సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో కథ కూడా ఒకటి. గడిచిన ఘటనలనూ, అనుభూతులనూ, వ్యథలనూ, వేదనలనూ, సంబురాలనూ… ఒక్కటేమిటి దేన్నయినా సరే ఆకర్షణీయంగా మలచి సరికొత్త పరిమళాలను అద్ది మనస్సును హత్తుకునేలా చెప్పేదే కథ.
భూత భవిష్యత్ వర్తమాన సమాజాన్ని విభిన్న కోణాల్లోంచి కళ్ళముందుకు తెచ్చి చూపుతాయి కథలు. రచయిత్రి జీవిస్తున్న పరిసరాల ప్రతిబింబమే ఇప్పుడీ ‘బోల్డ్ Ê బ్యూటిఫుల్’ కథాసంకలనం. రచయిత్రి అపర్ణ తోట నేటితరపు ప్రతినిధి. ఆధునిక భావాలు, కొత్త ఆలోచనలు, సరికొత్త ఆకాంక్షలు గల బోల్డ్ Ê బ్యూటిఫుల్ అపర్ణ. పదిహేను కథలతో కూడిన తొలి కథా సంకలనం ఈ బోల్డ్ Ê బ్యూటిఫుల్. దీంట్లోని అనేక కథలు యువతుల జీవిత గమనాలను పరిచయం చేస్తూ వారి మానసిక ఆరాట పోరాటాలను పరిచయం చేస్తూ మనలను లోతుగా ఆలోచింపచేస్తాయి. అవును అపర్ణ ఒక దగ్గర బోల్డ్‌గా ఇలా అంటారు… ఎవరు చెపుతారు దీనికి సరైన సమాధానం. ‘గీత దాటకుండా జీవితాన్ని చక్కదిద్దుకొమ్మని సూచిస్తారు విజ్ఞులు. అయితే గీత గీసేదెవరో, దేనికోసమో తెలియకుండా బరిలోకి దిగడమెందుకో’ అంటూ విసుగూ, కోపంతో ప్రశ్నిస్తుంటుంది. ఒకవేళ గీతలోనే ఆడాలంటే మన గీత మనమే గీసుకోవాలంటారు. దానికోసం బరి దాటాలని కూడా అంటారు. వాప్‌ా! ఏమి తెగువ..!! ముమ్మాటికీ కళ్ళు తెరిపించే ఆలోచన. తనను తొలుస్తున్న ఆ ఆవేదనలోంచి, ఆ అశాంతిలోంచి, జవాబులు దొరకని ఆమె ప్రశ్నల్లోంచి పుట్టుకొచ్చిన పాత్రలే ఈ కథలనిండా కనిపిస్తాయి. ప్రేమ, పెళ్ళి, కుటుంబం అందరికీ కావాలి. కానీ, దాని వెనక అనాదిగా జరిగే దోపిడీని తివాచీ కిందే ఏమీ తెలియనట్లు దాచి పెడతామంటారు. నిజమే! ఈ విషయాల్లో ఆడవారికి ఛాయిస్ తక్కువే. అడిగేవారూ లేరు… ఇప్పుడీ అపర్ణ… తన కథల్లోని పాత్రల ద్వారా ఆ ప్రయత్నమే చేశారు.‘ఒక అతడు`ఒక ఆమె’లో ఒకే ఆఫీసులో పనిచేస్తున్న స్త్రీ, పురుషుల మధ్య జనించిన ఆకర్షణే ఈ కథ. పెళ్ళి అనే బంధంతో ఒకరిపై ఒకరికి ఆధిపత్యం పెరిగిపోవడాన్ని ఇష్టపడని ఆమె పెళ్ళిలోని మొనోటనీని బ్రేక్ చెయ్యాలనుకొని తన కొలీగ్‌తో హోటల్‌లో గడపడం, చివరకు తను చేసేది సరైందా కాదా అని సతమతమయ్యే… మానసిక సంఘర్షణ గురించి తెలియజేసేది.
