తన పిల్లలు తనకు కారా!? – పి. ప్రశాంతి

శివరాత్రిలో ఆ కాస్త చలీ శివ శివా అంటూ వెళ్ళిపోయింది. ఇక మాదే కాలం అన్నట్టుగా ఎండలు పేట్రేగిపోతున్నాయి. ఆకులు రాల్చేసుకున్న చెట్లు మోడులుగా నిలబడ్డాయి. కొమ్మల కణుపుల్లోంచి చిగురుటాకులు మొలుచుకొ స్తున్నాయి. వేప చెట్లు నిండా పూలతో తెల్లబడ్డాయి.

హోళీ ఆడుకున్నట్లు మోదుగ చెట్లు పూలతో నిలువెల్లా ఎర్రబడున్నాయి. నాలుగు గొర్రెలు, రెండు మేకల్ని తోలుకుని చేనుకాడ్నించి ఇంటికెళ్తూ మోదుగ పూలు కోసి ఒడి నింపుకుంది రజిత. పూల ఎరుపుని మించిన మెరుపు ఆమె కళ్ళల్లో. అరుణవర్ణపు ఆ పూలంటే భాస్కర్‌కి ఎంతిష్టమో గుర్తు చేసుకుంది. ఇంటికాడ అత్తమ్మ దగ్గరున్న పిల్లలిద్దర్నీ తలుచుకుని గప్పున ఇల్లు చేరింది.
నాలుగిళ్ళ అవతల ఉండగానే అమ్మ రావడం చూసిన రెండేళ్ళ శ్రావణి పరుగున వచ్చి కాళ్ళకి చుట్టుకుంది. నెత్తిమీదున్న గంప పడిపోకుండా ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో బిడ్డనెత్తి చంకనేసుకుంది రజిత. అంతలో మేకలు, గొర్రెలు ఇల్లు చేరిపోయేసరికి రజిత కూడా పరుగున ఇల్లు చేరింది. తనకంటే ముందెళ్ళి ప్రేమగా పెంచుకున్న పూలమొక్కల్ని అందుకుంటాయేమో అని అంత దూరంనించే వాటి భాషలో అదిలించింది. ఒక్క రెమ్మన్నా అందకపోతుందా అని అటూ ఇటూ చూస్తూ మందగించిన మేకలు రజిత అదలింపునకు తిన్నగా వాటి స్థానానికెళ్ళి నించున్నాయి.
వాకిట్లో గంపతో పాటు, బిడ్డని కూడా దించి ఆ జీవాల్ని కట్టేసే పనిలో పడిరది రజిత. పొద్దున్నెప్పుడో దొడ్లో వదిలేసి మేతకి పోయిన తల్లి గొర్రెలు ఇంటికొస్తున్న సవ్వడి విన్నప్పట్నించీ జాలీలో ఉన్న గొర్రెపిల్లలు బే… బే… అని గింజుకుంటున్నాయి. రజితకన్నా ముందే ఉరుకులు పరుగుల మీదొచ్చిన తల్లి గొర్రెలు మూడూ వాటి పిల్లల దగ్గరికెళ్ళి పొదుగులందేలా నించున్నాయి. పొదుగు అందీ అందక అవస్థలు పడుతున్న గొర్రెపిల్లల్ని ఇడిచిపెట్టింది వెనకే వచ్చిన రజిత. ఇక అవి తల్లుల పొదుగుల్లో చేరిపోయి కుమ్మి కుమ్మి పాలు తాగుతున్నాయి. తల్లి గొర్రెలు ప్రేమగా వాటిని మూతుల్తో తడుతున్నాయే కానీ అక్కడ్నుంచి కదలలేదు. కడుపారా పాలు తాగి, కాసేపు అటు ఇటు గెంతి తల్లి గొర్రెల్తో ఆటాడాక అప్పుడు కానీ వదల్లేదు. మెల్లగా గడ్డి పరకల్ని కొరకడానికి తలలు వాల్చి అటు ఇటు వెళ్ళాక కానీ తల్లి గొర్రెలు కదల్లేదు. వాటికి ఇంకో ధ్యాస లేదు.
