గమనమే గమ్యం -ఓల్గా

ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది.
తల్లీ కొడుకులు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది.

కూతురంటే ప్రాణమిచ్చే తండ్రికి జబ్బు చేస్తే పక్కన లేకుండా ఆ కూతురు చదివి ఉద్ధరించాల్సిందేమిటి? ఎవర్ని? సరిగ్గా ఈ ప్రశ్నలకు సమాధానమా అన్నట్లు రామారావు గ్రామం చేరుకోగానే ఒక ఉత్తరం రాశాడు.
ప్రియమైన సుబ్బమ్మకు,
నేను క్షేమంగా చేరాను. సోమేశ్వరరావు ప్రయాణంలో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇక్కడ నాకు విశ్రాంతి దొరుకుతుందని వైద్యులు అనుకున్నారు. విశ్రాంతి వల్ల నా ఆరోగ్యం కుదుటపడవచ్చని అనుకున్నారు. కానీ రెండూ నిజాలు కావు. నాకు విశ్రాంతి కావలసింది శరీరానికి కాదు, మనసుకి. సరిగ్గా చెప్పాలంటే మెదడుకి. అది అసంభవం. నిరంతరం నా మెదడు ఆలోచిస్తూనే ఉంది. చరిత్ర గురించి తేలవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జాతికి చరిత్ర అవసరం. చరిత్ర లేని జాతి ముందుకు పోలేదు. మనకు చరిత్ర ఘనమైనది ఉండి కూడా చరిత్రహీనుల్లా బ్రతకవలసి రావటం ఎంత దురదృష్టమో, అది నన్ను ఎంత బాధిస్తుందో నీకు అర్థం కాదు. ఆ చరిత్రను నిర్మించాలంటే ఎన్నో చిక్కు ప్రశ్నలు. ఆధారాల కోసం కీకారణ్యంలో గుప్తనిధుల కోసం ఒంటరిగా వెళ్తున్న వాడి చందంగా ఉంది నా పరిస్థితి. పరిష్కరించాల్సిన విషయాల నుంచి మనసుకి విశ్రాంతి దొరకటం లేదు. దానికోసం చదవవలసినవి చదవకుండా, రాయవలసినవి రాయకుండా నేను జీవించలేను. ఎక్కువ రోజులు జీవించబోవటం లేదు. దీన్ని నువ్వు జీర్ణించుకోవాలి. ఈ ఉత్తరం చదివి నువ్వు బలహీనురాలివి కాకూడదు. బలాన్ని పొందాలి. ఎందుకంటే మనిద్దరి ప్రాణాలు మన శారదాంబ మీద పెట్టుకుని
ఉన్నాం. నా ప్రాణాలు పోతే శారదాంబకు ఎలాంటి లోటూ కలగకూడదు. శారదకు నా మరణం అశనిపాతంలా తగులుతుంది. మన అమ్మాయిని దానినుంచి రక్షించుకోవలసింది నువ్వే. అందుకు నువ్వు నీ సర్వశక్తులతో సిద్ధం కావాలి. అమ్మాయి చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. అమ్మాయి డాక్టర్‌ కావాలి. అది నాకు చరిత్ర రచనతో సమానమైన కోరిక అని నీకు తెలుసు. ఆ భారం, బాధ్యత నీవు ఒక్కదానివే వహించవలసి ఉంటుంది. నేను నీ మీద ఇంత బరువు మోపి వెళ్ళటం అన్యాయమని నాకూ తెలుసు. కానీ నాకు వేరే గత్యంతరం లేదు. నాకు వచ్చిన జబ్బు ప్రాణాలు తీసేదే కానీ, ఆశను మిగిల్చేది కాదు. నా మరణాన్ని శారద ఎలా తట్టుకుంటుందనే చింతే ప్రస్తుతం నా జబ్బుకంటే ఎక్కువ నన్ను బాధిస్తోంది. శారదకేం ఫర్వాలేదు నేనున్నానని నువ్వు హామీ ఇవ్వాలి. ఇది కఠినత్వమే. కానీ జీవించే రోజులు తక్కువ ఉన్న మనిషికి కఠినత్వం కవచంలా రక్షణ ఇస్తుంది. ఆ కవచం ధరించే నేనీ ఉత్తరం రాస్తున్నాను. నన్న క్షమించు, క్షమించకపో. అది నీ ఇష్టానికి, విచక్షణకు వదిలివేస్తున్నాను. కానీ శారదను స్వేచ్ఛగా ఏ లోటూ లేకుండా పెరగనివ్వు. మంచి డాక్టర్‌ కావాలి నా తల్లి. ఆధునిక మహిళ కావాలి నా కూతురు. ఈ దేశం గర్వించాలి మన అమ్మాయిని చూసి. చరిత్ర నిర్మించాలి నా చిట్టితల్లి. నాలా చరిత్ర రాయటం కాదు చరిత్ర నిర్మించాలి. అర్థమైందా? ఎంత పెద్ద ఆశతో జ్వలిస్తున్నదో నా ప్రాణం. సుబ్బూ… ఇదంతా నీవల్లే అవుతుంది. మన అమ్మాయి తెలివి, శక్తియుక్తులు మనకు తెలియనివి కావు. తప్పకుండా నా ఆశలన్నీ ఫలిస్తాయి. సూర్యం సంగతి శారదే చూసుకుంటుందనే భరోసా నాకుంది.
ఇక్కడ ఎన్ని రోజులు ప్రాప్తముంటే అన్ని రోజులుంటాను. శారద పరీక్షలయ్యాక మీరిద్దరూ కలిసి రండి. నీవనుకుంటూ ఉండి ఉంటావు. శారద పరీక్షలు అంత ముఖ్యమా అని… నువ్వనుకుంటున్న దానికంటే ముఖ్యం నాకు. శారద పరీక్షలు మాని నా దగ్గర కూర్చుంటే నా అశాంతి, అనారోగ్యం పెరుగుతాయి కానీ తరగవు. ఇంక రాయలేకపోతున్నాను. నేను రాయనివి, రాయలేనివి కూడా నీవు గ్రహించగలవు. నీ ప్రియమైన రామారావు
ఈ ఉత్తరం చదివి సుబ్బమ్మ గుండె రాయి చేసుకుంది. జరిగేది తెలుస్తూనే ఉంది. జరగవలసింది చూడాలి. అది కష్టమైనా సరే పళ్ళ బిగువున భరించాలి. శారద పరీక్షలు అయ్యేవరకూ తన ముఖంలో బాధ కనపడకూడదు. తన కంట్లో కన్నీరు ఊరకూడదు.
ఒక కఠోర తపస్సులా ఆ రెండూ చేసింది సుబ్బమ్మ.
