రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ రంగ సమస్యలపై పనిచేయడానికి ఫిబ్రవరి 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్వతంత్ర వేదికగా ఏర్పడిరది. గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రామీణ, ఆదివాసీ ప్రాంత సమస్యలపై స్వతంత్రంగానూ, ఇతర
రైతు, వ్యవసాయ కూలీ, దళిత ఆదివాసీ సంఘాలతోనూ కలిసి నిరంతరాయంగా రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్‌వి) పనిచేస్తోంది. క్షేత్రస్థాయి విశ్లేషణ, విధానాల విశ్లేషణ ద్వారా సర్వత్రా నెలకొన్న వ్యవసాయ సంక్షోభానికి పరిష్కార మార్గాలను సూచిస్తూ వస్తోంది. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు ఆదాయ భద్రత, సహజ వనరులపై స్థానిక ప్రజలకే హక్కులు, పర్యావరణ హితమైన వ్యవసాయాన్ని ఇతర గ్రామీణ, అటవీ ప్రాంత జీవనోపాధులను ప్రోత్సహించడం, ప్రజలందరికీ అవసరమైనంత సురక్షిత, వైవిధ్యం గల పౌష్టిక ఆహారం, ఎటువంటి వివక్ష లేకుండా హక్కుగా అందేలా చూడడం అనేవి రైతు స్వరాజ్య వేదిక ఏర్పరచుకున్న నాలుగు మూల లక్ష్యాలు.
రైతు స్వరాజ్య వేదిక ఏర్పడి పది సంవత్సరాలు నిండిన సందర్భంగా మార్చి 20, 21 తేదీలలో రెండు రాష్ట్రాల ప్రతినిధులు శ్రేయోభిలాషులతో హైదరాబాద్‌లో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఈ దశాబ్ద కాల ప్రయాణంలో అనేక ప్రజా సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, యువతీ యువకులతో కలిసి పనిచేసింది. మార్చి 20వ తేదీన జరిగిన బహిరంగ సమావేశంలో 300 మందికి పైగా రైతులు, రైతులతో పనిచేసే కార్యకర్తలు, సౌహార్ద ప్రతినిధులు, మేధావులు, కళాకారులు,
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మహా సభల సందర్భంగా తమ సమస్యలను అందరి దృష్టికి తెచ్చారు. వారిలో రైతు ఆత్మహత్యల కుటుంబాలకు చెందిన మహిళలు, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు ఉన్నారు. మహాసభ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన పోస్టర్లు, బ్యానర్లు, నినాదాలు, మహిళా రైతు కటౌట్‌లు ఉత్తేజకరమైన వాతావరణాన్ని నెలకొల్పాయి. మీటింగ్ హాల్ బయటపెట్టిన రకరకాల స్టాళ్ళు పోస్టర్లు, పుస్తకాలు, నివేదికల రూపంలో ఎంతో విలువైన సమాచారాన్ని, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సేంద్రీయ ఉత్పత్తులను ప్రదర్శించాయి.
‘‘ఎగురుతోంది ఆర్‌ఎస్‌వి జెండా’’ అనే ఉత్తేజాన్ని నింపే పాటతో రైతులు ఆర్‌ఎస్‌వి జెండాను ఆవిష్కరించగా దశాబ్ది సభలు ప్రారంభమయ్యాయి. సభకు హాజరైన వారికి ఆహ్వానం పలుకుతూ అధ్యక్ష వర్గం తరపున కొండల్ సభకు హాజరైన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా వారి సంఘాల పేర్లతో సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆశాలత సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో ఢల్లీి రైతాంగ
ఉద్యమంలో ప్రాణాలొదిలిన, గత 20 ఏళ్ళుగా ఆత్మహత్య చేసుకున్న, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది రైతులకు, లాక్‌డౌన్ సమయంలో కాలి నడకన స్వంత గ్రామాలకు వెళ్తూ చనిపోయిన వలస కార్మికులకు, హక్కుల సాధనలోను, మతోన్మాదుల దాడులలోను ప్రాణాలను కోల్పోయిన హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులకు, కరోనా బారినపడి చనిపోయిన వారందరికీ ఆర్‌ఎస్‌వి సవినయంగా జోహార్లర్పించింది. తర్వాత విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి ఆర్‌ఎస్‌వి దశాబ్ద కాల ప్రస్థానంలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టవలసిన అంశాల గురించి నివేదిక ప్రవేశపెట్టారు. ప్రారంభ సమావేశం ముగింపులో భానుజ నిర్వహణలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల నుండి కె.సాగరిక, నూర్జహాన్‌లు కౌలు రైతులు మద్దయ్య, విజయ్‌లు తమ సమస్యలను తెలియచేస్తూ మాట్లాడారు.
