపు అడుగులు వేసిన మొదటి స్త్రీగా భావించవచ్చు.
ఫాతిమా షేక్‌ జీవిత విశేషాలు, ఆమెకు సంబం ధించిన ఇతర సమాచారం అంతగా అందు బాటులో లేవు. ఆమె 1825`27 మధ్యకాలంలో జనవరి తొమ్మిదో తేదీన జన్మించినట్లు కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఫాతిమా జ్యోతీరావు ఫూలేకి మిత్రుడైన ఉస్మాన్‌ షేక్‌ తోబుట్టువు. వారు ఉత్తరప్రదేశ్‌కి చెందినవారని, వస్త్ర వ్యాపారం వారి వృత్తి అని తెలుస్తోంది. అయితే ఫాతిమా కుటుంబం వ్యాపారరీత్యా మహారాష్ట్రకి వలస వచ్చి పూనేలోనే స్థిరపడిరది. పూనేలోని భిడేవాడ వారి నివాస ప్రాంతం. ఆమె సావిత్రీబాయితో పాటు అహ్మద్‌ నగర్‌లో క్రైస్తవ మిషనరీ అయిన మేడం పరారే పాఠశాలలో టీచర్‌
ట్రైనింగ్‌ తీసుకుని దేశంలో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని అయింది. ఆమెమీద లోతుగా పరిశోధన చేసిన సయ్యద్‌ నస్రీన్‌ ఫాతిమా షేక్‌ ఉర్దూలో కవిత్వం కూడా రాశారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ పాఠ్య పుస్తకాలలో ఆమె కృషిపైన పాఠాలను కూడా ప్రచురించింది. అయితే ఆమె 1856 తర్వాత ఎక్కడ జీవించిందీ తెలియడం లేదని నస్రీన్‌ ఖాన్‌ అంటారు.
ఫూలే తల్లిదండ్రులు ఆధిపత్య కుల వత్తిడికి గురై తమ కుమారుడి అభ్యుదయ మార్గాన్ని అంగీకరించకపోగా చిన్నవయసు వారైన ఫూలేని ఆయన భార్య సావిత్రీబాయి ఇంటినుంచి బైటికి పంపినప్పుడు ఫూలే మిత్రుడు ఉస్మాన్‌ షేక్‌ వారికి ఆశ్రయం కల్పించాడు. వారికోసం ఒక అద్దె ఇల్లు ఏర్పాటు చేసి అన్నివిధాలుగా వారికి తోడుగా ఉన్నాడు ఉస్మాన్‌ షేక్‌. తర్వాత మహాత్మా ఫూలే, సావిత్రీబాయి పూనే పట్టణంలో మొదటిసారిగా అణగారిన కులాల ఆడపిల్లల కోసం పాఠశాల ప్రారంభించాలని తలపెట్టినప్పుడు వారికి స్థలం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి స్థితిలో ఫాతిమా షేక్‌ కుటుంబమే పూనేలోని భిడేవాడలోని తమ ఇంటిని స్కూల్‌ కోసం ఇచ్చారు.
బ్రాహ్మణీయ పితృస్వామ్యం స్త్రీ విద్యని నిరాకరిస్తే, ఇస్లాం మాత్రం స్త్రీ విద్యకు అభ్యంతరం చెప్పదు. కానీ వారు తమ మతాచారం ప్రకారం ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లో మతపరమైన విద్యని మాత్రమే అభ్యసించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఫాతిమా షేక్‌ ఆధునిక విద్యను అభ్యసించడం, తిరిగి దాన్ని కింది కులాలకూ, ఆడపిల్లలకూ బోధించడం అనే విషయంలో ఆమెకు తన సమాజం నుంచి సహకారం లభించలేదు. పైగా ఆమె పరదాలను దాటి బైటికొచ్చి సామాజిక కార్యక్రమంగా ఇంటింటికీ తిరిగి ఇంట్లో పెద్దవాళ్ళకు చదువు యొక్క ఆవశ్యకతని వివరించి, నచ్చచెప్పి, చివరకు వారిని ఒప్పించి దళిత బాల బాలికలను పాఠశాలకు తీసుకురావడం, తర్వాత ముస్లింల కోసం పాఠశాలలు స్థాపించడం అనేది ముస్లిం మత పెద్దలకు బొత్తిగా నచ్చలేదు. ఆమె వారినుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. మరొక పక్క తమ సంప్రదాయాలకు విరుద్ధంగా స్త్రీలకు చదువు చెప్పి, వితంతువుల సమస్యల మీద పనిచెయ్యడంతో సావిత్రీబాయితో పాటు ఫాతిమా షేక్‌ కూడా హిందూ మతస్తుల ఆగ్రహానికి గురయ్యింది. అయినప్పటికీ ఆమె తన మార్గం నుంచి పక్కకు తప్పుకోలేదు. సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ 1875లో భారతదేశంలో ముస్లింల విద్య కోసం ప్రయత్నాలు ప్రారంభించి ‘మహమ్మదన్‌ ఆంగ్లో`ఓరియంటల్‌ కాలేజీ’ని స్థాపించారు. ఆ కాలేజి తర్వాత ఆలీఘడ్‌ ముస్లిం యూనివర్శిటీగా పరిణామం చెందింది. అయితే, ఫాతిమా