శారదకు తండ్రి క్షేమంగా ఉన్నానని ఉత్తరాలు రాస్తున్నాడు. రెండు నెలలు సుబ్బమ్మకు రెండేళ్ళలా గడిచాయి. శారద పరీక్షలు ముగిశాయి. ఊరికి ప్రయాణమవుతున్నారు తల్లీ కూతుళ్ళు.
రామారావు మరి లేరనే వార్త ఆంధ్రదేశమంతా దావానలంలా వ్యాపించింది. శారదకు స్పృహ తప్పింది. సుబ్బమ్మ కూతురి గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఊరికి వెళ్ళి భర్త అంత్యక్రియలను బంధువులు, స్నేహితుల సహాయంతో జరిపించింది.
ఆంధ్రదేశమంతా కన్నీరు కార్చింది. సాహితీవేత్తలు, పండితులు, చరిత్ర పరిశోధకులు, స్వతంత్య్రోద్యమ నాయకులు… ఒకరేమిటి రామారావుగారిని ఎరిగిన ప్రతివారూ తమ ఇంట్లో స్వంత మనిషి పోయినట్లుగా బాధపడ్డారు. జ్వరంతో మంచం పట్టిన శారదను తీసుకుని మద్రాసు వచ్చింది సుబ్బమ్మ.
శారద తండ్రి పోయిన దుఃఖం నుంచి తేరుకోవటానికి సుబ్బమ్మ చేసిన కృషి ఏ తల్లీ ఏ కూతురికీ చేసి ఉండదు. ఆవిడ తన దుఃఖాన్ని పక్కనబెట్టి కూతురి బాధ్యత మీద వేసుకుంది. ఇంట్లో ఉన్నంతసేపూ శారదను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలలేదు. పగలూ, రాత్రీ అంటిపెట్టుకుని తిరిగింది. శారద కన్నీరు తుడిచి నవ్వించటమే పనిగా పెట్టుకుంది. శారద గలగలా నవ్వుతుంది ఎప్పుడూ. శారద నవ్వే ఆమె అందం. తండ్రి మరణించాక శారద దాదాపు నెలరోజులు నవ్వలేదు. మళ్ళీ శారద నవ్వు చూడగలనా అని భయపడిరది సుబ్బమ్మ. సూర్యం పరిస్థితి మరీ అయోమయం. అక్క దుఃఖం చూడలేడు. తన దుఃఖాన్ని దాచుకోవటం చేతకాని వయసు. ‘అక్క దగ్గర ఏడవకు నాయనా’ అని తల్లి తన దగ్గర ఏడుస్తుంటే తట్టుకోవటం చేతకాని మనసు. ఆ గందరగోళం, అశాంతి అతని మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకున్నాయి. చిన్న వయసులోనే ఒక విధమైన నిరాశ మబ్బులా అతన్ని కమ్మేసింది. సుబ్బమ్మ ఏదో ఒకటి చెబుతూ కూతురి వెంట తిరిగి తిరిగి అలసిపోయింది. నాలుగు నెలలు గడిచిన తర్వాత శారద మళ్ళీ గలగలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే సుబ్బమ్మ ఎవరూ చూడకుండా కరువుతీరా కంటారా ఏడ్చి సేదదీరింది. ఈ నాలుగు నెలలూ అన్నపూర్ణ నుంచి వచ్చిన ఉత్తరాలు కూడా శారదకు తన దుఃఖం నుంచి తేరుకోవడానికి సహాయపడ్డాయి.
ఇప్పుడు అన్నపూర్ణ, అబ్బయ్య కాకినాడలో ఉంటున్నారు. అబ్బయ్య కాకినాడ కళాశాలలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్ళయిన నాటినుంచీ తామిద్దరం భర్త సంపాదనతో బతకాలనే అన్నపూర్ణ కోరిక తీరింది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి.
ఈ సంవత్సరం కాంగ్రెస్‌ మహాసభలు కాకినాడలో జరుగుతున్నాయి. అన్నపూర్ణ శారదను రమ్మని మరీ మరీ కోరింది. గాంధీ జైలులో ఉన్నారు. గాంధీ లేకుండా జరిగే మహాసభలకు రావాలని లేదంది శారద. గాంధీని చూడాలని, మాట్లాడాలనీ శారద మనసులో చాలా రోజుల నాడు పుట్టిన కోరిక అడయారు మర్రి వృక్షమంత అయింది. కాంగ్రెస్‌ మహాసభలకు వెళ్ళి అక్కడ గాంధీని తప్ప అందరినీ చూడటం ఆ అమ్మాయికి అంత ఆసక్తిగా లేదు. చివరికి అబ్బయ్య ‘‘వాళ్ళను చూడటం, వీళ్ళను చూడటం కాదు సభలకు రావటమంటే… ఎవరేం మాట్లాడతారు? ఎలాంటి రాజకీయ చర్చలు జరుగుతాయి? రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది? ఏ తీర్మానాలు చేస్తారు? ఇవి తెలుసుకోవటానికి రావాలి’’ అని ఉత్తరం రాశాక కానీ శారదకు తన ఆలోచనలో తప్పు తెలిసిరాలేదు. తప్పు ఒప్పుకుంటూ శారద రాసిన ఉత్తరానికి అబ్బయ్య ‘‘ఆకర్షణ వ్యక్తుల పట్ల ఏర్పడుతుంది. ఉద్యమాలలోకి వ్యక్తి ఆరాధన వల్ల అనేకమంది వస్తారు. కానీ అక్కడే ఆగిపోకూడదు. వ్యక్తులను దాటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి’’ అని సమాధానం రాశాడు. గాంధీని ఆరాధించకుండా ఉండడం నా వల్ల కాదు అనుకుంది శారద. కాకినాడ వెళ్ళడానికి సుబ్బమ్మ సులభంగానే ఒప్పుకుంది. ఏదో ఒక సందడిలో పడి శారద మామూలు మనిషి కావాలనేదే ఆమె కోరిక. సూర్యాన్ని బంధువులింట్లో ఉంచి కాకినాడ వెళ్ళారు.
తల్లీ కూతుళ్ళిద్దర్నీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది అన్నపూర్ణ. వీళ్ళు వచ్చేసరికి కాకినాడలో సభల హడావుడి మొదలైంది. అన్నపూర్ణ వాళ్ళిల్లు చూసి శారద ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఎక్కడా దేవుడి పటాలు లేవు. పూజ గది లేదు. ఇల్లు కూడా నిరాడంబరంగా ఉంది. ఇంటి ముందు పెద్ద తోట పెంచుతున్నారు. కాకినాడలో అబ్బయ్యకు గోపరాజు రామచంద్రరావనే గురువు దొరికాడనీ, అదంతా ఆయన ప్రభావమనీ అన్నపూర్ణ చెప్తే సుబ్బమ్మ ఆశ్చర్యంగా ‘‘ఐతే నువ్వు కూడా నాస్తికురాలివయ్యావుటే’’ అంది. శారద ‘‘అమ్మా! నాకూ దేవుడి మీద నమ్మకం లేదు. నీ కోసం నమస్కారం పెడుతున్నా అంతే’’ అంది.
‘‘మరి ఇక్కడ నా పూజా పునస్కారాలెలా?’’ సుబ్బమ్మ విలవిల్లాడిరది.
‘‘అన్నీ ఏర్పాటు చేస్తాను’’ అంటూ అన్నపూర్ణ ఎక్కడినుంచి తెప్పించిందో సీతారాముల పటం తెప్పించింది. వంటింటి పక్కనున్న చిన్న గదిలో ఒక పీట వేసి దానిమీద ఈ పటం తెప్పించింది. సుబ్బమ్మ ఆ పటానికి పసుపు కుంకుమలు దిద్దేసరికి అన్నపూర్ణ, శారద తోటలో నుంచి బుట్టెడు పూలు కోసుకొచ్చారు. సుబ్బమ్మ పూజ దివ్యంగా జరిగింది.
అన్నపూర్ణ శారదకు కాకినాడంతా చూపించింది. బులుసు సాంబమూర్తి గారు అంత హడావుడిలోను శారద రామారావు కూతురని చెప్పగానే పదినిమిషాల పాటు ఆగి శారదను ఆప్యాయంగా పలకరించి, క్షేమ సమాచారాలడిగారు.
మూర్తి శారద బృందానికి పరిచయమయ్యాడు. వాళ్ళలో అతనొకడయ్యాడు గానీ మిగిలినవాళ్ళందరికీ అతను ఏదో ప్రత్యేకంగానే కనిపించేవాడు. శారద మీద తనకేదో అధికారం ఉన్నట్లు, చనువు ఉన్నట్లు మాట్లాడేవాడు. శారద దాన్ని పట్టించుకోనట్లు కనిపించినా లోలోపల దాన్ని ఇష్టపడేది. అందువల్ల ఎవరి అధికారాన్నీ సహించని శారద, మూర్తి ధోరణిని వారించేది కాదు. దానికి తోడు శారద, మూర్తి చాలాసార్లు ఉదయపు వేళల్లో సముద్రపు తీరాన కలుస్తున్నారనే విషయం కూడా మిగిలిన మిత్రులకు తెలిసింది.
రామకృష్ణ మిగిలిన వారిలా మౌనంగా ఊరుకోలేకపోయాడు.
‘‘అక్కా! మూర్తిగారి పద్ధతి ఏదో భిన్నంగా ఉంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా నీ మీద ఏదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తాడెందుకు? దానిని నువ్వు సహిస్తున్నావెందుకు? ఆ చనువు, ఆ పరిహాస ధోరణి నువ్వెందుకు భరిస్తున్నావు?’’
రామకృష్ణ నుంచి ఈ ప్రశ్న వస్తుందని శారద అనుకుంటూనే ఉంది. రామకృష్ణ కంటే తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, సజ్జనుడు ఎవరూ ఉండరని శారదకు తెలుసు. అతని దగ్గర విషయం దాచడంలో అర్థం లేదనీ, ఉన్న విషయం చెప్పేద్దామనీ అనుకుంది.
‘‘మూర్తి నన్ను ప్రేమిస్తున్నాడు రామూ. అందుకే ఆయనకా అధికారం.’’
‘‘నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయనకు పెళ్ళయింది కదక్కా’’ రామకృష్ణయ్య ఆందోళనగా అడిగాడు.
శారద ముఖం పాలిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. శరీరమంతా నిస్సత్తువగా అయిపోయింది. కాళ్ళు తేలిపోతున్నట్లయి దగ్గరున్న బెంచీమీద కూలబడిరది.
‘‘ఆ సంగతి చెప్పలేదా? అది దాచి ప్రేమిస్తున్నానన్నాడా?’’ రామకృష్ణ కోపంగా అంటున్న మాటలు కూడా శారదకు వినిపించలేదు. అసలు ఈ లోకం, ఎదురుగా ఉన్న రామకృష్ణ అంతా అదృశ్యమై పోయినట్లయింది. ఏమీ కనిపించటంలేదు, వినిపించటం లేదు. చీకట్లు కమ్మినట్లయింది.
రామకృష్ణ ‘‘అక్కా! అక్కా’’ అంటూ కుదిపాడు.
‘‘మూర్తికి పెళ్ళయిందా? నీకు తెలుసా?’’ చాలాసేపటికి అడిగింది శారద.
‘‘తెలుసు. నాకే కాదు. అందరికీ తెలుసు. ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. నీ దగ్గర దాచాడా ఇదంతా’’ రామకృష్ణ కళ్ళెర్రబడ్డాయి.
‘‘నేను అడగలేదు’’
‘‘నువ్వడగటం అలా ఉంచు. ప్రేమిస్తున్నానని చెప్పినవాడు తన పెళ్ళి విషయం చెప్పకపోతే ఏమిటర్థం’’
‘‘పెళ్ళి గురించిన మాటే మా మధ్య రాలేదు రామూ. అతను నన్ను పెళ్ళాడతాననలేదు. ప్రేమిస్తున్నారా, ఐతే పెళ్ళి చేసుకుందామని నేనూ అనలేదు. రామూ… ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం. దీని గురించి వివేకంతో ఆలోచించగల సమర్థురాలిననే నమ్మకం నామీద ఉంచు. నువ్వు దీని గురించి ఆందోళన పడకు. ఇదంతా నేను తేల్చుకోవలసిన విషయం. నువ్వు ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దు. నేను తేల్చుకుంటా…’’ శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకు దూకింది. అడ్డు లేకుండా ప్రవహించింది. అదంతా అయిపోయాక శారద లేచి ముఖం కడుక్కుని కాశీనాథుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళింది.
శారద వెళ్ళేసరికి దుర్గాబాయి ఆసుపత్రి నుంచి భర్తను తీసుకుని వచ్చింది. శారదను చూస్తూనే ఆమె ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.
‘‘చూశావా, వస్తుందనుకున్న సమయం వచ్చేసింది. ఇంక మనదే ఆలస్యం. అందరం దూకాల్సిందే. శారదా ఎప్పుడెప్పుడు సత్యాగ్రహం చేద్దామా అని మనసు ఆగటం లేదు.’’
