కాళీపట్నం రామారావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. లెక్కల మాస్టారు. ఆయన అలా వృత్తికే పరిమితమవలేదు. ప్రవృత్తి అయిన కధాసాహిత్యంలో కూడా బోధకులయినారు. తాను గొప్ప కధలు రాయడమే కాక అనేకమంది కధకులకు ప్రత్యక్ష, పరోక్ష బోధకుడయ్యాడు.
కథ అంటే ఏమిటి? వస్తు, శిల్పాలు గురించిన విశేషాలూ, పాత్రలు, పాత్రల పేర్లు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎరుకను కలుగచేసేందుకు ‘కధాకధనం’ వ్యాససంపుటిని ప్రచురించారు. అంచేతనే తెలుగు కధకులందరూ ఆయన్ని మాస్టారూ అని గౌరవంగా, ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన నియమబద్ధంగా, నిబద్ధతతో జీవించారు. ఏదైనా పాఠకునికి ఎరుక చేయాల్సిన విశేషం ఉంటేనే కథ రాయాలి తప్ప, పాఠకుని రంజింపచేయడానికి రాయకూడదనేవారు. అలా ఎరుక చేయాలన్నది ఏదీ తనకే ఎరుక కాలేదనుకున్నారేమో విరమించారు. రచన విరమించారే కానీ కధావరణంలోంచి నిష్క్రమించలేదు. నిత్యం కథతో జీవించారు. కధకులతో నిత్యసంభాషణలో ఉన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులయ్యారు గానీ విశ్రాంత రచయిత కాలేదు.
వారి జీవితంలానే వారి కథలు కూడా జీవన గణితబోధినిల్లా ఉంటాయి. జీవితాన్ని ఎక్కడ, ఎప్పుడు కోల్పోయామో దశలవారీగా వివరిస్తాయి. జీవితాన్ని చక్కదిద్దుకునే దోవయేదో వెదుక్కోమంటాయి. లోకపు ‘ప్లాటుఫారం’ (మాస్టారి తొలి కథ) మీద బతుకుబండికి పచ్చజెండా ఊపుతాయి కాళీపట్నం కథలు! జీవితాల్ని ఆడిరచే శక్తులేవో, ఆ శక్తుల ‘కుట్ర’లెటువంటివో ఎరుకపరుస్తాయి. జీవితంలో ఏది తెలియక పాఠకుడు సతమతమవుతున్నాడో, ఏది ఎరుకగాక జీవితాన్ని ఉన్నతీకరించుకోలేక పోతున్నాడో దానిని ఎరుక చేసే ‘సంకల్పం’తో మాస్టారు కథలు రాశారు. మాస్టారు తొలినాళ్ళలో వ్యక్తుల చుట్టూ, కుటుంబాల చుట్టూ ఉండే అనేక సంఘటనలను కధనం చేసినా, రాన్రానూ బయటపడ్డారు. ఆ కథలు మరింతగా పాఠకుల మనోవేదనను పెంచేవి తప్ప, పాఠకునిలో ఆలోచనలు రగిలించేవి కావనీ, అంచేత అలాంటి కథలు రాయడం మానుకున్నారు. పాఠకుని చైతన్యపరచే కథలు రాయగలిగేదాకా విరామం తీసుకున్నారు. ఆ తర్వాత రాసిన కథలతో కధాసాహిత్య దీపధారి అయ్యారు.
దేవుళ్ళ మహత్యాలూ, రాజుల వీరత్వాలే వస్తువులయిన ప్రాచీన కథకు ఆధునిక వర్తమాన జీవితాన్ని వస్తువును జేసి, ప్రభువుల భాషకు బదులు ప్రజల భాషకు పట్టం గట్టి గురజాడ కథను నడిపిస్తే… నడిచి నడిచి కథ అగ్రవర్ణ మండువాల్లో ఆగిపోయింది. అక్కడ ఆగిన ఆ కథను చాసోగారూ, రావిశాస్త్రి గారూ ప్రయత్నించి మండువాల నుంచి వీధిలోకీ, బజారులోకీ నడిపిస్తే, అక్కడ నుంచి కాళీపట్నం రామారావు మాస్టారు పేదల గుడిసెలకు, దళితవాడలకు, వీధుల్లోకీ, పంచాయతీ మండపాలకీ, పొలాలకీ నడిపించారు.
