భైరవి
తొమ్మిది పదుల నిండుజీవితం గడిపి, రాగం, తానం పల్లవులను పదిలంగా మనకొదిలి తాను ప్రశాంతంగా కన్ను మూశారు డి.కె.పట్టమ్మాళ్. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంగీత కచేరీలు చేసిన తొలి మహిళ ఈ అలివేలు. తల్లి కాంతిమతే ఆమెకు తొలి గురువు. భక్తి రసం పొంగిపొరలే దీక్షితార్ కృతుల్ని తన్మయత్వంతో పాడినా… సుబ్రహ్మణ్యభారతి విరచిత దేశభక్తి గేయాలతో ప్రజల్లో చైతన్యం నింపినా… అది పట్టమ్మాళ్ గొంతుకే చెల్లింది. సంగీత కళానిధి నుంచీ పద్మవిభూషన్ వరకూ ఎన్నో గౌరవాలు ఆమెను చేరి తమను తాము గౌరవించుకున్నాయి. నిరూపమానమైన ఆ అద్భుత వ్యక్తితో కలిసి గడిపిన కొన్ని క్షణాలు… ఏ పూర్వజన్మ సుకృతాలో.
1993లో అనుకుంటాను… సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రదాన కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అకాడమీ ఫెలోషిిప్ తీసుకోవడానికి పట్టమ్మాళ్ హైదరాబాద్ వచ్చారు. అప్పటికి నేను బొడ్డూడని జర్నలిస్ట్‌ని. పట్టమ్మాళ్ అన్న పేరు రేడియోలో వినడం తప్ప ఆమె గురించి ఇంకేమీ తెలియదు. గూగుల్…వికిపీిడియా అందుబాటులో లేనప్పటికీ. అయినా సరే ఇంటర్వ్యూ చేస్తానంటూ ఉత్సాహంగా వెళ్లాను. హోటల్లో వారు బస చేసిన గది బయటే ఈశ్వరన్‌గారు అడ్డుపడ్డారు. నేలకు జానెడు లేవు…నువ్వు జర్నలిస్టువా..? అని సందేహాంగా చూశారు. గుర్తింపు కార్డు చూపించమన్నారు. అసలే అంత ప్రముఖ వ్యక్తిని కలవబోతున్నందుకు ఒకటే టెన్షన్‌గా వుంది. మధ్యలో ఈయన. ట్రైయినీనని చెప్పుకోవడానికి అహం అడ్డు. అమ్మగారి అభిమానినంటూ అందమైన ఆంగ్లంలో లొడలొడా నాలుగు మాటలు చెప్పేశాను. అంతకు రెండు నెలల క్రితమే సంగీతం నేర్చుకోవడం మొదలెట్టాను. అక్కడ రాగాల గురించి జరిగిన చర్చ అందుకు ఉపకరించింది. మా గొడవ వినిపించిదేమో లోపలినుంచి పట్టమ్మాళ్ బయటకు వచ్చారు. ‘ఇందాక ఫోను చేసింది నువ్వేనా…రామ్మా…’ అంటూ ఆప్యాయంగా చేయందించారు. నుదట పెద్ద బొట్టు..ముక్కుపుడక…సాగిన చెవి తమ్మెలకు వేలాడుతున్న ఏడు రాళ్ల పోగులు.. గోరింటాకుతో పండిన చేతులు..ముఖంలోని అణువణువునా ప్రతిఫలించే చిరునవ్వు…అమ్మమ్మ గుర్తొచ్చి ఒక్క క్షణం తత్తరపడ్డాను.
