కరోనా కథల్లోకి పోతే… -తిరునగరి దేవకీదేవి

కనీ వినీ ఎరగని సందర్భం. అనూహ్యమైన విలయం. ఒక ఊరు, ప్రాంతమే కాదు, పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మొత్తంగా ప్రపంచమే అతలాకుతలమైపోతున్నది. భయానక వాతావరణం… అభద్రత… సందిగ్ధత… సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ

మానవ జాతి కకావికలమౌతున్నది. యుగయుగాల పరిణామంలో సంఘజీవిగా ప్రపంచమే ఒక గూట్లోకి ఒదిగిపోయిన ఈ జాతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో అకస్మాత్తుగా పెనుమార్పులు సంభవించినై. కారణం కరోనా వైరస్‌. గతంలో కలరా, ప్లేగు, మశూచి, హెచ్‌.ఐ.వి., స్వైన్‌ ఫ్లూ, స్పానిష్‌ ఫ్లూ వంటి వ్యాధులు కూడా మనిషిని గడగడలాడిరచిన విషయం వాస్తవమే ఐనప్పటికీ ఈ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. అందుకే సామాజిక దూరం అనివార్యమైంది. స్వంత అవయవాలపై కూడా నియంత్రణ తప్పనిసరైంది. బడా పారిశ్రామికవేత్తలు మొదలుకొని కూలీనాలి చేసుకునే జనం భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. మరణాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భేదం లేకుండా పోయింది. మనిషి చావుకు, అనారోగ్యానికి, భయానికి, ఆందోళనకు వైరస్‌ ప్రత్యక్ష కారణమైనప్పటికీ ఆ సమస్యలకు పరోక్షమైన కారణాలెన్నో. లింగ, కుల, మత వివక్షలతో పాటు పెట్టుబడిదారీ విధానం వర్గభేదాలు కూడా వైరస్‌ను అవకాశంగా తీసుకొని మనిషి ఉనికికే ప్రమాదాన్ని తెచ్చి పెట్టినై. సంస్కృతీ సంప్రదాయాలతో పాటు విభిన్న కళారంగాలలో తన అభివ్యక్తిని చాటుకుంటూ ఎదిగిన మనిషి అవసరాలు, ఎంతోమంది ఉపాధి మార్గాలు వైరస్‌ కారణంగా వచ్చిన పరిణామాలూ, నిబంధనలూ ఆ ఉపాధులను నిర్వీర్యం చేసినవి. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ సమాజాన్ని స్తంభింపచేసింది. ఎవరికి వారు స్వీయ గృహనిర్బంధానికి గురయ్యారు. దేశమంతా ఇంటికే పరిమితమై ఉన్నా కరోనా వైరస్‌ వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలిసినా డాక్టర్లు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది కరోనా బాధితుల బాధ్యతను వహిస్తే, దేశం యావత్తును శుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు సిద్ధమయ్యారు. జనాన్ని సామాజిక దూరం పాటించేలా పరిమితి చేయడానికి పోలీసు శాఖ పూనుకుంది. మీడియా కూడా తన భయాందోళనలను దూరం పెట్టి తెగించి తిరుగుతూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు చేరవేసింది. ఈ రంగాల సేవలు వెల కట్టలేనివి. ఫలితంగా ఆ రంగాల
వాళ్ళు వైరస్‌ దాడికి బలయ్యారు. మరి కొందరిని చావూ వదలనంది.