కారా సాహిత్యమ్మీద జరిగినంత చర్చ తెలుగు కథకుల్లో మరే కధకుడి మీదా జరగలేదు. కారాని మార్క్సిస్టని కొందరూ, కాదూ గాంధేయవాది అని మరికొందరూ, శిల్పం అనేది ఉండదని కొందరూ, గుప్తమే శిల్పమని ఇంకొందరూ, ‘యజ్ఞం’ రాసిన్నాడు సీతారాముడు అనీ, కధానిలయం నిర్మించాక అప్పల్రాముడు అనీ… ఇలా కారా సాహిత్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ వ్యాఖ్యానించింది లోకం!
తెలుగు సాహిత్యకారుల్లో అరుదైన సాహిత్య వ్యక్తిత్వం కారా మాస్టారిది. ఏ ఉద్దేశంతో ఓ విమర్శకుడు కారా మాస్టారిని ‘యజ్ఞం’ కథలోని అప్పల్రాముడు, సీతారాముడు పాత్రలతో పోల్చాడో గానీ ఒకరకంగా అది నిజమే! మాస్టారు ఎల్లప్పుడూ వ్యక్తిగా అప్పల్రాముడు, రచయితగా సీతారాముడు. యజ్ఞం కథలోని అప్పల్రాముడు సౌమ్యుడు. సమాజ నియమాలను, సమాజాన్ని నడిపే పెద్దల నిర్ణయాలనూ గౌరవించే వ్యక్తి. సీతారాముడు ఉద్రేకి. సమాజ నియమాలూ, సమాజాన్ని నడిపే పెద్దలూ న్యాయబద్ధంగా ఉంటేనే గౌరవిస్తాడు, లేదంటే తిరస్కరిస్తాడు. లోకం ఏమనుకుంటుందో అని సంశయించడు.
లోకం నివ్వెరబోయినా, నిష్ఠురమాడినా నిప్పులాంటి నిజాల మూటల్ని విప్పుతాడు. లోకానికి ఆలోచనలనందిస్తాడు. లోకం నివ్వెరబోయే వ్యక్తిత్వం సీతారాముడిది. సరిగ్గా ఈ లక్షణాలు కాళీపట్నం అన్ని రచనల్లోనూ (మలి దశలో రాసిన), చివరిగా రాసిన ‘సంకల్పం’, ‘అన్నెమ్మనాయురాలు’ కథల్లోనూ కన్పిస్తాయి. వ్యక్తిగా కారా మాస్టారిలో కన్పించే సౌమ్యత, లోకమేమను కుంటుందో అనే సంశయాత్మకత లోకానికి తెలిసిందే. ఏ సందర్భంలోనూ నోరు విప్పి తనదయిన అభిప్రాయాలను చెప్పలేదు, చెప్పాల్సిన సందర్భాల్లో నోటిలో కిళ్ళీని కుక్కేసుకునేవాడు. కానీ రచయితగా లోకానికి ఎరుక చేయాల్సిన అంశాల దగ్గరకు వస్తే కుండబద్దలు కొట్టాడు. దళితవాడలో అంతకుముందెవ్వరూ నడవని బాటలోకి సీతారాముడు నడచినట్టు కారామాస్టారు రచయితగా సాహిత్యావరణంలో కొత్తబాట నడిచాడు.