ఆ తర్వాత జరిగిన మొదటి సెషన్‌లో వర్తమాన రైతాంగ ఉద్యమం గురించి వక్తలు కవిత కురుగంటి, ఎన్.వేణుగోపాల్, మీరా సంఘమిత్ర, శంకర్‌లు వివరంగా, విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన రైతు సంఘాల నాయకుల డెలిగేషన్‌లో సభ్యురాలైన కవిత మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ ఉద్యమం ఇప్పటికే విజయాన్ని సాధించిందనీ, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేవరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని, ఢల్లీి సరిహద్దులలో బైఠాయించిన రైతులు దీర్ఘకాల ప్రణాళికతో పాల్గొంటున్నారని వివరించారు. ఢల్లీిలో జరుగుతున్న చారిత్రాత్మక రైతాంగ పోరాటం బహుశా ఇప్పటివరకు జరిగిన పోరాటాలలో అత్యంత సుదీర్ఘమైనదని, ఇది ఇతర పోరాటాలన్నింటికీ ప్రేరణను కలిగిస్తున్నదని వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ అన్నారు. దేశంలో నేడు జరుగుతున్న ప్రజా ఉద్యమాలలో పితృస్వామ్య వ్యతిరేక, కుల వ్యతిరేక పోరాటాలను సమ్మిళితం చేసి అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధి మీరా సంఘమిత్ర చెప్పారు. దళిత బహుజన ఫ్రంట్ నాయకులు శంకర్ మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాల రద్దుకై సాగుతున్న దేశవ్యాప్త పోరాటంలో దళితులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఫీుభావాన్ని ప్రకటిస్తున్నారని చెప్పారు.
మధ్యాహ్నం సెషన్‌లో మూడు వ్యవసాయ చట్టాలు, భూమి`అటవీ హక్కులు, వాస్తవ సాగుదారులు, వాతావరణ అనుకూల ప్రకృతి వ్యవసాయం అనే నాలుగు అంశాలపై సభకు హాజరైన వారందరూ నాలుగు గ్రూపులుగా విడిపోయి చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని తీర్మానాలు, డిమాండ్‌ల రూపంలో సభముందుంచారు. ఈ నాలుగు అంశాలలోను మహిళా రైతులు, రైతు ఆత్మహత్య కుటుంబాలలోని మహిళలు, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు, దళితులు, ఆదివాసీల సమస్యలను అంతర్లీనంగా చర్చించారు. ఆయా గ్రూపుల చర్చలలో మహిళలు చాలా చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సాయంత్రం ‘‘పరిపాలన, మీడియాలో ఇటీవలి ధోరణులు`ఐక్య ఉద్యమాల ఆవశ్యకత’’ అనే అంశంపై జరిగిన మూడవ సెషన్‌కు డాక్టర్ రుక్మిణీరావు అధ్యక్షత వహించగా రైతు కూలీ ఉద్యమ నాయకుడు పి.ఎస్.అజయ్ కుమార్, అమోమత్ సొసైటీ అధినేత ఖలీదా పర్వీన్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి.సంధ్య ప్రసంగించారు. ప్రభుత్వాలకు మీడియా అమ్ముడుపోయిన నేటి పరిస్థితులలో మతోన్మాద దాడులు పెరిగిపోయి, ప్రశ్నించటమే నేరమైపోయి, ప్రజాస్వామిక కార్యకర్తలపై నిర్బంధం అమలు జరుగుతున్న పరిస్థితిలో సంఘాలు, సంస్థలు తమ వేర్వేరు అస్తిత్వాలను కాపాడుకుంటూనే విస్తృత అజెండాతో ఐక్యంగా కలిసి ఉద్యమాలు చేయటమే నేటి అవసరమని వక్తలు బలంగా నొక్కి చెప్పారు. మహాసభలకు ముందు జిల్లాలలో రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ రంగ సమస్యలపై ఇతర సంఘాల సభ్యులను కలుపుకొని సదస్సులు నిర్వహించింది. అనేక జిల్లాల్లో ఆర్‌ఎస్‌వి కార్యకర్తలు కళాశాలల్లో విద్యార్థులకు వ్యవసాయ రంగ సమస్యలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 150 మందికి పైగా ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఈ పోటీలలో చాలా ఆసక్తిగా పాల్గొని వివిధ అంశాల గురించి వివరమైన వ్యాసాలు రాశారు. సభలకు తయారీగా సాంస్కృతిక ప్రచార దళాలను ఏర్పరచడానికి రెండు రోజుల పాటు కళాకారులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆ ఉత్సాహంతో మొదటి రోజు ప్రారంభం నుండి చివరి వరకు కళాకారులు పాటలు, నృత్యాలు, నాటిక ప్రదర్శించారు.