ఒక పక్క తన పని చేసుకుంటూనే ఓరకంట ఇదంతా చూస్తున్న రజిత కళ్ళల్లో తడి. రోజూ చూసేదే అయినా ఎప్పుడూ చూస్తూనే ఉండాలని పిస్తుంది ఆమెకి. చూస్తున్నంతసేపూ కళ్ళల్లో చెమ్మ, గుండెల్లో రక్తం వేడిగా పరుగులు తీస్తుంటుంది. చేతులు వాటి పని అవి చేసుకుపోతున్నా మనసు అగ్గి పెట్టినట్టుంటుంది. నరనరాన నిస్సత్తువ గుంజేస్తున్నట్టుంటుంది. ‘‘నోరులేని జీవాలే నయం మాట రాకున్నా భాష తెలుసు… కుయుక్తులు లేని నిర్మల సహజ జీవనం వాటిది. బిడ్డకి హాని తలపెట్టాలని చూస్తే మాత్రం ఎంతటి సాధు జంతువైనా తిరగబడతది, అవతలి బలంతో లెక్కలేదు. పర్వతాన్నయినా ఢీ కొంటది… తన బిడ్డని సాదుకుంటది. కానీ నేనేం చేస్తున్నా… ఆ బలం నాకెందుకు లేదు. మనిషిగా పుట్టినం దుకేనా…’ అనుకునేసరికి తను ఆకాశం లోంచి రాలిపోతున్న చుక్కలా అనిపిస్తుంది. నాలుగేళ్ళ తన కొడుకు లేత తొడమీద ఇంకో ఎర్రమచ్చ రాకూడదని దూరం నుంచే కళ్ళతో తడిమి మనసు లో హత్తుకుంటుంది. పాతికేళ్ళకే నూరేళ్ళు నింపుకున్న భర్త మీద కోపమొస్తుంది. పెళ్ళయిన ఐదేళ్ళకే తలక్రిందులైన తన జీవితం మీద జాలేస్తుంది.
చురుగ్గా, కలివిడిగా, ఆకర్షణీయంగా ఉండే రజిత ఎనిమిదో తరగతిలోనే భాస్కర్‌ ప్రేమలో పడిరది. మొదట కాదన్నా భాస్కర్‌ పదో తరగతి పరీక్షలు రాయడానికెళ్ళే ముందు చెప్పిన మాటలకి ఫిదా అయిపోయి, అది ప్రేమగా మలిచేసుకుంది. రెండేళ్ళైపోయింది. వ్యవసాయమంటే ప్రాణం పెట్టే భాస్కర్‌ అదే చదువు అగ్రికల్చర్‌లో కొనసాగిం చాలని, అందులో తనకి ఇష్టమైన విత్తన సంరక్షణ, విత్తనాభివృద్ధిలో పరిశోధన కూడా చెయ్యాలను కున్నాడు. అతనికి చేదోడుగా ఉంటూ వ్యవసాయం పనులు తను చూసుకోవాలనుకుంది.
భవిష్యత్తు ఎలాగూ నిర్ణయించేసుకున్నారు కనుక పదో తరగతితో పనిలేదని చదువుని నిర్లక్ష్యం చేసింది రజిత. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన కొన్ని రోజులకే భాస్కర్‌ తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. అక్కడితో చదువు ముగించి పదెకరాల వ్యవసాయాన్ని అందుకోవలసొచ్చింది. తర్వాత సంవత్సరం రెండు కుటుంబాలనీ ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు రజిత, భాస్కర్‌. ఇద్దరు పిల్లలు పుట్టారు. కాలం కలిసి రాక వ్యవసాయం అంతంత మాత్రంగా ఉంది. రెండు బర్రెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, పెరటి తోటలు. వీటిమీద వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడానికి లోటు లేదు కానీ వ్యవసాయం పైన అప్పు చెయ్యకూడదని గత ఐదేళ్ళలో విడతలుగా రెండెకరాలు అమ్మేసి పెట్టుబడి పెట్టాడు. ఆ యేడు వర్షాలు బాగా పడడంతో వ్యవసాయం బాగుంటుందని ఉత్సాహపడ్డారు. పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలి రజిత కూడా రోజంతా భాస్కర్‌తోనే బాయికాడ ఉంటూ పశువుల్ని మేపడంతో పాటు అన్ని పనుల్లో చేదోడుగా ఉండేది. ఓ రోజు వరిపొలానికి నీరుపెట్టి ఒరాలు సరిచేద్దామని చేలో దిగిన భాస్కర్‌ కరెంట్‌ తీగలు పడుండడాన్ని చూసుకోపోవడంతో షాక్‌ కొట్టి అక్కడికక్కడే చనిపో యాడు. రజిత జీవితం రంగు మారిపోయింది.