ఆమె భర్త సుబ్బారావు ఏదో ఆయాసపడ్డాడు. దుర్గాబాయి ఆయనకు మంచినీళ్ళిచ్చి, మందు తాగించి విశ్రాంతిగా పడుకునే ఏర్పాటు చేసి వచ్చింది. ప్రతిపనీ ఎంతో శ్రద్ధగా చేస్తుంది దుర్గ.
పనిలో అందం, శ్రద్ధ రెండూ కనిపిస్తాయి.
భర్తపై ఇంత శ్రద్ధ, గృహిణిగా కర్తవ్య ధర్మం, ఎట్లా సత్యాగ్రహంలో కలుస్తుంది? అదే అడిగింది శారద. .
‘‘శారదా… దేశం పిలిస్తే, బాపూ ఆజ్ఞ వేస్తే ఇక నన్ను నేను నిలవరించుకోలేను. సర్వ ధర్మాలూ పక్కన పెడతాను. నా ఆత్మ బోధించే ధర్మం ఒక్కటే. నా దేశం.’’
‘‘మరి నీ భర్త?’’
‘‘నా భర్తను చూసుకునేవాళ్ళు ఉన్నారు. ఉంటారు. ఆయన నన్ను ఆపరు’’ దుర్గ ముఖంలో ఆవేశం, ఆనందం,
ఉత్సాహం.
‘‘భార్యా భర్తల సంబంధం ఎలాంటిది దుర్గా?’’
దుర్గ నవ్వింది.
‘‘నీకు తెలియదా? పెళ్ళి కాలేదనుకో. ఐనా నీకు తెలియదంటే నేను నమ్మను.’’
‘‘భార్యాభర్తలందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారా?’’
‘‘నీకు ప్రేమ సమస్య వచ్చిందా? ప్రేమించుకుంటారు, ప్రేమించుకోరు. రెండూ ఉంటాయి. భార్య భర్తని సేవించాలి. అతనే లోకంగా ఉండాలి అంటారు. నాకలా ఎప్పుడూ లేదు. పాపం ఆయనకు తనతోడిదే లోకంగా ఉండాలని ఉందేమో. నేనెప్పుడూ అలా లేను.’’
‘‘కానీ నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే…’’
‘‘నేనెవరికైనా అలాగే చేస్తాను. భర్త కాబట్టి మరింత బాధ్యతగా ఉంటాను. కానీ ఈ బాధ్యత ఇంక మొయ్యలేను. దేశం కోసం దీనిని అవతల పెట్టెయ్యగలను’’.
‘‘కానీ స్రీలంతా నీలా ఉండగలరా?’’
‘‘ఉండలేరు. వాళ్ళకా దృష్టి లేదు. ఎంతసేపూ ఇల్లూ, భర్తా, పిల్లలు… ఇదే లోకం. అబ్బా, నాకా గుణం రాలేదు. వచ్చుంటే ఇక అక్కడే తెల్లార్చుకునేదాన్ని నా జీవితాన్ని.’’
‘‘భర్తను ప్రేమించకుండా దేశాన్ని ప్రేమించటం సరే… మరొక పురుషుడిని ప్రేమించటం సాధ్యమా?’’
‘‘ఆ విషయం నాకేం తెలియదు. ఆ ప్రేమ గురించి నేనెన్నడూ ఆలోచించలేదు’’.
దుర్గ వెళ్ళి భర్తకు అంతా అనుకూలంగా ఉందా అని చూసి కాళ్ళ దగ్గర తొలగిన దుప్పటి సరిచేసి వచ్చింది.
‘‘నువ్వు నీ భర్తకంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు. ఆ మాట ఆయనతోనే చెప్తున్నావు. నీ భర్త నీకంటే ఎక్కువగా ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెబితే…’’
‘‘అబ్బా… అంతకంటే శుభవార్త ఉంటుందా? ఆ ఇంకెవరికో ఈయన బాధ్యత అప్పగించి నేను స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో పడి పరిగెత్తుతా’’ దుర్గ ఆ మాటలన్న తీరుకి శారద నవ్వింది.
‘‘కానీ మామూలు స్త్రీలు ఏడుస్తారు కదా, భర్త తనను కాదని ఇంకొకరిని ప్రేమిస్తున్నాడంటే…’’
‘‘ఏమో. కొందరు ఏడవవచ్చు. కొందరు సంతోషపడవచ్చు. మరి కొందరు ప్రాణత్యాగం చేయవచ్చు. కానీ ఎక్కువమంది లోలోపల సంతోషిస్తారేమో’’.
‘‘ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది శారద.
‘‘ఈ భారం నుంచి విముక్తి లభించినందుకు. బతికినంతకాలం ఒకే మనిషికి బాధ్యత వహించటం తప్ప మరింక జీవితంలో ఏ పనీ లేకుండా ఉండటం. ఆ మనిషి ఎటువంటివాడైనా సేవించవలసి రావటం, స్వేచ్ఛ అనేది లేకపోవటం… ఎటు చూసినా ఆజ్ఞలే, ఆదేశాలే. ఏమో నాకైతే ఈ వివాహ బంధాన్ని మించి ఆనందం దేశసేవలోనే ఉంది. కొందరికి మరింక దేన్లోనైనా దొరకవచ్చు. కానీ శారదా… ఆలోచించే అవకాశమే లేదుగా స్త్రీలకు, ఎక్కడ నాకు ఆనందమని. ఊహ తెలిసిన దగ్గరినుంచి ఇదే నీ ఆనందం, ముక్తి, మోక్షం అని చెప్తుంటారు. ఏమో.. ఆడవాళ్ళు ఈ బంధం నుంచి బైటపడి స్వతంత్రంగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటే నయమనిపిస్తుంది నాకు.’’
‘‘స్వతంత్రం మనకీ కావాలిగా దుర్గా దేశానికిలాగే. మనల్ని మనం పరిపాలించుకోవాలనిపించదూ?’’
‘‘ఎందుకనిపించదు? కానీ దానికి ఎంతో శక్తి కావాలి. ముందు చదువు కావాలి. నువ్వు డాక్టర్‌వి అవుతావు. ఎంత మంచి సంగతి అది. నాకూ చదవాలని ఉంది. లాయర్‌ని కావాలని ఉంది. దేశ స్వతంత్ర విషయాల్లో ఎన్నో తెలుసుకోవాలి. చదువు లేకపోతే మళ్ళీ ఆ చదువుకున్న మగవాళ్ళ మాటలకు తలలూపటం తప్ప మరేం చెయ్యలేం. చదువుకోవాలి శారదా, ఆడవాళ్ళంతా చదువుకోవాలి. ఇంగ్లీషు చదువులు…’’ దుర్గ ముఖం వెలిగిపోతపోంది జ్ఞానకాంక్షతో.
వాళ్ళ మాటల్లో చాలా సమయం గడిచింది.