భుజం చుట్టూ చెయ్యేసి నన్ను తీసుకెళ్లి మంచం మీద తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు. పేరు అడిగారు. చెప్పాను. చక్కటి పేరు.. సంగీతం తెలుసా… అన్నారు. ఇప్పుడే నేర్చుకుంటున్నాని చెప్పాను. ‘నా మనవరాలిలాగా ఉన్నావు. మా నిత్యశ్రీ కూడా బాగా పాడుతుంది. నేర్చుకో.. మానవద్దు. సంగీతం ఆ పరమాత్ముడికి మనకు మధ్య వారధి..” అంటూ ఆశీర్వదించారు. ఇంటర్వ్యూ కొనసాగినంతసేపూ ప్రశ్నలకూ సమాధానాలిస్తూనే ఆప్యాయంగా నా భుజం మీద తట్టడం.. జుట్టు సవరదీయడం…అందమైన జుట్టు …ఫ్యాషన్ అని కత్తిరించకు…అని సలహా ఇచ్చిన ఆ గొంతు.. ఆ స్పర్శ …కర్ణాటక సంగీతంలో ధ్రువతారగా వెలుగొందిన ముగ్గురు విదుషీీమణుల్లో ఒకరివి. ఆ అదృష్టం అందిపుచ్చుకోవడానికి త..ప..మే..మి…చేసితివో… అని నాకు నేనే పాడుకుంటూ ఉంటాను. ఐదు నక్షత్రాల హోటల్లో ఒక ప్రఖ్యాత సంగీత కళాకారిణితో వృత్తిపరమైన ఇంటర్వ్యూలా గడవలేదా సమయం. పండక్కి పల్లెటూరెళ్లి అమ్మమ్మ ఒడిలో సేదదీరిన భావన. నా మనోపలకం మీద చెరగని జ్ఞాపకం. ఒకసారి కలుసుకుంటే మరిచిపోలేని వ్యక్తిత్వం ఆమెది.
ఆమెకు 1971లోనే పద్మభూషణ్ కూడా వచ్చింది. అలాంటిది 1993లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ రావడమేంటి?ఈ సందేహమే ఆమె ముందుంచితే..సంగీత నాటక అకాడమీ అవార్డుకూడా ఎప్పుడో నువ్వు పుట్టక ముందే వచ్చింది తల్లీ. ఆ అవార్డుకీ.. ఈ ఫెలోషిిప్‌కీ మధ్యలో ఎందుకో ముప్పయ్యేళ్ళు గడిచిపోయాయి మరి. అంటూ నవ్వుతూనే కొట్టి పడేశారామో. ఏ భాషలో పాడినా పదానికి అర్ధం తెలియందే పాడేవారు కాదట పట్టమ్మాళ్. కర్ణాటక సంగీతం ఎక్కువగానే తెలుగులోనే ఉందని, తెలుగు ఉచ్ఛారణ నేర్చుకునే ప్రయత్నం ఆమె తప్ప మరెవరూ చేసి ఉండరు. క్రమశిక్షణ, అంకితభావం..అన్న పదాలకు అర్ధం ఆమె ఆచరణలో చూపారు. ఏనాడూ పొద్దున్నే మూడున్నరకు లేచి సాధన చేయడం మానలేదు. పాట మనసు ఆమెకు తెలుసు. అందుకే దాని అర్ధాన్ని తన గొంతులో పలికించేవారామె. తనకన్నా చిన్నవారి గాత్రాన్ని పెద్ద మనసుతో మెచ్చుకోవడనాకి ఆమెకు ఎలాంటి అహమూ అడ్డు రాలేదు. తన స్వర కల్పనను సైతం పట్టమ్మాళ్ పాడారంటూ బాలమురళి ఎంత అబ్బురంగా చెప్పుకొంటారంటే…అది పట్టమ్మాళ్ గొప్పతనం.
