మన దేశంలో
సతీసహగమన నిషేధం ఓ సంస్కరణ
బాల్య వివాహ నిరోధం మరో సంస్కరణ
విధవా వివాహం ఇంకో సంస్కరణ
కన్యాశుల్కాన్ని పారద్రోలటం ఒకటి
వరకట్నాన్ని నిర్మూలించటం మరొకటి
విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు ఇంకొకటి
గత వందేళ్ళలో స్త్రీల గురించి ఎన్ని సంస్కరణలో కదా? స్త్రీల పట్ల సమాజం ఎంత దయగా ఉందో కదా అనిపిస్తుంది కదా!
మోసపోకండి అమ్మాయిలూ… మోసపో కండి…! మీ కోసం మేము ఆలోచిస్తున్నాం, మీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా వేయబడిన చిన్న చిన్న తాయిలాలు ఇవి. విద్య, ఆర్థిక స్వాతంత్య్రం మాత్రమేనా మనకు కావాల్సింది?
నిజానికి మనకి కావాల్సింది వీటన్నింటినీ మించినది సామాజిక స్వాతంత్య్రం… సామాజిక సమానత్వం… మనమీద మనకు యజమానిత్వం.
సమాజంలో పురుషుడికి ఉన్న స్థానం స్త్రీకి కూడా ఉంటే చాలదా.. మిగిలినవన్నీ స్త్రీలకి సిద్ధించడానికి.
నిజానికి పైన చెప్పిన సంస్కరణలన్నీ పైపై మందుపూతల్లాంటివే తప్ప స్త్రీలని పురుషులతో సమానంగా నిలబెట్టగలిగే శాశ్వత పరిష్కారాలు కాదు. అసలు ఈ సంస్కరణల అవసరం ఎందుకొచ్చింది? ప్రతి చోటా బాధితులుగా మహిళలు మాత్రమే ఎందుకున్నారు?
వీటిల్లో మగవాళ్ళ కోసం వచ్చిన సంస్కరణ అంటూ ఏమైనా ఉందా? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకు లేదంటే అసలు సంస్కరణలు తెచ్చి వాళ్ళని ఉద్ధరించాల్సిన అవసరం చరిత్ర పుటల్లో ఎక్కడా లేదు కనుక. ప్రతి తరంలోనూ స్త్రీ అంటే ద్వితీయ శ్రేణి మనిషి మాత్రమే. ప్రాణం ఉంది కాబట్టి మనిషి అనుకోవడమే తప్ప, ప్రాణం లేని వస్తువులకూ, స్త్రీలకూ మధ్య పెద్ద తేడా ఉన్న దాఖలాలు ఏమీ లేవు. స్త్రీ అంటే పురుషుడి ఆస్తి.
పాతరోజులకీ, ఇప్పటికీ ఏం మారింది? అప్పటిలాగానే ఇప్పుడు కూడా ‘పరాధీన’లుగానే బ్రతుకు సాగించాలనే తత్వమే కనిపిస్తుంది తప్ప మనల్ని మనతో సమానమైన మనుషులుగా గుర్తిస్తున్నారనే భావన ఏ స్త్రీకయినా ఉందా?
మానవులుగా పరిగణించబడుతున్న ఒకే జాతికి సంబంధించిన ఇద్దరినీ సమా నంగా పరిగణించకపోవడంలోనే మనిషి ఏనాడూ హేతుయుతంగా ఆలోచన చెయ్య లేదని అనుకోవడానికి తార్కాణం. మనిషి పుట్టుకకే నైతికత లేదని మనం భావించ డంలో తప్పేమీ లేదు.
ఆధునిక పురుషులంతా ఆదిమ సమా జపు క్రీనీడలే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్త్రీల పట్ల వాళ్ళకున్న అభిప్రాయాన్ని మరింత నాగరికంగా వ్యక్తం చేస్తున్నారు తప్ప వాళ్ళని తమతో సమానంగా అంగీకరించే వారి సంఖ్య బహు స్వల్పం. ఈ మాత్రం సంఖ్య పాతకాలంలోనూ ఉంది.
స్త్రీ తమతో సమానంగా ప్రజ్ఞ చూపిస్తే ఇప్పటి పురుషుడికి నచ్చదు. రకరకాలైన కారణాలతో ఆమె చేసే పనులకి వంకలు పెడతారు. పనుల్లో కూడా ఆడ పని, మగ పని అని విభజన చేసే ఆడవాళ్ళను హేళన చేయడం నిత్యకృత్యం. ఆడ పనులుగా పేరుపడిన వాటిని చేయడానికి మగవాళ్ళకి ఎక్కడలేని తలవంపులూ తోసుకుని వచ్చేస్తాయి.