ఆసియా ఖండం మొత్తం అసంఘటిత రంగాల పరిస్థితికి ముంబాయి నగరంలోని ధారావి పెద్ద సాక్ష్యం. అది పెద్ద స్లమ్‌ ఏరియానే కాదు కేవలం 1.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో సుమారు పది లక్షల మంది నివసించే ప్రాంతం. జనమంతా ఉపాధిని కోల్పోయి నాలుగు వేళ్ళు నోట్లోకి తీసుకుపోలేని పరిస్థితిలో సామాజిక దూరాలు… శానిటైజేషన్‌.. మాస్కులు.. ఇతరత్రా ఆరోగ్య సూత్రాల వంటి నిబంధనలను వాళ్ళ పరిమితులు తిరస్కరించినై. లాక్‌డౌన్‌ వలన పరిశ్రమలు, కంపెనీల నిర్మాణాలు, ఉత్పత్తి పనులు సమస్తం మూలనపడ్డాయి. దాంతో యజమానులకు కార్మికులతో అవసరం లేకుండా పోయి వాళ్ళను గాలికొదిలేసిన్రు. వండుకోవడానికి గింజలు లేక, ఉండడానికి కప్పు లేక సొంతూరుకు పోదామన్నా వాహన సౌకర్యం లేక వందలాది మైళ్ళ ప్రయాణానికి కాలినడకనే ఎంచుకోక తప్పలేదు. నెత్తిన మూట, కడుపులో బిడ్డ, చంకలో బిడ్డ, వేలు పట్టుకున్న మరో కొడుకుతో… దారి బత్తెం లేక ఆకలి దప్పుల చావులు… అనాథలైన బిడ్డలు, దారి చూపిస్తవనుకున్న రైలు పట్టాలు కొందరికి మృత్యు మార్గాలై… బరిబత్తె కాళ్ళతో శక్తిని మించిన నడక వల్ల తొవ్వంతా రక్తసిక్తమై… నడకలోనే ఋతుస్రావాలు, కాన్పులు… నడవ శక్తిలేక, సమయానికి తిండి లేక ఊపిరి ఆగిపోయిన సంఘటనలు… అత్యాచార యత్నాలు… అవయవాల దొంగిలింపులు ఎన్నెన్నో… హృదయవిదారక కన్నీటి దృశ్యాలు…
చేదునిజం, దుఃఖనది, బతుకు చెట్టు, పంచభూతాలు నవ్వుతున్నాయి. ఎంతెంత దూరం, ఈ పాపం దేనిది? కథలు. ఇంతటి విపత్తులో ప్రమాదం వల్ల కాలు పోగొట్టుకున్న తండ్రిని సైకిల్‌ ప్రయాణంగా ధైర్యంతో మనో నిబ్బరంతో స్వంతూరుకు చేర్చిన సంఘటనే ఆత్మస్థెర్యం, తీరం చేరిన లక్ష్యం కథలు. ఈ బాటసారులకు ఎన్నో ఆటంకాలు… మరెన్నో ఎదురు చూపులు… ఇల్లు చేరుకునే ఆరాటాలు. ఇవి పాదచారి కథ భద్రం చేసింది. ఈ సందర్భంలో ఎడారిలో ఒయాసిస్సులైన మానవత్వం పరిమళించిన సహాయక బృందాలే కాదు తమ పాడు బుద్ధిని బయట పెట్టుకున్న మృగాళ్ళూ ఉన్నారంటూ చెప్పుకొచ్చిన కథలే ఆకలి… కరోనా సమీక్ష.
మనిషి జీవితం సమస్త ప్రాణులకన్నా భిన్నమైనది. ఎన్నో తెలివితేటలు… మరెంతో విజ్ఞానం మనిషి సొత్తు. కానీ పశుపక్ష్యాదులకన్నా, మృగాలకన్నా లోభంపాలు మనిషికే ఎక్కువ. ప్రతి సంఘటనను, సందర్భాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. కరోనా కాలం దానికి మినహాయింపు కాలేదు. వ్యాపారస్తులు ప్రతి వస్తువు అమ్మకానికి కరోనాను అనుసంధానం చేస్తూ వచ్చిన్రు. కార్పొరేట్‌ దవాఖానాలు, చివరకు యూ ట్యూబ్‌లు కూడా ఆ పనే చేశాయి. ఇది ప్రజల మానసిక స్థితి మీద దాడి చేసే దోపిడీ. ఏ మాత్రం కనికరం లేకుండా వలస కార్మికురాలికి సాయం చేసే నెపంతో కిడ్నీని దొంగిలించిన ఓ వాస్తవిక సంఘటన కరోనా కౌగిట్లో మనీషా కథగా ఈ సంకలనంలో చేరింది. ప్రాణి ఉనికికి కేంద్రబిందువు స్త్రీ. ఆమె లేని మనుగడే లేదు. ఐనా పురుషస్వామ్యం వాళ్ళను ఉపయోగించుకున్నంతగా వాళ్ళ అసౌకర్యాలను పట్టించుకోదు. ముఖ్యంగా ఋతుస్రావాలను. ఈ సమస్య మహిళలను ఇబ్బంది పెట్టడమే కాదు ప్రాణాలను కూడా తీసింది. కొన్నిచోట్ల బాధితులు ఈ సమస్యలను స్వచ్ఛంద సంస్థల ముందుకు తీసుకువస్తే, మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్వయంగా అర్థం చేసుకొని వాళ్ళకు శానిటరీ పాడ్స్‌ అందించే పనికి పూనుకున్నై. ఆ వస్తువుతో వచ్చిన కథలే కరోనాకు భయపడి ఆ అవసరం ఆగేనా, కర్తవ్యం. అస్తమయం కథ మాత్రం దారిలో ఈడుకొచ్చిన పిల్ల చావుకు ఋతుస్రావం కారణమైందని చెప్తుంది. ఆత్మీయాలను హఠాత్తుగా కోల్పోయిన విషాదం కరోనా రక్కసి కోరలు కథనం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. పొద్దస్తమానం రైతు రెక్కలు ముక్కలు చేసుకుని జనం ఆకలి తీరుస్తాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో క్రమంగా పంటపొలాల స్థానంలో ఫ్యాక్టరీలు, అపార్టుమెంట్‌లు, భూకబ్జాలు వంటి అనేక కారణాలతో అమ్మబోతే అడవిగా భూములను అమ్ముకుని వలస పోక తప్పలేదు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పుణ్యాన తాము పొలాలను అమ్ముకున్న చోటనే కూలీలుగా చేరిన వాళ్ళూ ఉన్నారు. దేశం గాని దేశంలో ఊరు గాని ఊరులో జీవితాలను వెళ్ళబోసుకుంటున్న ఆ వలసలకు కరోనా ఉపద్రవం పెద్ద అశనిపాతమైంది. పలకరించే నాథుడు లేక కనీసం తాగేందుకు గంజి కూడా దొరకని దౌర్భాగ్య పరిస్థితిలో తిరిగి స్వంత గ్రామాలే అక్కున చేర్చుకున్నాయని చెప్పే కథలే పునర్జన్మ, కూటికుంటే కోటికున్నట్లే, శిశిర వసంతం, కరోనా సుగ్గి, ఏకాకి వలస. ఇక వలస పోకుండా పొలం పనులకు అంకితమై శాయశక్తులా కృషి చేసి పంట పండిరచినా కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల పేరిట పోలీసుల దాష్టీకం, మార్కెట్‌ మాయాజాలం, కుటుంబ అవసరాలు, బ్యాంక్‌ అప్పులు. వ్యవసాయదారుణ్ణి ఆత్మహత్య దిశగా నడిపించిన విధానాన్ని వివరించిన కథగా కరోనా సునామీ కాగా లాక్డౌన్‌ లోనూ పోలీసుల కంటబడకుండా సూర్యోదయానికి ముందునుండి సూర్యాస్తమయం వరకు పొలం పనులు చేయాల్సి వచ్చిన కథ తాళాలేయ వీలుకాని పొలాలు. ప్రభుత్వ లాక్‌డౌన్‌ ప్రకటనకు అనుకూలంగానో, అతిగానో వ్యవహరిస్తూ కొన్ని గ్రామాలు ఊరి పొలిమేరల్లో ముళ్ళకంచెలు నాటి పొరుగూరి జనాన్ని తమ గ్రామాలకు రాకుండా నిరోధించి కొత్త సమస్యలు సృష్టించిన గ్రామాలున్నాయంటూ ముళ్ళకంచె, కంచె కథలు సాక్ష్యంగా నిలిచినై. అసంఘటిత రంగానికి చెందిన మహిళ వలస ప్రయాణంలో అప్పుడే ప్రసవించిన బిడ్డను అనివార్యంగా అమ్ముకున్న ఉదంతం యాది మనసును ఛిన్నాభిన్నం చేయగా, తనను తాను సంభాళించుకున్న కథే ఊరట.