‘పరిధి’ సమకాలీన ప్రపంచంలో తెలివిగా సంచరించే ఇద్దరమ్మాయిల జీవితాలను తెలియచేసేది. వారు ఇంటా, బయటా రకరకాల మనుష్యులను, సమస్యలను ఎదుర్కొంటూ నేర్పుగా పరిష్కరించుకొంటూ ముందుకెళ్ళే క్రమంలో మలచిన కథ. ‘ఇంటర్మిషన్’ కథలో ఓ చిన్న కుటుంబం. భార్యా, భర్తా, పిల్లలు… ఇద్దరూ తెలివైనవాళ్ళే, ఉద్యోగస్తులు కూడా. పిల్లలను చూసే బాధ్యత కేవలం స్త్రీలకు మాత్రమే, పిల్లల కోసం ఉద్యోగం చెయ్యొద్దనే నిబంధన పెట్టడం, ఆ విధంగా పనిష్మెంట్ ఆమెకి ఎందుకనే మానసిక వేదనలోంచి సృష్టించిన సున్నితమైన పాత్ర. ‘సూడోరియాలిటీస్’లో అపర్ణ ఓ పాత్రతో ఇలా అనిపిస్తారు ‘పేదవారు పేదవారుగానే ఉండిపోవడానికి డబ్బున్న వారి పాత్ర చాలానే ఉంటుంది’. అవును. ఇది ఎంత నిజమో కదా. లోతుగా ఆలోచించం కానీ అసలయిన కారణమే అది. బాత్రూమ్‌లు శుభ్రం చేసే వాళ్ళ పనితనం, వాళ్ళ జీవితం ఆకళింపు చేసుకొని తన హృదయం ద్రవించి ఆ వృత్తిని వదిలి.. చివరకు వేరే పని చేసేటట్లుగా ఆ పాత్రని అద్భుతంగా మలిచిన కథ.
చదువు అందరి పిల్లలకూ ఒకేలా ఒంటపట్టక పోవచ్చు. సాహిర్ ఒక చిన్న బాబు. చదువులో వెనకబడడం వల్ల అతని తల్లి పడే మానసిక సంఘర్షణ ఒకవైపు, పిల్లవాడ్ని చదివించడం తల్లిగా నీకు రావడం లేదని ఆమె భర్త ఎత్తి పొడవడం… లాంటివి నిత్యం ఎక్కడో చోట స్త్రీల మీద ఆరోపణలు చూస్తున్న విషయాలనే ‘ఆనాటి వాన చినుకులు’లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొన్ని పాత్రలు వెలిబుచ్చిన వేదనాపూరిత సంఘర్షణలను, భావనలను మార్పునకు అంగీకరించని ఈ సమాజం మూర్ఛిల్లుతుందనే… ఒకటి, రెండు కథలను సమీక్షించకుండా పాఠకులకే వదిలేశా. ‘‘చాలా కాలం పాటు లైంగిక సంబంధాలలో అసంతృప్తిని, హింసను, బాధను సూటిగా రాయలేకపోయారు రచయిత్రులు. వాటికి చాలా ముసుగులు వేసి, కొంత దాచి అవస్థలు పడ్డారు. కానీ ఇప్పటి రచయిత్రులు లైంగిక ప్రాధాన్యతల వ్యక్తీకరణ కూడా చేస్తున్నారు’’ అంటారు ఓల్గా గారు వారి ‘ముందు మాట’లో.
నిజమే… ఈ పుస్తకంలోని కొన్ని పాత్రలు ఆవేదనలను వెలిబుచ్చి అప్పటివరకూ కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించాయి.
ఇక ‘సూరిగాడి చదువు’ చిన్నపిల్లల మానసిక స్థితి గురించి, దౌలత్ చిన్నప్పటి ఇల్లు, గుట్ట, వాటితో ముడిపడిన జ్ఞాపకాల గురించి… ఒక్కటేమిటి… దీంట్లోని అన్ని కథలూ, వస్తు వైవిధ్యమూ, విలక్షణ శైలీ మేళవించే ఉంటాయి. జీవితాలను పరిశీలించదగ్గ నేర్పు, పరిపక్వత, సమాజాన్ని ప్రశ్నించే ధైర్యం కలిగిన అపర్ణ…ఇంకా ఇంకా బోల్డ్‌గానే రాయాలనుంది, నేను రాయాలనుకున్న దాంట్లో తక్కువే రాశాను అంటారు. నిజమే కదా! ఒక జాతి, ఒక ఆకాశం ఎన్నాళ్ళని అణగదొక్కబడతారు!? ఇంకెన్నాళ్ళని… దోపిడీని మౌనంగా సహిస్తారు. ఎప్పుడో ఒకసారి
ఉద్భేధించక మానరు. కొందరికి ఇదంతా వింతగా, కొత్తగానూ తోస్తుందేమో. కానీ దేన్నయినా మోస్తేనే కదా తెలుస్తుంది బరువూ, బాధా, వ్యధా, వేదనా… దిగకుండా గట్టుమీంచి అంచనా వెయ్యలేం! ఏది ఏమైనా ఈ బోల్డ్ Ê బ్యూటిఫుల్ పాఠకుల ఆదరణవల్లే రెండేళ్ళలోనే రెండవ ముద్రణకెళ్ళిందీ అంటే అర్థం చేసుకోవచ్చు పుస్తకం యొక్క తాఖత్ ఎంతుందో…!
మరిన్ని బోల్డ్ రచనలతో పాఠకుల్లో మరింత చైతన్యాన్ని నింపాలని కోరుకుంటూ… అపర్ణకు అభినందనలతో…!