‘నీ రాకతోనే ఈ ఇంటికి చెడుపుట్టింది’ అంటూ కోడల్ని సాధించడం మొదలు పెట్టింది అత్తగారు. ఆమె అలాంటిది కాదని, పాలోళ్ళ ప్రభావంతో అలా మాట్లాడుతోందని, ఆమే మారుతుందని సరిపెట్టుకుంటూ వచ్చింది. ఓ రోజు పెద మామ, ఆయన కొడుకులిద్దరూ వచ్చి అత్తతో ఏదో మాట్లాడిపోయారు. బాయికాడ్నించి ఇంటికొస్తూ బళ్ళమీద పోతున్న వాళ్ళని చూసి ఈసారేం గొడవ తెచ్చిపెట్టారో అని భయపడ్తూనే ఇంటికొచ్చింది. మౌనంగా ఉన్న అత్తగార్ని చూసి తుఫాను ముందు ప్రశాంతతలా అనుకుంది. రాత్రి భోజనాలయ్యి, పనులు చక్కబెట్టుకునొచ్చి అత్త దగ్గర నిద్రపోయిన కొడుకుని తీసుకోబోతే ‘ఆడు నా దగ్గరే ఉంటాడు’ అని కటువుగా అన్న అత్త మాటకి బెదురుకుంది. బిడ్డని పక్కలో వేసుకుని పొదివి పట్టుకుని పడుకున్నా రాత్రంతా కలత నిద్రే. పొద్దుగాల వంట చేస్తున్న రజితకి అంత దూరాన కూర్చుని ‘నా కొడుకే సచ్చాక నువ్వెందుకీడ, మీ మామ, బావలు కూడా ఇదే చెప్తున్రు. పంచాయతయ్యి పంపించకముందే మీ నాయన్నొచ్చి తీస్కపోమను’ అన్న అత్తవైపు వెర్రిగా చూసింది. భూమి కాజేయడానికి ఇది బావల పన్నాగమని అత్తకెలా అర్థం చేయించాలో అని బెంగ పడిరది.
అక్కడ్నించి రెణ్ణెల్లుగా ఎన్నో గొడవలు. ‘నా కొడుకు పిల్లలు, నా ఇంటి పిల్లలు. ఏడికెల్లో… వచ్చిందానివి నువ్వు. ఆడే సచ్చినాంక ఇక నువ్వెందుకీడ? అసలే వయసులో ఉన్నావు. పిల్లలు నాకాడే ఉంటారు. ఏం జేత్తవో, ఈడయితే ఉండనీకి లేదు నీకు. ఇంకెన్ని దినాలు గుంజుతవు. మీ నాయన్ని రమ్మను నిన్ను తోల్కబోనీకి…’ అంటూ అత్త వేధింపు ఎక్కువైంది. కొడుకుని తన దగ్గరకే రానియ్యట్లేదు. వాడు కూడా దూరం నుంచి చూస్తాడు. కళ్ళు మెరుస్తాయి. అంతలోనే జప్పున చల్లబడతాయి. దగ్గరికి రాడం మానేశాడు. ‘నాలుగేళ్ళ వాడి పసి మనసుకి ఏ విషం చేరిందో’ అనుకోడం తప్ప ఏం చెయ్యలేకపోతోంది. ఓ పక్క ప్రేమించిన భర్త పోయిన బాధ… మరో పక్క కొడుకు రాని దిగులు… ఇంకో పక్క సర్వస్వం ఇక్కడే అనుకొనొచ్చిన చోటు ‘నీది కాదు పొమ్మ’ంటుంటే దిక్కుతోచని గుబులు… అన్నిటికన్నా, తన వయసుని అనుమానిస్తోన్న అత్త మీద కోపం కాదు… జాలి!!
ఉంటున్న ఇంట్లోనే తనకీ నివాసపు హక్కు
ఉందని, పిల్లల సంరక్షణ హక్కు తనకుందని, ఆస్తి హక్కు ఉందని తెలుసు. పోరాడబోతే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహాయ వ్యవస్థలు తనకి మద్దతుంటాయని తెలుసు. ఐనా తను ఇవేవీ తెలియని అమాయకురాలైన, భర్తనీ కొడుకునీ పోగొట్టుకుని తీర్చలేని బాధ పడుతున్న అత్తతోనా పోరాడాలి!? లేక ఆ అత్తని ఇలా ప్రభావితం చేస్తున్న శక్తులతోనా తను తలపడా ల్సింది!? లేదా రెండువేపులా పదునున్న కత్తిలాంటి సామాజిక వ్యవస్థలతోనా తను తేల్చుకోవాల్సింది?? ఎటూ తేలని ఈ ఆలోచనలకి అంతులేకుండా పోయింది.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.