స్త్రీలకి తమదంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఉందంటే ఆ స్త్రీలని కించపరచడానికి ఎన్ని మార్గాలు ఉండాలో అన్ని మార్గాలూ వెతుకుతారు వీరు. సమాజం ముందు ఆమెని దోషిగా నిలబెట్టేవరకూ నిద్రపట్టదు.
మనలని బలహీనులని చెప్పి మనల్ని మనమే అబలలుగా భావించి ఆత్మన్యూనత లోకి వెళ్ళేలా చేశారు. నియమ నిబంధనల ప్రతిపాదన వాళ్ళది, ఆచరణ మన బాధ్యత.
ఒక స్త్రీగా నీలోనో, నాలోనో ఒక చైతన్యం మొదలయ్యిందా… వెంటనే నైతికత అంటూ బయలుదేరుతారు సంప్రదాయ వాదులు. ఒక స్త్రీ చైతన్యం వల్ల సంస్కృతికో, సంప్రదాయానికో ఇబ్బంది వచ్చేస్తుందని అనుకుంటే ఆ సంస్కృతి లోని డొల్లతనం తేటతెల్లమవడం కాదా?
అసలు నైతికత అంటే ఏమిటి? ఎవరో రాశారంటున్న శాస్త్రాల ప్రకారం మన జీవితాలు కొనసాగించడం అనేనా? ఎవరు రాశారో చూడలేదు. అవి రాసిన కాలమేదో తెలియదు. ఆ రాసినవి ఈ కాలానికి ఎందుకు అన్వయించుకోవాలో చెప్పలేరు. కానీ వాటిని పాటించాలంతే… లేదంటే మోరల్ పోలీసింగ్.
పైపెచ్చు మనలో మనం ఒకరికొకరం సహాయంగా రావడానికి సంకోచిస్తాం కానీ, మనలోనే కొందరు మాత్రం పురుషులతో చేరి మనమీదే రాళ్ళేస్తూ ఉంటారు.
తనవైన ఆలోచనలూ, అనుభూతులూ, స్పందనలూ స్త్రీలకి కూడా ఉంటాయనే పట్టని వారి నడుమ ఆమె వ్యక్తిత్వం సంగతి సరే అస్తిత్వానికైనా చోటుందని మనం నమ్మగలమా? అస్తిత్వం అంటే దేహంగా బ్రతకడమేనా? దేహంగా బ్రతుకుతూ మనకీ అస్తిత్వం ఉందని మనల్ని మనం నమ్మించు కుంటూ ఎంతకాలం బ్రతుకు సాగించగలం?
స్త్రీ, పురుషుల మధ్య పరస్పర విశ్వాసాలు ఉండాలి తప్ప అధికారాలు కాదు కదా? నీకన్నా నేను అధికం అని ఒక పురుషుడు అనుకుంటే… నీ జన్మే నా చేతుల్లో ఉందని స్త్రీ భావిస్తే పురుషుడెక్కడ? మహిళలుగా మనకు అధికత్వం అవసరం లేదు సమానత్వం తప్ప. ఈ సమానత్వం కోసం మనకేమీ చట్టాలు అవసరం లేదు. చట్టాలతో సమానత్వం రాదు…మనస్సుల నుండి రావాలి.
సంతానోత్పత్తిలో తప్ప సామాజిక
ఉత్పత్తిలో మనల్ని భాగస్వాములుగా అంగీకరించే పరిస్థితి నుండి, వాళ్ళ ఆర్థిక అవసరాల కోసమైనా మనల్నీ సామాజిక అభివృద్ధిలో తప్పనిసరిగా అంగీకరించేలా చేయగలిగిన సామర్ధ్యం మనకుందని ఇప్పటికే నిరూపించుకున్న మనం, సమాజంలో తామెంతో మనమూ అంతే ఆని మన మనసులకి కర్తవ్య బోధ చేసి, కొడుకుకూ, కూతురుకూ ఒకేలాంటి ఆలోచనలు పెంపొందేలా అమ్మలుగా సమదృష్టి మొదలుపెడితే చాలు… సమాజంలో కొత్త భావనకి అంకురార్పణ చేసినట్లే.