మన ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరుతో చాలామంది ప్రజలు నిరాశ పడుతున్నట్లు నేను గమనించాను. ఇదే ప్రభుత్వాన్ని పరిపాలనకు ఏ మాత్రం సంబంధం లేని కారణాలతో వీరే ప్రేమగా ఓటేసి తిరిగి అధికారంలోకి తెచ్చారు. ఈ నిరాశకు మూలకారణం మామూలే… జరగనివి
ఆశించడం. నీవు ఆవు దగ్గరికి వెళ్తే పాలు, మూత్రం, పేడ లభిస్తాయి. కానీ ఆవు దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ కాఫీ ఆశిస్తే? ఎవరిది తప్పు? నీదా, ఆవుదా?
ఇక నిర్దిష్టంగా మాట్లాడదాం. ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేయాలని మనందరం ఆశిస్తున్నాం. ఈ రోజుల్లో ఆక్సిజన్ ప్రాముఖ్యంలో ఉంది. ‘‘గో ప్రదేశాల్లో’’ కూడా ఇప్పుడు ఆక్సిజన్ ఆవుకంటే, అత్యున్నత నాయకుడి (సుప్రీం లీడర్) కంటే ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు సమస్యే అది. ప్రజలు వారు ఆశించిన వాటిని అదుపులో ఉంచుకోలేక పోతున్నారు.
న్యాయంగా మాట్లాడితే అధికారంలో అన్ని పార్టీలు తమ మానిఫెస్టోలో గాని, ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నడూ ఆక్సిజన్ ఇస్తామని వాగ్దానం చేయలేదు. ఇప్పుడు వాళ్ళని ఆక్సిజన్ కొరతకు నిందించడం అంటే వ్యవహార పరిభాషలో చెప్పాలంటే ‘‘లక్ష్యాన్ని దూరం జరపడం’’. కాబట్టి విశాల ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ దూరం జరిపిన ఆశించిన లక్ష్యాల్ని వాటి యధాస్థానానికి వెనక్కి జరపడానికి గాను ప్రతి భారతీయులు వారి ప్రభుత్వం నుండి ఆశించాల్సిన వాటిలో సరైనవి ఏవో నేను ప్రతిపాదిస్తాను. ప్రస్తుతం మీకున్న భ్రమాన్వితమైన ఆశల స్థానంలో నేను పేర్కొనే వాటిని పెట్టుకుంటే మీకు కొంచెం కూడా నిరాశా భావం రాదు. అప్పుడు మీ ఆక్సిజన్ స్థాయి 99 అయినా 29 అయినా ‘విశ్వగురువు’ పట్ల నీ షరతులు లేని ప్రేమ ఒకే రకంగా చెదరకుండా ఉండిపోతుంది. ఇక చదవండి…
1. ఆశించాల్సింది వాక్సిన్లు కాదు ఓటిపీలు (వన్‌టైమ్ పాస్‌వర్డ్): గత ఏడేళ్ళలో ప్రధాని వేలాది ఉపన్యాసాలు చేసారు. ఎప్పుడయినా ఆయన వాక్సిన్ భారతం గురించి మాట్లాడారా? లేదు. ఆయన మాట్లాడిరదంతా డిజిటల్ ఇండియా గురించే. మీకు తెలీదని చెప్పొద్దు. మరి తెలిస్తే ప్రపంచపు అతి పెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం నుండి నిజంగా వ్యాక్సిన్ ఆశించడం వెర్రితనం కాదా. కేవలం మూడు గంటల్లో కోటి నలభై అయిదు లక్షల ఓటిపిలు పంపించగల ఆరోగ్య మంత్రి ఉండటం మన అదృష్టం కాదా! అయినా ఆరోపణలు చేయాలనుకుంటే ఒక చేతి అయిదు వేళ్ళతో ఆరు అంకెల ఓటిపి పంపేందుకు ప్రయత్నించకూడదా!
2. ధ్యాస మళ్ళించే సరుకు సరిపడగా ప్రభుత్వం నిల్వ చేయాలి: ప్రతిపక్షం, సామాజిక కార్యకర్తలు, ప్రపంచ మీడియా వంటి దేశ వ్యతిరేక శక్తుల నుండి ఎల్లప్పుడూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. పాకిస్తాన్‌పై కేంద్రీకరించకుండా వాళ్ళు ఆస్పత్రి పడకలు, వ్యాక్సిన్లు వంటి రోజువారీ విషయాల గురించి చింతించేలా జనాన్ని వాస్తవంలోకి గుంజుతుంటారు. కాబట్టి ఈ ప్రజా అవగాహన నుండి, మీడియా కథనాల నుండి ధ్యాస మళ్ళించే అంశాలకు సరిపడేంతగా ప్రభుత్వం నిల్వ చేసుకుంటుందని ఎవరయినా ఆశించడం సహజం. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ఎంత మాత్రం నిరాశపర్చలేదు.