ప్రతినిధుల సమావేశం: రెండవరోజు అంటే మార్చి 21వ తేదీన ప్రతినిధుల సమావేశం జరిగింది. అంతర్గత సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి జరిగిన ఈ సమావేశానికి దాదాపు 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా జిల్లాల వారీగా సమీక్ష జరిగింది. రెండు రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల బాధ్యులు తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల సారాంశాన్ని వివరించారు. అమెరికాలో ఉండి రైతుల కోసం పనిచేస్తున్న ‘ఐ ఫర్ ఫార్మర్స్’ సభ్యులు ఆన్‌లైన్‌లో పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్య కుటుంబాలతో పనిచేస్తున్న మెంటర్స్, అలాగే రైతుల కోసం పరుగు ద్వారా నిధులు పోగుచేస్తున్న రన్ ఫర్ ఫార్మర్స్ సంస్థల ప్రతినిధులు, ఇంకా అనేక ఇతర సంస్థల సభ్యులు, వ్యక్తులు కూడా రెండవ రోజు చర్చలలో పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యాచరణ: కార్యక్రమాల సమీక్ష తర్వాత భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండాలి అనే విషయంపై వివరమైన చర్చ జరిగింది. ఈ చర్చలో వచ్చిన సలహాల ఆధారంగా ఈ కింది అంశాలపై పనిచేయాలని నిర్ణయించి, ఒక్కొక్క అంశాన్నీ కార్యాచరణలో పెట్టడానికి వర్కింగ్ కమిటీలు ఏర్పాటయ్యాయి:
1. రెండు రాష్ట్రాలలో వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను సంఘటితపరిచి వారి హక్కుల కోసం పోరాడాలి.
2. కళాశాల విద్యార్థులకు రైతు సమస్యల గురించి వివరించి వారిని రైతాంగ ఉద్యమంలోకి తీసుకురావాలి.
3. పట్టణ వాసులకు కూడా రైతు సమస్యల పట్ల అవగాహన కల్పించాలి.
4. రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘాలను బలోపేతం చేయాలి.
5. పంటల కనీస మద్దతు ధర, రైతు బంధు, రైతు భీమా, వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకాల గురించి లోతైన అధ్యయనం చేసి అందులో లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి.
6. ఆదివాసి, దళిత, మహిళా రైతుల హక్కుల గురించి పోరాడాలి.
7. రైతు ఆత్మహత్య కుటుంబాలలోని మహిళలకు జీవనోపాధి గురించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సహకారం అందే విధంగా పనిచేయాలి.
8. AIKSCC (అఖిల భారత రైతాంగ పోరాట కమిటీ)లో భాగంగా జాతీయ రైతు ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనాలి.
9. ఆర్‌ఎస్‌వి చేపట్టే అన్ని కార్యక్రమాలలోను సామాజిక న్యాయం, కుల సమస్య, జెండర్ సమస్యల పట్ల అవగాహనతో పనిచేయాలి.
10. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు సాగించాలి (కౌలు రైతుల సమస్యలు, భూమి సమస్య, వ్యవసాయ కూలీల సమస్య, ఆదివాసుల సమస్యలు మొదలైనవి).
11. జిల్లాలలో కళాకారుల బృందంతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి.
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న రైతాంగ
ఉద్యమాన్ని అన్ని జిల్లాలలో ఉధృతం చేయాలని కూడా నిర్ణయం జరిగింది. దీనిలో భాగంగా మార్చి 23వ తేదీన షహీద్ దివస్, 26న జాతీయ రహదారుల రాస్తారోకో, ఏప్రిల్ 6న ఢల్లీిలో మిట్టి సత్యాగ్రహం ముగింపు కార్యక్రమంలో అన్ని గ్రామాల నుండి మట్టిని సేకరించి ఢల్లీికి పంపడం తదితర తక్షణ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం, ప్రణాళిక జరిగాయి. చివరగా, రెండు రాష్ట్రాలకు… ప్రతి జిల్లా నుండి ప్రతినిధులతో రాష్ట్ర కమిటీల ఏర్పాటుతో సమావేశం ఉత్సాహంగా ముగిసింది.