లాక్‌డౌన్‌లో వ్యాపారాలతో పాటు ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని సంస్థలు వేతనం లేని సెలవులిస్తూ ఊళ్ళకు పంపాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల విషయంలో ఏ విషయం తేల్చకుండా చేతులెత్తేసినై. దాంతో ప్రైవేటు ఉద్యోగస్తులంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. శ్రీ శ్రీ కవితలాగా ‘‘అటు చూస్తే బిడ్డల ఆకలి… ఇటు చూస్తే అప్పుల వాళ్ళు’’ అనే దశలో తమ హోదాలకు తిలోదకాలిచ్చి కూలో నాలో చేసుకోక తప్పలేదు. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకొన్నారని భయం భయం కథ చెప్తే జీవితాన్ని నిలబెడుతుందనుకున్న చదువు ఎందుకూ కొరగానిదవడంతో కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేక మనోవేదన చెందిన వాళ్ళే కాదు మనుగడ చాలించిన వాళ్ళున్నారని ఊహ కథ చెప్తుంది. కేవలం ఉద్యోగ సమస్యే కాదు… వరుస కరోనా సంఘటనలతో ఆర్థిక లోటుకు భయపడి ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకున్న కథ విధి విలాసం. లాక్‌డౌన్‌ మధ్య తరగతి కుటుంబాలనూ దెబ్బ తీసింది. సంపాదనా మార్గం లేక సాయం పొందడానికి హోదా అడ్డు తగిలి ఆత్మహత్యే శరణ్యమైన విషయాన్ని చెప్పిన కథ నువ్వే దిక్కు.
ఉపాధి కోల్పోని ఉద్యోగస్తులేమైనా సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఐ.టి. ఉద్యోగస్తులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఆఫీసులకుండే నిర్ణీత సమయాలు దారి తప్పినయ్‌. పని గంటల కాలం పెరిగింది. కంప్యూటర్‌, గోడలు తప్ప సహోద్యోగులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు, ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం అంతకన్నా లేదు. అంతా యాంత్రిక వాతావరణం. మహిళా ఉద్యోగినులది మరీ దీనమైన పరిస్థితి. పొద్దస్తమానం ఎదురుగా కనపడడంతో ఇంటిల్లిపాదీ చిరుతిండ్ల కోర్కెలకు రెక్కలొచ్చి ఆమె రెక్కలకే కాదు మనసుకూ విశ్రాంతి లేకుండా అయింది. మరోవైపు కార్పొరేట్‌ పాఠశాలలు లాక్‌డౌన్‌ సమయంలోనే ఆన్‌లైన్‌ తరగతులను మొదలు పెట్టడంతో ఆ సౌకర్యాన్ని, వాతావరణాన్ని పిల్లలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అయింది. దాంతో ఇండ్లే ఆఫీసులు, విద్యాలయాలు, చిరుతిండ్లందించే క్యాంటీన్ల అవతారమెత్తినాయంటూ రాసిన కథలే వర్క్‌ ఫ్రమ్‌ హోం, నడిచే యంత్రం, నాక్కొంచెం రెస్ట్‌ కావాలి, ఆదరువు లేని బతుకులు కాగా మనోస్థైర్యం తెచ్చుకుని అభిరుచికనుగుణంగా సాహితీ వ్యాపకంలో కాలం వెళ్ళబుచ్చిన కథ అనన్య. పొద్దస్తమానం పెళ్ళాలతో సేవ చేయించుకునే మగాళ్ళకు ఓ గుణపాఠం లాక్డౌన్‌ కథ. అసంఘటిత రంగాలలోనూ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్లుగా కొడుకు లాక్‌డౌన్‌లో చేతులు ముడుచుకుని కూర్చుంటే తల్లి సంపాదనకు సన్నద్ధమైందని చెప్పే కథ తల్లివేరు. నిర్మానుష్యమైన బయటి ప్రపంచాన్ని చూడగలిగినా వృద్ధులకు ఆఫీసుల, విద్యాలయాల అవతారమెత్తి టీవీ చూసుకునే అవకాశాన్ని పోగొట్టడంతో ఇళ్ళే జైళ్ళుగా తోచాయి. చాలామంది మానసిక ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు. గృహ హింస పెరిగింది. భార్యల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారిపై అత్యాచారాలు కొనసాగినై. అవాంఛిత గర్భాల సంఖ్య పెరిగింది. లాక్‌డౌన్‌ సడలింపులో అక్కడక్కడా బాల్య వివాహాల తంతు కూడా బాగానే కొనసాగింది.