శారద అడగాలనుకున్నది అడగలేదు. చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగొచ్చింది. గుండెలమీద బరువు ఏ మాత్రం తగ్గలేదు.
… … …
ఐతే ఆ తర్వాత ఇక శారదకే కాదు ఎవరికీ ఏమీ ఆలోచించే సమయం లేదు. దండియాత్ర మొదలైంది. అది దావానలంలా పాకింది. దేశమంతా ఉప్పు ఉడుకుతోంది. మద్రాసు సముద్రం మాత్రం చల్లగా ఉంది. మద్రాసు నిశ్శబ్దాన్ని చూస్తే శారదకు ఆశ్చర్యంగా ఉంది. ఆవేశమూ కలుగుతోంది. దుర్గ ఏం చేస్తోంది?
రెండు మూడు రోజులు ఆందోళనతో గడిచిన తర్వాత దుర్గను కలిసి మాట్లాడాలని బయల్దేరుతుంటే దుర్గే శారద ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అదే మొదటిసారి దుర్గ ఆ ఇంటికి రావటం. శారద సంతోషంతో పొంగిపోతూ దుర్గ భుజాల చుట్టూ చేయి వేసి గలగలా నవ్వుతూ దుర్గను తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇక సుబ్బమ్మగారి హడావుడి చూసి తీరాలి. సుబ్బమ్మ గారు అతిథులను చూస్తే ఆగలేరు. అందులోనూ తనకు ఇష్టమైన వాళ్ళంటే మరీ… ఆమె పెట్టినవన్నీ తినాలి, చెప్పేవన్నీ వినాలి. శారద దుర్గను తల్లినుంచి రక్షించి మేడమీదకు తీసుకెళ్ళింది.
‘‘చూశావా దుర్గా! గాంధీగారు సత్యాగ్రహంలోకి ఆడవాళ్ళు అప్పుడే రావాల్సిన అవసరం లేదంటున్నారు. నువ్వేం చేస్తావు?’’ ‘‘నేను చెయ్యవలసింది చేసేశాను. గాంధీగారికి ఉత్తరం రాశాను. ఆయన ఒప్పుకుంటారు. ఆయన అనుమతించక పోయినా నేను శాసనోల్లంఘనం చేసి తీరతాను. ప్రజల చేత చేయిస్తాను’’ దుర్గ కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి.
‘‘నువ్వు గాంధీగారి శాసనాన్ని కూడా ఉల్లంఘిస్తావా?’’
దుర్గ ధీరలా పలికింది.
‘‘శాసనం అన్న మాటకే తల వంచకూడదు. శాసన రూపంలో ఎవరేం చెప్పినా ఉల్లంఘిం చాల్సిందే. అది గాంధీగారు నేర్పిందే’’.
‘‘ఔను కానీ ఏం చేస్తావు? ఎలా చేస్తావు?’’
‘‘పంతులు గారు రెండు రోజుల్లో మద్రాసు వస్తారు. ఆయనతో ప్రకాశం గారితో మాట్లాడి మద్రాసులో నిప్పు రాజేయాలి. ఉప్పు వండాలి.’’
‘‘ప్రకాశం గారు గుంటూరు, బెజవాడ వెళ్తానంటున్నారుగా?’’
‘‘అక్కడ నాయకులెందరో ఉన్నారు. అంతగా అయితే ఒకసారి వెళ్ళి వాళ్ళను ఉత్సాహపరిచి రావొచ్చు. కానీ మద్రాసు ఇంత పెద్ద నగరం. బ్రిటిష్‌ వాళ్ళ పరిపాలనా కేంద్రంలో చిన్న నిప్పురవ్వ కూడా లేకుండా ఉంటే ఎలా? అది వాళ్ళ బలమనుకోరూ?’’
‘‘ఐతే నువ్వు సిద్ధమయ్యావా?’’
‘‘సిద్ధమయ్యాను శారదా. మరి నువ్వు?’’
‘‘నాకీ చదువనే బంధం ఒకటుందిగా. నాన్నకు మాటిచ్చాను. చదువుకి భంగం రాకుండా ఏం చెయ్యగలనో అదంతా చేస్తాను.’’ ‘‘మా అన్నపూర్ణ ఇప్పుడు కాకినాడలో ఉంది. తను కూడా సత్యాగ్రహం చేస్తుంది. నాకు తెలుసు.’’ ఇద్దరికీ సత్యాగ్రహం ఎలా చెయ్యాలో, ప్రజలను ఎలా సమీకరించాలో ఎంత మాట్లాడుకున్నా తనివి తీరటం లేదు.
దుర్గ ఇక వెళ్ళాల్సిన సమయం అయిందంటూ లేచింది. చివరిగా తన భయమూ శారదతో చెప్పింది. ‘‘మనం ఇన్ని ఆలోచిస్తున్నామా, చివరికి ఆ నాయకులు వచ్చి హఠాత్తుగా నిర్ణయాలు చేసేస్తారు. మనం అనుసరించాల్సిందే. వివరించే వ్యవధానం కూడా తీసుకోరు. ఉద్యమంలో నాయకుల్ని ఎదిరిస్తే అది ఉద్యమానికి హాని చేస్తుందంటారు. మనం వాళ్ళ పొరపాట్లను చెప్తూ, ఒక్క మాట మాట్లాడటానికి ఎంతో ఆలోచించాలి. ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నాయకులు ఉండాలి, కానీ ఇలా
ఉండకూడదనిపిస్తుంది.’’
దుర్గ మనసులో ఎంత ఆవేదన ఉందో అర్థమైంది శారదకు. ‘‘దుర్గా.. నువ్వే నాయకురాలివి. నీలో ఆ స్వభావం ఉంది. నిన్ను చూసి అందరూ ప్రేరణ పొందుతారు.’’
దుర్గ నవ్వింది.
‘‘నేను సాహసంతో చేసే పనులను జనం మెచ్చుకుంటారు. ఆ సాహసాలు కావాలి. కానీ నా ఆలోచనలు, నా మేథస్సు, వీటిని అంగీకరించటం పురుషులకు అంత తేలిక కాదు. ఆడవాళ్ళను అలా గుర్తించటానికి ఇంకా సమయం రాలేదేమో…’’
శారద దుర్గ నిరాశను తగ్గించాలనుకుంది.
‘‘ఎందుకు రాలేదు. సరోజినీ నాయుడిని గుర్తించటం లేదా?’’
‘‘ఆమె చదువు, ఆ చొరవ, ఆ దూసుకుపోయే తత్వం, సాహసం, తెలివి ఇవన్నీ ఒక పురుషుడికి ఉంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యేవాడు. ఇన్నీ ఉన్నా సరోజినీ నిర్ణయాలు చేసే స్థాయిలో లేదేమో అనిపిస్తుంది.’’