”సంగీతాన్ని మొక్కుబడిగా నేర్చుకోవద్దు. సంప్రదాయానికి కట్టుబడి నేర్చుకోవాలి. గుర్తింపు కోసం…బహుమతులు ఆశించి నేర్చుకోవద్దు. నేర్చుకోవాలన్న తృష్ట తీర్చుకోవడానికి, అందులో సంతృప్తిని పొందడానికి నేర్చుకోవాలి. ఎంత మధురమైన గొంతైనా సాధన లేనిదే సంగీతం రాణించదు. నేర్చుకున్న దాంట్లో ఎప్పుడైతే మనం పర్‌ఫెక్షన్ సాధిస్తామో అప్పుడు గుర్తింపే మనను వెదుక్కుంటూ వస్తుంది… అంటూ ఔత్సాహికులకు అదరంగా సలహా ఇచ్చే పట్టమ్మాళ్ భక్తిరసమైన సంగీతం పాడుతూ తరించడమే తనకిష్టమన్నారు. అందుకే రాగాలతో ప్రయోగాలజోలికి ఆమె వెళ్ళలేదు. పట్టమ్మాళ్, ఈశ్వరన్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి మృదంగ కళాకారుడు. రెండో అబ్బాయి గాయకుడు.నిజానికి పట్టమ్మాళ్ అంత ప్రముఖ వ్యక్తిగా ఎదగడానికి వెనకాల చాలా నేపధ్యమే వుంది. స్వాతంత్య్రానికి పూర్వం బాలికలు చదువుకుని ఉద్యోగాలు చేయడానికి ఎన్ని పోరాటాలు చేయాల్సివచ్చిందో… అంతకన్నా ఎక్కువే చేసి వుంటారామె. ఆమెది సంగీత విద్వాంసుల కుటుంబం కాదు. ఐదేళ్ళకే చక్కగా గొంతు విప్పి పాడడం మొదలెట్టారు కానీ నేర్పెేందుకు సరైన గురువే ఆమెకు లభించలేదు. ఏదో తల్లి నేర్పితే నేర్చుకోవడమే. మళ్లీ ఆ నేర్చుకున్న విద్యను నలుగురి మధ్య ప్రదర్శించడం నిషేధం. ఆనాటి సంప్రదాయం ప్రకారం గురుకులానికి వెళ్లి నేర్చుకుందామంటే అక్కడ మహిళలకు ప్రవేశం లేదు. అయినా సరే సంగీతం ఆమెను, ఆమె సంగీతాన్నీ వీడలేదు. వయెలిన్, మృదంగాలు సహ వాయిద్యాలుగా ఒక్కసారి కూడా సాధన చేయకుండానే ఆమె వేదిక మీద తొలి కచేరీ చేశారు. ఈశ్వరన్‌గారితో వివాహం ఆమెకూ, ఆమె సంగీతానికి కూడా తోడూ నీడైందనవచ్చు. ఆ రోజుల్లో ప్రముఖ మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్ మణి అయ్యర్ మహిళల కచేరీకి వాయించడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటిది పట్టమ్మాళ్ పాడుతోంటే వాయించకుండా ఉండలేకపోయారాయన. ‘నా వియ్యపురాలైనందుకు కాదు.. సంగీతంలో విద్వాసురాలైనందుకు ఆమెకు సహకరించాను’ అన్నారాయన. ఆయన కుమార్తెనే పట్టమ్మాళ్ కుమారుడు వివాహమాడారు.
సోదరుడు జయరామన్, కోడలు లలిత, మనమరాలు నిత్యశ్రీ…వీరందరూ పట్టమ్మాళ్ శిష్యులే. ”సంగీతంలో ప్రత్యేక బాణీ అంటూ ఏమీ ఉండదు. మనదైన శైలి ఉండాలని లేనిపోని జిమ్మిక్కులు చేసే ప్రయత్నం మంచిది కాదు. లీనమై పాడాలి. నూటికి నూరు శాతం మనకోసం మనం పాడుకుంటేనే అలా లీనమవగలం. అప్పుడు బాణీ దానంతటదే వస్తుంది…’ అనేవారు పట్టమ్మాళ్ . అలా సాధన చేవారు కాబట్టే ఆమె విదుషీమణులైన త్రిమూర్తుల్లో ఒకరయ్యారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
పట్టమ్మాళ్ పాడిన మామవపట్టాభి (మణిరంగు రాగం) అనే కీర్తన చాలా బావుంటుంది. ఇతరత్రా మహాగాయకుడైన బాలమురళి ఇదే పాడినప్పుడు నాకంతగా నచ్చలేదు. కళాకారుల ప్రతిభ కేవలం వారి నైపుణ్యం, సామర్థ్యాలమీదనే కాక, వారి మానసిక ప్రవృత్తి మీద కూడా ఆధారపడుతుందని చాలా సందర్భాల్లో నాకనిపిస్తుంది. పట్టమ్మాళ్, మదురై మణిఅయ్యర్ తదితరుల గానం బావుండటానికి కారణం అదే.