షేక్‌ 1848లోనే అణగారిన కులాలు, ఆడపిల్లల కోసం, ఆ క్రమంలోనే ముస్లిం పిల్లల కోసం పాఠశాలలు స్థాపించినప్పటికీ ముస్లింల విద్యా వికాసం కోసం పనిచేసిన మొదటి వ్యక్తిగా సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌నే చరిత్రకారులు రికార్డు చెయ్యడం వారి పితృస్వామిక పరిమితిగానే భావించాలి. అయితే చరిత్ర దాచేస్తే దాగదు కదా! ఫూలే దంపతులు స్వయంగా గ్రందస్థం చేసుకున్న తమ కార్యక్రమాల వివరాలలో వారి సహచరి అయిన ఫాతిమా షేక్‌ కృషి కూడా తారీఖులతో సహా బైటకొచ్చింది. ఫాతిమా అందించిన స్ఫూర్తితో బేగం రోకియా నఖావత్‌ కలకత్తా, పాట్నా పట్టణాలలో ముస్లిం బాలికల కోసం పాఠశాలలను ఏర్పాటు చేయడం విశేషం. చదువుని సామాజిక పరివర్తనకి గొప్ప ఆయుధంగా భావించి అణగారిన కులాలు, స్త్రీల చదువు కోసం, వారిపట్ల అమలయ్యే సమస్తమైన వివక్షను అంతమొందించడం కోసం బ్రాహ్మణీయ పితృస్వామిక వ్యవస్థతో జీవితాంతం పోరు చేసిన మహాత్మా ఫూలే, సావిత్రీబాయి దంపతులతో కలిసి పనిచేసింది ఫాతిమా షేక్‌. ఆమె ముస్లింల విద్యాభివృద్ధికి పునాదులు వేయడంతో పాటు అణగారిన కులాలు, మైనారిటీల ఐక్యతకు పాదులు వేసింది. ఫూలే దంపతులు నడిపిన పాఠశాలల్లో టీచర్‌గానే కాక సత్యశోధక సమాజ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంది. ఫూలే మేనత్త అయిన సగుణాబాయి సావిత్రీబాయి, ఫాతిమా షేక్‌ సత్యశోధక సమాజంలో ప్రారంభ మహిళా కార్యకర్తలు. ఫూలే, ఆయన మిత్రులతో కలిసి 1848`54 మధ్యకాలంలో సుమారు ఇరవై పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాక బ్రిటిష్‌ వారి నుంచి గుర్తింపు, సత్కారం పొందడంలో ఫాతిమా షేక్‌ అందించిన తోడ్పాటు కూడా ఉంది. తన కార్యక్రమాలలో ఫాతిమా తనకెంతో సహకరించిందని దూరాన ఎక్కడో ఉన్న ఫూలేకి ఒక ఉత్తరంలో సావిత్రీబాయి పేర్కొనడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్నే కాదు, విద్యాభివృద్ధి కోసం వారిద్దరి నిబద్ధతను కూడా తెలియజేస్తుంది.
ముస్లిం సమాజం స్త్రీలను పరదాల మాటున దాచేదే అయినప్పటికీ అప్పటికి వారికి ఇప్పుడున్నట్టు బయట సమాజం విషయంలో అభద్రతా భావం లేదు. ఫాతిమా జీవించిన కాలానికి ముస్లింల విషయంలో ఇతర సామాజిక వర్గాలకు ఉండే దృష్టి ఇప్పుడున్నంత దుర్మార్గంగా లేకపోవడం, మెజారిటీ ముస్లింలు సమాజంలో కులపీడన నుంచి తప్పుకోడానికి ఇస్లాం మతంలోకి వెళ్ళి, వారక్కడ సూఫీ సంస్కరణవాద ప్రభావంతో ఉండడం వల్లనే ఫాతిమా షేక్‌కు ఇది సాధ్యమై ఉండవచ్చు. అయితే ఆధునిక విద్య విషయంలో ఆమె ముస్లిం మతపెద్దల నుంచి అభ్యంతరాలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఫూలే దంపతులతో ఫాతిమా సోదరుడి ఆత్మీయ స్నేహమే ఆమెకు గొప్ప బలం. ఆమె సోదరుడు ఉస్మాన్‌ షేక్‌ ఒక ఆధునిక భావాలున్న సంపన్నుడుగా ఫూలే ప్రారంభించిన కార్యక్రమాలకు అన్నివిధాలుగా సహకారాన్ని అందించాడు. తన వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని పరదాలకు బలికాకుండా సమాజంలో వివక్షకు గురయ్యే అణగారిన కులాలు, స్త్రీల విద్యాభివృద్ధికి, తద్వారా వారిని అసమానత్వం నుంచి విముక్తి చెయ్యడానికి వినియోగించడం ఫాతిమాలోని గొప్ప సామాజిక స్పృహకు నిదర్శనం. ఫాతిమా షేక్‌ జీవితం, సామాజిక ఉద్యమ కార్యక్రమాల గురించి మరింత లోతైన అధ్యయనం అవసరం. ఆ పనిని బహుజన సమూహాలకు చెందిన మేధావులు, రచయితలూ, స్త్రీవాదులూ మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.