‘‘కాలం మారుతుంది దుర్గా. మనమూ నిర్ణయాలు తీసుకుంటాం. అన్ని పనులూ చేస్తాం.’’
‘‘ఔను. చెయ్యాలి. మనం చాలా పనులు చెయ్యాలి. ముందు మద్రాసులో సత్యాగ్రహం ప్రారంభించాలి. దానిలో ఎవరు కాదన్నా నేను ముందుంటాను.’’
దుర్గను మెచ్చుకోలుగా చూసింది శారద.
‘‘నేనూ సత్యాగ్రహం చేస్తానక్కా’’ అన్నాడు సూర్యం.
‘‘మనిద్దరం చదువులకు బందీలం తమ్ముడూ. నాన్నగారి కోరిక తీర్చాలిగా.’’
‘‘నేనేం చదవాలని నాన్నగారు చెప్పారు’’ అని ఆసక్తిగా అడిగాడు.
‘‘నీకేదిష్టమైతే అది.’’
‘‘నాకు సాహిత్యం, చరిత్ర ఇష్టం నాన్నలాగానే.’’
‘‘అదే చదువు. చదువు పూర్తయ్యాక నాన్నలాగే పరిశోధన చెయ్యి.’’ అక్క మాటలకు సూర్యం ఉత్తేజితుడయ్యాడు. కాసేపు కలల్లో తేలిపోయాడు.
మరో రెండు, మూడు రోజులు మద్రాసు నిస్తేజంగానే ఉంది. గుంటూరు, కృష్ణ మండలాల్లో సత్యాగ్రహం మొదలయిందని వార్తలొస్తున్నాయి.
ప్రకాశంగారు విజయవాడ బయల్దేరుతుండగా వెళ్ళి ఆయన్ని మద్రాసులో ఈ నిశ్శబ్దమేమిటని నిలదీసింది. ఒక్కరోజు అటు వెళ్ళి వచ్చి మద్రాసు సంగతి చూస్తానన్నాడాయన.
నాగేశ్వరరావు పంతులు గారిని కూడా సంప్రదించి దుర్గ రంగంలోకి దిగింది. పేటలన్నీ తిరిగింది. ప్రతి ఇంటి వాకిలీ తట్టింది. ఆమెకు మరికొందరు స్త్రీలు తోడయ్యారు. పెద్దా, చిన్నా, బీదా, గొప్పా తేడాలు లేకుండా వచ్చారు. దుర్గ అందరినీ నడిపించింది. ప్రకాశం గారు రావటంతో అందరిలో ఉద్రేకం రెట్టింపయింది. ఊరేగింపులు మొదలయ్యాయి. పోలీసులకూ, లాఠీఛార్జీలకు భయపడే వారెవరూ లేరు. శారద అంతా చూస్తూనే ఉంది. దూరంగా ఉండక తప్పలేదు. కాలేజీ మానేందుకు లేదు. పరీక్షలు తరుముకొస్తున్నాయి.
శారద లోపల్నుంచి వస్తున్న ఆవేశాన్ని, ఉద్రేకాన్ని అదుపు చేసుకోలేక సతమతమవుతోంది.
ఆసక్తి లేకుండానే కాలేజీకి, ఆస్పత్రికి వెళ్ళివస్తోంది. ఆ రోజు శారదకు ఏదో జరుగుతుందనిపించింది. తన జీవితంలో ఏదో చిన్న మార్పయినా రావాలనీ, వస్తుందనీ అనిపించింది.
ఉద్వేగాన్ని అణచుకుంటూ నడుస్తోంది.
ఎదురుగా గుంపుగా యువకులు నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. శారద ఉత్సాహంగా వారివైపు నడుస్తోంది. అందులో శారద మిత్రులు కూడా ఉన్నారు. సుదర్శనాన్ని దూరంనుంచే పోల్చుకుంది. అతను చదువు పూర్తిచేసి పత్రికా విలేఖరిగా పనిచేస్తున్నాడు. శారదకు మంచి మిత్రుడు. వాళ్ళ నినాదాలు విని జనం కూడా వస్తున్నారు. ఇంతలో వాళ్ళను తరుముతున్నట్లే వెనుకనుంచి పోలీసులు వచ్చి పడ్డారు. గుంపు చెల్లాచెదురయింది. కొందరు పారిపోయారు. కొందరు అలాగే నినాదాలిస్తూ నిలబడిపోయారు. పోలీసుల లాఠీలు పైకి లేచాయి. యువకుల శరీరాల మీద అవి విరుగుతున్నాయి. శారద పరిగెత్తుతూ అక్కడికి వెళ్ళేసరికి కిందపడిన యువకులను ఒదిలి కొందరిని అరెస్టు చేశామని తీసుకెళ్ళారు పోలీసులు. రక్తసిక్తమైన బట్టలతో, దెబ్బలతో నేలమీద పడి ఉన్నారు నలుగురు. శారద వాళ్ళను ఒక్కొక్కరినే లేపి పక్కనున్న చెట్టు కిందకు చేర్చింది. అందులో సుదర్శనం ఉన్నాడు. అందరికంటే అతనికే ఎక్కువ దెబ్బలు తగిలాయి.
‘‘మీరు శారద కదూ’’ అన్నాడు వారిలో ఒక యువకుడు.
‘‘ఔను. మీకెలా తెలుసు?’’
‘‘చాన్నాళ్ళ క్రితం గాంధీగారి మీటింగులో చూశాను. ఆ రోజు సభలో గాంధీగారెంత ఆకర్షణో మీరూ అంత ఆకర్షణ.’’
నొప్పిలో కూడా అతని కళ్ళు నవ్వుతున్నాయి.
శారద గంభీరమైపోయింది.
‘‘బాధ్యతగల పనులు చేస్తూ మీరలా మాట్లాడకూడదు. మీరిక్కడే కూర్చోండి. నేను టాక్సీ దొరుకుతుందేమో తీసుకొస్తాను. హాస్పిటల్‌కి తీసుకెళ్తాను’’ అంటూ టాక్సీ కోసం వెళ్ళింది.
పదిహేను నిమిషాలపైనే పట్టింది శారద టాక్సీలో వచ్చేసరికి. అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ముగ్గురికి చిన్నదెబ్బలే, ప్రమాదం లేదని కట్టుకట్టి మందులిచ్చి పంపారు.
సుదర్శనానికి తలమీద పెద్ద దెబ్బ తాకింది. ఒకటి, రెండు రోజులు ఆసుపత్రిలో ఉంటే మంచిదన్నారు.