అన్నట్టు ఉన్నట్టుండి ఈ ఆక్సిజన్ కావాలని దేశమంతా జనానికి పిచ్చెత్తడం వెనుక ఏ విదేశీ సంస్థ ఉందోనని మీరు ఆలోచించారా! అది ఐఎస్‌ఐ కావచ్చా? అది పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ కావచ్చా? ట్విట్టర్ అయ్యుండొచ్చా? ఆక్సిజన్ గురించిన ఈ కొత్త వేలం వెర్రితో ట్విట్టర్‌లో ట్రాఫిక్ అమాంతం పెరిగిపోయిందని మనకు తెల్సు. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, నీకు ఆక్సిజన్ అంటే అంత ప్రేముంటే ఎంత కావాలంటే అంత పీల్చుకో అంతేకానీ ప్రధానిని ఇందులోకి గుంజకు. నేను ఈ విషయంపై కట్టలు కట్టలు వ్యాఖ్యలు చదివాను. కానీ 70 ఏళ్ళ క్రితం నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడు వాతావరణంలో ఎంత ఆక్సిజన్ ఉందో ఇవాళ కూడా అంతే ఉందని ఎవ్వరూ రాయలేదు. అప్పుడది 21 శాతం. ఇప్పుడు కూడా 21 శాతమే. కానీ 1947లో కంటే దేశ జనాభా ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ పరిమాణం అంతే ఉంది. కానీ జనాభా నాలుగు రెట్లయింది. అంటే ఎవర్ని నిందించాలి? ఆలోచించు.
3. దేశం యొక్క ప్రతిబింబంపై శ్రద్ధ వహించడం: తన స్వంత జీవితం కంటే కూడా ఒక దేశ భక్తుడు ప్రభుత్వం నుండి ఆశించేదేంటి అంటే అది తన అన్ని వనరులనూ దేశం యొక్క ప్రతిబింబాన్ని (ప్రతిష్టను) కాపాడడానికి మళ్ళించాలనేది మాత్రమే. అంటే దేశ ప్రధాని ప్రతిరూపాన్ని కాపాడడం. కాబట్టి ప్రధాని కొత్త నివాసపు నిర్మాణం కోసం అట్టిపెట్టిన వేలకోట్ల రూపాయలను వ్యాక్సిన్ కొని దాన్ని పౌరులకు ఉచితంగా ఇవ్వడానికి వినియోగించాలని ఎవ్వరూ ఆశించకూడదు. పన్నులు చెల్లించే మానవజాతి చరిత్రలోనే పన్ను చెల్లింపుదారుల నిధుల నుండి నిర్మించిన ఏ ఒక్కదాని కంటే మన ప్రధాని నివాసం విలాసవంతంగా రాజప్రాసాదంలాగా ఉండటం పట్ల భారతీయుడైన ప్రతి ఒక్కరూ గర్వపడవద్దా?
4. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పైన ప్రధాని చిత్రం (ఫోటో): వేరే విధంగా జరగాలని కోరుకునే వాళ్ళున్నారంటేనే నాకు కోపం తన్నుకు వస్తుంది. ప్రధానిది కాకపోతే మరెవ్వరి ఫోటో నీ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై ఉండాలని నువ్వు కోరుకుంటావు? దాని బదులు వెంకటేష్ ప్రసాద్ ముఖం ఉండాలనా? నిజంగా?
5. ఏం లేదు: బాగా చదువుకున్న మేధావులు కూడా ప్రభుత్వం ‘‘ఏ రకమైన పరిపాలన’’ అందించకపోవడం పట్ల నిరాశ చెందడం ఈ దేశపు అతి పెద్ద విషాదం. సమయానికి ఐసియు బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు వగైరాలన్నీ లభించేలా చేయడానికి గాను కేంద్రీకృతమైన సమన్వయం జరగాలని వారు ఆశించారు. హల్లో! కరోనా వైరస్ దేశంలోకి దిగబడక ముందే అనేక నెలల నుండే మన ప్రధాని స్వావలంబన (ఆత్మనిర్భర్) కమ్మని అనేకసార్లు అభ్యర్థించారు. ఈ మహమ్మరి గురించి పూర్తిగా సన్నద్ధం కమ్మని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించారు. కానీ మీరు విన్నారా? అసలు స్వావలంబన (ఆత్మనిర్భర్) అంటే ఏంటో తెలుసా? అంటే ప్రభుత్వం నుండి ఏమీ ఆశించవద్దు అని, కాబట్టి అదే చేయండి. ఏమీ ఆశించకండి. ఒకదాని తర్వాత ఏమీ లేని మీ ఆకాంక్షలన్నీ చివరికి పూర్తయినాక నాకు ధన్యవాదాలు చెప్పండి. (జి.సంపత్, హిందూ సౌజన్యంతో… )