ఆకస్మిక లాక్‌డౌన్‌ జనాల ప్రణాళికలను తారుమారు చేసింది. కుటుంబ సభ్యులను విడదీసింది. అత్యవసర ప్రయాణాలను రద్దు చేసింది. పెద్దవాళ్ళను పిల్లల నుండి విడదీసింది. యువతరం కాన్పులకు, కష్టాలకు పెద్దల అండ లేకుండా చేసింది. కాన్పు సమయంలో భర్త తోడు లేకుండా చేసిన సంఘటనలున్నాయని చెప్పిన కథ నిరీక్షణ. పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు అర్థాంతరంగా ఆగిపోయి మానసిక వ్యథకు లోనుచేసి మొత్తం కుటుంబాన్ని చావు దిశకు మళ్ళించిన విధానాన్ని వివరించిన కథ కుటుంబాన్ని కడతేర్చిన కరోనా. ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళు తమ స్వంత గూడు చేరుకోవడం గగనమైంది. అనారోగ్యాలు, చావుల సందర్భాలలో కూడా బంధు మిత్రుల ఆత్మీయుల పలకరింపులకు దూరమై ఆదుకునే వాళ్ళు లేక నానా యాతనలు పడ్డారు. కన్న తల్లిదండ్రుల పార్థివ దేహాన్ని కడసారి చూసి అంత్యక్రియలు చేయడాన్ని తిరస్కరించిన సంతాన రత్నాలూ ఉన్నాయి. రకరకాల అనుమానాలు, సందేహాలు, భయాలు కొందరిని మానసికంగా కుంగదీశాయి. మరి కొందరిని చావు దిశకు మళ్ళించాయి. మొత్తంగా కరోనా కాలం మనిషి మానవత్వాన్ని అంచనా వేయగల్గిన ఓ కొలమానమైంది. కొందరు కరోనా కాలాన్ని స్వంత ప్రయోజనాలుగా మలుచుకుంటే, మానవతా దృక్పథంతో వాళ్ళకు సాయం చేసిన వాళ్ళున్నారు. అందులో డాక్టర్లు, పోలీసులు, చదువు చెప్పే పంతుళ్ళతో పాటు అసంఘటిత రంగ కార్మికులూ ఉన్నారని చెప్పే కథలే మాయని మానవత్వం, మరువని విలువలు, కాశీపతి మాస్టారు, నక్షత్ర నేత్రాలు, కరోనా తెచ్చిన మార్పు. ఇక వలస కార్మికులకు సాయం చేయడంలో ప్రణాళిక వేసుకున్న విధానాన్ని వివరించిన కథ వితరణ. ఇంట్లో ఆర్థిక స్వాతంత్య్రం లేకపోయినా వలస కార్మికులకు సాయపడే ప్రయత్నం చేసిన ఉదంతం సంచరిస్తూ సంచలిస్తూ కథలో చూడొచ్చు. గ్రామం బాగోగులనాశించి ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేసి తగిన నిబంధనలు ఏర్పాటు చేసుకున్న కథ కాలపరీక్ష.