అందరూ కతలు చెప్తారు. కానీ కతల్లో బతుకువెతల్ని చూపడమే గాక, ఆ వెతలకు కారణాల్నీ, వాట్ని తీర్చే దోవల్నీ ఎరుకపరచడం కొందరే చెప్తారు. కూటికీ, గుడ్డకీ, తలదాచుకునే గూడుకీ మనుషులు వెదుకులాడుకుంటారు. ఆ వెదుకులాటలోని దుఃఖాన్నీ, దౌర్భాగ్యాన్నీ ‘ఆర్తి’తో కథలు రాసినవారు కాళీపట్నం రామారావు. పిల్లలు తయారు చేసిన అట్టముక్కల మీద కధే (తీర్పు కత) కావచ్చు గానీ ఉత్తత్పి చేసేవాడికే పంపిణీ చేసే అధికారముండాలనే ‘తీర్పు’ చెప్పి మార్క్సిస్టు ఉత్పత్తి సంబంధాలని ఆ కథలో యెరుకపరిచారు. ప్రభువుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదులే, యిక చెల్లదులే అన్నట్టుగా కష్టజీవులకొక సంస్కృతి
ఉంటుందని ‘చావు’ పుట్టుకల దగ్గర బడుగుజీవుల బతుకు తీరుని వెలుగురేఖలుగా చూపారు ‘చావు’ కథలో. అభివృద్ధి పేరుమీద జరిగే ఏలినవారి యజ్ఞాలెవరికి మేలు చేస్తాయో, ఎవరిని బలి తీసుకుంటాయో ఊరందరికీ కళ్ళకు గట్టినట్టు పంచాయతీ మండపమ్మీద ఒలికిన బాలుడి నెత్తురు ఇప్పటికీ పచ్చిగా కనబడుతూనే ఉంది మాస్టారూ అంటోంది తెలుగు సమాజం. మనుషులు గూడు లేక ‘నో రూమ్’ అని బాధపడుతుంటే పట్టించుకోని ఏలికల లోకంలో, తనకొక గూడు లేకపోయినా మనుషుల బతుకు చిత్రాల కధలకు గూడు ‘కథానిలయం’ నిర్మించారు కాళీపట్నం వారు. కంచికి కథలు వెళ్ళేవో లేదో తెలీదు గానీ కధలన్నీ నేడు ‘కథానిలయం’ గూటికి చేరుతున్నాయి.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న శతకకారుని పద్యపాదాన్ని ఉదహరిస్తూ రావిశాస్త్రి గారు, కాళీపట్నం రామారావు గారి గురించి చెప్పిన మాటలు అక్షరసత్యాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం, విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఋణం తీర్చాలని లోకులు చెప్తే దానికి అదనంగా సామాజిక ఋణం చేర్చారు. మన శ్రమ లేకుండా సకలం అమర్చే సమాజ ఋణం తీర్చాలని చెప్పినవాడు కాళీపట్నం. అలా చెప్పిన ప్రకారం బహుశా అన్ని ఋణాలూ తీర్చిన వాడు మాస్టారు. మాస్టారికే సమాజం ఋణపడి ఉందేమో. పుణ్యపురుషుల కాలంలో నెలకు మూడు వర్షాలు పడ్డాయో లేదో తెలీదుగానీ కాళీపట్నం కృషి వలన కథల పంట మూడుపూలూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. మాస్టారు పుణ్య పురుషులు మాత్రమే కాదు గొప్ప కథకులు. కథకు చిరునామా కాళీపట్నం!
‘జీవధార’ కొరకు వేసారిన మనుషులు, ‘యజ్ఞం’లో సమిధలైన మనుషులు, ‘శాంతి’కై పోరాడే మనుషులు, ‘ఆదివారం’ సెలవు కోరే పనివాళ్ళు, ‘కుట్ర’ కేసులనెదుర్కొన్న ప్రజాస్వామికవాదులు, ‘అన్నెమ్మనాయురాళ్ళు, అప్పల్రాముళ్ళు, సీతారాముళ్ళు… వీరంతా కారా మాస్టారి ‘సంకల్పం’తో పుట్టిన పాత్రలు మాత్రమే కాదు, చీమూ నెత్తురు నిండిన నిజమయిన మనుషులు. మనుషులున్నన్నాళ్ళూ, మనుషుల్లో చీమునెత్తురూ ఉన్నన్నాళ్ళూ… మాస్టారి కథలుంటాయి. మాస్టారు నిర్మించిన కథానిలయం మీద కధాపతాక శాశ్వతంగా ఎగురుతూనే ఉంటుంది. సాహిత్యలోకం… కథాప్రపంచం… వినమ్రంగా మాస్టారికి జేజేలు పలుకుతోంది, అరుణారుణ నివాళులర్పిస్తోంది.
`