శారద సుదర్శనాన్ని ఆసుపత్రిలో చేర్పించి, అతనికి కావలసిన ఏర్పాట్లు చేసి ఆ తర్వాత క్లాసుకు వెళ్ళింది. అప్పటికే ఒక క్లాసు అయిపోయింది. అప్పుడు అందరిముందూ క్షమాపణ చెప్పటం కంటే ముందే వెళ్ళి వివరిస్తే మంచిదనుకుంది శారద.
శారదను చూడగానే ఆ తెల్ల ప్రొఫెసర్‌ ముఖం ఎర్రబడిరది.
‘‘మీ ఇండియన్స్‌కి అసలు బుద్ధిరాదు’’ అంటూ మొదలుపెట్టాడు.
శారద జేవురించిన ముఖంతో
‘‘ఔను సర్‌! మా ఇండియన్స్‌కి బుద్ధిలేదు. ఉంటే బ్రిటిష్‌ వాళ్ళు మమ్మల్ని పరిపాలించగలిగేవారా? బుద్ధి రావటం కూడా కష్టమే. వచ్చేది ఉంటే మిమ్మల్ని సహిస్తూ కూచుంటామా?’’
ఆ ప్రొఫెసర్‌కి కోపం కట్టలు తెంచుకుంది.
‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?’’
‘‘తెలుసు సర్‌. ఒక బ్రిటిష్‌ ప్రొఫెసర్‌తో మాట్లాడుతున్నాను. విద్యార్థి క్లాస్‌కి రాలేకపోతే కారణం ఏమిటని అడిగి తెలుసుకోవాలనే అవసరం ఉందనుకోని అహంకారపు బ్రిటిష్‌ ప్రొఫెసర్‌తోటి. నేను మీ క్లాస్‌కి రాకపోవటానికి కారణం అనాగరికమైన మీ పోలీసు వ్యవస్థ సర్‌’’
‘‘వాట్‌’’ ‘‘ఔను. వందేమాతరం అన్నందుకు లాఠీలు విరిగేలా, యువకుల తలలు బద్దలయ్యేలా కొట్టమని ఆదేశించిన అనాగరిక బ్రిటిష్‌ పోలీసులు. చెప్పండి సర్‌! అది అనాగరికత కాకపోతే మరేమిటి? మమ్మల్ని అనాగరికులమని హేళన చేస్తారే. మీ నాగరికత ఏమిటి సర్‌. అమాయకుల ప్రాణాలు తియ్యటమేనా? అది ఆటవికం సర్‌.’’
‘‘మిస్‌ శారదా. వాట్‌ హ్యాపెండ్‌? టెల్‌ మి ఎవ్రీథింగ్‌’’
శారద అంతా వివరించి చెప్పిన తీరుకి ఆ ప్రొఫెసర్‌ చల్లబడ్డాడు. ఆయన కూడా వచ్చి సుదర్శనాన్ని చూశాడు. పోలీసుల తరపున ఆయన క్షమాపణ చెబుతానన్నాడు. శారదను మెచ్చుకుని వెళ్ళాడు.
‘‘మంచి సివిలైజ్‌డ్‌ మాన్‌’’ అన్నాడు సుదర్శన్‌.
శారద తేలికగా నవ్వేసింది.
‘‘ఇంత మాత్రం నాగరికంగా ఉండటం కష్టమేమీ కాదు. నేనీయనను ఒదలబోవటం లేదు. జరిగినది, జరుగుతున్నది అన్యాయమని ఈయన గారి చేత ప్రభుత్వానికి లేఖ రాయిస్తాను. దానికేమంటాడో దాన్ని బట్టి తెలుస్తుంది ఈయనెంత నాగరీకుడో. ఇంక నేను వెళ్తాను’’. శారద కూడా బాగా అలిసిపోయింది.
‘‘చాలా సహాయం చేశావు శారదా. మళ్ళీ కనపడతావుగా?’’
‘‘ఎందుకు కనపడను? రాత్రికి భోజనం తెస్తాను. నువ్వీ ఆస్పత్రిలో ఉన్నంతవరకూ నా అతిథివి. రోజూ కనబడతాను.’’
‘‘ధన్యుడిని. ధన్యవాదాలు.’’
‘‘ధన్యవాదాలు చెప్పాల్సింది నేను. మిమ్మల్నందరినీ ఇక్కడికి తెచ్చినపుడు నాకు మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడి మెడికల్‌ విద్యార్థులను ఒక గ్రూపుగా చేసి సత్యాగ్రహులకు ప్రథమ చికిత్స నుంచీ అవసరమైన సేవలు, చికిత్సలు చేయటానికి పంపాలనుకుంటున్నాం. సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. వస్తాను.’’
వెళ్తున్న శారదను మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు సుదర్శనం.
సత్యాగ్రహం తీవ్రంగానే నడుస్తోంది. దుర్గ మద్రాసంతా తానై తిరుగుతోంది. దుర్గను అరెస్టు చేశారనే పుకార్లు ప్రబలుతున్నాయి. శారద అతి ప్రయత్నం మీద దుర్గను కలిసి తను తయారు చేసిన వైద్యుల బృందాన్ని పరిచయం చేసింది. దుర్గను చూస్తే ఒక శక్తిని చూసినట్లే అనిపించింది. పూర్వపు దుర్గకూ ఇప్పటి దుర్గకూ పోలికే లేదు. ఓర్పుగా భర్తకు సేవ చేసే దుర్గ ఇప్పుడు ఉత్సాహం, ఉద్రేకం, ఆవేశం, ఆలోచన అన్నీ ఒక చోటకు చేరి మానవహారం దాల్చిన మహా చైతన్యంలాగా ఉంది. శారదకు అన్నీ ఒదిలేసి దుర్గతో ఉండిపోవాలనిపించింది.
సత్యాగ్రహులు, దెబ్బలు తిన్నవారు శారద బృందం దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ దెబ్బలు చూస్తుంటే శారద గుండె మండిపోతోంది. వాళ్ళకా దెబ్బలు తగలకుండా చూసే అవకాశం లేదు. దెబ్బలు తగిలాక వైద్యం చెయ్యాలి.
కొన్నాళ్ళకు దుర్గ కనిపించటం మానేసింది. అరెస్టు చేశారనీ, తప్పించుకు తిరుగుతోందనీ, ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవుతోందనే వార్తలు వస్తున్నాయి. సుదర్శనం పత్రికలలో ఉద్రేకపూరితమైన వ్యాసాలు రాస్తున్నాడు. మూర్తి సత్యాగ్రహులలో ఒకడిగా వెళ్ళి దెబ్బలు తిని పడి ఉన్నాడు. రామకృష్ణ, మిగిలిన విద్యార్థి మిత్రులంతా తమ తమ ఊళ్ళకు తరలివెళ్ళి అక్కడ సత్యాగ్రహం జరిగేలా ఉద్యమించారు.