విధి విచిత్రమైంది, బలీయమైంది కూడా. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రపంచం కొన్నిసార్లు అందర్నీ అదే బాటలో నడువమంటుంది. అనివార్యం చేస్తుంది కూడా. లాక్‌డౌన్‌ కారణంగా ఊరు దాటడం కాదు కదా… ఇల్లు దాటడమూ నేరం కావడంతో ఆత్మీయుల కడసారి చూపులకు నోచుకోని, ఒకప్పుడు లగ్జరీ అనుకున్న స్మార్ట్‌ఫోన్‌ కనీసావసరమైన వేళనే కరోనా కోరిక. ఆ కోరికలోనూ న్యాయం లేకపోలేదు. కొడుకు అంత్యక్రియలు నిర్వర్తించడం కాదు కదా, కనీసం పార్థివ దేహాన్ని చూడలేని దీనస్థితిని బలి కథ చెప్తుంది. ఒకవైపు కరోనా వైరస్‌ ప్రజలను ఊపిరాడలేని పరిస్థితికి తీసుకొస్తే మరోవైపు ప్రభుత్వ విధానాలు దిగ్భ్రాంతిని కలిగించే విధంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్‌ ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇవాంక భారత పర్యటనను సజావుగా జరిపించడం, మర్కజ్‌ సమావేశానికి అనుమతినివ్వడం ప్రభుత్వం కొరివితో తలగోక్కున్నట్లు చేసింది. ఈ విదేశీ యానాలు జరగకపోయుంటే మన దేశ పరిస్థితి మరో విధంగా ఉండేదేమో! ప్రభుత్వం చేతులు కాలినంక ఆకులు పట్టుకుంది. వైరస్‌ ప్రబలడానికి ముస్లింలే కారణమన్న మత తత్వవాదానికి తెర లేపింది. ఇంతా చేసి ఆకస్మిక లాక్‌డౌన్‌ విధించి సమాజాన్ని స్తంభింపచేసి ఎన్నెన్నో అవాంతరాలకు కారణమైంది. పుండు మీద పుట్రలా తరతరాలుగా హిందూ మతతత్వ వాదులచే వివక్షకు, ఈసడిరపులకు గురవుతున్న ముస్లింలను ఈ అపవాదు ఎంతో క్షోభకు గురిచేసింది. వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసింది. ఆర్థిక స్థితిగతులను మరింత దెబ్బతీసింది. ఈ కారణాలు భూమికగా పరిందా, అపనమ్మకం, తీరని సమస్య, హద్దులు చెరిగిన వేళ, పాజిటివ్‌ ప్రపంచం కథలు. కరోనా కల్పించిన ప్రమాదాలను వివరించిన కథ బాబోయ్‌ కోవిడ్‌`19.
మొదటి దశ లాక్‌డౌన్‌లో మద్యం బానిసలు మానసిక వత్తిడికి గురైనా క్రమంగా ఆ మద్యం వ్యసనానికి దూరం కాగలరేమో అనుకునే దశలో ప్రభుత్వం ఆ వ్యాపారానికి పచ్చ జెండా ఊపి సామాజిక దూరం పాటించాలన్న నిబంధనకు నీళ్ళొదలడానికి కారణమై, ఎంతో కొంత మద్యం వ్యసనానికి దూరమైన మందుబాబుల చిందులకు, ప్రమాదాలకు, చావులకు కారణమైనవంటూ చెప్పుకొచ్చిన కథలు గౌరమ్మ కథ, భయం, నీటి బుడగ జీవితం. కాశీపతి మాస్టారులోనూ ఈ ప్రస్తావన ఉంది. సామాజిక సంబంధాలు కూడదన్న నిబంధన పిల్లల చదువులను అయోమయం చేసింది. యూనివర్శిటీ విద్యార్థిని మనోవ్యథను క్యాంపస్‌, పాఠశాల విద్యార్థుల బాధను పలక దుఃఖం, అసైన్డ్‌ చదువుల ప్రహసనాన్ని శిన్నపానం చదువులను గమనించవచ్చు. రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది సేవలను కథ కాని కథ, రంగయ్య కథలు వివరిస్తే, అనారోగ్యంలో ఆస్పత్రికి పోలేక క్లినిక్‌లను నమ్ముకొని నానా అగచాట్లు పడి గట్టెక్కిన విధానం భూమ్మీద కొన్ని నూకలు మిగిలుండొచ్చు. అత్యవసర వేళ కథనం, జిల్లేడుకాయ కథ కూడా బంధుమిత్రుల అనారోగ్యాల్లో అగచాట్లను వివరించేవే. సమాజం తీరు వింతైనది. సమస్యలను, పరిష్కారాలను తమకు అనుగుణంగా ఉండాలని ఆలోచిస్తుంది. ఆ పరిస్థితి కొన్నిసార్లు అధికారులను, పాలకులను ఇరకాటాన పెడుతుందని చెప్పే కథనం నేనో విషాద కావ్యాన్ని.