శారద క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది.
రైల్వే కార్మికులు సమ్మెకు దిగుతున్నారని సుదర్శనం చెబితే ఆ నాయకులను కలిసి వచ్చింది.
ఎన్ని చేస్తున్నా అసంతృప్తే. తను సత్యాగ్రహం చెయ్యలేదు. అరెస్టు కాకూడదు. చదువుకు అంతరాయం కలగకూడదు. ఎందుకు తనీ చదువుకు బందీ అయింది. దుర్గ కూడా చదువు మానవద్దంటుంది. దేశం ఇలా మండుతుంటే ఆ జ్వాలల్లో దూకకుండా, పుస్తకాలు కట్టకట్టి ఆ మంటల్లో పారెయ్యకుండా చదవటం దుర్భరంగా ఉంది శారదకు. సూర్యం, శారదలు తమ అసంతృప్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. శారదకు ఆ మాటల వల్ల అసంతృప్తి తగ్గుతుంటే సూర్యంకు నిరాశ పెరుగుతోంది.
క్రమంగా ఉద్యమం ఊపు తగ్గుతోంది. అరెస్టులు, అరెస్టులు. జైళ్ళు నిండిపోతున్నాయి.
దుర్గాబాయి, అన్నపూర్ణ వెల్లూరు జైలులో ఉన్నారని కచ్చితమైన సమాచారం వచ్చింది.
శారదకు వెళ్ళి వాళ్ళిద్దరినీ చూసి అభినందించి రావాలనే కోరిక పుట్టి అది మహోధృతమైంది.
కానీ వాళ్ళతో ఏ బంధుత్వమూ లేదు. అనుమతి ఎలా దొరుకుతుంది వారిని చూడటానికి.
వెల్లూరు వెళ్ళొచ్చు. అక్కడ మెడికల్‌ కాలేజీలో స్నేహితులను కలవొచ్చు. కానీ జైలుకి ఎవరు రానిస్తారు? ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంది. సత్యాగ్రహుల మీద పోలీసుల చర్యను అన్యాయమన్న ప్రొఫెసర్‌ తనకీ విషయంలో సహాయ పడగలడేమో ఒక రాయి వేసి చూద్దామనుకుంది.
అన్నపూర్ణకూ, తనకూ చిన్ననాటి నుంచీ ఉన్న స్నేహాన్ని వర్ణించి చెప్పి ఆయనలో సానుభూతి రేకెత్తించింది. ఆయన ఆలోచించి తప్పక సహాయపడతానన్నాడు. సహాయం చేశాడు కూడా. ఆ ప్రొఫెసర్‌ అన్నగారు వెల్లూరు ఆసుపత్రిలో డాక్టరు. వెల్లూరు జైలు అధికారికి మంచి స్నేహితుడు.
అతన్నించి ఉత్తరం ఒకటి శారదకు ఇప్పించాడు. శారద ఆఘమేఘాల మీద వెల్లూరు వెళ్ళింది.
జైలు అధికారి ఉత్తరం చూసి కూడా సందేహంలో పడ్డాడు. శారద జైలులోని వాళ్ళకు ఏదైనా సమాచారం తెచ్చిందా అనేది అతని సందేహం. శారద పదే పదే అభ్యర్థిస్తుంటే చివరకు కాదనలేకపోయాడు.
ఖైదీలను బంధువులు కలుసుకునే గదిలో ఆరాటంగా కూచుంది శారద. ముందుగా ఎవరొస్తారు? దుర్గా? అన్నపూర్ణా? ఎలా ఉన్నారో? ఏమంటారో? ప్రతిక్షణం నిదానంగా గడుస్తోంది. చివరికి అన్నపూర్ణ వచ్చింది. శారద లేచి కౌగలించుకుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు.
అన్నపూర్ణ బాగా చిక్కిపోయింది. సన్నటి శరీరంలో ఎత్తుగా ఉన్న పొట్ట. శారద అవునా అన్నట్టు చూసింది. ఔనన్నట్టు నవ్వింది అన్నపూర్ణ.
‘‘జైల్లో పుడుతుందా నీ కూతురు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు.’’
‘‘నీరసం లేదు, ఏం లేదు. మన వాళ్ళంతా నాకు ఎక్కడెక్కడి నుంచో మంచి తిండి తెచ్చి మెక్కబెడుతున్నారు. మొన్ననే నా సీమంతం కూడా చేశారు’’ దర్జాగా చెప్పింది అన్నపూర్ణ.
‘‘సీమంతమా?’’ ‘‘ఔను. దుర్గ ఉందిగా. ఊరుకుంటుందా? ఎంత హడావుడి చేసిందనీ! అందరూ తలా రూపాయి, అర్ధా వేసుకున్నారు. పూలూ, పళ్ళూ తెప్పించారు. దానికి వార్డెన్‌ని ఎలా ఒప్పించారో దుర్గకే తెలియాలి. తనే నాకు పూలజడ వేసింది. పాటలు, నృత్యాలు ఒకటి కాదనుకో. సందడే సందడి. ఇంటి దగ్గరుంటే మీ అన్నగారు సీమంతమా, గాడిదగుడ్డా అని తీసి పారేసేవారు. ఇక్కడ నాకు జరగని ముచ్చట లేదనుకో.’’ అన్నపూర్ణ జైలు జీవితమంతా శారదకు చెబుతుంటే కాలం తెలియలేదు.
‘‘అసలు దుర్గను జైల్లో చూడాలి. శిక్ష అనుభవిస్తున్నామన్న స్పృహే లేదు. ఏదో సంబరంలో పాల్గొనడానికి వచ్చినట్లుంది. మేమంతా అప్పుడప్పుడు ఇంటి గురించి బెంగపడుతుంటాం. దుర్గ వచ్చి ఏదో ఒకటి చేసి బెంగ పోగొడుతుంది.’’
శారద తను తయారు చేసిన విదార్థుల గ్రూపు గురించి చెప్పింది.
‘‘ఇప్పుడు మాకంత పని లేదు. ఉద్యమం చల్లారుతోంది క్రమంగా. ఎందుకో తెలియటం లేదు. ఇప్పుడు నాకు రైల్వే కార్మికుల సమ్మె గురించే ఆశ. అన్నపూర్ణా! ఆ కార్మికులను చూస్తుంటే గుండె నీరయిపోయిందే. ఎంత దరిద్రం, దైన్యం’’. శారద మద్రాసు విశేషాలు చెబుతుండగా సమయం దాటిపోయిందని అన్నపూర్ణకు పిలుపు వచ్చింది. అన్నపూర్ణ వెళ్ళిపోయింది.
జరిగిందంతా కలా నిజమా అనుకుంటూ మద్రాసు వచ్చేసింది శారద.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.