పరిస్థితులు బంధాలను విడదీయనూ వచ్చు, కలుపవచ్చు కూడా. లాక్‌డౌన్‌ కాలం ఆ పనే చేసింది. కోడళ్ళకు అత్తగార్ల పట్ల సుహృద్భావం కల్గించాయని చెప్పే కథలే మేము కాదు మనం, మీకు నేను నాకు మీరు, గృహాలయం. అవసరం మనిషిని మార్చిన ఉదంతం క్వారంటైన్‌ కథ ముందుకు తెస్తుంది. ఆ అవసరమే తెగిన బంధాలను కలిపిన కథ ఆపద్ధర్మం. ఎంతో కొంత స్వార్థమున్నా కొందరిని వివేకం తట్టి లేపడంతో మనిషిలో పరివర్తనం వస్తుందని చెప్పే కథలే అసతోమాసద్గమయా, మనస్సాక్షి. కుటుంబ బంధాలూ తమాషాగానే ఉంటాయి. ఆతిథ్యం ఇచ్చేవాళ్ళలోనూ, పుచ్చుకునే వాళ్ళలోనూ సజావుగా ఉండటమనేది ఆర్థికతపై ఆధారపడి ఉంటుందని, కొన్నిసార్లు కూతుర్లూ అతిథులుగా భారమౌతారని సందేశమిచ్చే కథ గృహలక్ష్మి కాగా, ఆతిథ్యం ఇచ్చేవాళ్లున్నా ఎక్కువ రోజులు భరించడం పుచ్చుకునే వాళ్ళకుండదు. ఎంతైనా స్వంతిల్లే స్వర్గసీమ కదా! ఈ ప్రస్తావన అదృశ్య గురువులో చూడొచ్చు. కుటుంబాలు ఎస్కలేటర్‌ మెట్లలాంటివి. పిల్లలకు తల్లిదండ్రులతో సంబంధం క్రమంగా సన్నగిల్లి తన పిల్లలతో బలపడి వాళ్ళకోసం ఆరాటపడడం సహజమనే సన్నివేశాన్ని చూపించిన కథ కరోనా చేసిన కల్లోలం. కనిపెంచిన తల్లిదండ్రులను కూడా లాభనష్టాల బేరీజు వేసుకుని ఆశ్రయమిస్తారని చెప్పే కథే నడక యాతన.
కరోనా చావులు చాలామందిని భయాందోళనలకు గురిచేశాయి. పక్కవాళ్ళ చావును చూసి మావాళ్ళో నేనే చస్తే…? అన్న ఆలోచనలతో, ఊహతో వణికిపోయిన వాళ్ళకు సాక్ష్యం ప్రార్థన కథ. ఆ కష్టం ఎదురైనా సంయమనం తెచ్చుకొని పెద్దలు పిల్లలకు అండగా ఉండి తీరాలని స్థైర్యాన్ని తెచ్చుకునే వారుంటారని మళ్ళీ చిగురించాలి కథ సందేశం. ఇక కరోనా సృష్టించిన సమస్యలనేకమని చెప్పిన కథ బహు ముఖాల కరోనా కాగా సమిష్టి కుటుంబాల ప్రస్తావన తెచ్చిన కథ పాత బతుకులు ` కొత్త పాఠాలు. పుండు మీద పుట్రలా లాక్‌డౌన్‌ కాలంలోనే పాలిమర్‌ గ్యాస్‌ లీకేజి కారణంగా ఆ ప్రాంత జనం ఇక్కట్లను వివరించిన కథనం పాలిమర్స్‌ లీకేజి`ఇన్‌స్టెంట్‌ జస్టిస్‌.
ఈ సంకలనంలో రచయిత్రుల కథనాలు వివిధాలుగా ఉన్నాయి. అవి విన్నవి, కన్నవి, ఊహించినవి, ఆశించినవి. నాలుగు గోడల మధ్య నలుగురు, లాక్‌డౌన్‌ డైరీ, లాక్‌డౌన్‌లోనూ మనసుల ఘోష, కరోనా కష్టాలు, నెత్తుటి అడుగుల తొవ్వ, ఏకాకి వలస, ఈ పాపం (శాపం) ఎవరిది?, కరోనా కష్టాలు ఇంతింత కాదయా, కరుణ చూపే కళ్ళు మొదలైన కథనాలు సమాజంలో జరుగుతున్న సన్నివేశాలకు కల్పన జోడిస్తే… కరోనా వలస కూలీల వ్యథలు, కంటికి కనపడని వైరస్‌, ఎంతెంత దూరం, లాక్‌డౌన్‌ సమయంలో మొదలైన కథనాలు జరుగుతున్న వాస్తవాలకు పరిష్కార మార్గాలతో పాటు ప్రభుత్వ విధానంలోని లోటుపాట్లను కథనం చేస్తాయి. కరోనా కల్లోల సమయంలో… మాత్రం స్వీయ అనుభవానికి సంబంధించినది. కరోనా సమాచారంతో పాటు సమాజానికి మనోధైర్యం ఇచ్చేదని చెప్పిన కళ్ళు తెరిపించిన కరోనా ` వలస కార్మికులు, ఇదేం బతుకు? కథనాలు రచయిత్రి మానసికావస్థకు సంబంధించిన స్వగతాలు. కరోనా కుచ్‌ నహీ కర్‌నా మనిషి విధివిధానాలపై రాసిన కథనం.
కథలలో రచయిత్రులు ప్రస్తావించిన సేవా సంస్థలు వాస్తవ సంఘటనలకు కల్పితాలు కాగా కె.సత్యవతి రాసిన కథనాలు ఆమె స్వంత అనుభవాలు. అందులో చిట్ట చివరి మనిషి ఎప్పుడొస్తాడు? కథనం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వలస కార్మికులకు రైలు టికెట్‌ బుక్‌ అయ్యేవరకు ఆశ్రయం కల్పించే దిశలో చేసిన కృషికి సంబంధించినది. మనిషితనం పరిమళించిన మేడ్చల్‌ ఫుడ్‌ Ê ట్రావెల్‌ క్యాంపు కథనం ఆమె స్వయంగా సన్నద్ధమై ఎంతోమందిని కూడగట్టుకుని ఎంతో శ్రమకోర్చి క్యాంపును ఏర్పాటు చేసి వలస కార్మికులను వాళ్ళ ఊళ్ళకు పంపడానికి పడ్డ కృషికి సంబంధించినది. ఆమెకు పరిచయమైన ట్రాన్స్‌ జెండర్స్‌ తమ సమాజం కోసం చేసిన కృషిని కరోనా కష్టకాలంలో సమంత సాహసం కథనం.
వలస వెనక్కి, ప్రమాదపుటంచుల్లో ఉన్నామా, జర జాగ్రత్త, దేశం ముంగిట కరోనా ఉపద్రవం కథనాలు విలేకరి అనుభవంలోని సంఘటనలకు జోడిరచిన ఆలోచనలు. కథలు, కథనాలు ఏమైనా వైరస్‌కన్నా ఆ వాతావరణం అనేక సమస్యలను సృష్టించిందనేది వాస్తవం. ముఖ్యంగా భయం ఎన్నో చావులకు కారణమైంది. ఇలా ఈ సంకలనం కరోనా పరిస్థితులలోని అనేక కోణాలను, వాస్తవాలను ఆవిష్కరించింది. మొత్తంగా ఇంతకు మించిన పరిస్థితులు ఉండవేమో అన్నంతగా రచయిత్రుల కలాలు కదిలినై. ఏమైనా సామాజిక, ఆర్థిక పరిస్థితులను పట్టుకోవడం వాళ్ళకు సాధ్యం కూడా. కొన్ని కథలు ప్రశ్నలను సంధిస్తే, మరికొన్ని పరిష్కారాన్ని చూపినై, ఇంకొన్ని సమాచారాన్నిచ్చినై. అయినా కథల్లోని తాత్వికతను చర్చించాల్సిన అవసరం మిగిలే ఉంది.
ఈ సంకలనం తేవడానికి సహకరించిన రచయిత్రులకు అభినందనలు! ధన్యవాదాలు!!

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.